అరుంధతిని వివాహానికి ముందే, ఎవరైనా , ఆమె అభిప్రాయాన్ని అడిగి ఉంటె, అరుంధతి నిష్కర్షగా తనకీ వివాహం వద్దనీ, అసలు వివాహం మీదే తన కసక్తి లేదనీ చెప్పి ఉండేది. కానీ, ఇంట్లో అందరూ , ఆమె వివాహం విషయం లోనే ఆమె ఉనికిని కూడా గుర్తించకుండా ప్రవర్తించటంతో, ఆమె కెక్కడ లేని కోపమూ వచ్చింది. తండ్రి దగ్గరి కెళ్ళి ఏడవాలనుకుంది. అందువల్ల ఏమీ లాభం లేదు. తల్లితో చెప్పుకోవాలనుకొంది. ఆమె మాటకేమీ విలువ లేదు. ఎక్కడి కైనా పారిపోవాలను కొంది. సరిగ్గా పెళ్లవుతుంటే , పదిమంది మధ్య లేచి నిల్చొని , నాకీ పెళ్ళక్కర్లేదని అరవాలను కొంది పెళ్ళి కొడుక్కి ఉత్తరం వ్రాసేద్దామనుకోంది -- కానీ , ఏ ఒక్కటీ చెయ్యలేకపోయింది. జీవితాంతమూ తననొక పరిధిలో బంధించి వేసే మంగళ సూత్రాలు మెళ్ళో పడగానే, ఒక్కసారి ఉలిక్కిపడింది. ఆ క్షణంలోనే, ;ఏదెలా జరుగుతే అదలా జరుగనీ" అనే లాంటి నిర్లిప్తత ఆమె నావరించుకొంది. గృహిణిగా భర్త యింట అడుగు పెట్టిన తరువాత కూడా, అరుంధతికి తన నిర్లిప్తత వదిలించుకోవలసిన అగత్యం కలుగలేదు. అందుకు కారణం వెంకటలక్ష్మీ.
వెంకటలక్ష్మీ న్యాయానికి ప్రకాశరావు ఇంట్లో వంటమనిషి -- కానీ, గృహ యాజమాన్యమంతా ఆవిడే నిర్వహిస్తుంది. వెనుకా ముందూ ఎవ్వరూ లేరు. అక్కడే పడి ఉంటుంది. ఏరోజు, ఏ కూర చెయ్యాలో నిర్ణయించుకోవటం, ప్రకాశరావు తో చెప్పి పని కుర్రాడి ద్వారా ఇంట్లోకి సామాన్లు తెప్పించడం ఇల్లంతా పరిశుభ్రంగా ఉంచటం, పనివాళ్ళతో సక్రమంగా పనిచేయటం, ఇంట్లో వాళ్ళకు ఏ సమయంలో ఏం కావాలో చూసుకోవటం, అన్నీ వెంకట లక్ష్మే సమర్ధించుకొంటుంది. కాఫీ వేళకు కాఫీ, భోజనం వేళకు భోజనం ఫలహారం వేళకు ఫలహారం కానిచ్చి, భర్త చెప్పే మాటలు , నిరాసక్తంగా వింటూ, ఏదో నవల చేత్తో పుచ్చుకొని కూర్చునేది అరుంధతి-
ఇంత మంచి వంటమనిషి దొరకటం, అదృష్టమనేవారు అందరూ! ఒకనాడు మనోరంజని వచ్చి, అది అదృష్టం ఎంతమాత్రం కాదని చెప్పేవరకూ అరుంధతి కూడా ఇలానే అనుకుంది-- మనోరంజని సుందర్రావు భార్య.
ఒకనాడు ప్రకాశరావు కోర్టు నుంచి ఇంటికి వస్తూనే "ఇవాళ నీకోసం ఎవరొచ్చారో చూడు!" అన్నాడు హుషారుగా!
బద్దకంగా పడుకొని నవలలో లీనమయి పాయిన అరుంధతి విసుక్కుంది. కష్టం మీద నవల మూసి చీర, బొట్టు సరిచేసికొని మనసులో విసుగుని దాచుకోవడానికి ప్రయత్నిస్తూ హాల్లోకి వస్తూ దిగ్భ్రాంతితో నిలబడిపోయింది. సుందర్రావు ఒక అపరిచిత యువతీ కూర్చొని ఉన్నారు. అరుంధతిని చూడగానే, సుందర్రావు అతి సహజంగా చిరునవ్వుతో 'హలో! అరుంధతీ! బాగున్నావా?' అన్నాడు.
"ఆ! కులసాగానే ఉన్నాను" ఆప్రయత్నం గానే అనేసింది అరుంధతి కూర్చుంటూ.
"ఈవిడ మా శ్రీమతని తేలిగ్గానే వూహించగలవు. పేరు మనోరంజని , శ్రీ రాజారావుగారమ్మాయి- మనో! ఈవిడే అరుంధతి - ప్రకాశరావు గారి భార్య! నా మేనమరదలు!"
సుందర్రావు పరిచయ వాక్యాలు ముగియగానే , విలాసంగా తన చెయ్యి జాపింది మనోరంజని. అరుంధతి చెయ్యి అందించి, కరస్పర్శ ముగియగానే తన చేతి వంక అసహనంగా చూసుకొంది, మనోరంజని నలుపు!- బాగా నలుపు-- కొందరు నల్లగా ఉన్నా, ఆ నలుపులో ఒక తళుకు ఉంటుంది. మరికొందరి నలుపు మసిబారి నట్లుంది. మనోరంజని శరీరచ్చాయ, ఈ రెండవ రకం. కళ్ళు పెద్దవి. పెద్ద కళ్ళు అందమంటారు. ఆ మాటలు తలక్రిందులు చేస్తాయి మనోరంజని కళ్ళు. బాగా పెద్దవైన ఆమె కళ్ళ లోంచి కనుగ్రుడ్లు కొట్టవచ్చేటట్టుగా, పైకి ఉబికి ఉంటాయి. కనుపాపలు తేనే రంగులో ఉండి పిల్లి కళ్ళను జ్ఞాపకం చేస్తాయి. ముఖం బాగా కోలగా కోడిగ్రుడ్డులా ఉంటుంది. చెవులకు రింగులూ, వాటికి వేలాడుతూ ముత్యాలూ ఉన్నాయి. మెడలో పచ్చలు, ముత్యాలూ , కేంపులూ తాపిన నెక్లెస్ , మోడ్రాస్ చెయిన్, నులకతాడూ ఉన్నాయి. ఒక చేతిని వివిధ రకాలయిన డిజైన్ లలో గాజులు ఇంచుమించు మోచేతి వరకూ ఉన్నాయి. మరొక చేతికి రాళ్ళు పొదిగిన బంగారు గొలుసు కల రిస్టు వాచీ ఉంది. చీర నిండా జరీ గళ్ళున్న ఆకుపచ్చ అంచు ధర్మవరం ఎర్ర పట్టు చీర కట్టుకొంది. జరీ పువ్వులున్న ఆకుపచ్చ పట్టు జాకెట్టు వేసుకుంది. ఎరుపూ, ఆకుపచ్చ , ఒకదాని కొకటి బాగా సరిపోతాయి. కానీ, రెండూ కలిపి ఆవిడ ఒంటికి సరిపోలేదు- నల్లని ముఖంలో లిప్ స్టిక్ రాసుకున్న ఎర్రని పెదవులు భయంకరంగా కన్పిస్తున్నాయి. బాగా పైకి చుట్టిన సిగలో ఒక పక్కకి మాత్రం పువ్వు లున్నాయి. ఒక విషయంలో మాత్రం మనోరంజనిని మెచ్చుకొని తీరాలి- అది ఆవిడ ప్రదర్శించే విలాసం. ఆవిడ కూర్చోవడంలో, నిల్చోవటం లో, చీర సర్దుకోవడం లో , హేండ్ బాగ్ జిప్ తీసి రుమాలు అందుకోవటం లో , కాఫీ కప్పు చేతిలోకి తీసికొని సిప్ చేయటం లో , నెమ్మదిగా నవ్వటం లో విలాసం ఉట్టిపడుతూ ఉంటుంది.
తనను అరుంధతి పరిశీలనగా చూడటం గమనించి, మనోరంజని కొద్దిగా గర్వాన్ని సూచిస్తూ కనుబొమలేగరేసింది. అరుంధతి చటుక్కున తన చూపులు తిప్పుకోంది. అంతలో ప్రకాశరావు బట్టలు మార్చుకొని రావటమూ వెంకతలక్ష్మీ అందరికీ, కాఫీ ఫలహారాలు తేవటమూ జరిగింది.
ప్రకాశరావు రాగానే, సుందర్రావు ప్రకాశరావూ వ్యవహారానికి సంబంధించిన మాటల్లోకి దిగిపోయారు. తన వినినదాన్ని బట్టి అరుంధతి తెలిసికొన్న దిది-
మనోరంజని తండ్రి చనిపోయారు. ఆస్థిఅంతటికీ మనోరంజనే వారసురాలయింది. న్యాయముగా ఆవిడకు రావలసిన ఇల్లోకటి, బంధువులలో ఎవరో ఆక్రమించుకొన్నారు. ఏదో, ఆ ఒక్క ఇంటి కోసం, ఆశ కాదు గాని అన్యాయాన్ని సహించకూడదు. అందుకనే ప్రకాశరావు సహాయం కావలిసోచ్చింది. ఈ ఆకస్మిక స్నేహ ప్రకటనకు కారణం కూడా ఇదే కావచ్చు.
వ్యవహారానికి సంబంధించిన మాటలు పూర్తీ కాగానే, సుందర్రావు అరుంధతి వంక తిరిగాడు.
'నన్ను క్షమించు అరుంధతీ! నీ పెళ్ళికి రాలేకపోయాను- సరిగా అప్పుడే, మా మావగారికి చాలా జబ్బు చేసింది. అందరం మతులు లేకుండా ఉన్నాము. (సరిగా ఈ మాటలంటూన్నప్పుడు మనోరంజని కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. సుందర్రావు అరుంధతితో మాట్లాడుతూనే ఆమె భుజం మీద మృదువుగా తట్టి వోదార్చాడు.) ప్రకాశరావు గారి వంటి భర్త దొరికినందుకు నిన్ను మనసారా అభినందిస్తున్నాను-- నువ్వు చాలా అదృష్టవంతురాలీని."
అరుంధతి సూటిగా సుందర్రావు కళ్ళలోకి చూసింది.
"అవును! చాలా అదృష్టవంతురాలిని."
సుందర్రావు కళ్ళు సిగ్గుతో క్రిందకు వాలిపోలేదు -- నిర్లక్ష్యంగా అరుంధతి చూపుల నెదుర్కొని హాయిగా నవ్వేశాడు.
ప్రకాశరావు చాలా సంతోషించాడు.
అరుంధతీ ప్రకాశరావును తమ ఇంటికి రమ్మని మరి, మరి ఆహ్వానించిన తరువాత సుందర్రావు లేచి, "డార్లింగ్! పోదామా?" అంటూ తన చెయ్యి మనోరంజని కందించాడు. మనోరంజని ఆ చెయ్యి సుతారంగా అందుకొంటూ తనూ లేచి , తల ఒక ప్రక్కకు కొద్దిగా వాల్చి "వస్తానండీ!' అని బయలుదేరింది.
