Previous Page Next Page 
మౌనవిపంచి పేజి 30

 

    "షటప్!" కోపంగా అన్నాడతను.
    
    "ఫస్ట్ యూ షటప్!" దెబ్బకు దెబ్బ అన్నట్టుందామె.

    

    ఆశ్చర్యంగా చూస్తున్నా ఆఫీసరు, మేనేజరు.
    
    "అయ్! నేనెవరో తెలుసా? తలచుకుంటే నిన్ను ట్రాన్స్ ఫర్ చేయిస్తే! అవసరమయితే టర్మినెంట్ చేయిస్తా!" తన స్థాయి హోదా తెల్పాడతను.
    
    "తెలుసు! అదొక్కటే నువ్వు చేయగలిగింది. కానీ నేను తలుచుకుంటే నిన్ను రిమాండ్స్ కి పంపిస్తాను తెలుసా?"
    
    "నందగారూ!" కంగారుగా పిలిచాడు ఆఫీసరు.
    
    ఆఫీసరు పిలుపుతో నిషాదిగినట్లయింది ఆమెకి.
    
    "సారి సర్, మీ ముందు ఇలా సమాధానాలు చెప్పవలసి వస్తుందనుకోలేదు!" అంది.
    
    "అసలేం జరిగింది?"    

 

    "నథింగ్! ఇంత పొగరైన అమ్మాయిని మీరెలా కంట్రోల్ చేస్తున్నారు? ఇళ్ళు దొరకని సిటీకో, నీళ్ళు దొరకని పల్లెకో పంపెయ్యాలి? అప్పుడే బుద్దొస్తుంది. తిక్క కుదురు తుంది!" అన్నాడు ప్రమోద్ కుమార్.
    
    "కొందరికి ఎన్ని జరిగినా బుద్ది రాదు!" అంది నంద.
    
    "మిస్ నందా!"
    
    "అలా పిలవండి మర్యాదగా!"    
    
    "పిలుస్తాను! కానీ ఒక్కటి గుర్తుంచుకో! ఏనాటికైనా నువ్వు నావల్ల దెబ్బతినక తప్పదు!"    

 

    "నేను అదే చెబుతున్నాను! నాకు బాధ కలిగిన రోజున నిన్నింత సులభంగా వదలను. నిన్ను సుఖంగా వుండనివ్వను!"
    
    పళ్ళు పటపట కొరికాడు ప్రమోద్.
    
    కంగారుపడ్డాడు ఆఫీసరు.
    
    "అసలేం జరిగింది? ఎందుకు మీరిలా పోట్లాడున్నారో నాకర్ధం కావటం లేదు.
    
    "సర్! ఎంతగా అవమానించింది మీరే చూశారుగా!" అంది నంద.  

 

    "అది నువ్వు మరిచిపోవాలి నందా!"
    
    "హుఁ! పేలవంగా నవ్వింది. సర్! మనిషి కేవలం ఒక్క తిండి కోసమే బ్రతకటంలేడు. ఆత్మాభిమానం పోయిన రోజున ఈ ఉద్యోగాలు అక్కరలేదు. ఈ సంపాదననా అక్కర్లేదు. బిచ్చ మెత్తుకుని బ్రతికినా ఫర్లేదు!" అంది.
    
    అయినింకేం అన్లేదు.
    
    ప్రమోద్ మిర్రి మిర్రి చూస్తున్నాడు.
    
    ప్రతిసారీ తనకే ఎదురుదెబ్బ కొడుతున్న నందని ఎలా లొంగదీసుకోవాలో అతనికి తెలియలేదు.    

 

    "సర్! నన్నెందుకు రమ్మన్నారు?"
    
    "నువ్వింక వెళ్ళవచ్చు!" సమాధానంగా అన్నాడు ప్రమోద్.
    
    "హమ్మయ్య బ్రతికించాడు!" అనుకున్నాడు ఆఫీసరు.
    
    "థాంక్యూ!" అని వెళ్ళిపోయింది నంద.
    
    ఆమె తన సీటులోకి రాగానే ముఖాన పట్టిన చెమట తుడుచుకుంటూ వుంటే స్టెల్లా వచ్చేసింది.
    
    "ఏం జరిగింది?"
    
    "తూచా తప్పకుండా చెప్పింది నంద "నిజం స్టెల్లా! ఆ క్షణంలో అంత ధైర్యం ఎలా వచ్చిందో నాకే తెలియలేదు. గడగడా మాటకి మాట అనేశాను. తీవ్రంగా సమాధానాలు చెప్పాను. మన ఆఫీసరు కంగారుపడిపోయాడనుకో!"
    
    స్టెల్లా అభినందించింది.
    
    మరో పదినిముషాల్లో కెల్లా ప్రమోద్ కుమార్ వెళ్ళి పోయాడు.
    
    అతని వెంట వెళుతున్న మేనేజర్ తీక్షణంగా చూస్తూ వెళ్ళిపోయాడు.
    
    నంద ఒక విధమైన బలహీనతతో నిట్టూర్చింది. "భగవంతుడా నాలో ఎన్నడూ ఈ ఆత్మస్థైయిర్యం' ఆ ఆత్మవిశ్వాసంపోకుండా చూడు! ఆస్తి ముఖ్యం కాదు. ఐశ్వర్యం శాశ్వతం కాదు. అంతస్థులూ, హోదాలు తాత్కాలికాలే! కానీ ఎన్ని ఆపదలొచ్చినా, ఎన్ని చిక్కులొచ్చినా, ఎన్ని యిబ్బందులొచ్చినా మనోధైర్యం మాత్రం నానుండి పారిపోకుండా చూడు తండ్రీ! అదొక్కటే ఆధారంగా జీవిస్తున్నాను- అనుకుంది ప్రార్దించింది.
    
                                       16
    

    మరో అయిదు నిమిషాలకి ఫోనొచ్చింది స్టెల్లాకి.
    
    "ఆఫీసుకి ఫోన్ చెయ్యొద్దని చెప్పండి స్టెల్లా!" మవుత్ పీస్ అందిస్తూ అన్నాడు హెడ్ క్లర్క్.
    
    ఆ మాటలకి అదోలా చూసి నవ్వి అంది.    

 

    "మేం ఫోన్ చెయ్యమని చెబుతామా సార్! ఏ అవసరం వచ్చో, అర్జంటు పని తగిలో ఎవరో ఫోన్ చేస్తారు! అది మాకెలా తెలుస్తుంది? అయినా ఆఫీసు ఫోన్ లో ఎవరూ స్వంత విషయాలు మాటాడుకోరా?" అంది స్టెల్లా.
    
    అదే ఆమెలో ఉన్న విశేషం.
    
    అతను హెడ్ క్లర్క్ కానీ, హెడాఫీసు క్లర్క్ కానీ ఆఫీసరు కానీ పై ఆఫీసు అధికారి కానీ ఆమె జంకు ఎరగరు.
    
    నిర్లక్ష్యంగా, నిర్ముఖమాటంగా సమాధానం చెబుతుంది.
    
    డ్యూటీ కరెక్ట్ గా చేసుకుంటూ వెళ్ళే వాళ్ళకి ఉండే ప్రత్యేకత అదే!
    
    "హలో!" అంది మాడిన హెచ్.సి. ముఖంచూస్తూ.  

 

    "హలో!" కొత్తగొంతు వినిపించింది అవతలనుండి.
    
    "ఎవరు మీరు?"
    
    "నేను విష్టువర్ధన్ ని-"
    
    "అంటే?" కనుబొమలు ముడివేసి అడిగింది స్టెల్లా.
    
    "మీ ఫాదర్ చెప్పలేదా?"
    
    "ఏమిటి చెప్పలేదు? సూటిగా చెప్పండి!"
    
    "అయాం విష్ణువర్ధన్ లెక్చరర్ ఇన్ కామర్స్ గవర్నమెంట్ కాలేజి. రీసెంట్ గా ట్రాన్స్ ఫర్ అయి వచ్చాను. ఎలయన్స్ విషయం చెప్పేడు మా ఫాదర్. నిన్ను చూట్టానికి ఇప్పుడు ఆఫీసుకి వస్తున్నాను" అన్నాడు నింపాదిగా.
    
    "ఇప్పుడా" కంగారుపడింది స్టెల్లా.
    
    "అవును! లంచ్ అవర్ కదా! ఫ్రీగా వుంటావు- మీ కేంటీన్ లో నో, మీ ఆఫీసు ప్రక్కన ఉన్న హోటల్లో టీ తీసుకుంటూ మాటాడుకుందాం!"
    
    "ఏం ఇంటికే రావచ్చుగా!"
    
    "ఉహూ! నాకిష్టం లేదు. బయటే కలుసుకోవాలి."
    
    "అలా అయితే ఆఫ్టర్ ఆఫీసవర్స్-"
    
    "ఊహూఁ నాకు ఫైవింటికి వో ఎంగేజ్ మెంట్ ఉంది."
    
    "పోనీ రేపు, లేదా ఎల్లుండి లేదా-"
    
    "మిస్ స్టెల్లా!" చిరాకుగా అన్నాడతను- "నేను ఈ రోజు లంచ్ అవర్లో మిమ్మల్ని చూడాలి దట్సాల్. ఇది మీ ఫాదర్, మీ స్టెప్ మదర్ నిర్ణయించిన టైం-"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS