Previous Page Next Page 
సంపెంగ పొదలు పేజి 2


    దుర్గ ముఖం ఎర్రబడింది. "ఫో! నీతో ఎవరు మాట్లాడగలరు!" అంది.
    "అడిగినదానికి సమాధానం చెప్పని వాళ్ళతో  ఎవరూ మాట్లాడలేదు. హరి ఎడంటే చెప్పవేం?"    
    దుర్గ కళ్ళేగరేస్తూ కొంటెగా "ఏం? నీ హరికి నన్ను కాపలా ఉంచావా? ఎంతసేపూ , హరి, హరి! -ఇవాళ తో రోగం కుదుర్తుంది;లే!" అంది.
    "ఏమిటేమిటీ? ఇవాళంతా తమాషాగానే ఉంది. నీకు పుణ్యం ఉంటుంది. అసలు సంగతి చేపుదూ?!"
    కొంచెం ఆశ్చర్యంగానే అన్నాడు గిరి.
    దుర్గ చేతులు నడుము కానించి గర్వంగా నించుని, "ఇవ్వాళ హరి అన్నయ్య నీతో సినిమాకి రాడు. రేపటి నుంచీ నీతో మాట్లాడడు." అంది.
    "సూర్యుడు పశ్చిమాన్న ఉదయిస్తున్నాడంటే ఇంతకంటే తేలిగ్గా నమ్ముతాను." దృడంగా అన్నాడు గిరి.
    "నువ్వు నమ్మకపోతే నీ కర్మ! నిన్ను , నన్నూ ప్రపంచాన్ని హరి మర్చిపోయేలా చేసే మహేంద్ర జాలం ఇవాళ రైల్లో దిగుతుంది."
    'వో! ఉమ వస్తుందా? అరె! నాకు చెప్పలేదేం?"
    స్వగతం లో అనుకున్నాడు గిరి.
    "అదా, సూర్యుడు తూర్పునే ఉదయిస్తున్నాడు కానీ, హరి కింక మనం అక్కర్లేదు." అంది చప్పట్లు కొడుతూ.
    "అలాగేం? చూస్తూ ఉండు. నా దగ్గరకు రాకుండా ఒక్క రోజైనా ఉండగలడెమో? ఎలాగైనా , ఈ సెలవుల్లో నాకు తోచడం కష్టమే!" నేను లేనూ?' అంది.
    గిరి, దుర్గను గమనించకుండానే "పోవోయ్! నువ్వు ఆడదానివి నీతో నాకేం తోస్తుందీ?' అన్నాడు.
    దుర్గ గిరి వైపు కు తిరగకుండానే "అలా మాట్లాదతావెం గిరీ? ఉమ ఆడది కాదా? అన్నయ్య కు ప్రపంచమంతా ఆవిడే కావటం లా? అంది." ఆ మాటతో దుర్గ చెప్పదలుచుకున్నది గిరికి పూర్తిగా అర్ధమయింది. దిగ్భ్రాంతి లో కుర్చీ లోంచి లేచి నిలుచున్నాడు. అప్పటి గిరి ముఖాన్ని చూసి ఆమె గిరి వైపు తిరగకుండానే "నీకు నేను అర్ధం కాలేదంటే నమ్మను. నా నోటితోనే , నీకు విందామని ముచ్చటైతే , చెప్పడానికి నేను  సిగ్గు పడను." అంది.
    "దుర్గా! అలా మాట్లాడకమ్మా!" అన్నాడు గిరి బాదగా.
    ఆ సంబోధనకూ ఆ కంఠస్వరానికీ విచలితురాలై దుర్గ గిరి వైపుకు తిరిగింది -- అతని ముఖం చూసిన దుర్గ తానూ స్థాణువై పోయింది.
    అభిమానంతో , బాధతో ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. గిరి దుర్గ దగ్గిరగా నడిచి తన రూములో ఆమె కన్నీళ్లు తుడిచి "క్షమించు దుర్గా! నువ్వు హరిని ఒకలాగా, నన్ను మరొక లాగా చూస్తావని నేనెప్పుడూ అనుకోలేదు. నేనలా ఆలోచించలేదు." అన్నాడు.
    ఈ అనునయం, దుర్గ మనసును మరింత గాయం చేసింది. గిరి దగ్గర నుండి దూరంగా పోయి సోఫా లో కూలబడి చేతులతో ముఖం కప్పుకుంది. ఎంత అణుచుకుందామన్నా దుర్గ కు ఏడుపు ఆగటం లేదు. గిరి మనసు కెలికినట్లయింది. దుర్గ కన్నీళ్లు తన కెంత బాధ కలిగిస్తాయో అతనికి మొదటి సరిగా అర్ధమైంది. కానీ, ఆత్మీయతలో మాధుర్యం లేదు. ఆప్యాయత మాత్రమే వుంది. దుర్గ దగ్గిరకు వెళ్లి ఆమె తల నిమురుతూ , "దుర్గా! ఇలా చూడు. నీ కన్నీళ్లు ఆపడానికి నేనేమైనా చేస్తానమ్మా! నేను నిన్నెంత అభిమానిస్తున్నానో నీకు తెలియదు" అన్నాడు.
    దుర్గ ముఖం పైకెత్తింది. రోషంతో ఆమె కళ్ళు మండిపోతున్నాయి. "దీన్నేనా , అభిమాన మంటారూ? నా కన్నీళ్ళ తో నీకేమవసరం?"    
    గిరి దుర్గ రెండు చేతులూ తన చేతులతో అదిమి పట్టి 'నువ్వు వట్టి పిచ్చిదానివి దుర్గా! నిన్ను నువ్వే సరిగా అర్ధం చేసుకోలేక పోతున్నావు. జాగ్రత్తగా ఆలోచిస్తే నీకే అర్ధమవుతుంది. నామీద నీకున్న భాతృవాత్సల్యాన్ని మరోలా అర్ధం చేసుకుంటున్నావు. ఎట్లాంటి సందర్భంలో నైనా ఈ గిరి అన్నయ్య నీకు అండగా ఉండి నీ కన్నీళ్లు తుడుస్తాడని గుర్తు పెట్టుకో!" అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. దుర్గకు మతి పోయిన ట్లయింది. గిరి మీద అంతులేని కోపం వచ్చింది. తాను తొందరపడి బయటపడటం వలన అతను తననలా అవమానించాడని అనుకుంది. ఎంత అణుచుకుందామన్నా ఆమెకు కన్నీళ్లు ఆగటం లేదు. మనసూ, శరీరమూ కూడా భగభగ మండుతున్నాయి. ఇంతలో వీధిలో జట్కా చప్పుడూ హరి ఉమల గొంతుక లూ వినిపించాయి . కన్నీటితో మలినమైన తన ముఖం వాళ్లకు కనిపించకుండా ఉండాలని బాత్ రూమ్ లోకి పరుగెత్తింది దుర్గ.

                                        3
    గిరిని వెంటబెట్టుకుని హరి లోపలకు వచ్చేసరికి, వాళ్ళ కోసరమే ఎదురు చూస్తూ సోఫాలో కూర్చున్న ఉమ లేచి నుంచుంది -- అంతవరకూ ఉమ ప్రక్కనే కూర్చున్న దుర్గ చటుక్కున లేచి లోపలకు వెళ్ళిపోయింది. హరి అది గమనించే స్థితిలో లేడు. గిరి మనసు కలుక్కుమన్నా సర్దుకున్నాడు. హరి పరిచయం తర్వాత నమస్కారం చేస్తూ, ఎంతో కుతూహలంగా ఉమ గిరి వైపు చూసింది. గిరి కూడా అదే కుతూహలం తో ఉమ వైపు కు పరీక్షగా చూసాడు.
    "గిరిగిరి అంటూ తెగ కోసేవాడు హరి. ఏ మన్మధుడో అనుకున్నాడు పొడుగ్గా, ఏం పెద్ద ప్రత్యేకత ఉందనీ?' అనుకుంది ఉమ.
    "ఫోటో లో కంటే బ్రహ్మాండంగా ఉంటుందన్నాడు -- వాడి ముఖం! అంతే! తామునిగింది గంగ ...." అనుకున్నాడు గిరి.
    ముగ్గురూ కొంచెం సేపు పెకాడుకున్న తర్వాత గిరి వెళ్తానని లేచాడు. ఎప్పుడూ గిరిని సగం దూరం దాకా సాగనంపే హరి, లేవనైనా లేవకుండా "సరే!" అన్నాడు.
    గిరి నవ్వుతూ కను బొమలు ముడిచి "ఇంత తొందరగా పోతున్నందుకు థాంక్స్ అయినా చెప్పకుండా , సరే , నంటూన్నావా? ఇవాళ్టి కి మా యింటి దాకే రావద్దు గానీ, గుడి దాకా అయినారా!" అంటూ హరి భుజం పట్టుకుని లేవదీశాడు. హరి తప్పనిసరిగా లేచి గిరి వెంట బయలుదేరాడు. ఉమ నవ్వుకొని చెదిరిపోయిన పేక ముక్కలు సరిగా పేర్చుతూ కూర్చుంది. ఇంతలో హరి, గిరి వెళ్లిపోయారని గమనించి దుర్గ వచ్చి ఉమ పక్కన కూర్చుంది.
    "నీకు పెకాటంటే ప్రాణం కదా, ఇండాకాట్నుంచీ రాలేదేం దుర్గా!" యధాలాపంగా అంది ఉమ.
    "ఇప్పుడు వచ్చాగా! కలిపి వెయ్యి." నవ్వటానికి ప్రయత్నిస్తూ అంది దుర్గ -- దుర్గ గొంతు కొంచెం బొంగురుగా ఉండటం తో , ఉమ ఆశ్చర్యంగా దుర్గ ముఖం లోకి పరిశీలనగా చూసింది. కళ్ళు కొంచెం ఉబ్బి ఎర్రగా ఉన్నాయి. ఎందుకో ఏడ్చి వుంటుందని ఊహించి , ఉమ దుర్గ చేతిని తన చేతిలోకి తీసుకుని , లాలనగా నిమురుతూ "దుర్గా! ఎందు కేడ్చావో నాకు చెప్పు. ఇంతలో ఏమొచ్చింది ?' అంది ఆశ్చర్యంగా.
    దుర్గం ముఖం ప్రక్కకు తిప్పుకుంది. ఉమ కొంచెం రోషంగా "ఇంతేనా, మన స్నేహం? అవునులే! నీ రహస్యాలేవీ నాకు చెప్పవూ" అంది.
    దుర్గ పూడిపోతున్న గొంతు పెగాల్చుకుని "ఆ గిరి వట్టి దుర్మార్గుడు " అంది.
    ఉమ ఆశ్చర్యానికి కంతు లేకుండా పోయింది.
    "అదేమిటీ? బావ అతణ్ణి ఆకాశాని కేట్టుతాడు . నువ్వు పాతాళానికి తోసేస్తున్నావు. అది సరే! గిరి దుర్మార్గుడవడానికి నీ ఏడుపుతో ఏం సంబంధం దుర్గా! నీతో ఏమైనా పిచ్చి పిచ్చి వాగుడు వాగాడా? వాగితే బుద్ది చెప్పాలి. లేకపోతె అసహ్యించుకుని వూరుకోవాలి . అంతేకాని ఇలా ఏడుస్తారా?"
    ఆవేశంగా ఉన్న ఉమ మాటలకు దుర్గ మనస్సు కలుక్కుమంది. "అది కాదు! అది కాదు" అంది.
    ఉమ అర్ధం లేనట్లు చూసింది.
    "అసలంతా నాదే తప్పు.' అంది దుర్గ . ఇంక కన్నీళ్ళ ను అణచుకోలేక ప్రవహింప జేస్తూ ........
    ఉమ కంతా అయోమయ మయింది -------దుర్గ భుజాలు పట్టుకుని కుదుపుతూ "జరిగింది చెప్పు,  నువ్విలా ఏడుస్తుంటే , నా మనసుకు చాలా కష్టంగా ఉంది. నీ కన్నీళ్లు తుడిచే భారం నాది. వివరంగా చెప్పు" అంది.
    దుర్గ కు కూడా మనసులో చాలా బరువుగానే ఉంది. తన బరువు దింపు కోవాలనే ఎదురు చూస్తుంది.
    "ఏం చెయ్యను ఉమా! బలహీనతలు అందరి లోనూ ఉంటాయి. చిన్నతనం నుంచీ ఎంతో చనువుగా ఉండేవాడు. ఎంతో ప్రేమ, ఆప్యాయత నటించే వాడు. అది నటన అని తెలియక నేనూ నిజంగానే ప్రేమించాను. మొన్న సాహసించి ఆ భావం అతని ముందు వ్యక్తం చేశాను. ఇంకేం లోకువ కట్టి, అవమానించి వెళ్ళిపోయాడు."
    ఉమ వళ్ళో తల ఆనించి దుర్గ గట్టిగా ఏడ్చింది.
    ఉమకు కూడా రోషంతో కళ్ళెర్రబడ్డాయి. ఉమ ఏదో అనబోయేటంతలో బయట హరి అడుగుల సవ్వడి వినిపించింది. దుర్గ చటుక్కున కన్నీళ్లు తుడుచుకుని మామూలుగా కూర్చుంది-- హరి లోపలకు వస్తూనే "తొందరగా తయారు కండి. సినిమాకు వేడదాము" అన్నాడు.
    "నేను రా నన్నయ్యా! నువ్వూ, ఉమా వెళ్ళండి." అంది దుర్గ.
    హరి లోలోపల సంతోషించాడు.
    ఉమ మాత్రం :మేమిద్దరమే వెడితే అత్తయ్య తంతుంది. నువ్వు రా , దుర్గా!" అంది.
    దుర్గ? నవ్వి    "అబ్బో ! అత్తగారంటే ఏం భయభక్తులూ అమ్మకు నేను చెపుతానులే! చిలుకా గోరు వంకల్లా మీరిద్దరూ వెళ్లి రండి" అంది.
    ,ముందర నీలిరంగు పట్టు జాకెట్టు వేసుకొని మబ్బు రంగు మైసూరు జార్జిట్టు చీర కట్టుకుని హంసలా తన పక్కనే నడుస్తున్న ఉమను తన్మయత్వం తో చూస్తూ "ఇంకా ఎక్కువ కాలం నేను ఆగలేను ఉమా! ఈ వేసవి కాలంలోనే మనం పెళ్లి చేసుకుందాం." అన్నాడు.
    ఉమ కొంటెగా నవ్వి "మరీ పాపం! అంతా నీ యిష్టమే!' అంది.
    "ఏం నా యిష్టమే , నీ యిష్టం కాదా?" అన్నాడు హరి హుషారుగా నవ్వుతూ. ఉమ కూడా నవ్వింది. ఇంతలో ఉమకు దుర్గ గుర్తు వచ్చింది.
    "బావా! నువ్వీ గిరి స్నేహం వదిలెయ్యాలి" అంది. గంబీరంగా తెల్లబోయాడు.
    "రామాయణం లో పిడకల వేట లాగ ఇదేమిటి? గిరి నిన్నేం చేశాడూ?"
    "నన్నేం చెయ్యక్కర్లేదు. అటువంటి సంస్కార హీనుడితో నా బావ స్నేహం చెయ్యటం నాకిష్టం లేదు."
    "గిరి సంస్కార హీనుడా? గిరిని నువ్వేమర్ధం చేసుకున్నావని అలా అంటున్నావ్! తొందరపడి ఇంకొకళ్ళ ని అలా విమర్శించకూడదు ఉమా!"
    హరి మాటలలో ఆవేదన ధ్వనించింది. గిరిని ఎవరేమన్నా అతనికి కష్టంగా ఉంటుంది. ఉమకు కోపం వచ్చింది. "అవునులే! నీకున్నంత నిదానం నాకు లేదు. నువ్వా గిరితో మాట్లాడటం మానేస్తేనే గాని, నాతొ మాట్లాడక్కర్లేదు ." అంది.
    హరి సమాధానం చెప్పలేదు. సరదాగా సినిమాకు వెళ్ళిన వాళ్ళు మూతులు ముడుచుకుని ఇంటికి వచ్చారు. గిరి స్నేహం వదులు కోవాలనే భావనే హరికి అంతులేని వ్యధను కలిగించింది -- గిరి పేరు చెబుతూనే ఉమ మండి పడుతుంది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS