Previous Page Next Page 
స్త్రీ పేజి 29

 

                               

 

    "సుజా!"
    నిశ్శబ్దం నలుమూలలా అవరించుకున్న ఆ యింట్లో అంత చిన్న పిలుపే కంఠం ఎత్తి అరిచినట్టు ప్రతిధ్వనించింది. మరోసారి పిలివనవసరం లేకుండానే, "ఎవరూ?" అంటూ వచ్చింది సుజాత. "ఎవరూ? పార్వతా?' ఆశ్చర్యంగా సంభ్రమంగా అంది.
    "నేనే, సుజా!" చేతిలో సంచి బల్ల మీద పెట్టి మరేమీ అనకుండా లోపలికి నడిచింది పార్వతి. "కొంచెం మంచి నీళ్ళిస్తావూ?"
    నీళ్ళ గ్లాసు అందిస్తూ , "నా వుత్తరం నీకు అందింది కదూ?' అంది సుజాత.
    "అందింది. నేనెలాగూ రావాలనుకుంటూనే ఉన్నాను. అమ్మ ఒంట్లో ఎలా వుంది? నిద్ర పోతోందా?"
    "లేదు. ఊరికే పడుకుంది. రా, వెళ్దాం" అంటూ తల్లి పడుకుని ఉన్న గది గుమ్మం ముందుకు నడిచింది.
    "అమ్మా! పార్వతి వచ్చిందమ్మా!"
    కామేశ్వరమ్మ లేచి కూర్చుంది -- "ఎవరూ? పార్వతా? మన పార్వతే!" అంటూ.
    "అవును పిన్ని గారూ! మా రుక్మిణీ వాళ్ళ వూరు వెళ్లాను. ఒక్కసారి అందర్నీ చూసి వెళ్దామని...." ఆగిపోయింది . పద్మజ మాట ఎత్తితే కామేశ్వరమ్మ ఎంత బాధ పడుతుందో! బేల మనస్సుతో బావురుమని ఏడుస్తుందేమో? మరేమీ మాట్లాడకుండా మంచం దగ్గరగా బల్ల మీద కూర్చుంది.
    కామేశ్వరమ్మ బొత్తిగా నీరసించి పోయింది. మనోవ్యాధి తో బాధ పడుతున్నట్టు స్పష్టంగానే తెలుస్తుంది. తనను చూసీ చూడగానే ఆవిడ ఎడ్చేస్తుందనుకున్న పార్వతికి మాత్రం ఆశ్చర్యం కలగక పోలేదు. ఆవిడ కళ్ళలో నీటి జాడే లేదు. వేసవి తాపానికి పోడారిపోయిన గుంటల్లా ఉన్నాయి: పార్వతి కేసి చూస్తూ అడిగింది:
    "మీ రుక్మిణి సూర్యం వాళ్ళూ బావున్నారా?"
    "బాగానే ఉన్నారు, పిన్ని గారూ! రుక్మిణి కి మూడో మాసం అనుకుంటున్నారు. అనుకోటం ఏమిటి లెండి. డాక్టరు కూడా చెప్పింది. వేవిళ్ళ తో కొంచెం నీరసంగా ఉంది. ఫరవాలేదు. మందులూ అవీ వాడుతోంది. సూర్యం రిజల్ట్స్ తెలిశాయి. మొన్ననే బి.ఏ పాసయ్యాడు. ఇక ఎక్కడైనా ఉద్యోగం చూసుకోవాలి." ధోరణిలా అన్నీ తనే చెప్పేసింది.
    "ఉద్యోగం ఏదైనా దొరికేలా ఉందా వాడికి?"
    "కాస్త ప్రయత్నిస్తూనే ఉన్నాను. ఈ మధ్యనే మాకు కొత్త ఆఫీసరు వచ్చాడు. అయన చాలా మంచివాడని విన్నాను. ఒకసారి వెళ్ళి అడిగితె ఏమౌతుందో మరి. ఇటునుంచి వెళ్ళాక వెళ్దామనుకుంటున్నాను. ఈ రోజుల్లో ఉద్యోగాలంటే మాటలా, పిన్ని గారూ? ఎంతో కష్టపడితే గాని ఫలితం దక్కటం లేదు. అదీ అదృష్టవంతులకే."
    "అయితే మీ చెల్లాయి పురుడు వాళ్ళింటి దగ్గరే పోసుకుంటుందా?"
    "అలాగే అంటోంది మా అత్తయ్య. నాకిష్టం లేదు, పిన్నిగారూ! నేనంటూ వుంటే దానికి పుట్టిల్లు ఉన్నట్టే లెక్క! మొట్టమొదటి పురుడు కదా? తీసుకొచ్చి నా దగ్గరే ఉంచుకుందామని ఉంది. రుక్కుతో పాటు అత్తయ్య ని కూడా రమ్మన్నాను. ఆస్పత్రి లో చేర్చేస్తే అంతా వాళ్ళే చూసుకుంటారు. ఆ పల్లెటూల్లో ఎందుకు బాధ పడాలి, చెప్పండి?"
    "నిజమేను. నీ ఆలోచనే బావుంది."
    కామేశ్వరమ్మ ఇంకా ఏమైనా అడుగుతూ వుంటే బావుండుననిపించింది పార్వతికి. గడిచిన పది పదిహేను రోజుల్లోనూ తల్లి అంత ఎక్కువగా మాట్లాడటం చూడని సుజాత ఆశ్చర్యంగా వింటూ కూర్చుంది.
    "ఆ సుజా! పార్వతి ఎప్పుడు భోజనం చేసుందో ఏమో? స్నానం చేస్తుందేమో చూడు. వెళ్ళమ్మా పార్వతీ! ముందు కొంచెం అన్నం తిని రా!"
    మాట్లాడకుండా లేచింది సుజాత. మరేమీ అనకుండా వెంట వెళ్ళింది పార్వతి.
    పార్వతికి అన్నం వడ్డిస్తూ గొంతు తగ్గించి మళ్ళా వెనకటి గాధంతా వివరించింది సుజాత. సుజా వ్రాసినట్టు ఇల్లంతా బొత్తిగా వెలవెల బోతున్నట్టే ఉంది. ఇంట్లో అందరూ ఉన్నా ఎవ్వరూ లేరని పిస్తుంది . కాస్త గట్టిగా మాట్లాడుకోటానికి కూడా మనస్సు ఒప్పకుండా ఉంది.
    పద్మజ కబుర్లు చెప్తోంటే సుజా కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. "అక్కయ్య ఇలా చేస్తుందని మనం ఎవ్వరం అనుకోలేదు కదూ?" అంటూ పార్వతీ మొహంలోకి చూసింది.
    పార్వతి వెంటనే ఏం మాట్లాడలేక పోయింది. పద్మజ ఏమంత ఘోరమైన నేరం చేసిందని వీళ్ళంతా ఇలా బాధ పడుతున్నారు? కోరుకున్న వాణ్ణి సాహసించి పెళ్ళి చేసుకుంది. అంతేగా? అలాంటి సాహసం మాత్రం ఎంతటి వాళ్ళకు! అనిపించింది. "పాపం , పద్మని మనమంతా బొత్తిగా అపార్ధం చేసుకుంటున్నామేమో సుజా! తను మాత్రం ఏమంత తప్పు చేసిందని?"
    విస్మయంగా చూసింది సుజాత, "అక్కయ్య గురించే నువ్వు మాట్లాడుతున్నది! తప్పు చెయ్యనే లేదూ? నిజంగా అక్కయ్య ని నువ్వు సమర్దిస్తున్నావా , పార్వతీ?"
    "సమర్ధించటం కాదు, సుజా. పద్మజని విమర్శించటానికి మనం ఎంతటి వాళ్ళం? అనిపిస్తోంది నాకు. వంశాచారాలనీ, కుటుంబ సంప్రదాయాలనీ త్రోసి పుచ్చుతున్నానని పద్మజ కి తెలీదంటావా? పదిమందీ హేళనగా చెప్పు కుంటారనీ, అమ్మా, నాన్నా బాధ పడతారనీ ఆలోచించలేదంటావా? అయినా ఆ వ్యక్తిని పెళ్ళి చేసుకుందంటే.....పద్మజ తెలివి తక్కువగా ఆ పని చేసుందంటే నేను ఒప్పుకోను."
    "కాదు పార్వతీ! పోనీ, మిగతా విషయాలన్నీ వదిలెయ్యి. అమ్మకోసం, నాన్న కోసమైనా అక్కయ్య తన కోరిక చంపుకోవలసింది. బిడ్డల్ని ప్రేమాభిమానాలతో పెంచి ప్రయోజకుల్నిచెయ్యవలసిన బాధ్యత తల్లిదండ్రులకే గానీ ఆ తల్లి దండ్రుల పట్ల వినయ విదేయలతో ప్రవర్తించవలసిన కర్తవ్యం బిడ్డలకు లేదంటావా?"
    "ఎలా అంటాను, సుజా? కాని పద్మజ ఇష్టం వున్న వ్యక్తిని దూరం చేసుకుని జీవితాంతం బాధపడాలంటావా?"
    "ఇష్టం! ఇష్టాలకి అర్ధం ఏమిటి, పార్వతీ! మన బ్రతుకులు నాశనం చెయ్యాలని పెద్దవాళ్ళు ప్రయత్నిస్తారా? మన వంశ ప్రతిష్టలూ , సంప్రదాయాలు , రీతి రివాజులూ -- అన్నీ ఉగ్గు పాలతో నేర్చుకుని కూడా అలాంటి అర్ధం లేని ఇష్టాలేందుకు పెంచుకోవాలి?"
    "అమాయకంగా మాట్లాడుతున్నావు సుజా! మనస్సనేది పూర్తిగా మన వశంలో ఉండదు. మనస్సు ని శాసించుకోగలిగే శక్తి మనిషికి ఉన్ననాడు ఇలాంటి సమస్యలే ఉత్పన్నం కావు. అయినా ఈ నిబంధనలన్నీ మనలాంటి వాళ్ళకి గానీ పద్మజకి కాదు. అక్కయ్య తత్వం మొదటి నుంచీ తెలిసి కూడా ఇంత పిచ్చిగా బాధ పడతావెందుకు? ప్రకృతే క్షణక్షణానికి మారిపోతున్న ఈ కాలంలో ఇంకా వంశాలూ, ఆచారాలూ, కులాలూ, గోత్రాలూ ఆలోచిస్తే అంతా సంకుచితంగానే కనిపిస్తోంది. పద్మజ లాంటి వాళ్ళే పుట్టక పొతే మనం, మన సంఘం ఎన్ని తరాలు వెనకబడి వుండే వాళ్ళమో అనిపిస్తోంది. ఇలా ఎవరూ సాహసించ లేకపోతె సంఘ సంస్కారం అనేది ఎలా జరుగుతుంది?"
    ఒకరకమైన చిరాకుతో చూసింది సుజాత. "ఇప్పుడు మన సంఘానికి వచ్చి పెద్ద లోటేమిటంటావ్ సంస్కారాలకి?"
    "ఎందుకు లేదు? ఎంతైనా ఉంది. పరిస్తితులతో పాటు , కాల గమనం తో పాటు మనుషులు మారకపోవటం లోటేందుకు కాదు? ఈ యింట్లో పరిస్థితే చూడు. నీ తల్లికి అక్షర జ్ఞానమైనా లేదు. అమె కడుపున పుట్టిన బిడ్డ డాక్టరైంది. ఆడపిల్ల ఇంటి గడప దాటి వీధిలో అడుగు పెడుతోంది. స్త్రీ పురుషులు చదువుల నిమిత్తమో, ఉద్యోగాల నిమిత్తమో కలిసి మసలుతోన్న ఈ కాలంలో వయస్సు తో  పాటు వారి మధ్య ఆకర్షణలూ, అనురాగాలూ అసహజం కాదు. తదనుగుణంగా ఈ సంస్కారవివాహాలకి కూడా అవకాశం ఇవ్వక తప్పదు. రోజులు శరవేగంతో మారిపోతోంటే సంఘం పాత నియమాలతోనే మడికట్టు కూర్చుంటూ వుంటే ఎలా వీలౌతుంది? పద్మజ లాంటి వ్యక్తులే సంఘం పురోభివృద్ది కి వెన్నముక లాంటి వాళ్ళు తెలుసా? అందరి తో పాటు కాస్త ఆలోచించగలిగిన వాళ్ళు కూడా మూర్ఖంగా పద్మజ ని విమర్శించటం -- ఏమో? నాకు నచ్చలేదు , సుజా!"
    "నువ్వెన్ని చెప్పు, పార్వతీ! నాది మూర్ఖత్వమే కావచ్చు. ఆ సంస్కార మేదో మా యింటి నుంచి బయల్దేరటం మాత్రం నాకిష్టం లేదు. అక్కయ్య సాహసంతో మా కుటుంబం అల్లరి పడింది. మేమంతా అవమానాల పాలయ్యాం. సంఘ సంస్కారం జరుగుతోందని సంతోషించెంత విశాల హృదయాలు లేవు మాకు." సుజా చిన్న బుచ్చుకుంది.
    "క్షమించు సుజా! నీకు చాలా కోపం వచ్చింది. నన్నింత అపార్ధం చేసుకుంటావనుకుంటే నా మనస్సులో మాట విడమర్చి చెప్పేదాన్ని కాదు."
    "నాకేం కోపం లేదు, పార్వతీ! ఒక్కటి చెప్పు, నువ్వే అయితే అక్కయ్య లా చేస్తావా?"
    "అలాంటి ధైర్య సాహసాలు నాకా? పద్మజని అర్ధం చేసుకుందామనే ప్రయత్నించాను గానీ, నేను పద్మని ఎన్నటికీ కాలేను."
    తిరస్కారంగా అంది సుజాత. 'ఆవిణ్ణి నువ్వింతగా మెచ్చుకోవలసిన ఘనతేమీ నాకు కనిపించటం లేదు. కని పెంచిన తల్లిదండ్రుల్ని తృప్తి పరచలేని వాళ్ళు ఎక్కడో సంఘాన్ని ఉద్దరించేస్తారను కోవటం లో అర్ధం లేదు. తన వాళ్ళంతా అవమాన భారంతో కుళ్ళి కృశించి పోతోంటే తను మాత్రం స్వర్గ సుఖాల నుభవిస్తే సరిపోతుందా? అలాంటి స్వార్ధాన్ని నేనెప్పుడూ క్షమించను. నేనే కాదు, భగవంతుడు కూడా క్షమించడు. చూడు, అక్కయ్య కి తెలిసి వస్తుంది. తప్పకుండా తెలిసి వస్తుంది." కోపావేశాలతో సుజా కళ్ళు చెమర్చాయి.
    పార్వతి మరేమీ సంభాషణ పెరగనివ్వలేదు. మూడో నాడు బయల్దేరే ముందు కామేశ్వరమ్మ మంచం దగ్గరికి వెళ్ళి నిలబడింది. "వెళ్లొస్తాను , పిన్నిగారూ! వెళ్ళగానే ఉత్తరం వ్రాస్తాను. మీ ఆరోగ్యం కాస్త జాగ్రత్తగా ......"
    "అమ్మా! పార్వతీ!" కామేశ్వరమ్మ పార్వతి మొహంలోకి తపన గా చూసింది. గత మూడు దినాలలోనూ పద్మజ గురించి ఒక్కమాట కూడా ఆ యిద్దరి మధ్యా రాలేదు. తీరా పార్వతి వెళ్ళిపోతుంటే కామేశ్వరమ్మ మనస్సు దాచుకోలేకపోయింది.
    "ఏమిటి, పిన్ని గారూ, ఏమైనా చెప్పాలనుకుంటున్నారా?"
    "నీకూ....నీకూ తెలీదా, అమ్మా, నిజంగా? అది....అది చూశావా ఎంత పని చేసిందో! చెప్పా చెయ్యకుండా ....హు!' నీరసంగా నిట్టుర్పు విడిచింది కామేశ్వరమ్మ. అప్పటికి కూడా ఆ ప్రసక్తి ఎత్తే సాహసం లేని పార్వతి మాట్లాడకుండానే నించుంది.
    "ఆ పెళ్ళి చేసుకునే ముందు పోనీ నీకైనా ఓ ఉత్తరం ముక్క వ్రాసిందీ? నువ్వు వెంటనే మాకు వ్రాస్తే...."
    కంగారుగా అంది పార్వతీ: "లేదు , పిన్ని గారూ! నాకేమీ తెలీదు. ఓ సంవత్సరం నుంచీ కూడా నాకు సరిగ్గా ఉత్తరాలు వ్రాయటం లేదు. నేనూ మీలాగే పత్రికలో పెళ్ళి ఫోటో చూసి తెలుసుకున్నాను. తర్వాతైనా వ్రాస్తుందేమో అనుకుని ఎదురు చూస్తున్నాను. పోనీ, నాకు నేనే వ్రాద్దామంటే....."
    మహా కోపంగా శాసించింది కామేశ్వరమ్మ. "వద్దు, వద్దు . ఆ పాపిష్టి దాని కింకా ఉత్తరాలు కూడానా? నువ్వు వ్రాయనూ వ్రాయకు. అది వ్రాస్తే చదవనూ చదవకు. వెధవ కాయితాలన్నీ చించి పోగులు పెట్టు."
    చాలాసేపు అలాగే నిలబడింది పార్వతి. "వస్తాను, పిన్నిగారు! నాకు బండి వేళ...."
    "ఆ, వెళ్ళు తల్లీ! వెళ్ళు! రుక్మిణి కి పురుడు రాగానే ఉత్తరం వ్రాయి. జాగ్రత్త! ఒంటరి దానివి! నీకు మాత్రం మంచి చెడ్డలెం తెలుసు?" భుజం మీదుగా కొంగు లాక్కుని గది గుమ్మం దాటి వరండా మీదికి వచ్చి నించుని మరీ సాగనంపింది పార్వతిని.
    జట్కా ఎక్కి కూర్చున్న పార్వతి దగ్గర సెలవు తీసుకుని కళ్ళు తుడుచుకుంటూ లోపలికి వచ్చింది సుజాత.

                            *    *    *    *


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS