సో! అలాటి వాడికి ఈ కాలేజీలో సీటు దొరకడం వాడిక్కడ చదవటం నాకు తలవంపులు! టీ.సి. ఇస్తా తీసుకెళ్ళండి.
న్యాయానికి వాడిని డిబార్ చేసి పంపాలి. కానీ అలా చేయను! వాడి వీపున కొట్టవచ్చు! కానీ భవిష్యత్తు మీద కొట్టను! ఇదిగో ఆ అమ్మాయి యిచ్చిన రిపోర్ట్! చించి తగ లెడుతున్నాను!"
నారాయణస్వామిగారిని ఎవరూ నిరోధించలేకపోయారు ప్రమోద్ టీ.సి. తీసికెళ్ళి అదే వూర్లోని మరో క్రిస్టియన్ కాలేజీలో చేరాడు. ఒక మతం నుంచి వెలివేయబడినవాడు గత్యంతరం లేక మరోమతంలో చేరినట్టుగా.
అయితే అంతటితో సమస్య మాసి పోలేదు.
ఇక్కడినుంచి టీ.సి. పట్టుకెళ్ళి ఆ కాలేజీలో చేర్చి మూడో రోజే ప్రమోద్ కుమార్ ఒక్కడే అటకాయించాడు నందని!
"ఆగు పిల్లా ఆగు! దెబ్బకి దెబ్బ తీస్తాను" అన్నాడు.
క్షణంపాటు విస్తుపోయి తన ఒంటరితనానికి భయపడినా అతడి ఏకాకిత్వాన్ని చూసి ధైర్యం తెచ్చుకుంది.
"ఏం చేస్తావ్? ఎత్తు కెళతాను. రేప్ చేస్తాను. రేపే మన శృంగారలీలలు గోడలమీద వెలిసేట్టు చేస్తాను."
"ఊఁ ఎంత పొగరు?"
"పొగరు కాదు విగర్! పగ! పగ!"
"నువ్వే నాసినమవుతావ్! అదిగో మురళి వస్తున్నాడు అతను సాక్ష్యం. నువ్వేం ధైర్యం చేసినా అతని సాక్ష్యంతో నిన్ను ముప్పు తిప్పలు పెడతాను. మూడు చెరువులు నీళ్ళు తాగిస్తాను! మురళీ! కమాన్! ఈ వెధవ చూడు! ఏంటో కూస్తున్నాడు!" అని పిలిచింది మురళిని.
మురళి నందకి ఎక్కడో దూరపు బంధువు.
ఇంటర్ పూర్తిచేసి ట్రెయినింగ్ కి వెళ్ళి మునిసిపల్ స్కూల్లో టీచర్ గా వుంటున్నాడు.
తొలినుంచీ అతను ప్రమోద్ కి రైవల్ పార్టీయే!
"ఏంటోయ్?" దర్పంగా అడిగాడు మురళి.
"నీ కెందుకోయ్?" నిర్లక్ష్యంగా అన్నాడు ప్రమోద్.
"ఆమె నా కజిన్! నువ్వు అవాకులు, చెవాకులు పేల్తే తాట వలుస్తాను."
"ఏం పొగర్రా నీకు!" అని పైకి దూకాడు ప్రమోద్
అంతే! దాదాపు అరగంట సేపు ఒకర్నొకరు బాదుకున్నారు. అంతలో గుంపైన జనం వాళ్ళని వదిల్చారు.
ప్రమోద్ కోపంగా, అవమానంలో వెళ్ళాడు.
తర్వాత జరగవలసినదంతా జరిగిపోయింది.
తాత్కాలికంగా నంద ప్రమోద్ పై విజయం లాటిది సాధించినా, నారాయణ వెళ్ళి క్షమాపణ చెప్పేదాకా వదల్లేదు ప్రమోద్ తండ్రి చంద్రమోహన్.
నారాయణ ఈ సంఘటనతో బాగా నలిగిపోయాడు. ఇక చదువు చాల్లే అనుకుని కూతురికి పెళ్ళి చేయాలని శత విధాల ప్రయత్నించాడు. నిర్విరామంగా సంబంధాల కోసం వెతికాడు.
ఆఖరికి కొంచెం దూరం బంధువు, వరుసకి చెల్లెలు అయిన శివకుమారి కుమారుడు పెళ్ళి చూపులకు వచ్చాడు.
అతను విష్ణువర్ధన్, ఎమ్మేచేసి ఎక్కడో కాలేజీలో లెక్చరర్.
పెళ్ళి చూపులలో అతనికి నంద బాగా నచ్చింది.
ఇంటివాళ్ళు పెట్టిన టిఫిన్ అతని కో లెక్చరర్ శివకుమార్ కి బాగా నచ్చింది.
అయితే వచ్చిన చిక్కల్లా కట్నాల వద్దే వచ్చింది.
నారాయణ చెప్పిన ఫిగర్ వాళ్ళకి బొత్తిగా నచ్చలేదు.
పాతికవేలకీ, ఎనిమిది వేలకీ మధ్య వారధి ఎంత! అంత అగాధాన్ని పూడ్చటం ఎలా? నారాయణ ఎంత బ్రతిమాలినా ఆ సంబంధం కుదరలేదు. మళ్ళీ ప్రయత్నాలు సాగేదాకా తిరిగి స్టడీస్ లో పడిపోయింది నంద.
ఆ తర్వాత పరిస్థితులు వక్రించటం- ఊళ్ళు తిరగటం-జీవన వనంలో ఎన్నెన్నో ఎదుర్కోవటం! ఉద్యోగం సంసార బాధ్యత- బరువు- వీటి మధ్య నంద బాగా నలిగిపోయింది. అవన్నీ మర్చిపోయింది. పెళ్ళి వాయిదా పడిపోయింది. ఉద్యోగానికి అంకితమై పోయింది.
15
"ఇంత బ్యాక్ గ్రౌండ్ ఉందా?" నంద చెప్పినదంతా విని స్టెల్లా ఆశ్చర్యంగా అడిగింది.
"ఊ" నీరసంగా అంది నంద.
"నువ్వేం భయపడకు! ఇప్పుడు మనిషి మారిపోయి ఉండచ్చు. అప్పుడు కాలేజీ రోజుల్లో సిల్లీగా ప్రవర్తించి వుండచ్చు! అంతే!" ధైర్యం చెప్పింది'
"నాకలా అనిపించటం లేదు! పగబట్టే స్వభావం అతనిది!"
"నిజమే! కానీ వెనుకటి విషయాలు తిరగతోడతాడంటావా?"
"ఏమో చూద్దాం ఏమవుతుందో" అంది నంద.
అంతలో మెసింజర్ వచ్చి ఆఫీసరుగారు పిలుస్తున్నారని చెప్పాడు.
"ఎవరెవరున్నారక్కడ?"
"మేనేజరు, కొత్త ఆఫీసరు ఉన్నారమ్మా!"
నంద గుండెల్లో రైళ్ళు పరుగెత్తాయి. దీనంగా చూసింది స్టెల్లావైపు.
"ఏం భయపడకు! అమర్యాదగా ప్రవర్తిస్తే వెంటనే ఇలా వచ్చేయి! ఇద్దరం కలిసి వెళదాం! లేదా గట్టిగా అరువు!"
వాళ్ళు మాట్లాడుకుంటున్న దేమో తెలీని మెసెంజర్ "అయ్యగారు పిలుస్తున్నారు త్వరగా రండమ్మా!" అంటూ పిలిచాడు.
బలి పశువులా వెళ్ళింది నంద.
"హో! నువ్వా!" హేళనగా అన్నాడు ప్రమోద్ కుమార్ నందిని చూసీ చూడగానే.
నంద ఆత్మాభిమానం బుసలుకొట్టింది.
ఆ క్షణంలో ఆమె తన కుటుంబ దీనస్థితి, ఆర్ధిక అవసరాలు, తన ఇర్క్ సంపోజిషన్ అన్నిటినీ మరిచిపోయింది. బుసకొట్టే నాగినిలా అయిపోయింది. తిరిగి ఒక్కసారిగా.
ఆనాటి ఆత్మాభిమానం మళ్ళీ తలెత్తింది.
"నువ్వా!" అంది తిరిగి అదే హేళనతో.
"పొగరే మాత్రం తగ్గలేదే!" రెచ్చిపోయి అన్నాడతను.
"నేనూ అదే అనుకుంటాను. పొజిషన్ పెరిగినా పోకిరీ బుద్దులు పోలేదే! కనకపు సింహాసనమున శునకం కూర్చున్నంత మాత్రాన దాని బుద్దులు మారతాయా? తిరిగి అదే ధోరణిలో అంది నంద.
