Previous Page Next Page 
మరుపులో మెరుపులు పేజి 2

 

    ముఖర్జీ కారు దగ్గరగా వచ్చి కోటు చేతి మీదకు తీసుకుని "రా వెళ్దాం" అన్నాడు. కారు డోర్ తెరిచి పట్టుకుంటూ.
    డిన్నర్ తీసుకుంటున్నంత సేపు సుమను తెలియని భయం నిలవనీయకుండా చేసింది. ముఖర్జీ ఎప్పుడూ లాగా హుషారుగా కబుర్లు చెప్తూన్నా, సుమ మాములుగా వుండలేక పోయింది.
    "యివాళ అంత ముభావంగా వున్నావేం?'
    "కొద్దిగా తలనొప్పిగా వుంది."
    "వెళ్ళిపోదామా?"
    "ఊ...."
    "టేబుల్ మీద డబ్బు పెట్టి లేచి యివతలకు వచ్చాడు ముఖర్జీ. మౌనంగా అతన్ని అనుసరించింది సుమ.
    లైట్ల వెలుగుల్లో వెన్నెల చల్లదనం తెలియక పోయినా, తెల్లగా మెరుస్తూ మెల్లగా పయనిస్తున్న చంద్రుడు ఆహ్లాదకరంగా వున్నాడు. మెల్లగా డ్రైవ్ చేస్తూ ఒక చెయ్యి జాపి సుమ భుజం చుట్టూ వేశాడు.
    "సుమా!" అన్నాడు మృదువుగా . "మన పెళ్ళి జరిగి పోవడానికి నువ్వెందు కొప్పుకొవో నాకర్ధం కాదు." అన్నాడు. "నాకు పెళ్లి చేసుకోవడం యిష్టం లేదని యిదివరకే చెప్పాను."
    "నన్నా....అసలేనా?"
    'అసలే!"
    "ఎందుకని?"
    "నాకు పెళ్లి మీద కోరిక లేదు."
    "నేను నమ్మను."
    మీరు నమ్మినా, నమ్మక పోయినా అది మాత్రం నిజం."'    
    "కారణం చెప్పాలి."
    "చెప్పేందుకు కారణమంటూ ఏమీ లేదు."
    'సుమా! ఆ మాట నన్ను నమ్మమన్నావా? నీ అందం తెలివి తేటలు యిలా అర్ధం లేని అనుమానాలతో వ్యర్ధం చేసుకోవడానికి నిర్ణయించుకున్నావంటే ఏదో కారణం ఉండాలి." అన్నాడు కారు స్లో చేస్తూ.
    "కారు అపుతాడంటేనే భయం. తన్ని దగ్గరకు తీసుకుని.....తను వూహించేందుకు కూడా యిష్టపడదు. అబ్బ, అంత కంటే చావడం నయం" అనుకుంది. "దయచేసి నన్ను దింపెయండి. నాకు తలనొప్పిగా వుంది."
    ఆమె ముఖం వంక నిశితంగా చూశాడు. యిబ్బందిగా వున్నట్లు గ్రహించి, నిశ్శబ్దంగా నిట్టూర్చాడు.
    యిక్కడాపేయండి. నడిచి వెళ్ళిపోతాను."
    "ఏం? మీ ముసలమ్మా చూస్తె వప్పుకోదా?" నవ్వుతూ అడిగాడు.
    "వప్పుకోవడమా? రేపు యింట్లోంచి పంపించేస్తుంది. మగాళ్ళ తో కలిసి పది గంటల వరకు షికార్లుతిరిగి వస్తే వప్పుకోనని మొదటి రోకే చెప్పింది" అంది నవ్వుతూ.
    అతను కూడా నవ్వుతూ "గుడ్ నైట్" అన్నాడు. "గుడ్ నైట్" కారు వెళ్ళి పోంగానే తేలిగ్గా గాలి పీల్చుకుంది. అప్రయత్నంగా హేండ్ బేగ్ తెరిచి చూసింది. మసగ వెల్తుర్లో , ముఖర్జీ జేబులోంచి తీసుకున్న తాళాలు మిలమిల మెరిశాయి. ఒక్కసారి వులిక్కి పడింది. తాళాలు బయటికి తీసి గట్టిగా పట్టుకుంది. కొద్ది క్షణాలు వాటి వంకే చూస్తూ గడిపింది. ఏదో నిర్ణయించుకున్నట్లు -- దూరంగా పోతున్న టాక్సీ ని పిలిచి ఎక్కింది. సగం దూరంలో దిగిపోయి మరో టాక్సీ సందు చివర దింపమంది.
    ఆ వీధిలో యింకా సందడి బాగా తగ్గిపోలేదు ఒకసారి చేతి వాచీ వంక చూసుకుని "వాచ్ మన్ యింకా వచ్చి ఉండడు" అనుకుంది మాములుగా అతి సామాన్యంగా అందరితో నడిచి ఆఫీసు లోకి వెళ్ళింది. తాళం తెరిచి సరాసరి ముఖర్జీ గదిలోకి వెళ్ళింది. అద్దాల కిటికీ లోంచి తొంగి చూస్తుంటే బయట లైట్ల వెలుగులోని నిశ్శబ్దం కాబోయే ప్రపంచం నిస్తేజంగా కనిపించింది. అక్కడ నుంచి తను అందరిని చూడగలదు. గదిలో లైటు వేయనంత వరకు తన్ని ఎవరూ చూడలేరు. అనుకుంటూ చీకట్లో మెల్లిగా తడుముకుంటూ ఇనప్పెట్టె దగ్గరకు వెళ్ళింది. మెల్లిగా అతి ప్రయాస మీద పెట్టె తెరవ గలిగింది.
    ఎదురుగా కట్టలు, గుట్టలుగా పేర్చి వున్న ఆ డబ్బును చూస్తుంటే మోహమంతా ఎర్రగా కందిపోయింది. కళ్ళలో కసి, కోపం పేరుకుని దీప జ్యోతుల్లా వెలగ సాగాయి. రూపాయల మీదకు వెళ్ళబోతున్న చేతులు ఆవేశంగా వణక సాగాయి. కొద్ది క్షణాలు అదే స్థితిలో వుండి పోయింది. బలవంతాన నిద్రహించుకొని సేఫ్ లోంచి డబ్బు తీసి, హేండ్ బాగ్ లో పట్టినంత పెట్టుకుంది. యధాప్రకారం సేఫ్ మూసేసి బయటకు వచ్చేసింది.
    అప్పుడే చల్లదనాన్ని సేకరించు కుంటున్న గాలి శరీరానికి తాకి గగుర్పొడిచినట్లయింది. తేలికగా ఊపిరి పీల్చుకుంది. మనసంతా ఎంతో తేలికగా వున్నట్లనిపించింది. కంగారు, కోపం, ఆత్రుత ఆవేశం అన్నీ తగ్గి వాటి స్థానాన ఏదో భావం చేసిన పనికి సంజాయిషీ అడిగే అంతరాత్మ ఎదురుగా నిలిచాయి. సమాధానం లేని తన చర్యను సమర్ధించుకునే ప్రయత్నం చేస్తూ గబగబా సినిమా హాలు వైపు నడిచింది.
    అప్పుడే సినిమా పూర్తీ అయినట్లుంది. జనం కోలాహలంగా బయటకు వస్తున్నారు. టాక్సీ లు ఆగి వున్నాయి. గబగబా ఒక టాక్సీ ఎక్కి పోనీమ్మంది.
    యిల్లు చేరగానే బాగ్ లో డబ్బు తీసి మంచం మీద పరిచింది. తదేకంగా దాని వంక చూస్తుంటే శరీరమంతా ఒక్కసారి జలదరించింది. చమట తో తడిసిపోయింది కొద్ది క్షణాలు అదే స్థితిలో నిలబడి పోయి తేరుకొని డబ్బంతా మూట గట్టి ఓ అతి సామాన్యంగా , మాసిపోయి వున్న సంచి లో పెట్టుకుంది.
    శార్వాణి తీసేసి చీర కట్టుకుంది. ఎత్తుగా వున్న చుట్ట వూడదీసి వదులు వదులుగా బారెడు జడ అల్లు కుని, ముఖాన బొట్టు , చేతులకు నిండుగా గాజులు చెవులకు దిద్దులు అతి సామాన్యంగా అలంకరించుకుంది. ఒక్కసారి చుట్టూ చూసి మసలమ్మ కివ్వాలిసిన డబ్బు సొరుగు లో పెట్టి సూట్ కేస్ తీసుకుని బయటకు నడిచింది చకచకా.

                                             *    *    *    *

                                    3
    "అబ్బబ్బా! యింటి నిండా ఈ పిల్ల లేచిటమ్మా ఒకటే గోల. అరుపులూను," అంటూ కుర్చీ లో కూలబడింది మాధవి అలసట గా. రైలు ప్రయాణం తో ఎర్రబడ్డ కొలకులు, నలిగిన బట్టలు రేగిన జుట్ట్టు అలసటను తెలుపుతున్నాయి.'    
    "ఎప్పుడో మూడు నెల్లకో ఆరునెల్ల కో వస్తావు. ఒక్కర్తే నూ వుంటే ఏం తోస్తుంది చెప్పు? ఏదో వాళ్ళు వచ్చి ఆడుకుంటుంటే కాస్త సందడి గా వుంటుంది.
    "నే వెళ్ళాక రమ్మనమని చెప్పు ఈ నాలుగు రోజులు నాకే సందడీ అక్కరలేదు" అంది విసుగ్గా.
    మాధవి వంక చూచి నవ్వుతూ "లే స్నానం చేసి పడుకో" అంది వేడి పాలు చేతి కందిస్తూ.
    స్నానం చేసి మంచం మీద వాలిన మాధవి కి బడలిక తో వళ్ళు మండుతున్నా , కంటి మీదకు నిద్ర రాలేదు. మంచానికి పక్కగా వున్న కిటికీ లోంచి చల్లటి గాలి శరీరమంతా తాకుతోంది. వెల్లకిలా పడుకుని నుదుటి మీద చేయ్యనించుకుని పైన కప్పు వంక చూస్తూ వుండిపోయింది. పైనంతా సున్నం మాసిపోయి, పెళ్ళలూడి పోతుంది. ఎప్పుడో కూలేట్టు వున్నా, ఈ యింటి నుంచి మాత్రం మారడానికి వప్పుకోదు మాధవి తల్లి రాజ్యలక్ష్మీ.
    నిశ్చింతగా, నిశ్చలంగా పైకి చూస్తున్న మాధవికి మనసులో రకరకాల భావాలు సుళ్ళు తిరగసాగాయి. చిన్నతనం నుండి అలవాటుగా, ఆ మంచం మీద పడుకుంటున్నా ఆరోజు పైకి చూస్తుంటే ఎప్పుడూ కనిపించని రూపాలేవో కనిపించిపోసాగాయి. బరోడా లో పరాంజసే, బెంగుళూరు లో అనంత రామన్..... కలకత్తా లో ముఖర్జీ వెలుగు వెనక నీడల్లా కనిపించ సాగారు. వారి చుట్టూ నెలకు వేల రూయాలు చెదురుమదురుగా తిరగసాగాయి. బెజవాడ లో ఆ లాకర్ లోంచి డబ్బు తియ్యాలి..... ఆమె ఆలోచనలు అంతం కాకుండానే కళ్ళు మూతబడి పోయాయి. పరిసరాల్లో ఏమి జరుగుతున్నది తెలియనంత గాడ నిద్రలో మునిగి పోయింది.
    "ఎవరో తలుపు కొడుతున్నారు. ఆ చప్పుడంటేనే భయం. టక్....టక్ ....ఎంతకీ అగదెం ఆ చప్పుడు.....ఒకటే చలి... అబ్బ.... యెంత చీకటి....భయంతో ఒళ్ళు జలదరిస్తోంది.... ఎవరో మాట్లాడుతున్నారు....తలుపు తెరుస్తున్న చప్పుడవుతోంది.
    "అమ్మా....వద్దు....నాకు భయం.....తలుపు తెరవ్వద్దు....నేను లేవను......"
    "మధు....లే.....ఏదో కలవరిస్తున్నావు. నీకేదో పీడకల వచ్చినట్లుంది..... లే....లేచి మొహం కడుక్కో.
    ఎప్పుడూ లాగే కళ్ళు తెరిచి కంగారుగా చూచింది. తెల్లని వెలుగు గదంతా పరుచుకుని వుంది. గుమ్మంలో నుంచుని వున్న తల్లి ఎదురుగా కనిపించింది. ఒక్కసారి చుట్టూ చూసి లేచి, నుదుటి మీద చెయ్యి పెట్టుకుంది. అప్పుడే నీళ్ళలో ముంచి తీసినట్లున్న ముఖం తడిగా తగిలింది.
    "నాకీ కల రావడం మానదెం?.... ఎందుకిలా ఎప్పుడూ వస్తూనే వుంటుంది...." అని తనలో అనుకునేది పైకి అనేస్తూ. రెండు చేతుల మధ్య పగిలి పోతున్నట్లున్న తల గట్టిగా పట్టుకుంటూ.
    గుమ్మం లో నుంచున్న రాజ్యలక్ష్మీ లోపలకు వెళ్ళిపోయింది. అలా ఎంత సేపుందో మాధవి కే తెలియదు. మెల్లిగా లేచి తడబడుతూ లోపలకు వెళ్ళింది.

                                                               4
    "చాలామంది అమ్మాయిలు వచ్చారు సార్. మీరు ఇంటర్వ్యూ చేస్తారా? నన్ను చూసి పంపించేయమన్నారా?" అడిగాడు రామకృష్ణ. అప్పుడే ఆఫీసులో కి వచ్చి ఉత్తరాల్ని చూసుకుంటున్న ప్రభాకర్ ని.
    "అందరిని చూచేందుకు నాకు టైము లేదు. నువ్వు ఇంటర్వ్యూ పూర్తీ చేసేయ్ కొంచెం అర్హత వున్న వాళ్ళనిపించిన ఓ అయిదారుగురిని సెలెక్ట్ చేసి మిగతా వాళ్ళని పంపెయ్యి. వాళ్ళను నేను చూస్తాను?" అన్నాడు తలయినా ఎత్తకుండా.'    
    ముఖ్యంగా తను చూడాలసిన వుత్తరాలని తీసుకుని, వాటికి అవసరమయిన సమాధానాలు యివ్వడం పూర్తీ చేసేటప్పటికి మళ్ళీ లోపలకు వచ్చాడు రామకృష్ణ.
    "అయింది సార్ నా పని. ఒక అయిదుగురు మాత్రం గ్రాడ్యూయేట్స్ వున్నారు. మీరు చూసి సెలక్ట్ చేస్తే?' ఆగిపోయాడు రామకృష్ణ.
    చేతిలో వున్న వుత్తరం బల్ల మీద వుంచి గదిలోంచి బయటకు వచ్చాడు ప్రభాకర్. అధునాతనంగా అలంకరించుకుని ఆకర్షణీయంగా వున్న అమ్మాయిలను దూరం నుంచే చూస్తూ "వాళ్ళ అర్హత లను చూచా -- వాళ్ళ అందాన్ని చూచా నువ్వు సెలక్ట్ చేసింది?' అడిగాడు నవ్వుతూ. "నేనాగదిలోకి వెడతాను ఒక్కొక్కరినే నువ్వు పంపించు" అంటూ అప్లికేషన్స్ తీసుకుని పక్క గదిలోకి వెళ్ళాడు.
    చేతిలోకి అప్లికేషన్ తీసుకుని పై నుంచి క్రింద దాకా చదువుతూ "నమస్తే" అన్నమాట వినిపించగానే తల ఎత్తాడు.
    "నమస్తే! కూర్చోండి. " అన్నాడు కుర్చీ చూపిస్తూ.
    "మీరు....."
    "కుసుమ."
    ఒక్కసారి తల ఎత్తి చూచాడు....ఎండలో రాబట్టి కాబోలు పచ్చని ముఖం కందినట్లుంది. పెద్ద పెద్ద కాటుక కళ్ళు కోన తేలిన ముక్కు, కనుబొమల నుండి నుదుటి దాకా పోడుగయిన నల్లని బొట్టు పొడుగ్గా నాగు పాము ల్లాంటి రెండు జడలు.....మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే ముఖం..... కళ్ళు దించి కాగితాల్లోకి చూశాడు.
    తలఎత్తి మళ్ళీ ఆమె వైపు దృష్టి సారించాడు వంగిన పెదిమలకు, గడ్డానికి మధ్య ప్రత్యేకంగా కనిపించే చంద్ర వంక....."ఎక్కడ చూచి వుంటానీమెను?' అనుకున్నాడు. ఎక్కడ చూచిందీ గుర్తుకు రాక మునుపే------
    "యింతకు ముందు ఎక్కడయినా పని చేశారా?' అడిగాడు.
    "లేదు....ఏదో చిన్న చిన్న టెంపరరీ వి చేశాను. చెప్పుకో తగ్గ అనుభవం లేదు."
    "ఎప్పుడు చేరగలరు?"
    "ఎప్పుడు వుద్యోగం దొరికితే అప్పుడే!"
    నవ్వాడు.
    ఒక్కసారి తలఎత్తి చూచింది.
    అతని నవ్వులో ఏదో ప్రత్యేకత వుందనిపించింది. భారీ అయిన విగ్రహం చురుగ్గా కనిపించే చిన్న కళ్ళు కాని అతని నవ్వే.....
    ఏమిటది?..... తను.... అతన్ని గురించి ఆలోచించడం .....ఆశ్చర్య పోయింది. వూహ కందనంతగా.....
    "రేపు సోమవారం నుండి చేరండి. రామకృష్ణ నడిగితే మీ డ్యూటీస్ చెప్తాడు" అని ఆమె కంటే ముందుగా తలుపు తీసుకుని బైటకి వెళ్ళిపోయాడు ప్రభాకర్.
    కొద్ది క్షణాలు అక్కడే నుంచుని మెల్లిగా బయటకు నడిచింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS