Previous Page Next Page 
గాజు బొమ్మ పేజి 3


    చిక్కవరం లో కృష్ణమూర్తి గారి పేరు తెలియని వారు లేరు. ఆ చుట్టూ పక్కల ఉన్న ఊళ్లలో కూడా అయన మాటంటే వేదవాక్కే. అంత పేరు ప్రఖ్యాతు లయాన్ని వాటంత టవే వరించాయి. అక్షరం రాదు. అయినా స్పష్టంగా, అనర్గళంగా ఆరు గంటలైనా విన సొంపుగా మాట్లాడ గలరు. ఎక్కడా చిన్న తప్పు దోర్లనీయరు. చదువు కున్న వారికన్న మిన్నగా మాట్లాడతారు.
    అటు కాంగ్రేసు కి అందరు, ఇటు కమ్యూనిస్టులకీ చెందరు. ఊళ్ళో ఏ మంత్రి దిగినా అయన కాహ్వానం అంది తీరవలసిందే . ఏ ఇద్దరి మధ్య కలహం చెలరేగినా కృష్ణమూర్తి గారే న్యాయవేత్తలు.
    ఎన్నో కోర్టుల్లో అయన ప్లీడర్లు కూడా చకితులయ్యేట్టు సాక్ష్యాన్ని స్తంభంగా నిలబెట్టి తమ మనుష్యుల్ని గెలిపించేవారు.
    పక్కనే ఉన్న గొల్లన పల్లిలో ఉన్న వెలమదొరల కాయన ఆప్తమిత్రులు. అడవిలో వేటకు వెళ్ళినప్పుడు తుపాకీ మొదటగా పేల్చే దీయనే.
    కానీ తన స్వంత వాళ్ళ కింత సన్నిహితం కాలేక పోయారు.
    ఇద్దరు తమ్ముళ్ళు. పెద్ద తమ్ముడే నాడూ ఎదురై ఈయన్ని మాట్లాడించడు. చిన్నవాడెప్పుడైనా డబ్బు గురించి అడిగితె చెయ్యేత్తే వారు.
    భార్య అన్నపూర్ణ . గుణం లో కూడా ఆమె అన్నపూర్ణే నని ఆ ఊరి వారి అభిప్రాయం.
    కాని, భర్త విశ్వేశ్వరుడు గాదు పాపం! అంతమందికి ఎంతో ప్రాణ స్నేహితుడైన ఆయన అర్ధాంగి కి ఆగర్భ శత్రువు.
    ప్రేమగా పిలిచి ఎరగరు. తీయని అనుభూతికి చోటులే దా ఇరువురి మనస్సుల్లో. అసలా ఇల్లాలు భర్త స్పర్శే ఎరగదని ఆ ఇంట్లో వారికి తప్ప మరొకరి కి తెలియదు. కానీ ఎన్నోసార్లు ఆయనతో దెబ్బలు తిన్నది. తిట్లు ప్రతిరోజూ దీవెనల్లా కురిసేవి.
    అందుకు కారణం ఉంది. ఆ ఇంటి పెద్ద కొడుకాయన. పచ్చని సంసారం. సిరి సంపదలకి లోటు లేదు. పాతి కేకరాల మాగాణి. కొండ పక్కన అయిదెకరాల మామిడి తోట. తండ్రి లేడు. ఇద్దరూ తమ్ముళ్లూ అన్నకి భయపడేవారు చిన్నతనం నుంచీ.
    ఎప్పుడూ వ్యవసాయంలో మునిగి తేలే ఆ ఇరువురికీ ఈయనంత కండబలమూ లేదు, వ్యవహార దక్షతా లేదు. పండించి బళ్ళతో ధాన్యాన్ని ఇళ్ళకు చేరిస్తే అమ్మి దర్జాగా దొరలతో పాటు వేటల్లో, పోట్లాటల్లో నాయకుడై నవ్వుల పువ్వుల రంగడి లా వెలిగి పోయేవారు కృష్ణమూర్తి గారు.
    ఒకరిద్దర్ని చేరదీసి భార్య మాటే మరిచి పోయారు. సీసాలు సీసాలు తాగేవారు. కానీ, ఎంత మత్తులో ఉన్నా పొరపాటు డోర్ల దాయన పెదవుల నుంచి.
    ఇంటా గెలిచారు. బయట గెలిచారు. ఇంట రాక్షసుడై గెలిచారు. బయట ఎందరికో నచ్చిన రాజై వెలిగారు. అయన చిన్న తమ్ముడికి ఇద్దరు పిల్లలు. పెద్దవాడు రాజా. చిన్న పిల్ల హిమబిందు. తమ్ముళ్ళ తో మాట్లాడరు కొన్నాళ్ళు. కానీ, ఆ పసివాళ్ళు ఆయనకి ప్రాణ సమానులు. ఇంటి దగ్గర ఉన్నంత సేపూ వాళ్ళ తోడిదే లోకం.
    హిమబిందు ఆయనకి బంగారు తల్లి. రాజా ముత్యాల కొండ. ఏ ఊరికి వెళ్ళినా, ఎంత రాచకార్యంలో ఉన్నా, తినడాని కెన్నో తెచ్చేవారు మరిచి పోకుండా . బొమ్మలు , బట్టలు ఎన్నో!
    హిమబిందుని భుజం మీద ఎక్కించుకుని గొల్లన పల్లిలో నాటకాలకు తీసుకెళ్ళే వారు. రాజా చేయి పుచ్చుకుని చెప్పే కధ వింటూ నడిచేవాడు.
    ఇద్దరూ పెరిగి పెద్ద వాళ్ళయ్యారు. రాజా ఇంజనీరై రాజస్తాన్ లోని జయపూర్ లో ఉంటున్నాడు. హిమబిందు చదువు కుంటున్నది.
    ఆయనతో గడిపిన క్షణాలు బిందు మనస్సు లో ఎప్పుడూ ఉత్సాహాన్ని మేల్కొల్పుతుంటాయి . నవ్వుకుంటుందాయన పరిహాసానికి. "ఎంత మంచి నాన్న!" అని మురిసి పోతుందామె హృదయం. కరుణతో ఆ మాటే అంటుంది అప్పుడప్పుడు.
    "నిజం కరుణా! అమ్మ కన్నా నన్ను ఎక్కువగా ప్రేమించు తాడు పెదనాన్న! నాన్న దగ్గర అంత చనువు ఉండదసలు! కానీ, ఎందుకో మరి -- పెద్దమ్మ నిలా సంతోష పెట్టరు. నన్ను పెంచు కుంటాననేది ఎప్పుడూ పెద్దమ్మ! ప్చ్జ్! చచ్చిపోయింది ఈ విచారం తోనే , ఏ సుఖమూ ఎరక్కుండానే!"
    "అవును. నేనూ చూశాను మొన్న! మీ ఊళ్ళో ఉన్నప్పుడు. కొండ గట్టెక్కి వచ్చినప్పుడు నీ ముఖం చూడగానే అడిగారుగా ఏమైందని? నువ్వు నిజం చెప్పక పోయినా అయన గ్రహించారు అసలు సంగతిని. నువ్వు అమ్మతో మాట్లాడుతున్నప్పుడు నన్ను పిలిచి 'బిందు ఏడ్చిందా అమ్మా' అన్నారు. అబద్దం చెప్పలేక పోయాను నేను. ఆ మాట వినగానే అయన కళ్ళలో నీళ్ళు నిండు కొచ్చాయి." కరుణ బిందు వంక చూసింది.

                    
    గుంటూరు వచ్చిన తరువాత ఆమె ఏడ్పు కి కారణం అడిగి తెలుసుకోవాలని నిశ్చయించు కుంది కరుణ. మరునాటికి వీలు చిక్కింది. ఆ ప్రసక్తి ఎత్తడానికి. హిమబిందు ఎప్పటిలా ఉత్సాహంగా, నవ్వుతూ, నవ్వించుతూ తిరుగుతుంది. కానీ, ఆ ఉత్సాహం లో జీవం లేదు, ఆ నవ్వులో సహజతత్వం కానరావడం లేదు.
    కరుణ గమనిస్తూనే ఉంది, హిమబిందు చాటుమాటుగా కళ్ళు వత్తు కోవడం. మాట్లాడుతూనే ఉంటుంది. అంతలోనే గొంతులో దుఃఖం జలజల మని పొంగి, మాటల్లో కించిత్ విషాదం వినిపిస్తుంది. దాన్ని కప్పి పుచ్చాలని నవ్వుతుంది. ఆ నిర్జీవమైన నవ్వు వింటుంటే కరుణ హృదయం విలవిలలాడి పోతున్నది. అందుకే ఆ సంగతి తిరిగి పైకి తోడింది.
    "నాకు తెలుసు, పెదనాన్న బాధపడ్డా డెంతగానో! కానీ.....నిజం చెప్పగానే నా ముందే కంట నీరెట్టుకుంటాడు. ఆ దృశ్యాన్ని చూసి భరించలేను.....ఊ! పోనివ్వు! ...ఇంతకూ ఏలూరు ఎప్పుడు వెళ్ళడం? రేపా?..."
    "బిందూ! మాట మార్చేయ వద్దు! ఈ నీ కరుణ మరీ చిన్న పిల్లగాదు. నీ మనసులో ఏం ఉందొ తెలుసుకోలేనేమో? కానీ, నువ్వు బాధతో కదిలి పోతుంటే చూసి భరించలేక నా మనస్సూ ఏడుస్తోంది. హాస్టల్లో కూడా అప్పుడప్పుడు నీ కళ్ళు ఎర్రబడేవి. ముఖం వాడిపోయేది. మీ సైన్స్ సబ్జక్టే కఠినం! ప్రాక్టికల్స్ చేసి, రికార్డులు రాసి రాసి అలిసి పోయావేమో అనుకునే దాన్ని. కానీ...కారణం అది గాదు! అవునా, బిందూ?"
    "కాదని నీకెలా తెలుసోయ్!" నవ్విందామె.
    "ప్లీజ్! బిందూ ! ఇంకెప్పుడూ ఇలా నవ్వకు. నీకది నవ్వేమో! కానీ, అది నా మనస్సుని కోసేస్తోంది. నీ ఊహల్లో నా స్నేహాని కెంత విలువ ఉందొ నాకు తెలియదు. కాని, నా మనస్సున నీకో ప్రత్యెక స్థానం ఉంది. మన పరిచయం ఓ సంవత్సరం పాటిదే. కావచ్చు. అయినా ఏ మాటా దాచుకోదు నా హృదయం నీనుంచి."
    "పిచ్చి కరుణా! పొరపాటు పడుతున్నావ్! నీతో చెప్పగూడనిది నాకూ లేదు. కానీ, చెప్పలేను .... ఆహా.....చెప్పలేక పోతున్నాను."
    ఆమె గొంతు తడబడుతుంది. కరుణ ఒడిలో తల పెట్టుకుని కళ్ళు మూసుకోంది,.
    "మనస్సుని తొలిచే దాన్ని దాచుకొంటే మరీ బాధ! బిందూ! పైకి వినిపించితే కొంచెం ఊరటగా ఉంటుంది" అన్నది కరుణ.
    హిమబిందు కళ్ళు మూసుకొనే ఉంది. కానీ , రెప్పల క్రింది నుంచి కన్నీటి బిందువులు జారి పడుతున్నాయి.
    "ఎలా చెప్పను, కరుణా! చెప్పు....." ఆమె మాట్లాడలేక పోయింది. ఏదో చెప్పబోతూన్న పెదవులలాగే ఉండిపోయాయి. ఒళ్ళంతా చల్లబడి పోయింది.
    కరుణ గాబరాగా పెద్దగా అరిచింది-- "బిందూ! అన్నయ్యా! తొందరగా రా! బిందు ! బిందు పడిపోయింది" అంటూ.
    వంటింట్లో ఉన్న తల్లీ , అన్నా -- ఇద్దరూ పరుగున వచ్చారు.
    శ్యామ సుందర్ వెంటనే డాక్టర్ కి ఫోన్ చేశాడు. బిందుని మంచం మీద పడుకో బెట్టారన్నా చెల్లెళ్ళు.
    డాక్టర్ వచ్చి పరీక్ష చేశాడు. వెంటనే ఇంజక్షన్ ఇచ్చాడు. "గుండె బలహీనంగా ఉంది! దడలా వచ్చి పడిపోయి ఉండవచ్చు! ఫర్వాలేదు. అయిదారు నిమిషాల్లో తేరుకుంటుంది" అన్నాడు వెళ్ళిపోతూ.
    లేచిన తరువాత కరుణ వంక చూసింది బిందు. అత్రతతో చూస్తూన ఆమె ప్రాణం కుదుట పడింది.
    "ఏం లేదు! గుండెల్లో నొప్పిలా వచ్చింది. ఆ షాక్ కి తట్టుకోలేక పడిపోయానెమో?"
    "ఏ షాక్ కి తట్టుకోలేక పడిపోయావో నాకింకా చెప్పవా, బిందూ?' అనుకున్న దామె లోలోన. పైకి మాత్రం అక్షరం కూడా రానీయలేదు. హిమబిందు చేయి పట్టుకుని మృదువుగా నిమురుతూండిపోయింది.
    కరుణ తల్లి హడావిడి ఇంకా తగ్గలేదు.
    "అయ్యో! బిడ్డ మంచు ముద్దయి పోయిందమ్మా! ఎంత బాధ తల్లీ! ఎంత బాధ! ఈ గుండె దడక్కాస్త జాగ్రత్తగానే ఉండాలమ్మా! కరుణా! కాఫీ ఇచ్చి ఇలా రా! ఇదిగో ఈ ఆపిలు పండు కోసి పెట్టు!"
    శ్యామ సుందర్ హాల్లో కిటికీ దగ్గరా నిలబడి హిమబిందు వంకే చూస్తున్నాడు.
    కరుణ చేతుల్ని చెంపలకు హత్తుకుంటూ అన్నది హిమబిందు నెమ్మదిగా !
    "మిమ్మల్ని గాభరా పెట్టా ననుకుంటానే బాగా? మీ అమ్మగారు......."
    "తరవాత చెప్పుకుందాం ఇవన్నీ! కొంచెం సేపు పడుకో!"
    "ఉహు! పాడుకొను. నువ్వేదైనా చెప్పు, కరుణా! మాట్లాడక పొతే పిచ్చెక్కి పోతుంది నాకిప్పుడు. నా కేమీ అవదులే ఇక! ఒంటరిగా ఉండలేను" అన్నదామె మరో వైపుకి వత్తిగిలి కరుణ చేతిని గట్టిగా నొక్కుతూ.
    "శరత్ బాబు 'బడదీది" ఆడుతోందిక్కడ. అన్నయ్య నిన్న చూశాట్ట! బాగుందంటూన్నాడు! కానీ, నా కెందుకో "బడదీది' పుస్తకం చదువుతుంటే మనసు తరుక్కు పోతుంది, బిందూ!"
    "నిజమే! నాకూ అంతే! వెళదాం అయితే! ఇంకా గంట టైముందేమో??" హిమబిందు లేచి కూర్చుంది.
    "ఇప్పుడా! నీకేమైనా పిచ్చెక్కిందా ఏమిటి? అమ్మ కోప్పడుతుంది. ఇంత నీరసంగా ఉండి సినిమాకు వెళతావా అంటుంది. వద్దు! ప్లీజ్ ! బిందూ !ఈరోజు కాదు రేపు వెళదాం! నీకు రేపటికి కాస్త నీరసం తగ్గుతుంది."
    "నోనో'! నాకేం నీరసం లేదు, గీరసం లేదు. వెళ్ళ వలసిందే! ఆ సినిమాకి! రేపే కాలేజీకి వెళ్లి పోదాం! ఎందుకని అడక్కు! నేనిక్కడ ఉండాలే నిక! మరోలా అనుకోకు , కరుణా! అమ్మగారూ, మీ అన్నయ్యా నన్ను ఆత్మ బంధువుల్లా చూస్తున్నారు . కానీ ....కానీ.... ఎందుకో నా మనస్సు మన హాస్టల్ వైపు పరుగెడుతోంది!" అన్నదామె లేచి నిలుచుని.
    ఏనాడూ ఇంతకుముందు హిమబిందు ఇలా ప్రవర్తించడం చూడాలే దామె హాస్టల్లో. మొదటి సంవత్సరం లో పరిచయం అయ్యింది ఇరువురికీ. రెండవ సంవత్సరం లో ఆ పరిచయం స్నేహంగా మారింది. ఇద్దరూ ఒకే రూం లో ఉండడం వలన కరుణ బి.ఎ సెకండియర్ చదువుతుంది. హిమబిందు బి.ఎస్ సి సెకండియర్ లో ఉంది. శ్యామ సుందర్ ఏలూరు లోనే రెడ్డి కాలేజీ లో తెలుగు లెక్చరర్.
    కరుణ బిందు వంక చిత్రంగా చూసింది. ఆమె అప్పుడే చీర మార్చు కుంటుంది. శ్యామసుందర్ తెల్లబోయాడు ఆ సంగతి విని.
    "ఇప్పటివరకూ నేనే ఇంకా ఆ షాక్ నుంచి తేరుకోలేదు. తనెలా వెళ్ళగలుగుతుంది!.. సరే, పదండి, మళ్ళీ ఏదైనా జరిగితే........" అంటూ అతనూ బయలుదేరాడు.
    సినిమా నుంచి వచ్చిన తరువాత భోజనాలు ముగించుకుని పడుకున్నారు. కరుణ క్షణాల్లో నిదుర లోకి జారిపోయింది. హిమబిందు కదులుతూనే ఉందింకా. పది పదకొండు కొట్టింది గడియారం!
    లేచి కూర్చుందామె. హాయిగా నిద్ర పోతున్నది కరుణ. ఆ నిశ్శబ్దం ఆమెలో ఎన్నో ఊహల్ని రేపుతుంది. లేచి మంచి నీళ్ళు తాగి పెరట్లో కి వెళ్ళింది. వెన్నెల చల్లదనాన్ని వేదజల్లుతుంది. మనసుకి ఆ చల్లదనం కొంచెం హాయి నందించింది. కానీ, లోలోన చెలరేగుతున్న కల్లోలం హృదయాన్ని కాల్చేస్తున్నది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS