4
"తమరు ఈ లోకంలోనే ఉన్నారా?" పది నిముషాల నుంచీ గుమ్మం లో నుంచున్నా , తన రాక గమనించకుండా పుస్తకం చదువు కుంటున్న ఉమతో అన్నాడు గిరి.
గిరి, కంఠ స్వరం విని ఉలిక్కిపడింది ఉమ. గతవారం దినాలుగా ఆమె గిరి మీద అంతులేని ద్వేషాన్ని పెంచుకుంటుంది------
"నేను ఉమను. దుర్గను కాను" అంది విసురుగా.
ఉమ విసురుపాటూ, ఆమె మాటలూ, రెండూ అర్ధం కాలేదు....గిరికి. అయినా కోపం తెచ్చుకోకుండా నవ్వుతూ "నా కళ్ళు ఇంతవరకూ బాగానే పనిచేస్తున్నాయి." అన్నాడు.
"అవును! పని చెయ్యనిది మెదడే!"
ఉమ ధోరణి కి, గిరి ఆశ్చర్యమూ, కించిత్కోపమూ కూడా కలిగాయి. అయినా తన కోపాన్ని నిగ్రహించుకుని తలుపుకు జేర్లబడి నవ్వుతూ "హరికి, నిదానస్తురాలు భార్య అయితే బాగుండు ననుకునే వాడిని-- మేనత్త, మేనమామ బిడ్డల పోలికలు వూరికినే పోలేదు. మీ దాంపత్యం చూడాలి.' అన్నాడు.
ఉమ రెచ్చిపోయింది.
"మా దంపత్యాన్ని కేం? మాకు ఏం ఉన్నా, ఏం లేకపోయినా సాధారణ మానవుల కుండాల్సిన సంస్కారం వుంది.' అంది.
గిరికి ఈసారి నిజంగా కోపం వచ్చింది.
"తెలుస్తూనే ఉంది. ఒక సాధారణ పరిచయస్తుడితో తగినంత కారణం లేకుండా ఇష్టమొచ్చినట్లు అమర్యాదగా మాట్లాడ గలగటం గొప్ప సంస్కారమే!"
ఉమ బిత్తర పోయింది. రోషంతో, అవమానంతో ఆమె ముఖం ఎర్రబడింది. ఏదో సమాధాన మియ్యాలనే తొందర లో "మీరు సాధారణ పరిచయస్తులు కారు.' అంది.
ఉమ ఆవేశం లో గాడి తప్పిందని గిరి అర్ధం చేసుకున్నాడు. అయినా ప్రతీకార వాంఛ చల్లారక "ఎవరికీ?' అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. గిరి వెళ్ళిపోయాక ఉమకు తను అన్నదేమిటో తెలిసి వచ్చింది. ఒక్కసారిగా వళ్ళంతా జలదరించింది. తన రెండు చేతులతో గట్టిగా పట్టుకుంది. తాను అనదలుచుకున్న దేమిటి? అన్న దేమిటీ?
ఈ గిరి ....పళ్ళు పటపట లాదించింది ఉమ.
దుర్గను చూస్తె ఉమకు జాలిగా ఉంది. దుర్గ స్థితికి కారణమయిన గిరి మీద అందుకే కోపం! దుర్గ విషయం నాలుగూ అడిగేసి, గిరిని ఒప్పించి దుర్గాతో వివాహం జరిపించాలని ఉమ కోరిక. అనుకోకుండా కధ యిలా అడ్డం తిరిగింది.
ఉమ దగ్గర నుండి వెళ్ళిపోయిన తరువాత గిరి చాలా పశ్చాత్తాప పడ్డాడు. ఏది ఏమైనా , ఉమ హరికి కాబోయే ఇల్లాలు . ఆమె రవంత పొరపాటు చేస్తే తాను క్షమించి ఉండగూడదా ? ఒకటికి రెండు రెట్లు బదులు తీర్చి వచ్చాడు. ఉమ మొదట్లో నవ్వుతో ఎంతో సరదాగా ఉండేది. అకస్మాత్తుగా తన మీద ఎందుకు కోపం వచ్చినట్లు? అసలు కోపతాపాల పుట్టేటంత చనువు తమ యిద్దరి మధ్యా ఎక్కడ ఉంది?
వణుకు తున్న పెదవులతో రోషంతో , నిస్సయంతో ఎర్రబడిన కన్నులతో పొడుగ్గా శిల్పి మలచిన విగ్రహం లా ఉన్న ఉమ అతని కనుల ముందు కదలాడింది. అతని మనసంతా సానుభూతితో నిండిపోయింది. ఉమ దగ్గరకు వెళ్లి తన తొందరపాటుకు క్షమార్పణ చెప్పుకోవాలని పించింది. కానీ -- వెళ్ళలేదు. మనసంతా ఒక రకమైన చిరాకుతో నిండి ఉంది అనుకోకుండా అతని కాళ్ళు బీచి కి దారి తీశాయి. తల వంచుకుని ఆనాటి సంఘటనలను గురించి , ఉమ గురించీ ఆలోచిస్తూ నడుస్తున్న గిరికి తల ఎత్తగానే ఎదురుగా ఇసుకలో కూర్చున్న ఉమ కనిపించేసరికి మతి చలించినట్లయింది. ఉమ కూడా అంతే ఆశ్చర్యంగా గిరి వంక చూసి తర్వాత నవ్వి "ఈ క్షణం లో మిమ్మల్ని గురించే ఆలోచిస్తున్నాను. మీరు ప్రత్యక్ష మయ్యారు. రండి, కూర్చోండి" అంది.
ఈసారి గిరి తన చెవులను నమ్మలేక పోయాడు -- ఆమె మాటలకు ఇంచుమించు అలాంటి సమాధానమే అతని దగ్గరా సిద్దంగా ఉంది. అయినా ఆ సమాధానం చెప్పకుండా కొంచెం ఎడంగా కూర్చున్నాడు. ఉమకు క్షమార్పణ చెప్పుకోవాలని అతని హృదయం ఆరాట పడుతుంది. మాటల కోసరం వెతుక్కుంటున్నాడు. అంతలో ఉమే "మధ్యాహ్నం నా ప్రవర్తన అనుచితంగా ఉందని ఒప్పుకుంటున్నాను. ఏమీ అనుకోకండి." అంది తల వంచుకుని ఇసుకలో గీతలు గీస్తూ .
గిరి ఒక్కసారిగా తనను కమ్ముకున్న భావ సంఘర్షణ లతో తలక్రిందు లయ్యాడు. వెంటనే సర్దుకొని తన మామూలు ధోరణి లో నవ్వి "ప్లీజ్! మీ తప్పును ఒప్పేసుకుని, నా తప్పును పదింతలు చేయకండి." అన్నాడు-- ఉమ మనసారా నవ్వింది.
'ఇంత మంచివారు , అంత కఠినం గా ఎలా ఉండగలరో?"
గిరి కొంత ఆశ్చర్యపోయి భయం నటిస్తూ "మళ్ళీ ఏం ప్రళయం వచ్చి పడిందీ?' అన్నాడు.
అతని అభినయమూ, మాటలూ, ఉమ కూడదీసుకుంటున్న వోపికను చెదర గోడ్తున్నాయి. గిరి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మళ్ళీ ఆ సంఘటన ఆమెకు గుర్తు రాసాగింది. జాగ్రత్తగా ఆలోచిస్తే తనదే తప్పని గూడా ఆమెకు తోచింది. గిరికి దుర్గ విషయం నచ్చ జెప్పాలంటే అది నెమ్మది మీద జరగాలనీ, దానికి చాలా శక్తి కావాలని కూడా గుర్తించింది. ఈ ఆందోళనతోనే ఆలోచిస్తూ, ఆమె హరికి కూడా చెప్పకుండా ఒంటరిగా ఇలా బీచికి వచ్చింది. గిరి కన్పించేసరికి పశ్చాత్తాపంతో నిండిన ఆమె మనసు, తేలిగ్గా తన తప్పును ఒప్పుకునేలా చేసింది. ఇక దుర్గ విషయమే ఆమెను బాధిస్తోంది. "మీరీ మధ్య దుర్గ ను చూశారా?" అంది సూటిగా -- గిరి ఉలిక్కిపడ్డాడు. ఉమ కోపానికి కారణం అతనికి లీలగా స్పురించింది. కానీ, ఉమ కేంతవరకూ తెలుసో అతనికి తెలియదు. అందుకని గడుసుగా "నాకు కనబడడం లేదు." అన్నాడు.
'అందుకనే ఇలా నవ్వగల్గుతున్నారు. దాన్ని చూస్తె ఎంత రాతి గుండె వాళ్ళ కన్నా జాలి కలుగుతుంది." అంది ఉమ. గిరి తల వంచుకుని "పిచ్చి పిల్ల" అన్నాడు.
ఆ సమాధానం ఉమకు కొరుకుడు పడలేదు. 'అవును పిచ్చిది కనుకనే మిమ్మల్ని ప్రేమించింది." అంది కొంచెం బాధగా. గిరి ఇరుకున పడ్డాడు. పరిస్థితిని ఉమ కేలా తెలియ జెప్పాలో అతనికి అర్ధం కాలేదు.
"నన్ను ప్రేమించడం లో పిచ్చి తనం లేదు. అది సరిగా అర్ధం చేసుకోకపోవటం లో పిచ్చితనం ఉంది. నేనూ హరి, దుర్గ చిన్నప్పటి నుంచి ఒక చోట పెరిగాం-- నేను, హరినీ, దుర్గ నూ ఒకే దృష్టి తో చూశాను. అలాగే దుర్గ కూడా నన్నూ, హరినీ ఒకే దృష్టి తో చూస్తుందని అనుకున్నాను. అసలు నిజం కూడా అంతే! దుర్గ తననుతానర్ధం చేసుకోలేక పోతుంది. ఇన్నాళ్ళుగా దుర్గ నాకు కనపడనందుకు నిష్కారణంగా ఇలా క్షోభ పడుతున్నందుకు నేను కూడా ఎంత బాధపడుతున్నానో మీరర్ధం చేసుకోలేదు."
గిరి కళ్ళలో నీరు తిరుగుతుంటే ముఖం పక్కకు తిప్పుకున్నాడు. ఉమ తెల్లబోయింది. ఉమ ది ఏ విషయమూ లోతుగా ఆలోచించే స్వభావము కాదు. గిరి అన్నట్లు ఉమది కూడా ఉద్రిక్త ప్రకృతి -- దుర్గ ఆవేదన విని బాధపడినట్లే, గిరి కన్నీటికి చలించింది. ఏం మాట్లాడాలేక తల వంచుకుంది.
కొంతసేపటికి నిగ్రహించుకుని మళ్ళీ గిరే అన్నాడు. "దుర్గ ఈ విషయాన్ని కొంచెం లోతుగా ఆలోచిస్తే తనే అర్ధం చేసుకో గలిగేది. నేను తనను అవమానించానని బాధపడుతుందే కాని, అసలు విషయం అర్ధం చేసికోవటం లేదు. దుర్గ నాకు స్నేహితురాలు -- సోదర తుల్య-- నేను మనసారా తన సుఖం కోరుకుంటున్నాను. చిన్నప్పటి నుండీ కలిసి మెలిసి తిరగటం వలన నా మీద పెంపొందిన వాత్సల్య భావాన్నే, దుర్గ మరోలా అర్ధం చేసుకుంటుంది. తన ప్రతి కదలిక తో ఆమెను పులకరింప జేయగలిగిన పురుషుడు, ఆమె జీవితంలోకి ప్రవేశించినప్పుడు గానీ, నా మాట లమెకు అర్ధం కావు."
ఉమ ఏదో సమాధానం చెప్పడానికి తలెత్తే సరికి తమ వైపుకు వస్తూ హరి కనుపించాడు. ఉమా, గిరి ఇద్దరూ స్వాగతపూర్వకంగా నవ్వారు. హరి వాళ్ళ మధ్య కూర్చుంటూ "అరె! మీరిద్దరూ ఇక్కడ ఉన్నారా? ఉమా? నీకోసం బజారంతా వెతికి ఇక్కడకు వచ్చాను' అన్నాడు.
హరి ఈ విధంగా మాట్లాడటం క్రొత్త కాదు. కానీ, ఉమ కెందుకో మనసూ కలుక్కుమంది. హరి ఈ సమయంలో ఇక్కడకు రాకుండా ఉంటె బాగుండేదని కూడా అనిపించింది. తన అంతరాంతరాలలో కలిగిన ఈ భావానికి తనే ఆశ్చర్యపోయింది.
"ఒరేయ్! థాంక్స్ చెప్పుకో! పానకం లో పుడకలా మీ ఇద్దరి మధ్యా ఉండకుండా పోతున్నాను" అంటూ నవ్వుతూ లేచాడు గిరి---
"వెళ్ళద్దు." చటుక్కున అంది ఉమ.
హరి, గిరీ ఇద్దరూ ఆశ్చరు పోయారు. గిరి తన ఆశ్చర్యాన్ని పైకి కనుపించ నీయలేదు. హరి తన ఆశ్చర్యాన్నించి కోలుకోలేక పోయాడు. ఉమ తల తిప్పుకుంది.
"క్షమించండి. మీరు పొమ్మన్నా మీకోసమయితే పోయేవాడిని కాదు. కానే నాకు పని ఉంది.' అని గిరి వెళ్ళిపోయాడు.
ఒక్క క్షణ కాలం వాతావరణం స్తబ్ధమయింది. ఉమ మనసు తనను తానె అర్ధం చేసుకోలేని అల్లకల్లోలంలా ఉంది. చటుక్కున లేచి "పద బావా' మనం కూడా ఇంటికి పోదాం" అని నడవటం మొదలు పెట్టింది ఉమ. హరి యాంత్రికంగా ఆమె ననుసరించాడు.
