Previous Page Next Page 
ఆదివిష్ణు కథలు పేజి 31


    "ఆహా. మొదటి పెళ్ళాముండగానే రెండో పెళ్ళాన్ని కట్టుకున్న ఘనుడు. మీరా పని చేయగలరా?"
    "నే చేయకపోయినా చాలామంది చాటుగా చేస్తున్నట్టు తెలుసు."
    "ఇందులో తిరకాసూ ఏర్పడింది లెండి. మొదటి పెళ్ళానికి పిచ్చెత్తిందని ఒక గొప్ప పుకారు పుట్టించి రెండో పెళ్ళాన్ని పబ్లిగ్గా పెళ్ళాడాడు. మొదటి పెళ్ళాం నిజంగా తనకి పిచ్చెత్తింది కాబోలునని చెప్పి నూతిలో దూకి చచ్చింది."
    "నాకీ విషయాలు తెలియవు సుమా?"
    "శ్రీధరరావు డబ్బుకోసం ఎంత పనైనా చేసేయగల పురుగు. ఉత్త మాయమనిషి కొన్నాళ్ళకి మీకూ తెలుస్తుంది లెండి."
    మోహనరావు వెళ్ళిపోయాడు. శ్రీధరరావుగురించి ఆలోచనలు మాత్రం నన్ను విడిచిపెట్టలేదు. కానీ వూరొచ్చింది ఆఫీసు పనిమీద. ఆ పనేదో చక్కబెట్టుకు వెళ్ళవలసిన వాడిని అనవసరంగా శ్రీధరరావు గురించి నాకిన్ని ఆలోచనలెందుకు? అని చాలా తడవలనుకున్నాను గాని, ఆచరణలో ఓడిపోయాను. సత్యం అన్నట్టు నేను 'పూల్' నేమో!
    సత్యం దగ్గర్నుంచి ఉత్తరం వచ్చింది. క్షేమసమాచారం వగైరా మినహాయించి ఆ ఉత్తరంలో నా క్కావలసిన విషయాలు ఇవి.
    "....... ఇక్కడ నీకో కథ చెప్తాను. దాన్ని నీ గుండెలో దాచేసుకో. నేను సత్యవతిని ప్రేమించానని చెబితే నమ్మవేమోగాని నేను ప్రేమించినమాట నిజం. అయితే ఆ సత్యవతికి డబ్బు కావాలి. హోదాగల ఒక మొగుడు కావాలి.
    సత్యవతిని చదివించింది సుందరశివరావు. అందుచేత విధవయ్యింది. సుందరశివరావుకి గుండెజబ్బుంది. నాలుగేళ్ళ క్రితం సుందరశివరావుని ఆ జబ్బు మింగేసింది. మొన్నీ మధ్యనే సత్యవతి పుట్టింటికెళ్ళిపోయిందని తెలిసింది. వెళ్ళేప్పుడు అత్తవారింట చిన్నసైజు యుద్ధం చేసిందట, అయ్యా! ఇదీ కథ.
    సత్యవతికి పెళ్ళయ్యేంతవరకూ నా ప్రేమని దాచుకున్నారా రావ్! ఆమె మొగుడు పోయిం తర్వాత, ఆమెనే మరిచిపోయాను. నీ ఉత్తరం నాకు చాలా గుర్తుచేస్తోంది. అందుచేత చదివి దాన్ని చించవతల పారేశాను. ఇకముందు సత్యవతి నిమిత్తమై నువ్వు నాకు ఉత్తరాలు రాయక. ఇది నా రిక్వెస్టు. సత్యం."
    సాయంత్రం గదికి వెళ్ళగానే పార్ధుని చూశాను. కావాలని జెప్పి నా గదిలోకి పిలిచాను. రెండు చాక్లెట్లు వాడి చేతిలో పెట్టాను. వాటిని దూరంగా వుంచి అన్నాడు.
    "తప్పు నేను తినకూడదు.అమ్మ పిన్ని తిడుతుంది."
    "ఎందుకనిట?"
    "మీరిచ్చిందేమీ తినకూడదు."
    "ఫర్లేదు తిను. మీ అమ్మ పిన్నికి నేను చెబ్తాగాని తిను."
    భయంగా తీసుకున్నాడు.
    "మీ అమ్మగారి పేరేమిటోయ్?"
    "సత్యవతమ్మ"
    "మరి నీ నాన్నగారిపేరు?"
    "లేరుగా."
    "పేరేమిటి?"
    "సుందరంగారు చాలా మంచివాడు. మా చిన్నాన్నా మంచివాడే. అమ్మ పిన్నికి అమ్మంటే యిష్టంలేదు. నన్ను తిడుతుంది. బాబ్జీకి అమ్మ నాన్న ఏవైనా తెస్తే దాన్లోని నాకస్సలే పెట్టదు."
    "బాబ్జీ ఎవరు?"
    "అమ్మ పిన్ని కొడుకు."
    "చూడు పార్ధూ! మీ అమ్మానువ్వూ ఎంచక్కా మీ చిన్నాన్న దగ్గరి కెళ్ళిపోగూడదూ?"
    "మా అమ్మ రాదు."
    "ఎందుకనట?"
    "మా అమ్మ వాళ్ళందర్తో పోట్లాడేసిందిగా అందుకు."
    పక్కవాటాలోంచి 'పార్ధూ' అని కేక వినిపించింది. పార్ధుడు మిగిలిన చాక్లెట్ నోట్లో వేసుకుని పరపర నమిలి మూతి తుడుచుకుంటూ అన్నాడు.
    "అమ్మ పిన్ని పిలిస్తోంది."
    "వెళ్ళిరా. అప్పుడప్పుడూ వొస్తుండు."
    పార్ధుడు వెళ్ళిపోయాడు. వాడు వెళ్ళినవేపు చూస్తూ నించున్నాను నాగది గుమ్మం దగ్గిర. డాబామీద వాళ్ళిద్దరూ నావేపూ, పార్ధుడివేపూ చూస్తున్నారు. ధైర్యం ఏసి నేనింకా అక్కడే నించున్నాను. డాబామీద నించున్నాయన నన్ను చేత్తో పిలిచాడు. వెళ్లేందుకు ముందు సందేహించేను.
    "రండి మాస్టారు! మీ ముందే మెట్లున్నాయి రండి"
    చొక్కా వేసుకుని వెళ్ళాను. నేను మెట్లెక్కుతూండగా, ఆవిడ కిందికి దిగింది. ఆయనొక్కడే డాబామీద ఉన్నాడు. నన్ను సాదరంగా ఆహ్వానించాడు. తన ముందున్న పేము కుర్చీ చూపించాడు. కూర్చున్నాను. అంతవరకూ మోగుతోన్న ట్రాన్సిస్టర్ని ఆఫ్ చేసి వో వారగా పెట్టి అన్నాడు;
    "నా పేరు ముకుందరావు. పోస్టల్ డిపార్టుమెంటులో పన్జేస్తున్నాను."
    నన్ను నేను పరిచయం చేసుకున్నాను.
    "మీకు వీళ్ళందరితో మునుపు పరిచయం ఉందా?"
    "పార్ధుడి నాన్నగారు నాక్కొంచెం తెలుసు. మేమంతా కలిసి చదువుకున్నాం."
    "అలా చెప్పండి. సుందరరావు మాకు దూరపు బంధువు. మొన్న మీరూ విన్నారుగా ఆ కామాక్షమ్మగారు మిమ్మల్ని ఎంతలేసి మాటలన్నారో మాకు పిల్లలు లేరంటే అది మా ఖర్మ! కానీ పిల్లల్ని పిల్లలుగా చూచే గుణం మాకుంది. కడుపుకి కంటే మాత్రం రాక్షసత్వం మంచిదా?"
    ముకుందరావు ఇచ్చిన సిగరెట్టు ముట్టించుకుంటూ మౌనం వహించాను.
    వీళ్ళందరి కథ చెప్పాలని నాకే మాత్రం లేదు. అవుతే మీకూ పార్ధుడంటే యిష్టం గనక వాళ్ళ కథ చెప్తాను. చెప్పేదాండి.
    "చెప్పండి."
    "సుందరశివరావు అంతస్తేమిటో మీకు తెలుసుననుకుంటాను. వాళ్ళింట్లో బంగారం భోంచేస్తారన్నా అతిశయోక్తి కాదేమో. అలాంటి యింట పుట్టిన పార్ధుడు యిక్కడింత హీనంగా బతుకుతూంటే మనసున్న మనిషెవ్వడూ సహించలేడు. అంతమాత్రం చేత వాళ్ళ సొంత విషయాల్లో జోక్యం కల్పించుకోడమూ మంచిది కాదనుకోండి. కానీ, జాలనేది వుంటుంది కదా! ఇది ఆ కామాక్షమ్మ గారికి గిట్టదు. ఆవిడమాట శ్రీధరరావుకి వేదవాక్కు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS