"థాంక్స్ ..... మాధవి జీవితంలో సక్సెస్ తప్ప ఫెయిల్యూర్స్ ఉండవు" అంది.
విశాల్ మాట్లాడలేదు.
మాధవి కాలు మీంచి కాలు తీసేసి కొంచెం ముందుకు వంగి అంది. "భార్య బతికి ఉండగా మరో పెళ్ళి చేసుకున్నావంటే నువ్వు చాలా ధైర్యస్తూడివి అనుకోమంటావా? మగాడి వన్న అహంకారంతో ఏం చేస్తుందిలే అన్న నిర్లక్ష్యంతో చేసుకున్నావనుకొమంటావా?"
విశాల్ మాట్లాడలేదు. మౌనంగా చూపులు తిప్పుకుని అప్పుడే అపర్ణ సర్దిన పూలకేసి చూస్తుండి పోయాడు.
"నేనిప్పుడు కోర్టుకి వెళితే ఏం చేస్తావు?"
విశాల్ అప్పుడు కూడా ఏం మాట్లాడలేదు.
"నీకున్న సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కి అభినందించాలో, తిట్టాలో అర్ధం కావడం లేదు. నీకూ, నాకూ మధ్య జరగబోయే వార్ లో ఆ అమ్మాయి విక్టిమ్ అవుతుందని నీకు తోచలేదా? నీ స్వార్ధం కోసం ఓ అమాయకురాలి జీవితం నాశనం చేస్తున్నావన్న ఆలోచన రాలేదా?"
విశాల్ చూపులు తిప్పి మాధవి వైపు సూటిగా చూశాడు. అమెరికా నీళ్ళు బాగా వంట పట్టాయేమో ఎప్పటి కన్నా రంగు వచ్చింది. స్లిమ్ గా అయింది. చాలా ఆధునికంగా అలంకరించుకుంది. చదువు తెచ్చిన కళతో మెరిసిపోతోంది.
నెమ్మదిగా అన్నాడు. "ఆరోజు నా మాట వినకుండా నిర్లక్ష్యంగా నీ దారిన నువ్వు వెళ్ళిపోయిన రోజు నేనిలా చేస్తానని, చేయగలనని నువ్వు ఊహించలేదా? నీకోసం మూడు సంవత్సరాలు మునిలా ఎదురు చూస్తానన్న ఓవర్ కన్పిడేన్స్ తో ఎలా ఉన్నావు?"
మాధవి నవ్వింది. "నేను ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తీ ఒక మామూలు మగాడిలా ప్రవర్తిస్తాడని నేనూహించలేదు.
"సో....నువ్వు తప్పు చేశావని నీకు అనిపిస్తోందా?"
మాధవి మాట్లాడలేదు. టీపాయ్ మీద ఉన్న వారపత్రికల వైపు చూస్తూ కొన్ని క్షణాలు మౌనంగా ఉండిపోయింది. తరువాత అంది. 'అవును నేను తప్పు చేశాను. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని నమ్మి నిన్ను పెళ్ళి చేసుకున్నాను. చాలా పెద్ద తప్పు చేశాను. అయితే హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం తప్పైనా, ఒప్పైనా నా స్థానాన్ని అనుమతి లేకుండా మరొక స్త్రీకి ఇవ్వడం నువ్వు చేసిన నేరం. ఈ నేరాన్ని సవాల్ చేసే హక్కు నాకుంది. నా స్థానాన్ని తిరిగి పొందే హక్కు కూడా నాకుంది అనుకుంటా....
"హక్కులు ...."నిర్లక్ష్యంగా అన్నాడు. "హక్కుల గురించి పోరాడేముందు నీ భాద్యతలని ఒక్కసారి గుర్తుకు తెచ్చుకో. ఒక కోడలిగా నీకేం బాధ్యత లేదా? నన్ను భర్తగా అంగీకరించేముందే నా వాళ్ళని కూడా నీ వాళ్ళుగా అంగీకరించాలన్న నిజం నీకు తెలియదు. అందుకే అవసానదశలో ఉన్న అత్తగారి మీద కనికరం లేకుండా నీ స్వార్ధం చూసుకుని వెళ్ళిపోయావు."
"యస్.... నన్ను పాతికేళ్ళు పెంచిన నా తల్లిదండ్రుల్నే నేను కేర్ చేయలేదు. కేవలం నెలన్నర పరిచయం ఉన్న ఆవిడ కోసం నేనెందుకు నా కెరియర్ త్యాగం చేయాలి?"
"అవును నిజమే... నన్ను కనిపెంచి నాకోసం తన సుఖాల్ని త్యాగం చేసిన నా తల్లి కోసం నేను మాత్రం కేవలం మూడు ముళ్ళ బంధం కోసం నా తల్లి నెందుకు త్యాగం చేయాలి.... అందుకే చేయలేదు. .. నా తల్లి సుఖం కోసం, ఆవిడ మనశ్శాంతి కోసం ఏం చేయాలో అదే చేశాను. ఈ విషయం నువ్వు ఏ కోర్టులో సవాల్ చేసుకుంటావో చేసుకోవచ్చు."
"తల్లి, తల్లి అనుకునే మగాడికి పెళ్ళి చేసుకునే అర్హత లేదు... ఎందుకు చేసుకున్నావు?"
"అలాగా! కెరియర్ కోరుకునే ఆడదానికి మాత్రం పెళ్ళి చేసుకునే హక్కుందా? లేదు... నువ్వు మాత్రం ఎందుకు చేసుకున్నావు?"
"ఒకే. జరిగిందాంట్లో తప్పంతా నామీద వేసేయాలన్న నిర్ణయానికి వచ్చవన్న మాట. అలా అయితే నా స్థానం నేను పొందడానికి ఏం చేయాలో నాకు బాగా తెలుసు."
వంటగదిలో కాఫీ కలుపుతోన్న అపర్ణ చేతుల్లో గిన్నె వణికింది. తీవ్రస్థాయిలో వినిపిస్తున్న వాళ్ళిద్దరి స్వరాలు ఆమెకి భయంతో ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. ఏం జరుగుతోంది. జారిపోబోతున్న గిన్నె గట్టు మీద పెట్టి నిలువెల్లా వణికిపోతూ శిలలా నిలబడిపోయింది.
హటాత్తుగా 'అపర్ణా" అంటూ గట్టిగా మాధవి స్వరం వినిపించింది. గుండె గుభిల్లుమంది. కాళ్ళు కుంటుకున్నట్టుగా నిలబడ్డ చోటే స్తంభించి పోయింది.
"అపర్ణా.... నిన్నే బైటకిరా...." మాధవి స్వరం అదే తీవ్రస్థాయిలో వినిపించింది.
"మనమధ్య తనెందుకు? తనేం చేసింది. ఏం మాట్లాడాలో నాతొ మాట్లాడు" విశాల్ స్వరం కూడా అదే స్థాయిలో వినిపించింది. ఎక్కడి నుంచో పెద్ద పెద్ద రాళ్ళు తన తల మీద పడుతున్న భావన. ఒంటినిండా గాయాలై రక్తం కారుతున్న పక్షిలా విలవిల్లాడుతోంది అపర్ణ. కళ్ళు వర్షిస్తున్నాయి. అక్కడ ఒక్క క్షణం కూడా నిలబడలేకపోయింది. గుండె దిటవు చేసుకుంటూ అడుగులో అడుగు వేసుకుంటూ బైటికి వచ్చింది.
అమెనా స్థితిలో చూసిన విశాల్ , మాధవి కూడా అవాక్కయ్యారు. ఒక్క నిమిషం పాటు అంతటా నిశ్శబ్దం ఆవరించింది. మాధవి ముందుగా తేరుకుని లేచి నిలబడి అపర్ణ వైపు సూటిగా చూస్తూ నెమ్మదిగా నడుస్తూ ఆమె వైపు వచ్చింది. అపర్ణ రెండు చేతులూ జోడించి కుప్పకూలినట్టుగా కింద కూర్చుండి పోయింది.
విశాల్ కంగారుగా పరిగెత్తు కుంటూ వచ్చి "అపర్ణా" అంటూ ఆమెని లేవనెత్తబోయాడు. మాధవి గట్టిగా అరిచింది "అగు'
విశాల్ నిశ్చేష్టుడిలా చూశాడు.
మాధవి ఒంగి అపర్ణని భుజాలు పట్టుకుని లేవనెత్తింది. అపర్ణ వెక్కివెక్కి ఏడుస్తూ క్షమించండి... నేను వె...ళ్ళి..పో..." అంటూ మొహానికి చేతులు అడ్డం పెట్టేసుకుంది.
మాధవి కొన్ని క్షణాలు అలాగే చూస్తూ నెమ్మదిగా అంది. "ఇంత భయం ఉన్నదానివి ఎలా కట్టించుకున్నావీ తాడు? ' అపర్ణ మెడలో మంగళసూత్రం వేలితో పైకెత్తుతూ అడిగింది.
అపర్ణ ఏం మాట్లాడలేదు. రెండు చేతుల్లో మొహం దాచుకుని వెక్కివెక్కి ఏడవసాగింది.
"ఎందుకేడుస్తున్నావు? ఈ ఇంట్లో స్థానం పోతుందని భయమా? తప్పు చేశానన్న పశ్చాత్తాపమా?"
"మాధవీ.... తను అమాయకురాలు. దయచేసి తనని వదిలేయ్. నీ అంత బ్రేవ్ కాదు. మనం మనం తేల్చుకుందాం.."
విశాల్ మాటలకి చివ్వున చూసింది మాధవి. 'అమాయకురాలు కాబట్టే ఈజీగా మభ్యపెట్టి ఆమెని పెళ్ళి చేసుకున్నావు. మనం, మనం తేల్చుకున్నా ఇప్పుడు నష్టపోయేది తనే. భవిష్యత్తు ఏం నిర్ణయించుకుందో తెలియాలి కదా....లేకపోతె ఏదన్నా ఆధారం చూపించి పంపిస్తాను."
"నువ్వెవరు పంపడానికి?"
విశాల్ మాటతో చర్రున చూసింది. "ఈ ఇంటి యజమానురాలిని."
"నీకా హక్కు లేదు."
"ఉందొ లేదో తేల్చాల్సింది నువ్వు కాదు ....లా"
"మీకు పుణ్యం ఉంటుంది. ఆయన్నేం అనకండి.... జరిగినదాంట్లో అయన తప్పేం లేదు."
భారమైన స్వరంతో అంటోన్న అపర్ణ వైపు చూస్తూ "మరి ఎవరిది? నీదా? నువ్వు అతడిని లొంగదీసుకున్నావా?"
ఒక్కసారిగా ఆ మాటకి దుఃఖం ఎగదన్ని భోరుమంది అపర్ణ.
విశాల్ ఉగ్రుడయ్యాడు గభాల్న అపర్ణ ని పొదివి పట్టుకుని మాధవి వైపు అసహ్యం నిండిన కళ్ళతో చూస్తూ అరిచాడు. "రాక్షసీ! తప్పెవరిదో నీకు తెలియదూ? ఇంకా నీ తప్పు నువ్వు తెలుసుకోలేదంటే ఈ జన్మలో నువ్వు తెలుసుకోలేవు. ఒకే....నీకేం కావాలి? ఆస్తా....రాసిస్తా....దయచేసి మా జీవితాల్లోంచి వెళ్ళిపో.... నీకు నమస్కారం చేస్తా..."
మాధవి కి అతని చూపులు గుండెల్లో గురిచూసి విసిరిన కత్తుల్లా అనిపించాయి. ఆ చూపులకి గుండె ముక్కలుగా విరిగిపడుతున్న భావన కలిగింది. అతని మాటలు ఒక్కొక్క అక్షరం ఒక్కో బాకులా తాకుతున్నట్టు అనిపించింది. అతని చేతుల మధ్య గువ్వపిట్టలా ముడుచుకుని ఉన్న అపర్ణ వైపు చూసింది. కళ్ళల్లోకి చివ్వున దూసుకొచ్చింది బాధ. అది కనిపించకుండా కళ్ళు తిప్పెసుకుంది. హు....ఎంత ప్రేమ.... అంతేలే అణిగి, మణిగి ఉండే ఇల్లాళ్ళంటే మగాళ్ళ కి ప్రేమే.... ఆ ప్రేమలో అనురాగం కన్నా ....స్వార్ధమే ఎక్కువ. భవిష్యత్తు ని అల్లుకోడానికి పందిరి కోసం వెతికే ఆడపిల్లలకి స్వార్ధం లోనే ప్రేమ కనిపిస్తుంది. నెమ్మదిగా, స్థిరంగా స్వరంలో విశ్వాసం ఒలికిస్తూ అంది....
"నీ ఆస్తికోసం నీతో జీవితం కోసం తపించి, దేబిరించే స్థితిలో లేను నీలాంటి వాళ్ళను పదిమందిని పోషించగల స్థితిలో ఉన్నాను."
అపర్ణ దగ్గరగా నడిచింది మాధవి. అప్రయత్నంగా అపర్ణ ని వదిలేసి కొంచెం ఎడంగా జరిగాడు విశాల్. అపర్ణ భయంగా చూసింది మాధవిని. నీళ్ళల్లో తడిసిన చేప పిల్లలా ఉన్న ఆమె కళ్ళు చూస్తుంటే జాలేసింది మాధవికి.
"నాకు చదువుంది.... డబ్బుంది.... ధైర్యం ఉంది... అన్నిటికీ మించి బతకగలనన్న ఆత్మవిశ్వాసం ఉంది. కానీ, నీకు బతుకంటే భయం తప్ప ఏమీ లేనట్టున్నాయి. ముఖ్యంగా ఆత్మవిశ్వాసం లేని ఆడదానికి బతికే అర్హత లేదు తెలుసా" అపర్ణ ఏడుస్తూ తల వంచుకుంది.
"చూశావా! జరిగినదాంట్లో నీ పాత్ర కొంచెమే అయినా తప్పనంతా నీదే అన్నట్టుగా ఓ నేరస్తురాలిగా తలవంచుకున్నావు. కానీ, అతన్ని చూడు ఎంత ఠీవిగా తలెత్తుకుని ఉన్నాడో...."విశాల్ వైపు చూసింది. విశాల్ విసురుగా తల తిప్పేసుకున్నాడు.
మాధవి అదో రకంగా నవ్వింది... 'అపర్ణా! ఒక్క విషయం మాత్రం నీకు చెప్పడానికి నేనిక్కడికి వచ్చాను. పరాధీనగా బతికే ఆడదానికి జీవితమంతా అభద్రతా భావం పగబట్టిన పాములా వెంటాడుతూ ఉంటుంది. ఇవాళ అభయం కలిగించిన అతని రెండు చేతులూ ఏ కారణం చేతనన్నా నిన్ను వదిలేస్తే ఎలా బతకాలో ఆలోచించుకో... కేవలం ఓ రక్షణ కోసం, భద్రతా కోసం నీది కాని స్థానం అక్రమించావు. కానీ , ఒక్క క్షణం ఈ ఇంటి ఇల్లాలు తిరిగి వస్తే నా పరిస్థితి ఏంటి అని అలోచించి ఉంటె నీ జీవితాన్ని మరోవిధంగా మలుచుకునే దానివి.... ఆడదానికి రక్షణ నిచ్చేది తన చేతులు, తన కాళ్ళే.... వాటి మీద ఆధారపడడంలో ఉన్న ఆనందం మగాడి మీద ఆధారపడి బతకడం లో లేదు."
విశాల్ వైపు తిరిగి అంది.... "ఇకనుంచైనా ఆమెకి బతుకంటే మమకారం కలిగించు.... భయం కాదు.... గుడ్ బై...."
నెమ్మదిగా, ఠీవిగా వెళ్ళిపోతున్న మాధవి వైపు నిర్విన్నులై చూస్తూ ఉండిపోయారు అపర్ణా, విశాల్.
***
