అతను టైపు రైటరు కి కాగితం బిగుస్తుంటే , తప్పు చేసినదానిలా బిడియంగా ముడుచుకుపోతూ ప్రక్కనే వున్న మరో కుర్చీలో కూర్చుంది.
"అంతసేపు అతని సీటు దగ్గర బాతాఖానీ వేసుకున్నారు. ఇంక ఇప్పుడు ఈయన గారు ఆవిడ పని చేసి పెడుతున్నాడు. చూశావా ఈ వింత.' అన్నట్లు తార కన్ను గిలికించి కమల కేసి చూస్తూ.
సరిగ్గా అలాంటి భావాన్నే వ్యక్తం చేస్తూ రమణమూర్తి కామేశ్వరరావు ని చూసి చిన్నగా నవ్వాడు.
హాలుకి అటు ప్రక్కగా వున్న సీటులో వుండే అవధానికి రమణమూర్తి సంజ్ఞలు చెయ్యటం వో వంకర నవ్వు విసరటం కనిపించింది కాని అసలు విషయం అర్ధం కాలేదు. అందుకే పని గట్టుకుని లేచి వచ్చి రమణమూర్తి చెవిలో గుసగుసలు ఆడి అసలు సంగతి తెలుసుకుని ఆ దృశ్యాన్ని వోసారి కళ్ళారా చూసి తల ఆడించు కుంటూ తన సీటులోకి వెళ్ళిపోయి--
'అమ్మగారు అప్పుడే అలిసి పోయారులా వుంది . అయ్యగారు సాయం చేస్తున్నారు.' అంటూ జగన్నాధం చెవి కొరికాడు విషయం అంతా చెప్పి -
'పోనీలే ఇప్పుడు నీకేమిటి బాధ.' అన్నాడు జగన్నాధం విసుగ్గా కనుబొమలు చిట్లిస్తూ , అవధాని నోరు మూసుకున్నాడు.
తార వెకిలి నవ్వూ, దీని అర్ధం ఏమిటో నీకు తెలుసా అన్నట్లు కళ్ళు తిప్పటం అదీ చూస్తె కమలకి ఒళ్ళు మండింది-
'ఆమె కివాళ తలనొప్పో, చెయ్యి నొప్పో వచ్చి వుంటుంది. అతను పనిలో కాస్త సాయం చేయబోయాడు. ఈ మాత్రం దానికి ఏదో విడ్డూరం జరిగి పోయినట్లు ఇదవటం ఎందుకూ? అయినా నువ్వు విస్తుపోవటం లో ఆశ్చర్యం లేదులే - నువ్వు ఉద్యోగంలో చేరిన కొత్తలో ఆ మురళీ ధరరావు తో అవసరం వున్నా లేకపోయినా ఏదో కల్పించుకుని మాట్లాడాలనీ, అతని దృష్టిని నీవేపుకు ఆకర్షించు కోవాలనీ ఎంత తాపత్రయపడలేదు?-- కాని ఈ ఆఫీసులో తార అనే ఒక వ్యక్తీ వుంది అనే గుర్తింప యినా లేనట్లు అతను వుండిపోవటంతో చివరికి నిరాశ చేసుకున్నావు. ఇప్పుడు ఈ కళ్యాణి ని చూస్తుంటే నీలో అసూయ తల ఎత్తుతోంది. నిజం చెప్పాలంటే ఆ రావు గారిని నీ ప్రక్కన ఊహించుకోవాలంటేనే నా మనస్సు ఎదురు తిరుగుతుంది. కాకి ముక్కుకి దొండ పండులా వుంటుంది మీ కాంబినేషన్ -- ఎంచక్కా కళ్యాణి అయితే -- ' యేదేచ్చగా సాగిపోతున్న ఆలోచనలకి నవ్వుకుని నిజంగా వాళ్ళకి అలాంటి అభిప్రాయం వుందో లేదో కాని ఆఫీసులో మాత్రం కాస్త అలజడి బయలుదేరింది అనుకుంది కమల --
మిగిలిన స్టాఫ్ మొహాలలో ముద్ర వేసుకున్న కొశ్చన్ మార్కులు కరిగి పోకుండానే మురళీ వుత్తరం పూర్తీ చేసి కాగితాలు చేతిలోకి తీసుకుని లేచి నిలబడ్డాడు . కళ్యాణి లేచి 'చివరికి , మీకు శ్రమ ఇచ్చాను...థాంక్సు.' అంది మెల్లగా.
మురళీ సమాధానం చెప్పలేదు. అతి సున్నితంగా, పెదవులు విడి విడనట్లు ఒక్కసారి నవ్వి వూరుకున్నాడు. త్రుటి కాలం అతని మొహం లోను పెదవుల మీద తొణికిసలాడిన ఆ చిరునవ్వులో 'ఫరవాలేదు, శ్రమ ఏముంది?' అన్న భావం ఒక్కటే కాదు మరేదో అభిమానం అంతకు మించిన ఆత్మీయత స్పష్టం అవుతున్నాయి.
కళ్యాణి గుండెలు ఒక్కసారి ఎలాగో కొట్టుకున్నాయి. తల ఎత్తి సూటిగా అతని మొహం వంక చూస్తె అతను తన మనస్సులోని అలజడి ని తనకే అర్ధం కాని బెదురూ నీ ఎక్కడ గ్రహించేస్తాడో అన్నట్లు తల వంచుకుని పేపర్లు అటూ ఇటూ సర్దుతూ వుండి పోయింది.
'సరే-- ఆ మిగిలిన వుత్తరాలు మీరు చెయ్యగలిగితే చెయ్యండి. లేకపోతె ఒంట్లో బాగుండ లేదని మేనజరు కి చెప్పి ఇంటికి వెళ్ళిపొండి -- రేపు వచ్చాక చూసుకోవచ్చు.' అని అతను వెళ్ళ బోతుంటే,
'ఫరవాలేదు, చేయగలిగి నంత వరకూ చేస్తాను' అంటూ టైప్ రైటరు ముందు కూర్చుంది కళ్యాణి.
* * * *
వో ఆదివారం సాయంకాలం షికారు కని బయలుదేరిన మురళీ కి కాస్సేపు పార్కులో కూర్చుని రావాలని బుద్ది పుట్టి అటు వేపుకి దారి తీశాడు. పార్కు గేటు తెరుచుకుని లోపలికి నడుస్తూ యధాలాపంగా పరిసరాలని పరికిస్తున్న అతని కళ్ళు కాస్త దూరంగా, అటు తిరిగి కూర్చున్న అమ్మాయి దగ్గిర ఆగి పోయాయి. 'అరె-- కళ్యాణి లా వుంది.' అనిపించి గుండెలు ఒక్కసారి ఎలాగో కొట్టుకున్నాయి. తను కావాలని కోరుకున్నదేదో ఇలా హటాత్తుగా ఎదురయితే ఆ సంతోషం లో ఏం చెయ్యాలో తోచక తికమక పడిపోయినట్లు , ఇలా వెళ్లి ఒంటరిగా కూర్చున్న ఆ అమ్మాయిని పలకరిస్తే ఆమె ఏమైనా అనుకుంటుందే మో అని జంకు తున్నట్లు ఒక క్షణం పాదాలు ఆగిపోయాయి. 'అసలింతకీ ఆమె కళ్యాణే నా? అని.' అన్న వూహ వచ్చి చిన్నగా నవ్వుకుని మళ్లీ నడక సాగించాడు.
'సందేహం లేదు -- కళ్యాణే -- అలాంటి చీర తను మొన్న ఆఫీసుకి కట్టుకు వచ్చింది -- బెత్తెడు వెడల్పున వీపు మీద పరచుకున్న బారెడు జడ -- తుమ్మెద రెక్కల్లా నిగనిగ లాడుతున్న వోక్కు వోక్కుల జుట్టు....' దగ్గర పడుతున్న కొద్దీ కళ్యాణే అని నిర్ధారణ చేసుకుంటూ 'ఏమని పలకరించాలి? ఆఫీసులో అవసరం మేరకు ఆఫీసు విషయాలు తప్ప మరో విషయం మాట్లాడుకొని తమ మధ్య సంభాషణ ఏ ధోరణి లో సాగుతుంది.' అని వూహలు అల్లుకుంటున్నాడు.
అతను ఇంకా నాలుగడుగుల దూరంలో వుండగానే ఆ అమ్మాయి లేచి నిలబడి చీర కొంగు సర్దుకుని, కుచ్చెళ్లు సరిజేసుకుంటోంది.
'అరె! వెళ్లి పోతుందేమొ -పిలిస్తే బాగుండదు.' అనుకుని, ఆ నాలుగడుగు లూ ఒక్క అంగలో దాటినంత హడావిడిగా నడిచి దగ్గరికి వెళ్లాడు.
వెళ్లి పోబోతున్న ఆమె తన ప్రక్కగా ఎవరో నిలబడినట్లయి తల తిప్పి చూసింది ఎదురుగా మురళీ -- ఆమె కళ్యాణే.
క్షణం లో సగం సేపు, ఇద్దరికీ ఏం మాట్లాడాలో తోచలేదు. ఆ తరువాత ,
'మీరా?' అని కళ్యాణీ, 'మిమ్మల్నీ దూరం నుంచే గుర్తు పట్టాను -- అప్పుడే వెళ్లి పోతున్నారేం?' అని మురళీ ఒక్క సారే పలకరించు కున్నారు.
'నేను వచ్చి చాలాసేపే అయింది -- నేను వచ్చేసరికి ఒక్క మనిషి కూడ ఈ చుట్టుపట్ల లేదు' అక్కడక్కడా గుంపులు గుంపులు గా చేరి కబుర్లు చెప్పుకుంటున్న పెద్దలనీ, జట్లు జట్లుగా ఆటలాడుకుంటున్న పిల్లలనీ కలయజూస్తూ అంది కళ్యాణి.
'భలేవారే-- అయితే ఎవ్వరూ లేనప్పుడు వస్తే, నలుగురూ వచ్చేసరికి వెళ్లి పోవాలంటారా?' అంతటితో వదిలి పెట్టకుండా సంభాషణ సాగిస్తూ అన్నాడు.
'ఆహా-- అదేం కాదు-- నేను వచ్చి చాలా సేపయిందని.....' నసిగేసింది కళ్యాణి.
'మీ వుద్దేశ్యం అది కాకపోవచ్చును కాని, మీరు చెప్పింది వినగానే మాత్రం నాకో సంగతి గుర్తు వచ్చింది.' మాట్లాడటానికి టాపిక్ దొరికింది కదా అన్న వుత్సాహంతో చొరవగా అన్నాడు.
'ఏమిటది?' అన్నట్లు ఆసక్తిగా చూసింది కళ్యాణి.
'ఇలా ఎంతసేపు నిలబడి మాట్లాడుకుంటాం ? అలా కూర్చోండి -- ఇక మరి మర్యాదగా వుండదని అతనికి కాస్త దూరంలో కూర్చుని 'ఇంక ఇప్పుడు చెప్పండి.' అన్నట్లు చూసింది.
'అబ్బే, పెద్ద విశేషం ఏం కాదు. కాని మా బాలాంబ పిన్ని చదువు సంగతి గుర్తు వచ్చింది -- మా పిన్ని అంటే మా అమ్మ చిన్నాన్న కూతురు. తల్లి తండ్రులకి ఒక్కతే. మా చిన్న తాతగారు జిల్లా కలెక్టరు గా రిటైరయారు లెండి...లేక లేక కలిగిన ఒక్క గాను ఒక్క బిడ్డ --తండ్రి పెద్ద హోదాలో ఉన్నాడు. చేతి నిండా నౌకర్లు, ఇంటి నిండా బంట్రోతు లు. మా పిన్నికి కావలసినంత గారం జరుగుతుండేది - ఆవిడ కా అంటే కా, కీ అంటే కీ , ఆవిడ గుర్రాన్ని చూసి గాడిద అంటే అంతా అలా అనాల్సిందే అన్నంత అపురూపంగా పెరిగింది -- ఇంట్లో తల్లి తండ్రులనీ, నౌకర్ల నీ అలా తన ఇష్టం వచ్చినట్లు ఆడించే పిన్ని బయటి ప్రపంచంలో మాత్రం చాలా పిరికిగా భయస్తురాలిగా వుండేది-- తన మానాన తను ఏవో బొమ్మలూ, అవీ పెట్టుకుని ఒక్కతీ ఇంట్లో ఆడుకోవటమే కాని, పదిమంది స్నేహితురాళ్ళ ని పోగేసుకోటం అందరి ఇళ్ళకీ వెళ్ళటం అదీ వుండేది కాదు-- చదువు కూడ మేష్టరే ఇంటికి వచ్చి చెప్తుండేవాడు. కూతురు స్కూలుకి వెళ్లి చదువు కోవాలనీ, నలుగురి తో కలిసి మెలిసి తిరగాలనీ మా తాతగారికి కోరికగా వుండేదిట -- అందుచేత ఎలాగో మంచి మాటలు చెప్పి, బ్రతిమాలుకొని చివరికి స్కూల్లో జేరటానికి ఆవిడ్ని ఒప్పించారుట. అయితే మా పిన్ని వూరికే ఒప్పుకోలేదు. వో షరతు కూడా పెట్టింది........"
