"మరి గుడికీ, దీనికీ సంబంధం ఏమిటి?" శ్యామ సుందర్ ప్రశ్నించాడు ఎంతోసేపటికి.
"ఆ భార్యాభర్త లిద్దరూ ఈ గుళ్ళో లింగాన్ని ఇప్పటికీ ఎవరికీ కనిపించకుండా పూజిస్తున్నారనీ చాలామంది నమ్మకం. కొన్నాళ్ళు దూర్యోదయం అయ్యేసరికే పూజారి రాకముందే లింగానికి పూలూ, కుంకుమా అర్పించి ఉండేవట."
ఆ తరవాత ఆలయంలోకి వెళ్ళారు. ఆలయం చిన్నది. ఓ బల్ల పైన శివలింగం ఉంది. మువ్వురూ ఆ ప్రయత్నంగానే చేతులు జోడించారు. పూలు లింగం పైన వేసి బయటికి వచ్చి నిలుచుంది బిందు ముందుగా.
అప్పుడే బయట అడుగు పెడుతున్న శ్యామ సుందర్ ఏదో అడగబోయి హిమబిందు వంక చూసి ఆశ్చర్య పోయాడు.
ఆమె కళ్ళల్లో నీళ్ళు నిండి ఉన్నాయి. పెదవులు కొరుక్కుంటూ పైపైకి పొంగి వస్తున్న దుఃఖాన్ని ఉపశమింపజేయాలని ప్రయత్నించుతుంది.
"ఏమిటలా ఉన్నారు? ఏమైంది! ఏమైనా..."
"..........."
కరుణ బయటి కింకా రానేలేదు. పూజారి చెబుతున్న కధలో లీనమై పోయిందామె.
"తలనొప్పిగా ఉందా? అలిసి పోయారేమో మా మూలాన? కాసేపు కూర్చోండి." అసలు కారణం తెలియక కంగారు పడిపోతున్నాడతడు.
ఆమె చెక్కిళ్ళు పూర్తిగా తడిసిపోయాయి. అశ్రుదారాలతో. గొంతులో నుంచి ఉండలు ఉండలై పైకీ కిందికీ కదులుతుంది దుఃఖం. అంతలో బయటికి వచ్చింది కరుణ.
"అరే! ఏమైంది? బిందూ? ఎందుకు ఏడుస్తున్నావు? చెప్పవూ?"
కరుణ భుజాల మీద వాలిపోయి వెక్కి వెక్కి ఏడవసాగిందామె. హృదయాన దాగి ఉన్న శోకమంతా కట్టలు తెంచుకుని వస్తుంది. అయిదారు నిమిషాలలాగే ఆ శోక వారధి లో మునిగి పోయింది. కొంతసేపటికి నిగ్రహించుకోగలిగింది. కరుణ తన పైటతో బిందు ముఖాన ఉన్న కన్నీటి చారికల్ని తుడిచింది.
శ్యామ సుందర్ అంతసేపూ హిమబిందు వంకే నిశ్చేష్టుడై చూస్తుండి పోయాడు. అంతవరకూ నవ్వుతూ, ఉత్సాహంగా కధ చెప్పిన ఆమె మనస్సు అంతలోనే ఎందుకలా గుండెలు పగిలేట్టు ఏడ్చిందో అతనికి తెలియకుండా పోయింది.
ఆ ఇరువురి మధ్యా అంత చనువు లేదు. ఇంత సన్నిహితంగా అతడెప్పుడూ హిమబిందు తో కలిసిన క్షణాలు లేవు. స్నేహితురాలు అన్నగా తప్ప మరో ప్రత్యెక అనుబంధం లేదు వారిద్దరి మధ్య. "కేవలం పరిచయం ఉన్న తన ముందు ఎందుకలా ఏడ్చిందామె? ఏవో స్మృతులు మనస్సున కల్లోలాన్ని స్పుజించాయేమో?' అనుకున్నాడతడు లోలోన.
కరుణ ఆపైన మరో మాట మాట్లాడకుండా హిమబిందు ననుసరించినది అన్నతో పాటు. వచ్చేటప్పుడెంతో ఉత్సాహంతో వచ్చారు. అంతకు రెట్టిం పైన మూగదనంతో ఇల్లు చేరుకున్నారు మువ్వురూ.
"ఏమిటమ్మా అలా దిగాలు పడిపోయావు?' ప్రశ్నించారామెను పెదనాన్న కృష్ణమూర్తి గారు.
"అబ్బే! ఏం లేదు, నాన్నా! ఎండగా ఉంది గదూ! ఎక్కి దిగేప్పటి కి బాగా అలసిపోయాం!"
కానీ, ఆ కంఠనా ఎప్పటి మృదుత్వం వినిపించలేదు. ఆ సమాధానాన ఏదో దాచినట్లు తెలిసిపోతున్న దాయనకు. అలసట కళ్ళలో మెరిసే మెరుపుల్ని అణిచి వేయదు. కానీ, ఆమె విశాల నయనా లిప్పుడు ఎప్పుడూ ఉండే కాంతిని కోల్పోయాయి. ఆ సంగతి పసిగట్టే అయన అనుమానించి ప్రశ్నించారు.
ఆ జవాబు విన్న శ్యామ సుందర్ హిమబిందు వంక చూశాడు ఆశ్చర్యంతో. ఆ కళ్ళల్లో 'చెప్పవద్దు. జరిగింది!' అన్న అభ్యర్ధన కదిలినట్లనిపించిందతనికి.
బిందు అమ్మగారు కూడా అలాగే ప్రశ్నించింది.
"అబ్బ! ఏముందమ్మా? ఎండలో తిరిగితే ఎలా ఉంటారు మనుషులు? పెదనాన్న కీ, నీకూ ఎప్పుడూ నన్ను పోలీసుల్లా కాపలా కాయడమే పనిలా ఉంది!" చివరలో చిన్నగా నవ్విందామె.
అంతటితో ఆ ప్రసక్తి ఆగిపోయింది. కానీ, వాళ్ళ ప్రశ్నలూ, హిమబిందు సమాధానాలూ శ్యామ సుందరుని కి ఎదలో ఎన్నో ఆలోచనల్ని స్పుజించాయి.
"ఏదో ఉంది! ఈ గులాబీ చుట్టూ ముళ్ళున్నాయి! అవెంత వాడి యైనవో?' అతని ఆలోచనకు దాని స్పష్టమైన రూపం అందనేలే దేన్నీ విధాల పరిశోధించినా.
ఆ సాయంత్రమే బయలుదేరారిరువురూ. కరుణ, స్నేహితురాల్ని కూడా గుంటూరు రమ్మని అడిగింది. అందుకామె సుముఖంగా లేదు.
"ఇప్పుడు గాదులే!"
"మరెప్పుడు వస్తావు? ఉహు! రావల్సిందే! అన్నయ్య కూడా రమ్మని చెప్పమన్నాడు!"
"కాదులే , కరుణా! మరోసారి వస్తాను! ఇప్పుడు నా మనస్సేందుకో మూగదై పోయింది. పంజరంలో చిలకలా ఉండి పోవాలనిపించు తోంది."
"అలాగే! కానీ ఇక్కడ గాదు. మా ఇంటికి రా!క బిందూ! అక్కడా ఓ పంజరం ఉంది!.....' ఆగి ఆమె కళ్ళలోకి చూసింది.
"ఉందా?"
"ఆహాహా! ఉంటుంది. నీ నా మధ్య స్నేహం ఉంది గదా? ఆ అనుబంధాన్నే పంజరంగా మలుస్తాను."
"కరుణా! నీ స్నేహం తీయనిదే!" ఆమె మనసు పరవశించిందా స్నేహమయి సమాధానం లోని తీయదనానికి.
ఎవ్వరూ అడ్డు చెప్పలేదామె ప్రయాణానికి. అలా వెళ్ళడమే మంచిదన్నట్లు సూచించారు కృష్ణమూర్తి గారు.
ఆ ఊరి నుంచి ప్రయాణానికి వాహనాలంటూ ఏమీ లేవు ఒక్క యేండ్ల బండి తప్ప. గన్నవరం వరకు వచ్చి రైలు నందుకోవాలి.
పాలేరు బండిలో బల్ల వేశాడు. అడుగున ఎండు గడ్డి వేసి పైన చాప పరిచాడు. ఆ పైన బల్ల మీద గుడిసె కట్టాడు. ఎండ పొడ పడకుండా ఉండాలనీ కలవారి ఆడపడుచు ప్రయాణం చేస్తుందనీ.
"చూశారా మా రధం!" నవ్వింది హిమబిందు బండేక్కుతూ.
"బాగుంది!" అన్నాడు శ్యామ సుందర్.
పాలేరు ఎడ్ల నడిలించాడు సెలగోల ఝుళింపించి ఊరు దాటేవరకూ ప్రతి ఇంట్లో నుంచి ఎవరో ఒకరు తొంగి చూస్తూనే ఉన్నారు.
బండి రోడ్డు మీదికి వచ్చింది. ఎర్రమట్టి రోడ్డు బండి నడుస్తుంటే ఎర్రటి దువ్వ పైకి లేస్తుంది.
ఏవో చెబుతున్నాడు పాలేరు రంగన్న. ఉత్సాహంగా బండి తోలుతూ.
"అమ్మాయి గోరు ఎప్పుడెల్లినా గిత్త దూడల్నే కడతా నండి. సిటుక్కున టేసను జేరు కుంటయ్! ఈ ఎర్ర దూడుంది చూశారా? మాంచి చురుకైంది లెండి! ఎహే! నడవ్వే! నీ సిగదరగ! ఇది కాస్త మందం, బాబూ!"
ఆ అనుభవం అన్నా చెల్లెళ్ళ కి వింతగానూ ఉంది, ఆనందంగానూ ఉంది. రోడ్డు మీద గోతుల్లో పడుతుంది చక్రం . ఆ కుదుపుకి అవయవాలన్నీ విదిపోతున్నట్టుంది వాళ్లకు. అది ఓ క్షణమే! ఆ పైన మళ్ళీ బండి చక్రాల చప్పుడు వినపడుతుంది. ఎర్ర మట్టిలో చిన్న చిన్న రాళ్ళున్నాయేమో? క్రొత్త రోడ్డు. ఆ రాళ్ళ మీద చక్రాలు పరిగెడుతుంటే లయబద్దమైన శబ్దం వెలువడుతుంది. విన సొంపుగా ఉందది. ఎడ్ల మెడలో గంటలు అవిరామంగా మోగుతూనే ఉన్నాయి.
"ఇంకెంత లెండి! ఓ మైలుంటది! వచ్చేశాం! ఆ! కాత్త గట్టిగా కూకోండి! చనం లో టేసను ముందేడతా బండిని! హేయ్! చల్!..." పాలేరు సెలగోల తో ఎడ్ల వీపు మీద అంటించాడు చురుగ్గా.
ముందు ఓ బండి పోతున్నది. దాన్ని దాటేసి దూసుకుపోయింది క్షణంలో.
"ఓయ్! తగ్గరా , బుల్లోడా! ఇయ్యేటనుకున్నా? గుర్రాలు జాలవు! ఆ!..." వెనకబడిన బండి వాణ్ణి పరిహసించాడు.
బండిలో వాళ్లకి ఉత్సాహంగానే ఉంది అలా పరుగు పెడుతూ ఓ బండిని దాటిపోవడం. వాళ్ళ మనస్సుల్లో కూడా ఆనందం పరుగులు పెడుతుంది బండి వేగంతో కలిసి.
వెనకవాడు భాగీరధ ప్రయత్నం చేస్తున్నాడు ముందుకు రావాలని. కానీ, అంతలో మలుపు తిరిగింది బండి.
దిగి టిక్కెట్లు తీసుకున్నారో లేదో రైలు రానే వచ్చిందంతలో. హడావిడిగా సూట్ కేసులు రైల్లో ఉంచాడు రంగన్న.
కదిలింది రైలు రెండు నిమిషాల్లో.
