Previous Page Next Page 
సాఫల్యం -1 పేజి 2


    "జాఫర్"
    నా గుండె ఝల్లు మంది. వళ్ళు చల్లారి పోయింది.
    పాతిక సంవత్సరాలకు ఆ పేరు అనుకోకుండా విన్నాను. "రమ్మను" అన్నాను. అతను వచ్చాడు. మరోసారి నమస్కారం చేసి కూర్చోమంటే ఓ నిముషం నసిగి అనక కూర్చున్నాడు.
    "ఏం పని మీద వచ్చారు" అన్నాను.
    అతను కొంచెం సేపు నసిగి, తను వచ్చిన పని బయట పెట్టాడు. తను బియ్యే ప్యాసయినట్టు ఎక్కడా తనకు ఉద్యోగం దొరకనట్టు, తండ్రి లేనట్లు, తల్లిని పోషించవలసిన బాధ్యత తన మీద ఉన్నట్టు చెప్పి, సభ్యత కోసం తన కనులకోలకుల్లో అణిగి వున్న కన్నీటిని మధ్య వేలుతో తుడుచుకున్నాడు.
    నా కళ్ళూ చెమ్మగిల్లాయి.
    ఈ రకం గాధలు, కధలు నాకు కొత్తగాక పోయినా, అతను చెప్తున్నప్పుడు ఏదో ఒక రకమైన అనుభూతి కలిగింది నాలో. కారణం అతని పేరే నెమో! ఆ పేరుతొ నా జీవితానికి కల సంబంధం బాంధవ్యం అలాంటిది.
    "సరే ఆలోచిస్తాను. అప్లికేషను ఇచ్చి వెళ్ళండి" అన్నాను. అతను టైపు చేయించి తెచ్చుకున్న అప్లికేషను ఫారం నా టేబుల్ మీద పెట్టి మరో సారి నమస్కరించి వెళ్ళిపోయాడు. అప్లికేషను వైపు ఒకసారి చూసి దాని మీద పేపర్ వెయిట్ పెట్టాను. పక్క నున్న ఫైలు తీసి, ఆఫీసు పని లోకి జోరపడ్డాను. నా బుర్ర మొద్దుబారింది. ఆఫీసులో కూర్చో బుద్ది కాలేదు. రాత్రి గుర్తుకు తెచ్చిన గతాన్ని మళ్ళీ పునశ్చరణ చెయ్యాలని నా మనస్సు ప్రయత్నిస్తోంది.
    అదొక రకం మానసిక వ్యాధి.
    నాకు అలాటపుడు పని చెయ్య బుద్ది కాలేదు. కుర్చీలోంచి లేచి, బయటికి వచ్చాను. ఎక్కౌంటెంట్ వేసిన జోక్ కి నవ్వబోతున్న వాళ్ళంతా నన్ను చూసి, తమ కార్యక్రమానికి అడ్డు వేసుకున్నారు. ఎక్కౌంటెంట్ ఇబ్బందిగా ముఖం పెట్టి, తమ పనిలో నిమగ్నుడై నట్టు నటించి, "వాటీజ్ దిస్" అని ఒక ఫైలు ని ప్రశ్నించాడు. నేను తిన్నగా అతని దగ్గరకు వెళ్ళి, "నేను ఇంటికి వెళ్తున్నాను. ఏవైనా అర్జంటు కాగితాలుంటే ఇంటికి పంపండి." అని చెప్పి బయటికి వచ్చేశాను.
    ఇంటికి వచ్చి , బట్టలు మార్చుకుని పడకుర్చీ లో మేను వాల్చాను. మళ్ళీ నా మనస్సు స్వేచ్చగా గతంలోకి చొరబడింది.
    "...నేను చేసుకున్న నిర్ణయం ప్రకారం మామయ్య లేని సమయాల పట్టిక తయారు చేసి, ఆ ప్రకారంగా వాళ్ళింటికి వెళ్ళే వాణ్ణి. అత్తయ్య చాలా ఆదరణ తో మాట్లాడేది. ఆరోజు నేను వాళ్ళింటికి వెళ్లేసరికి ఏదో పని మీద మామయ్య రాజమండ్రి వెళ్ళాడని చెప్పింది. అత్తయ్య ఆ పూట నన్నక్కడే భోజనం చేయమని బలవంతం చేసింది. "నీ కిష్టమైన కూరేదో చెప్పు చేస్తాను" అంది. వెంటనే నేను "బెండకాయ" అన్నాను. బోలెడు బెండకాయ కూరతో ఆనాటి భోజనం ముగిసింది. అదే నేను వాళ్ళింట్లో భోజనం చేయడం. అదే ఆఖరి సారి కూడా అయ్యింది. ఆరోజంతా వాళ్ళింట్లో నే గడిపి, రాత్రి సినిమా కి కూడా వాళ్లతో వెళ్లి, పదిన్నర కు ఇంటికి వచ్చాను, అవధాన్లు నాకోసం కుర్చీలో కూర్చొని ఉన్నారు. "నీతో ఒక ముఖ్యమయిన విషయం మాట్లాడాలని వచ్చాను." అన్నారు. నాతొ మాట్లాడేదేవిటని ఆశ్చర్యపోయి, "చెప్పండి" అన్నాను.
    "ఇది మీ గృహ సంబంధమైన విషయం అనుకో. అయినా మీ నాన్నగారికి నాకు ఉండే స్నేహం వల్ల కలగజేసుకోవలసి వచ్చింది" అంటూ ప్రారంభించారు.
    "నువ్వు మీ మామయ్య గారింటికి వెళ్ళడం తగ్గించాలి. తగ్గించడమే కాదు. మానెయ్యాలి. మీ నాన్నగారు ఈ విషయం మీద నాకు ఇప్పటికి చాలా ఉత్తరాలు రాశారు. మీ నాన్నగారి కోపం నీకు తెలియనిది కాదు . కోరి తలిదండ్రుల తో వైరాలు పెంచుకోడాలు, పెట్టుకొదాలు మంచిది కాదు" అన్నారు. నాకు కోపం పెట్రేగి పోయింది. నన్ను అది చేయక, ఇది చేయి అనడానికియనేవరు అనిపించింది.
    "ఈ విషయం లో నేను ఒక నిర్ణయానికి వచ్చాను లెండి. అసలు మా నాన్నగారికి, మామయ్య కు ఎందుకు వైరం వచ్చింది మీకు తెలిస్తే చెప్పండి.' అన్నాను.
    అయన ప్రారంభించారు.
    "ఆదిలో మీ మామయ్య , మీ నాన్నగారు పనిచేసే ఆఫీసులో గుమస్తాగా ఉండేవాడు. మేనేజరు తో లాలూచీ అయి, మీ నాన్నగారి మీద ద్వేషం చూపించి, మేనేజరు మంచి కోసం ఏవో చేసేవాడట. అవన్నీ నాకు సరిగా తెలియవు. చివరికి వ్యక్తీ దూషణ వరకూ వచ్చిందని మీ నాన్నగారన్నారు. ఆ తరవాత వచ్చిందని మీ నాన్నగారన్నారు. ఆ తరవాత మానేశారు. అంతవరకూ నాకు తెలుసు. నువ్వీ వూరు వస్తున్నప్పుడు నిన్ను మీ మామయ్య ఇంటికి వెళ్ళనియ్యద్దని నాకు ఖండితంగా రాశారు. అందుకని కలగ జేసుకోవాల్సి వచ్చింది." అన్నారాయన. నేను ఇక ఆ విషయం మీద ప్రశ్నలు వేయకుండా వూర్కున్నాను.
    అ తరవాత కూడా వాళ్ళింటికి వెళ్ళడం మానలేదు. ఒకనాడు అత్తయ్య నాతొ అంది. ఆ మాట ఇదివరకే అమ్మ అంది.
    "రమ పుట్టినప్పుడు మీ అమ్మగారు వచ్చి మా కోడలు పిల్ల ఏదీ అని, చూసి చక్కగ ఉంది. నల్లగా ఉంటుందేమో మా అబ్బాయి నివ్వం అందామనుకున్నాను. ఇక నాకే బెంగా లేదు. మా వాడికి మంచి పెళ్ళాం దొరికింది అన్నారు. ఎప్పటి కయినా ఆవిడ కోరిక, నా కోరిక తీరితే దేముడికి వేయి దండాలు పెడ్తాను" అంది అత్తయ్య. నేను తల వూపి, వూర్కున్నాను.
    మరోసారి వాళ్ళింటికి వెళ్లేసరికి ఎవ్వరూ లేరు. రమ ఏదో నవల చదువుతూ కూర్చుంది. నన్ను చూడ్డం తోనే కుర్చీలోంచి లేచి, "కూర్చోండి" అంది కూర్చుంటూ "మంచి నీళ్ళు కావాలి" అన్నాను. రమ లోపలకు వెళ్ళింది. మంచినీళ్ళు తెచ్చి యిస్తూ, "మీ పెళ్లట కదూ ఈ వేసంగు ల్లో" అంది. నేను ఉలిక్కిపడ్డాను. రమ కళ్ళల్లో నీరు నిలిచి ఉంది.
    "ఎవరన్నారు" అన్నాను.
    "రాజమండ్రి లో సంబంధం చూశారట. మీ నాన్నగారన్నారు" అంది. అందులో అబద్దం లేదేమో ననిపించింది నాకు. "చూస్తె చూడచ్చు. వాళ్ళు చూసినంత మాత్రాన్న మనం చేసుకోవాలని రూలుందేవిటి? నేను ఒకమ్మాయిని పెళ్లి చేసుకోవాలను కుంటున్నాను. ఆమె వప్పుకుంటే చేసుకుంటాను. లేకపోతె అంతే" అన్నాను. రమ కళ్ళు సిగ్గుపడ్డాయి. "ఎవరు" అంది పెదిమ మీద దొర్లిన సిగ్గును దాచుకుంటూ.
    "నువ్వే" అన్నాను నేను. నా గొంతు వణికింది. గొంతు సరిచేసుకుని, మాట్లాదేలోగా అత్తయ్య వచ్చేసింది. కాస్సేపు కబుర్లయ్యాక, "అన్నట్లు వారికి హైదరాబాదు టాన్స్ ఫర్ అయ్యింది ఈ నెలాఖరుకు వెళ్ళిపోతున్నాం" అంది.
    నా గుండె ఝల్లు మంది.
    "నిజంగానా " అన్నాను.
    "నిజమే " అంది అత్తయ్య.
    నెలాఖరుకు సామానంతా సర్దుకుని , బయల్దేరారు. ఆనాడు మామయ్య నాతొ కొంచెం ఎక్కువ మాట్లాడాడు. "మీమీద కాని, నీమీద కాని, నాకు గాని, మా వాళ్లకు గాని ఏ విధమైన కక్షలూ లేవు. ఏదో ఎవరి బ్రతుకులు వాళ్ళు బ్రతుకుతున్నాము. నామీద లేనిపోని భావాలు పెట్టుకోక" అన్నాడు. ఆ మాటలకు తాత్పర్యం ఏమిటో అర్ధం కాలేదు. కాదు కూడా.    
    వాళ్ళు వెళ్ళిపోయారు.
    రమ కళ్ళతోనే తన అశక్తతను వ్యక్తపరచింది. మౌనంగా తలవూపి "వెళ్ళొస్తాం " అంది. నేనూ తలవూపాను. ఆరాత్రి నాకు నిద్ర పట్టలేదు.
    కాలం పొడిగా గడిచింది.

                             *    *    *    *


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS