మొదటి రాత్రి తనచేతుల్లో వాలిపోయిన రోజు "ఇంత అదృష్టం కలుగుతుందని నేనెన్నడూ ఊహించలేదండి" అంది అపర్ణ. కానీ "మీరిలా చేశారేంటండీ? మాధవికి విదాకులివ్వ కుండా నన్ను పెళ్ళి ఎందుకు చేసుకున్నారు" అని అడగలేదు.
మాధవి వస్తోంది... వచ్చి ఏం చేస్తుంది? నేరుగా ఈ ఇంటికే వస్తుందా? పుట్టింటికి వేడుతుందా? ఇది తన ఇల్లు అన్న స్పృహ మాధవికి ఉందా? హక్కుగా వస్తుందా? బిదియపడుతూ వస్తుందా? తప్పు చేసిన భావనతో గిల్టీగా వస్తుందా? మాధవి తిరిగి వస్తోందన్న వార్త విశాల్ మనసులో రకరకాల ఆలోచనలను రేకెత్తిస్తోంది. మాధవి ఇప్పుడు తన స్థానం కోసం దెబ్బలాడుతుందా , ఈమెని ఇంటి నుంచి వెళ్ళగోడుతుందా? ఈమె పరిస్థితేంటి? అతని క్కూడా బుర్ర పనిచేయడం లేదు. మొద్దు బారినట్టు ఉంది . అపర్ణ దుఃఖం చూస్తుంటే హృదయం కరిగిపోయింది.
నెమ్మదిగా ఆమె చుబుకం పట్టుకుని మొహం పైకి లేవనెత్తి కన్నీళ్లు తుడుస్తూ అనురాగం ధ్వనిస్తున్న స్వరంతో అన్నాడు "బాధపడకు....ఎట్టి పరిస్థితుల్లో నీకు అన్యాయం చేయను సరేనా!..."
కన్నీళ్లు నిండిన కళ్ళతో అతని మొహంలోకి చూసింది. ఆ కన్నీళ్ళ మధ్య నిజమా.... అన్న ఆశ మిలమిలా మెరిసింది.
అభయం ఇస్తున్నట్టు మెత్తగా నవ్వాడు. "వెళ్ళు మొహం కడుక్కో... వెళ్లు ఏడవకు" అంటూ ఆమెని నెమ్మదిగా నడిపిస్తూ వాష్ బేసిన్ దగ్గరకు తీసికెళ్ళాడు. పంపు తిప్పి కుడిచేతి నిండా నీళ్ళు నింపి , ఎడం చేత్తో ఆమె భుజం పట్టుకుని ముందుకు వంచి నీళ్ళు మొహం మీద చల్లాడు.
అతని ఆప్యాయత కీ, అప్రేమతో కూడిన చర్యకీ చలించి పోయింది అపర్ణ. చాలు....నాకీ అభయం చాలు అనుకుంటూ "నేను కడుక్కుంటాను" అంది. సన్నగా వెక్కుతూ.... అపర్ణ మొహం కడుక్కుని టవల్ తో తుడుచుకుంటూ అంది "మీరు వెళ్ళండి ....ఆఫీస్ కి టైం అయిందేమో కదా.... సారీ....నావల్ల లేట్ అయిందేమో...."
"లేదులే పర్లేదు.... నేను వెళ్ళాక ఇంకేమీ ఆలోచించవద్దు.... జరిగేది జరుగుతుంది. ఏది ఏమైనా నీకు మాత్రం అన్యాయం చేయను. నా మాట నమ్ము."
నమ్ముతాను అన్నట్టు తల ఊపింది. 'గుడ్" అంటూ విశాల్ బ్యాగ్ తీసుకుని ఆఫీసు కి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిన వైపు చూస్తూ అలాగే నిలబడి పోయింది అపర్ణ.
ఆరోజు ఆదివారం....
విశాల్ ఆలస్యంగా నిద్రలేచాడు. నాలుగు రోజులుగా సరిగా నిద్ర పట్టడం లేదు. ఏదో అశాంతి మనసుని ఆవరించి నిద్రలేకుండా చేస్తోంది. అపర్ణ ఇచ్చిన కాఫీ తాగి, న్యూస్ పేపర్ చదువుకుంటూ కూర్చున్నాడు. మాధవి ఇండియాకి వచ్చి నాలుగు రోజులైంది. ఇంతవరకూ విశాల్ అటు వెళ్ళడం గానీ, మాధవి విశాల్ ని కలుసుకోడం గానీ జరుగలేదు. ప్రాణాలు ఉగ్గబెట్టు కుని జరుగబోయే సంఘటన కోసం ఎదురు చూస్తోన్న అపర్ణ మనసిప్పుడు కొంచెం కుదుటపడి నట్టుంది....మాములుగా నవ్వుతూ తిరుగుతోంది.
విశాల్ మాత్రం మాధవి గురించి ఆలోచిస్తూనే ఉన్నాడు. అదృష్టవంతురాలు.... అనుకున్నది సాధించింది అనుకున్నాడు. ఎంత కాదనుకున్నా ఆమె తనభార్య.... మూడేళ్ళు ప్రేమించి, కోరికోరి పెళ్ళి చేసుకున్నాడు. ఇద్దరూ కలిసి భవిష్యత్తు గురించి ఎన్నో కలలు కన్నారు. అందమైన ఆశాసౌధాలు నిర్మించుకుని అందులో అన్యిన్యమైన దాంపత్య జీవితాన్ని డిజైన్ చేసుకున్నారు. కానీ ,కెరియర్ ముఖ్యం అంటూ ప్రేమనీ, బాధ్యతల్ని కూడా కాలితో తన్ని వెళ్ళిపోయింది మాధవి. అమెది స్వార్ధమా, రాక్షసత్వమా? లేక ఆమె చేసింది కరెక్టా.... నిట్టూర్చాడు విశాల్. తప్పకుండా ఆమెకి తను అపర్ణ ని పెళ్ళి చేసుకున్నట్టు తెలిసే ఉంటుందీ పాటికీ , వెళ్ళిన కొత్తలో కొన్ని మెయిల్స్ పంపించింది. కానీ తను సరిగా రెస్పాండ్ అవకపోవడంతో మెయిల్స్ ఆగిపోయాయి.ఇప్పుడు ఇండియా వచ్చిన తరువాత కూడా తనని కలవడానికి ప్రయత్నించ లేదంటే ఆమె తప్పకుండా తనని మర్చిపోయి ఉంటుంది. ఇప్పుడు ఆవిడ తనకన్నా విద్యాదికురాలు. తను కేవలం బి.టెక్ .విదేశాల్లో ఆవిడ ఎం.ఎస్ చేసి వచ్చింది. తాత్కాలికంగా వచ్చి తల్లిదండ్రు లని చూసి వెళ్ళి పోతుందేమో.... అక్కడ ఎంఎస్ చేసి ఇక్కడ ఉద్యోగం చేయడానికి పిచ్చిది కాదు కదా.... తప్పకుండా అక్కడేదో మంచి ఉద్యోగం దొరికి ఉంటుంది.విశాల్ కి ఎక్కడో ఏమూలో కొంచెం ఈర్శగా అనిపించింది. బాధగా కూడా అనిపించింది. ఏం ఊహించాడు... ఏం జరిగింది ఆరోజు మాధవి తనతో గొడవ పడి వెళ్ళిపోవడం గుర్తొచ్చింది.
బి.టెక్ చదివే రోజుల్లో ఇద్దరూ ప్రేమించుకున్నారు. ఇద్దరికీ ఎంఎస్ చేయాలన్నది ఆశయం. బి.టెక్ అయిపోగానే ఇద్దరూ కలిసి అమెరికాలోని చాలా యూనివర్శిటీ ల్లో ఎంఎస్ కి అప్లై చేశారు. లక్కీగా ఇద్దరికీ కూడా రెండు, మూడు యూనివర్శిటీ ల్లో సీటొచ్చింది. ప్రయాణానికి అన్ని ఏర్పాట్లు అయ్యాయి. ఆడపిల్లను పరాయి మగాడితో అంతదూరం ఒంటరిగా పంపడం ఇష్టం లేని మాధవి తల్లిదండ్రులు ఎలాగా వాళ్ళు పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నారని తెలిసి, పెళ్ళి చేసుకుని వెళ్ళమన్నారు. అందుకు మాధవి కానీ, విశాల్ కానీ పెద్దగా అభుంతరం పెట్టలేదు. అదీ ఒకందుకు మంచిదే అనిపించింది వాళ్ళకి. అంగరంగ వైభవంగా పెళ్ళి అయింది. మాధవి విశాల్ చేయందుకుని అతనికి ఇంటికి వచ్చింది. అందం, ఐశ్వర్యం , చదువు అన్నీ ఉన్న కోడల్ని చూసి ప్రభావతి మురిసిపోయింది.
విదేశీ ప్రయాణానికి సుమారు నెల, నెలన్నర ముందువరకూ వాళ్ళ దాంపత్య జీవితం రసవంతంగా సాగిపోయింది.
అయితే ఓ రోజు ఉదయం అనుకోకుండా విశాల్ తల్లి ప్రభావతి గారు జబ్బు బడింది. నోటి నుంచి రక్తం కక్కుకుంటున్న అవిడని కంగారుగా హాస్పిటల్ కి తీసుకెళ్ళిన విశాల్ డాక్టర్స్ చెప్పిన వార్తతో షాక్ తిన్నాడు. ఆవిడ కి బ్రెస్ట్ క్యాన్సర్. ఊహించని ఆ పరిణామం తో విశాల్ హతాశుడైనాడు. ఏం చేయాలో దిక్కుతోచలేదు. జబ్బుగా ఉన్న తల్లిని వదిలి విదేశాలకు వెళ్ళడానికి అతనికి మనస్కరించలేదు. ఒక్కగానొక్క కొడుకుగా ఆవిడనలా వదిలి వెళ్ళడానికి బాధ్యతా రాహిత్యమే కాక మానవత్వం కాదని పించింది. అందుకే ఎం.ఎస్ ఆశ చంపెసుకున్నాడు. మాధవి మాత్రం విదేశీ ప్రయాణం క్యాన్సిల్ చేయడానికి ససేమిరా అంగీకరించలేదు. "నీ తల్లి కాబట్టి నువ్వు నీ ప్రయాణం క్యాన్సిల్ చేసుకోవాలి? నేనెందుకు నా ఆశయం వదులుకోవాలి. ఎంత కష్టపడి సీటు సాధించాము. సీటొచ్చి వీసా వచ్చి, టికెట్స్ కూడా బుక్ చేశాక క్యాన్సిల్ చేయడం నాకిష్టం లేదు." అని తేల్చింది మాధవి.
"మరోసారి ఈ అవకాశం తప్పకుండా వస్తుంది మధూ.... నా మాట విను....ఈ సమయంలో అమ్మని వదిలి వెళితే లోకం ఏమంటుంది... లోకం సంగతి పక్కన పెట్టు మన అంతరాత్మ అంగీకరిస్తుందా?"అని బతిమాలాడాడు.
"నీ అంతరాత్మ అంగీకరించక పోవచ్చు, కానీ అంతరాత్మ అంగీకరిస్తుంది.... సారీ' అంది. ఎంత నచ్చచెప్పినా వినకుండా ప్రయాణం అయింది.
విశాల్ కి ఆ సమయం భయంకరమైన పరీక్షా సమయం అయింది. ఒకవైపు అనారోగ్యంతో ఉన్న తల్లీ... మరోవైపు ప్రేమించి పెళ్ళాడిన భార్య.... మరోవైపు ఆహ్వానిస్తున్న అందమైన భవిష్యత్తు.... ఏం చేయాలో అర్ధం కాలేదు. మాధవి ఈ సమయంలో తనకి అండగా ఉంటె ఈ నిరాశని అందంగా భరించవచ్చు అనిపించింది. అమ్మ బాధ్యత ఇద్దరూ కలిసి పంచుకుని ఇక్కడే మంచి భవిష్యత్తు నిర్మించుకోవచ్చు అనిపించింది. మాధవి తల్లిదండ్రులతో కూడా పరిస్థితి వివరించి చర్చించాడు. వాళ్ళకీ మాధవి మొండితనం నచ్చలేదు. కూతురికి నచ్చ చెప్పారు. మాధవి వినలేదు. నా కెరియర్ కన్నా నాకేదీ ముఖ్యం కాదు అని తేల్చి చెప్పింది.
నిర్దయగా అత్తగారిని, నిర్లక్ష్యంగా భర్తని వదిలి విదేశాలకు వెళ్ళిపోయింది.
కాలింగ్ బెల్ మోగడంతో విశాల్ గతం నుంచి తెప్పరిల్లాడు. న్యూస్ పేపర్ అతని ఒడిలో పడి ఉంది. "ఎవరో వచ్చారు అపర్ణా" అన్నాడు.
ప్లవర్ వాజ్ లో పూలు సర్దుతోన్న అపర్ణ ప్లవర్ వాజ్ జాగ్రత్తగా స్టాండ్ మీద పెట్టి తలుపు తీయడానికి వెళ్ళింది. తలుపు తీసిన అపర్ణ గుండెల్లో ఒక్కసారిగా డైనమెట్ పేలినట్టు అయింది. ఎదురుగా పచ్చని వంటి రంగుతో , స్లీవ్ లెస్ బ్లౌజు , మామిడి పండు రంగు రంగు డిజైన్ చీర కట్టుకున్న అందమైన యువతి. "ఎక్స్ క్యూజ్ మీ" అంటూ అపర్ణ ని తప్పించుకుని లోపలికి వచ్చింది. అపర్ణ చైతన్య రహితంగా పక్కకి జరిగి గోడకు అనుకుని శిలలా నిలబడింది. ఆ యువతి హాల్లోంచి స్టైల్ గా నడుస్తూ విశాల్ కూర్చున్న వైపు వెళ్ళింది. ఆమెను చూడగానే విశాల్ చేతిలోంచి న్యూస్ పేపర్ జారి కిందపడింది. చటుక్కున లేచి నిలబడ్డాడు.
ఆయువతి అతని దగ్గరగా నడిచి ఎదురుగా నిలబడి అతని కళ్ళలోకి చూస్తూ... "హలో అంటూ చేయి చాచింది. షేక్ హ్యాండ్ కోసం. విశాల్ అప్రతిభుడిలా నిలబడిపోయాడు.
"షాక్ తగిలిందా? బహుశా నేను వస్తానని ఊహించి ఉండవు. అవునా!... మాధవి....నేను మాధవి ని. అయామ్ మాధవి ఎం.ఎస్ " అంటూ నవ్వింది.
విశాల్ మొహం జేవురించింది. కోపం అణచుకుంటూ "కూర్చో' అంటూ ఆమెకి సోఫా చూపించి తను కూర్చున్నాడు. మాధవి కాలు మీద కాలు వేసుకుని కూర్చుంది.
విశాల్ గోడకి బల్లిలా అంటుకుపోయి నిర్జీవంగా నిలబడిన అపర్ణ వైపు చూస్తూ 'అపర్ణా.... కాఫీ తీసుకురా" అన్నాడు మృదువుగా.
అపర్ణ అలాగే చైతన్య రహితంగా నడుస్తూ వంటగది లోకి వెళ్ళింది.
వెనక్కి తిరిగి భుజమ్మీదుగా అపర్ణ నిలబడిన వైపు చూస్తూ.... "ఈమెనేనా నువ్వు ఇల్లీగల్ గా మ్యారేజ్ చేసుకున్నావుట.... గుడ్.... మంచి ఇల్లాలు"
విశాల్ ఏం వినిపించుకోనట్టుగా "సక్సెస్ పుల్ గా తిరిగి వచ్చినందుకు కంగ్రాట్స్" అన్నాడు.
