Previous Page Next Page 
స్వాతి జల్లు పేజి 29

 

    "నా మనో! నాలో ఏదో కొంచెం బలహీనత లేదనను కానీ, ఇంక మీద నిన్ను నా దేవత లాగా చూసుకొంటాను. నా మాట నమ్మవూ? నన్ను కాపాడవూ?"
    "ఓహ్! నా గుండెలు బ్రద్దలవుతున్నాయి డార్లింగ్! నా ఒక్క దాని కోసమూ అయితే, ఎందుకైనా సిద్దపడేదాన్నేమో, కాని నాలో ఇంకో ప్రాణి పెరుగుతుంది. ఆ ప్రాణి అడదో, మొగదో ఎవరు చెప్పగలరు? కర్మకాలి ఆడదే అయితే ఎవరి పోలిక వస్తుందో? కీడించి మేలేంచాలి! నా పోలికే రావచ్చు! పాపం! దానికి నగలైనా లేకపోతె ఈ లోకంలోఎలా నిలబడుతుంది? నన్ను క్షమించు. నువ్వు వేలకు వేలు , నీ యిష్టం వచ్చినట్లు ఖర్చు చేసినా చూస్తూ వూరుకొన్నాను. కానీ, నా సంతోషాన్ని కూడా నాశనం చెయ్యలేను. నిస్సహాయురాలీని."
    మనోరంజని ఏడుస్తూ వెళ్ళిపోయింది.

                              *    *    *    *

    ప్రకాశరావు పట్ల వెంకటలక్ష్మీ కి ప్రత్యేకాభిమానం ఉందని అరుంధతి గ్రహించినా, దాని యదార్ధ స్వరూపం మాత్రం ఆమెకు తెలియదు. తెలిసికోవాలని ప్రయత్నించనూ లేదు. కానీ ఒక్కసారిగా అన్ని సంగతులూ బయటపడి పోయాయి.
    పన్నెండేళ్ళ కు వెనుక....!
    వెంకతలక్ష్మీ తల్లి ప్రకాశరావు గారింట్లో వంట చేస్తూ ఉండేది. వెంకటలక్ష్మీ కష్టపడి చదివించేది. అందమూ, చదువూ, వినయమూ , రంగరించుకొన్న వెంకట లక్ష్మీ ని అందరూ అభిమానంగానే చూసేవారు. చిన్నతనంలో అప్పుడప్పుడు వెంకటలక్ష్మీ ప్రకాశరావు లు ఆడుకొనే వారు.
    వెంకటలక్ష్మీ ఫోర్ట్ ఫారం చదివే రోజుల్లో ఒకనాడు, వెంకటలక్ష్మీ తో ప్రకాశరావు రింగ్ టెన్నిస్ ఆడుతున్నాడు. అంతలో "వెంకటలక్ష్మీ" అన్న గర్జన వినిపించి, వెంకటలక్ష్మీ , తన చేతిలో రింగ్ క్రిందకు జారవిడిచి, వణికిపోతూ చూసేసరికి, పులిలాగ తల్లి నిల్చొని ఉంది. వెంకటలక్ష్మీ తలవంచుకొని తల్లి దగ్గిరకు వెళ్ళిపోయింది.
    ఆ రాత్రి వెంకటలక్ష్మీ తల్లి కూతురుని కౌగలించుకొని, కన్నీళ్లు పెట్టుకొంది.
    "నీకు తెలియదమ్మా! ఇంకా చిన్నపిల్లవు కావు. ఇక మీదట నువ్వసలు వారింటికి రావద్దు. వారి అబ్బాయితో కలిసి మెలిసి తిరగొద్దు. బీదవాళ్ళని అందరూ లోకువగానే చూస్తారు. నా కర్మకాలి నేను వంట మనిషినయ్యాను. నీకూ నా గతి పట్టకూడదు! దీక్షతో కూడిన కృషి ఉంటె, మనం సాధించలేనిది లేదు. బాగా చదువుకో! వృద్ది లోకి రా! నీ కాళ్ళ మీద నువ్వు నిలబడు! విచక్షణా జ్ఞానంతో నీకు నచ్చిన యువకుడిని   వివాహం చేసుకో! నా జీవిత ధ్యేయం ఇదే! అప్పటివరకూ నేను బ్రతికున్నా, లేకపోయినా నా మాటలు నువ్వు మరిచి పోవద్దు."
    వెంకటలక్ష్మీ స్వాతికురాలు! బుద్ది మంతురాలు! తల్లి మాటలను శిరసా వహించింది. వెంకట లక్ష్మీ బొత్తిగా తన కంటికి కనబడక పోయేసరికి ప్రకాశరావుకు పిచ్చెత్తినట్లయింది.  వెంకటలక్ష్మీ ని ఎలా కలుసు కోవాలా, అని తీవ్రంగా ఆలోచించాడు. వెంకటలక్ష్మీ బడి నుండి తన ఇంటికి వచ్చే దారిలో కాశాడు- వెంకటలక్ష్మీ కనపడగానే, అతని హృదయం యెగిరి గంతులు వేసింది. తల్లి బోధలన్నీ మరిచిపోయి, వెంకటలక్ష్మీ కూడా ప్రకాశరావు ను చూసి మందహాసం చేసింది. ప్రకాశరావామేను తనతో హోటల్ కు రమ్మన్నాడు. వినయం ముందర పుట్టి, తరువాత వెంకట లక్ష్మీ పుట్టింది. గుండెలు దడదడలాడుతున్నా, కాళ్ళు వణుకుతున్నా , మనసు ఏవో అపస్వరాలు పలుకుతున్నా వెంకట లక్ష్మీ అతనితో వెళ్ళింది. తమ ఇంట్లో వెంకటలక్ష్మీ ని కలుసుకోవటం కంటే ఇదే చాలా బాగుంది ప్రకాశరావుకు.
    ఒకరోజు హోటల్ కు--
    మరొకరోజు సినిమాకు--
    చివరకు వెంకటలక్ష్మీ ప్రకాశరావు లు ఒకరి నొకరు ఒక్కరోజు కూడా విడిచి ఉండలేని పరిస్థితి కి వచ్చేసారు. ఆ రోజుల్లోనే , ఇద్దరూ కలిసి ఫోటో తీయించుకొని, చెరొక కాఫీ ఉంచుకున్నారు. పాకం ముదిరింది. ప్రకాశరావు కాలేజీ ఎగ్గొట్టి వెంకటలక్ష్మీ ని కూడా బలవంత పెట్టి మానిపించి, ఆమె తల్లి, తమ ఇంట వంట చేసే సమయంలో నేరుగా ఆమె ఇంటికే వచ్చేసేవాడు.
    ప్రకాశరావు ఒకనాడు హద్దు మీరబోతుండగా "ఛ! ఛ! పెళ్ళి కాకుండా ఇదేమిటి?" అంటూ వారించింది వెంకటలక్ష్మీ.
    అప్పటికి తగ్గిపోయినా, రోజురోజుక్కి అతిశయస్తూన్న వెంకటలక్ష్మీ సౌందర్యం ప్రకాశరావును నిలువ నియ్యలేదు.
    "లక్ష్మీ! మన మనసు లొకటి కావాలి కాని, పెళ్ళి లో ఏముందీ? మోసం చెయ్యాలనుకొంటె పెళ్ళి చేసికొని మాత్రం మోసం చెయ్యకూడదూ? నా చదువు పూర్తయితేనే కానీ, పెద్దవాళ్ళు  నెదిరించి పెళ్ళి చేసికోలేను. అప్పటి వరకూ , నీకు దూరంగా ఉండమంటావా? పెళ్లి సంఘం కోసం ఎప్పుడో, ఒకప్పుడు అవుతుంది లే! మనం భార్య భర్తలమే!"
    లోకమంతా , అందంగా మనుష్యులందరూ మంచివాళ్ళుగా కనుపించే ఆ వయసులో వెంకట లక్ష్మీ ప్రకాశరావు మాటలు తేలిగ్గా నమ్మేసింది.
    చివరి ఘడియ వరకూ కూతురు తనలా వంట మనిషి కాకూడదని కలవరిస్తూ వెంకటలక్ష్మీ తల్లి కన్ను మూసింది. దిక్కులేని వెంకటలక్ష్మీ ని ప్రకాశరావు తల్లిదండ్రులు చేరదీసారు. లా ఫైనల్ ఇయర్ చదువుతున్న ప్రకాశరావు కు వెంకటలక్ష్మీ తమ ఇంటికే వచ్చి చేరటం సంతోషాన్ని కలిగించటానికి మారుగా చికాకును కలిగించింది. అతనికి అనేకమంది మిత్రులు పోగయ్యారు! తెల్లవారి లేస్తే వింత వింత అలంకారాలతో మెరిసి పోయే విద్యార్ధినులను చూస్తూ వాళ్ళతో నిరాడంబరంగా ఉండే వెంకటలక్ష్మీ ని పోల్చుకొని చీదరించుకొనేవాడు.
    ఇంతలో ప్రకాశరావు తండ్రి పోయాడు. ప్రకాశరావు కుటుంబం ఆర్ధికంగా కొంత ఇబ్బందులకు లోను కావలసి వచ్చింది. ప్రకాశరావుకు డబ్బు విలువ తెలిసింది. అతడు లా లో డిగ్రీ తీసుకోగానే అనేక సంబంధాలు కట్నాలతో రాసాగాయి. చదువూ, అందమూ ఉన్న అమ్మాయిలూ డబ్బు కూడా తీసికొని తనకు భార్యలుగా రాబోతుంటే, ఈ దిక్కుమాలిన వెంకటలక్ష్మీ ని ఎందుకు చేరదీయాలో అర్ధం కాలేదు ప్రకాశరావుకు. అంతలో ప్రకాశరావు తల్లి జబ్బు పడింది. కన్నకూతురి కంటే మిన్నగా వెంకటలక్ష్మీ ఆవిడకు సేవ చేసేది. మంచమెక్కిన ప్రకాశరావు తల్లి కొడుకును త్వరగా పెళ్ళి చేసుకోమని పోరసాగింది.
    ప్రకాశరావు తల్లి దగ్గిర కూర్చున్నాడు.
    "నేను నీ మాట కాదననమ్మా! కనీసం బి,ఏ. అయినా పాసయి సభ్య సమాజంలో హాయిగా మసలగలగాలి. చూడటానికి బాగుండాలి. కట్నం కనీసం ఏడు వేలకు తక్కువ కాకూడదు. నీ యిష్టం వచ్చిన సంబంధం స్తిరపరచు."
    ఈ మాట అంటున్నప్పుడు వెంకటలక్ష్మీ కూడా అక్కడే ఉంది. చాలారోజులుగా ప్రకాశరావు ధోరణి విపరీతంగా మారిపోయినా, వెంకటలక్ష్మీ సహిస్తూ వచ్చింది. కానీ, స్పష్టంగా అతని నోటే ఈ మాటలు వినటంతో , నిగ్రహించుకోలేకపోయింది. అతనినే స్పష్టంగా అడిగింది.
    "మీకేనాడో నేను భార్యను. ఇంకా పెళ్ళేమిటి?"
    "పిచ్చిమాటలు మాట్లాడకు! వంటమనిషి కూతురు ప్రకాశరావు కు భార్య అవుతుందా? ఇది సంభవమా?"
    "నాకేం తెలుసు? ఒకనాడు మీరే అన్నారు."
    "నాకు గుర్తు లేదు!"
    "నేను మరిచి పోలేను."
    "నీ కర్మ! నువ్వే విధంగానూ నా కడ్డు రాలేవు. నీ మాటలకు రుజువు లేదు.
    "అక్కర్లేదు . ఋజువు చెయ్యాలని నేను ప్రయత్నించటం లేదు. కానీ, నాగతేమిటని అడుగుతున్నాను."
    "దానికి సమాధానం నేనా చెప్పేది? అయినా కుల వృత్తి ఉందిగా!"
    ప్రకాశరావు వెటకారంగా  నవ్వాడు. ఆ నవ్వు వెంకటలక్ష్మీ గుండెలను చీల్చింది. అక్కడి నుండి వచ్చేసి, కుళ్ళి కుళ్ళి ఏడ్చింది.
    వ్యక్తీ, సంఘమూ, పరస్పరాశ్రయాన్ని విడువకుండానే ముందుకు సాగాలి. వ్యక్తీ సంఘ నియమాల నతిక్రమించకూడదు. సంఘ నియమాలు వ్యక్తీ వికాసాని కడ్డు వచ్చేవిగా ఉండకూడదు. ఈ రెంటిలో ఏది నియతి నతిక్రమించినా , పరిణామాలు వాంఛనీయమైనవిగా ఉండవు.
    ఒకనాడు అజ్ఞానంలో కొన్ని విలువలను నిర్లక్ష్యం చేసిన దోషానికి ఫలితమానాడు తెలియక పోయినా, తర్వాత చక్కగానే తెలిసింది. వెంకటలక్ష్మీకి! తన కర్మ ఫలితాన్ని తను అనుభవించక తప్పదు.
    ప్రకాశరావుకు చేతులు జోడించింది.
    "నేను నా కులవృత్తినే పాటిస్తాను. మీదగ్గరే జీవితాంతమూ వంట మనిషిగా ఉంటాను."
    ప్రకాశరావు కనుబొమలు చిట్లించాడు.
    "ఎందుకూ? నా సంసారం లో చిచ్చు పెట్టడానికా? నా కాబోయే భార్య బి.ఏ పాసయింది. ఎంతో అందంగా ఉంటుంది!"
    "నేను బలహీనురాలినే! కానీ నీచురాలిని కాను. మీ సంసారంలో నా మూలంగా కలత లేమీ రావు."
    "వీల్లేదు. నిన్ను నా ఇంట్లో ఉంచుకోవటం నా గుండెల మీద కుంపటి ఉంచు కొన్నట్లే! ఏ క్షణంలో ఏం జరుగుతుందో?"
    "మీ పాదాల సాక్షిగా చెపుతున్నాను. నా నోటి మీదుగా, మన రహస్యం ఏనాడూ బయటకు రాదు. నా కారణంగా మీ సంసారంలో అశాంతి రావటం, అసంభవం. మీకు జీతమియ్యక్కర్లేని వంటమనిషిగా ఉంటాను. నా సర్వస్వమూ మీకు అర్పించుకొన్నందుకు ఈ మాత్రం కనికరించలేదా?"
    వెంకటలక్ష్మీ మాటలన్నింటిలో "జీతమియ్యక్కర్లేని వంటమనిషి" ప్రకాశరావును బాగా ఆకర్షించింది.
    "కానీ, నువ్వెన్నడూ నామీద అభిమానం ప్రకటించకూడదు."
    "ప్రకటించను."
    "నా భార్యను ఏనాడూ, నిర్లక్ష్యం చెయ్యకూడదు."
    "మీకంటే ఎక్కువగా గౌరవిస్తాను."
    "నాతొ మాట్లాడటానికి ప్రయత్నించకూడదు!"
    "ఇంకా మన మధ్య మాటలేముంటాయి?"
    "జాగ్రత్త!ఇందులో ఏది హెచ్చు తక్కువ వచ్చినా, నిన్ను వెంటనే వెళ్ళ గొట్టేస్తాను." వెంకటలక్ష్మీ తల వూపింది.
    "చాలు! ఈ మాత్రం అదృష్టం చాలు! ధర్మ బద్దంగా మాంగల్య ధారణ జరిగిన తర్వాత కూడా వంటమనిషి కన్న హీనంగా చూడబడే స్త్రీలు లేక పోలేదు గదా! వారిలో తనూ ఒకతే!
    వెంకటలక్ష్మీ వణికిపోతూ నిల్చుంది. ప్రకాశరావు భగ్గున మండి పడ్తున్నాడు.
    
                                 *    *    *    *
    "కదలవేం? ఇంకా వెళ్లలేదూ?"
    వెంకటలక్ష్మీ పెదవులు కదిలాయి.
    "ప్రాణాలతో నేనిక్కడి నుండి కదలను. నా కీ ఇంట్లో స్థానమున్నదని నలుగురిలో నిరూపించుకోడానికి, నా మెడలో మాంగల్యాలు లేని మాట నిజమే కాని, నా అంతరాత్మ నాకు చాలు!"
    ప్రకాశరావు చేయ్యేత్తి చెళ్ళున వెంకటలక్ష్మీ ని కొట్టబోయాడు. ఆ దెబ్బ అడ్డు వచ్చిన అరుంధతి కి తగిలింది. 'అబ్బ! అని అరిచి క్రింద పడబోతున్న అరుంధతి ని ఆందోళనతో పొదివి పట్టుకొన్నాడు ప్రకాశరావు.
    "ఆరూ! కళ్ళు తేరు! అరె! నువ్వెందు కడ్దోచ్చావ్!"
    అరుంధతి మీదికి వంటి గాభరాగా అంటున్నాడు ప్రకాశరావు.
    అరుంధతి ప్రకాశరావును మెల్లగా వదిలించుకొని లేచింది. చెంప మీద అయిదు వేళ్ళూ వాత దేలి కనుపించాయి. అది చూసేసరికి ప్రకాశరావుకు వెంకటలక్ష్మీ మీద మరింత మండింది.
    "దుర్మార్గులారా! వంచకి! ఇందుకా! ఇక్కడున్నది ? ఇంకా పోవెం?" అంటూ విరుచుకు పడ్డాడు.
    అరుంధతి కి దెబ్బ తగిలినందుకు ప్రకాశరావుకు ఎక్కువ బాధగా ఉంది. వెంకటలక్ష్మీ కి. చటుక్కున అరుంధతి దగ్గిరకు రాబోయింది.
    "అడుగు ముందుకు వేస్తె జాగ్రత్త!"
    గర్జించాడు ప్రకాశరావు. వెంకటలక్ష్మీ నిలబడి పోయింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS