Previous Page Next Page 
ఆదివిష్ణు కథలు పేజి 29


    కాసేపటికి సుందరశివరావు లేచి నుంచుని పెదాల మీదుగా నవ్వేసి అన్నాడు.
    "ఐయామాల్ రైట్ మైడియర్ ఫ్రండ్స్ థేంక్యూ సత్యా! థేంక్యూ వెరీమచ్."
    ఆ రోజుల్లో సుందరశివరావులా తిరుగుదామనిపించేది నాకు. అతనిలా సిగరెట్లు కాల్చేస్తూ, అతనిలా తెలివిగా (అందంగా) మాట్లాడుతూ, అతనిలా సరదాగా -ఎన్నో కోరికలు! కానీ, అదేం పాపమో! ఆ పార్టీ ముగిసిన మరుసటి రోజునుంచే అతను నన్ను చూచి గూడా పలుకరించేవాడు కాదు. అక్కడికీ రెండు మూడు తడవలు అతన్ని పలుకరించి నా అభిమానం చంపుకున్నానేగానీ, అతన్నేననుకున్నంత చొరవ, గల మనిషి కాడు, ఏ పుట్టినరోజు పండుగలాటితో నేనూ ఏర్పాటుచేసి సుందరశివరావునీ, అతని ప్రేమనీ అతని సొసైటీని యావన్మందినీ పిలిచేసి ఇంకేదో చేసేయాలనిపించేది. కానీ, అతని చుట్టూతా వున్న 'హంగు'ని చూచి ఆ కోరిక చంపుకునేవాడిని.
    - నన్ను కొన్నాళ్ళపాటు 'ఆలోచింప' జేసినా 'ఆ సుందరశివరావు భార్యేనా యీమె? లేకపోతే -అదే పాటని నామనసుకి నచ్చే రీతిన అంత చక్కగానూ ఎలా పాడగలదు? ఎలా పాడుతుందసలు?
    నేనీ గదిలో చేరి యిన్ని రోజులైనా, ఒక్కరోజు గూడా సుందరశివరావు కన్పించలేదు. శ్రీధరరావుగారికీ, నే నూహిస్తున్న సత్యవతికీ సంబంధమేమిటో తెలీదు. వోవేళ పరిస్థితులు అనుకూలించక సుందరశివరావు సత్యవతిని పెళ్ళాడలేకపోయాడా? ఏమో - అదీ జరిగుండవచ్చు. ఈ ప్రేమ కథలు ఒక్కోమాటు బలీయమై పోగలవు.
    దొడ్లో అలికిడైనట్టు గమనించేను. కిటికీ గుండా ఆత్రంగా చూసేను. మెరుపుతీగలాంటి పడుచు తెల్లని బట్టల్లో మరింత మెరిసిపోతోంది. సన్నజాజులు అతి నాజూగ్గా కోసుకుంటోంది. నూటికి నూరుపాళ్ళు సత్యవతే! నమ్మకంగా సాక్షాత్తు ఆవిడే!!
    అకస్మాత్తుగా ఆమె నా కిటికీవేపు చూసింది. గబుక్కున అక్కడ్నించి లేచివొచ్చి హోల్డాలుమీద కూర్చున్నాను. సుందరశివరావు గుర్తుకొచ్చేడు. అంతగా ప్రేమించిన అతను సత్యవతినెందుకు పెళ్ళిచేసుకోలేదు?
    సత్యవతితో ఉత్తర ప్రత్యుత్తరాలు నాకు అంతగా లేవు. అతను నాగార్జునసాగర్ లో పన్జేస్తున్నాడు. వెంటనే అతనికో ఉత్తరం రాశాను.
    "...... ఈ విషయంలో కుతూహలం పొరపాటు కాదేమో సత్యం! నా మనసుకు నచ్చిన మనుషుల్లో వాళ్లిద్దరూ వున్నారు గనక యింతగా రాయడమవుతోంది. నిజమే నీతో తిరిగి నన్నాళ్ళూ వాళ్ళవిషయం ముచ్చటించలేదు. అంతమాత్రం చేత నేను వాళ్ళని మరిచిపోయేనని అనుకోవద్దు.
    రాత్రి నాకు వచ్చిన పాట విన్నాను. అదేపాటని కొన్నేళ్ళ క్రితం నీతోపాటు సుందరశివరావు పార్టీకొచ్చినప్పుడు విన్నాను. ఆ నాడు నా పరవశత్వాన్ని మందలించావు గూడాను.కానీ సత్యం - ఆ పాటంటే నాకెంతో యిష్టము. నేనిప్పుడిక్కడ కవిత్వమేధో రాయబోతున్నానని ఖంగారు పడకు. నీ అభిరుచి నాకు తెలుసు. నీతో అడ్జెస్టు కావడమూ తెలుసు.
    సత్యవతి ఆ పాటపాడింది. మీ సుందరశివరావు ఆ రోజుల్లో ఆ పిల్లని తప్ప మరెవ్వరినీ పెళ్ళిచేసుకోనని మనందరికీ చెప్పేడు. బహుశ నీకిది గుర్తుందనుకుంటాను. రాత్రి అదే పాట వినిపించగానే సత్యవతి జ్ఞాపకమొచ్చింది. ఆ తర్వాత నేనిక్కడ సత్యవతిని చూసేను. ఇన్ని రోజులైంది. ఇప్పటికొచ్చి సుందరశివరావు నాకీ యింట్లో కనిపించలేదు. కారణం చెప్పలేను గానీ, సుందరశివరావు మాటతప్పి మరో పిల్లనెవర్నైనా పెళ్ళాడాడేమోననిపిస్తుంది. ఇది కేవలం ఒక అనుమానం.
    నీకు వాళ్ళిద్దరి విషయమేదైనా తెలుస్తే వెంటనే జవాబు రాయి. ఏం తోచక రాసిన ఉత్తరమని కొట్టిపారేయకు. నీ జాబుకోసం ఎదురుచూస్తుంటాను...."
    ఉత్తరాన్ని పూర్తిచేసి, ఆ వేళే పోస్టు చేయడానికి బయటకు వెళ్ళేను. పోస్టుచేసి తిరిగి గదికొస్తుండగా, నా గది ముందు పార్థూ, బుజ్జీ ఇద్దరూ కర్రల్తో కత్తియుద్ధం చేస్తూన్నారు. వాళ్ళని చూస్తూ అక్కడే నించుండిపోయేను.
    రాను రాను ఆ యుద్ధం మంచి రక్తిగా తయారవుతోంది. పార్ధుడు చాలా కుతూహలంగా కర్రతిప్పేస్తున్నాడు. బుజ్జి దొంగదెబ్బ తీసేందుకు ఎదురు చూస్తున్నట్టుంది. వాడప్పుడే బిక్కమొహం పెట్టి దొంగచూపులు చూస్తున్నాడు రాస్కెల్!
    తృటిలో పార్ధుడు కాలిమీద బుజ్జిగాడు కొట్టేవాడేను. వెంటనే వాళ్ళిద్దరి మధ్యకీవెళ్ళి, బుజ్జి ప్రయత్నాన్ని వారింది, న్యాయంగా పోరాడమని హెచ్చరించేను. పార్ధుడు ఉత్సాహంగా తలూపేడు గానీ, బుజ్జి మాత్రం నావేపు మిర్రున చూసేడు.    
    డాబా తాలూకు పనిలేని ఆడకూతురు మరో మగరాపజుతో క్రింద ఈ ధర్మయుద్దాన్ని చాలా యిదిగా చూస్తూన్నట్టు గమనించి గబగబా నా గదిలోకి వచ్చేను.
    బయట మళ్ళా యుద్ధం ప్రారంభమయింది. ఈ తడవ కొంచెం జోరుగా సాగుతోంది. యుద్ధం సినిమాలలోలాగా పార్ధుడు తన యెడం చేతిని ఎత్తిపెట్టి కుడిచేత్తో కర్రని మహా సరదాగా తిప్పేస్తున్నాడు.
    సరిగ్గా అదే సమయంలో ఓ లావుపాటి ఆడమనిషి అక్కడికొచ్చింది. సాగుతూన్న యుద్ధం టక్కున ఆగిపోయింది. అక్కడ్నుంచి ఆవిడ గొంతుచించుకోడం మొదలైంది.
    "అయ్యో, అయ్యో, నీ కళ్ళు నెత్తి మీద కొచ్చేయట్రా పారూ! నీ చేతులు విరిగిపోను -చిన్న వెధవపన్జేసి నీ యిష్టమొచ్చినట్టు కొట్టేస్తూన్నావుట్రా! నిన్నని ఏం ప్రయోజనం, చెట్టంత ఎదిగి యీ అఘాయిత్యాన్ని చూస్తున్నవాళ్ళననాలి. కడుపుకి కంటే తెలుస్తుందికానీ, ఎంత మొత్తుకుంటే ఏం ప్రయోజనం?.... నీ కెన్నిసార్లు చెప్పాలిరా మడ్డి వెధవా, ఈ రౌడీ ఆటలాడొద్దని, ఇంకా యిక్కడే నించున్నావేరా? కదులు" అన్చెప్పి బుజ్జి చెవి పుచ్చుకుని బరబరా లాక్కుపోయిందావిడ.
    పార్ధుడు బిక్కమొహంతో, నేలమీద కాలుతో రాస్తూ నించున్నాడు.
    డాబామీదున్న ఆవిడ, అతన్తో సహా -తుపాకిగుండు తగిలిన పిట్టల్లా రివ్వున డాబా దిగేశారు.
    "కడుపుక్కంటే తెలుస్తుంది గానీ-"
    నాకూ బాధనిపించింది. ఎలాగైతేనేం ఈ భూమ్మీద ఈవిడొక్కర్తే  కనిపారేస్తున్నారు కాబోలు బిడ్డల్ని! పిల్ల లిద్దరూ ముచ్చటగా ఆడుకుంటున్నారని చూడ్డంగానీ, మాకు పిల్లల్లేరని కాదుగా, ఆ డాబావాళ్ళ సంగతేమిటో తెలీదు గానీ, కొన్నిరోజుల్లో నేనూ తండ్రిని కాబోతున్నాను.
    "అమ్మా! తల్లీ! నువ్వేమో ఆ గది దాటి ఒక్కడుగు ఇటురావు. మీ పార్ధుడేమో ఇక్కడ పనిపిల్ల వాడ్నిష్టమొచ్చినట్టు కొట్టి పారేస్తూన్నాడు. అదేమంటే మిడిగుడ్లు పెట్టుకు మింగేస్తున్నాడు రా! వచ్చి వాడి అవతారాన్ని చూడు. ఏ గాలికి బతుకుతే మాకేమన్నట్టు కూర్చుంటే నష్టమెవ్వరికీ?"
    ఆవిడింకా అరుస్తూనే వున్నది.
    రాత్రి పక్కవాటాలోంచి మెల్లిగా మాటలు వినిపించేయి. పార్ధుడికి బుద్ది చెబుతోంది సత్యవతి.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS