"అల్లరిగా తిరక్కూడదు నువ్వు బాగా చదువుకోవాలి. పదిమందిలోనూ మంచి అనిపించుకోవాలి. నువ్వు నా మాట వినకపోతే నా కేడుపుకొస్తుంది పారూ. చెప్పు.... అమ్మ యేడుస్తే నీకు బాగుంటుందా!"
వెంటనే శ్రీమతి గుర్తుకొచ్చింది నాకు. ఆ మధ్య వారం రోజులపాటు విపరీతమైన దగ్గుతో బాధపడిపోయేను. అది కేవలం సిగరెట్లు అతిగా కాల్చడం వలనని మా ఆవిడ నింద! రెండు రోజులు చెప్పి చూచింది. ఆ రెండురోజులూ కావాలని చెప్పి మరింత ఎక్కువగా కాల్చాను. అప్పుడన్నది. కళ్ళనిండా నీళ్ళు నింపుకుని -
"కనీసం నా ముందైనా సిగరెట్లు కాల్చకండి. మీ దగ్గు చూస్తూంటే భయమేస్తోంది. దానిక్కారణాన్ని పదే పదే గుర్తుచేసి నన్ను బాధపెట్టకండి. నేను బాధపడటం మీ కిష్టమైతే మరి నేనేం చెప్పలేనంతే!"
శ్రీమతి గుర్తుకు రావడంతో సిగరెట్టు కాల్చాలనిపించింది. సిగరెట్టు ముట్టించి పొగ వదిలేను. ఇక్కడొక మాట మనవి చేయాలి. నేను కలల్లో కొంచెం సరదాగా తిరిగే మనిషిని. ఈ అలవాటిప్పటిది కాదు. చాలామంది నన్నీ విషయంలో ఎగతాళి చేసేవారుగూడాను.
"అతనా! వట్టి తిక్కమనిషి మనం చెప్పేది వింటూనే మనల్ని మరిచిపోయి తిక్కపోజు పెట్టేసి వెళ్ళిపోతాడా"వటాని! తోచని సమయాన్ని తోచేవిధంగా మల్చుకోడమనే పద్దతిని 'తిక్క' అంటే నేనేం చేసేది?
కొన్ని రోజుల్లో పుట్టబోయే మా చిరంజీవి వయస్సు ఈ క్షణంలో నాలుగేళ్ళు. చందమామ. మా యింటికో వెల్తురు. అవునాండి, ఇది మొదటిభాగం. వాడుత్త పెంకి ఘటం. వాళ్ళమ్మని క్షణం ఊపిరి పీల్చుకోనివ్వడు. వాళ్ళమ్మ దగ్గిర వాడికి చనువెక్కువ. ఇరవైనాలుగ్గంటలూ మాటలూ కావాలి. ముచ్చటపడి యేదైనా వాడితో చెప్పటానికి ప్రయత్నిస్తే యక్షప్రశ్నలు, ప్రాణంతీసి పారేస్తాడు. ఈ పోరుపడలేక శ్రీమతి వాడిని నా దగ్గరికి పంపింది ఓనాడు. అప్పుడు మా యిద్దరి మధ్య నడిచిన సంభాషణా క్రమం యిది :
"ఒరేయ్ ఏమిట్రా అల్లరి?" నేను
"అల్లరి కాదు గురూ!" వాడు
"ఒరేయ్, ఒరేయ్! నాన్నగార్ని 'గురూ' అనకూడదు."
"మరి నువ్వు ఆ కళ్ళజోడుమావయ్యని గురూ అంటావేం?"
"వాడా? వాడు వెధవ గనక."
"గురూ అంటే ఏమిటి?"
"ఇదిగో విన్నావా? వీడిక్కడ నన్ను తినేస్తున్నాడు."
"నాకేం తెలీదు" మా ఆవిడ.
"మరి.... ఒక్కో మాటునువ్వూ, కళ్ళజోడు మావయ్యా యిద్దరూ కలిసి ఎవర్నో తిడతారెందుకూ వాడు వెధవ కాడా?"
"నీతో నేను వాగలేనురా చిట్టీ! మాటకు ముందు నన్ను నువ్వు అని పిలవకు."
"ఏమని పిలవాలి?"
"డాడీ! అని"
"ఎందుకని."
"నువ్వు మా అబ్బాయివి గనక,"
"పిలవకపోతే."
"కొడతాను."
"ఎందుకని."
"అబ్బబ్బ... చంపేస్తున్నావురా చిట్టిగా."
"నాకివాళ డబ్బులివ్వలేదు. అమ్మ నడిగితే తన దగ్గిర్లేవుంది."
"ఇప్పుడు డబ్బుల్తో పనేమిట్రా?"
"కొనుక్కోవాలి."
"ఏమిటి?"
"సిగరెట్టులు."
"అయ్యబాబోయ్! నిన్ను సిగరెట్లు కాల్చమని ఎవరు చెప్పార్రా?"
"అమ్మ"
"విన్నావా? వేడిని సిగరెట్లు కాల్చమని సలహా యిచ్చావా?"
"వాడిని చూచైనా ఆపాడు సిగరెట్లు మానేయండి" మా ఆవిడ పథకం ఇది.
"సర్లే నువ్వు నోరుమూసుకో. చూడు చిట్టీ నువ్వు సిగరెట్లు కాల్చకూడదు నాన్నా! తప్పు."
"మరి నువ్వు కాల్చుకోవచ్చా?"
"నేను పెద్దవాడిని."
"మరి నేను పెద్దయిం తర్వాత కాల్చనా?"
- సిగరెట్టు చివరంటా కాలీ, వేలిని కాల్చేసింది. దాంతో కలనుంచి బయటపడ్డాను. ఛీ....వెధవది, సిగరెట్లు మానేయాలి. ఈ దురలవాటు పిల్లలక్కూడా సంక్రమిస్తే అప్పుడేంగావాలి కనుక?
మావాడు పార్ధుడిలా కొంచెం అల్లరి. కొంచెం బుద్దిగా వుంటే చాలు. మా అక్కయ్య వాళ్ళు నాకు ఆడపిల్ల పుడుతుందని జోస్యం చెపుతున్నారు. వాళ్ళదంతా స్వార్ధం. మా పిల్లకి పెళ్ళి చేసే ప్రయత్నంలో వాళ్ళతో కాళ్ళబేరానికి రావాలని వాళ్ళ ఉద్దేశం. మా అమ్మగూడా వాళ్ళ జట్టే. ఎటుతిరిగీ అన్నయ్య, నాన్నగారూ, నేనూ, మా ఆవిడ, అందర్నీ మించి మా వదిన - మా అందరి కోరికా నాకు కొడుకు కావాలనే.
నిద్రకి కళ్ళు మూతలు పడుతూన్న వేళ మా వాళ్ళంతా గుర్తుకొచ్చేరు. ఆ రాత్రి కలల్తోనే గడిపాను.
ఆఫీసుకెళ్ళడం, అద్దెగదికి రావడం మినహా వేరే వ్యాపకమంటూ లేదు. చాలా యాంత్రికంగా ఉన్నదిక్కడ నా వ్యవహారం సాయంత్రం ఈ వూళ్ళో చూడడం పడని ఇంగ్లీషు సినిమా 'నార్త్ బై నార్త్ వెస్ట్.' ఇంటర్వెల్ లో ఇక్కడ ఆఫీసులో పన్జేసే మోహన్ రావ్ కలిశాడు. మోహన్ రావెంట కొత్త మనిషి ఒకతనున్నాడు. పరిచయం చేశాడు. శర్మట, మొన్ననీ మధ్య ఒక కథ పత్రికలో రాశాట్ట. నేను చదవలేదు గానీ ఆ కథ చాలా బాగుందని మోహన్ రావ్ మెచ్చుకున్నాడు. శర్మ మా యిద్దరికీ టీ లు తెచ్చాడు.
సినిమా పూర్తయిం తర్వాత మోహనరావొక్కడూ నాతో పాటు సెంటర్ వరకూ ఒచ్చేడు. దారిలో అతనన్నాడు.
"ఈ శర్మ మీ యింటివోనరు గురించే ఆ కథ రాసేడు. దానిమీద కొన్ని గొడవలూ వచ్చాయి."
"మా యింటి ఓనరుకి ఒక కథ కూడా ఉన్నదా!"
