Previous Page Next Page 
అపశ్రుతులు పేజి 2


    తృళ్ళిపడ్డట్టు కదిలి ఏం తొందర నానా?....ఉద్యోగం అవ్వాలిగా!" అన్నాడు గొంతు తడబడుతూంటే.
    "నీక లేకపోతే ఏం? అమ్మాయి చేస్తూందిగా." వంటఇంట్లోంచి గబగబా ఇవతలికి వస్తూ అంది శ్రీనివాసరావు తల్లి జానికమ్మ.
    "ఛ, ఛ ఊరుకోమ్మా......ఆ అమ్మాయి ఉద్యోగం చేస్తూంటే నేను కూర్చుని తింటానా?" విసుగ్గా మొహంపెట్టి అన్నాడు శ్రీనివాసరావు.
    "ఒసేవ్ నువ్వుండు మాట్లాడకు.....అలాగేరా ఉద్యోగమయ్యేకే పెళ్ళిచేసుకోవచ్చు నిశ్చయం చేసుకుందాం. అమ్మాయి బంగారు బొమ్మలా మాంచి చలాకీగా. ఉషారుగా ఉంటుందిలే."
    చివాలున లేచి ఇంట్లోకెళ్ళిపోయాడు శ్రీనివాసరావు.
    "ఏవిటండీ..మనం ఇలా నాన్చుతూంటే బంగారంలాంటి సమ్మంధం చెయ్యిదాటిపోదూ" వెళ్తూన్న కొడుక్కి విన్పించేలా అంది జానికమ్మ.
    "ఆ....మరి దేశంలో ఆడపిల్లాలు దొరక్క పొరు .....ఇప్పుడే చూపులూవద్దు నిర్లక్ష్యంగా అన్నాడు శ్రీనివాసరావు తాలూకాఫీసు గుమస్తా ఉద్యోగం చేసి. రిటైరాయిన రంగనాధం బుద్ధి చాకులా పనిచేసి. మాట ఇచ్చేశాం సాయంకాలం నిన్ను తీసుకువస్తున్నామని మా మాటనిలబెట్టు" అంటూ పైమీద కండువా గట్టిగా దులిపివిసురుగా వీధిలో కెళ్ళిపోయాడు.
    తెల్లబోయాడు శ్రీనివాసరావు అతని మాటలు వింటూ మాటమాత్రమైనా నాతో చెప్పక్కర్లేదా? ఛ ఛ ఏం మనుష్యులో మీరు అని విసుక్కున్నాడో క్షణం.
    మధ్యాహ్నం మూడు గంటలవేళ అరటికాయ బజ్జీలు చేస్తూంది జానికమ్మ. వంట ఇంట్లోకొచ్చి తల్లి పక్కన పీట వాల్చుకు కూర్చుని "అమ్మా నా పెళ్ళికప్పుడేం తొందరమ్మా" నెమ్మదిగా అన్నాడు శ్రీనివాసరావు.
    "బాగుంది. ఎప్పుడైనా చెయ్యమని అడుగు తావా! నువ్వు! మూడేళ్ళయి ఇదే వరస" నవ్వే సిందావిడ.
    "చదివి ఉద్యోగం చేస్తూన్న అమ్మాయి....వద్దమ్మా. నాకు వ్యవసాయం చేయిస్తూ ఈ పల్లెలోనే ఉండిపోవాలనుంది"
    "ఇక్కడ ఈ ఊళ్ళోనా? వ్యవసాయమా!" ఆమె తెల్లబోయి చూసిందతని వైపు.
    "ఏం? మా తాతలు ఈ ఊళ్ళోనే వ్యవసాయంమీద బ్రతికారు. నాన్నగారి ప్రావిడెంట్ ఫండు ఎలానూ వస్తుంది. ఆ డబ్బుతో మన పొలం విడిపించేసుకుందాం."
    "నిన్ను చదివించింది ఇందుకా! ఏవిట్రా అబ్బాయ్ నీ ఉద్దేశ్యం?" కాస్త తీవ్రంగానే ధ్వనించిందామె గొంతు.
    "చదువు కేవలం ఉద్యోగం కోసమేనా అమ్మా ఉపయోగపడేది?"
    "మరెందుకు?" టక్కున ఎదురు ప్రశ్న వేసింది జానకమ్మ.
    నవ్వుకున్నాడు శ్రీనివాసరావు ఆమె అమాయకత్వానికి. జీవికకు మరొక ఆధారంలేకపోతే ఉద్యోగాన్కే. కాని పదెకరాల మాగాణీ ఉన్న నేను ఉద్యోగం మానేస్తే, నాలా చదివిన ఇంకో వ్యక్తికి ఆ ఉద్యోగం లభించవచ్చుగా! అనుకుంటూ.
    "అయితే ఎందుకు చదివావు ఎమ్మే! బోలెడు డబ్బు తగలేసి!"
    "అక్కయ్యకి అయిదు వేల రూపాయల నగలు చేయించి పెట్టావ్. చదువు అక్కర్లేదన్నావ్? బోలెడు కట్నం పోసి బాగా చదివిన అతనికిచ్చి పెళ్ళి చేశారు అక్కయ్య విద్యావంతులయిన భర్తా ఆడబిడ్డలూ అందరి మధ్యా తాను చదువుకోలేదని క్షణ క్షణం తన్ను తాను చిన్న చేసుకు బాధపడుతుంది. చదువు ఉద్యోగాని కొక్క దానికే ఆర్జించాల్సింది కాదమ్మా. ఊపిరి ఉన్నంతవరకూ మన జీవితాన్కి మంచిమిత్రుడిలా సహకరిస్తుందమ్మా!" అసలు ఓనమాలే దిద్దని ఆమెకింకా విపులంగా ఎలా చేపపాలో తెలియక ఊరుకున్నాడు శ్రీనివాసరావు.    
    "ఒరేయ్ అబ్బాయ్ నేను చెప్తానుండరా....పదేళ్ళక్రితం నేను శృంగవరపుకోటలో పన్జేసేప్పుడు మనింట్లో ..... చదువుకోక పోయినా చురుకూ తెలీవీ ఉన్న జానికమ్మ చాలు ఊరుకుందురూ ...." అంటూ చెప్పవద్ధన్నట్టు అతని వైపు చూసింది.
    పకపకా నవ్వేశాడు శ్రీనివాసరావు.
    ఎందుకురా నవ్వేస్తున్నావ్ అంటూనవ్వారు రంగనాధం.
    అమ్మ బట్టలు వేస్తే చాకలి పిల్ల వద్దురా పిచ్చి బట్టలు పట్టుకుపోయేది నాలుగు రేవులు అయ్యే సరికి ఇంటందారి బట్టలు మొత్తం పదిహేను బట్టలు పోయాయ్ తల్లి చిన్నబుచ్చుకుంటుందేమో అని జంకుతూ నెమ్మదిగా అన్నడు శ్రీనివాసరావు.
    "అదీ.... అందుకే నేను బి.ఎ. ప్యాసైన అమ్మాయిని ఈ ఇంటి కోడలుగా ఎన్నుకున్నాను సగర్వంగా కొడుకు వైపు చూస్తూ అన్నారు రంగనాధం.
    "నాకు ఇష్టంలేదు నాన్నా..." నిర్మొహ మాటంగా అనేశాడు శ్రీనివాసరావు.
    "అబ్బాయ్ అమ్మాయిని చూడు, నీకు అమ్మాయి నచ్చిందీ లేనిదీ చెప్పు ..... అంతే. మాట ఇచ్చాం. యివాళ అబ్బాయిని తీసుకువస్తాం అని ఒసేవ్ అన్నట్టు వాళ్ళింటికెలానూ వెళ్తున్నాం. ఇప్పుడెందుకని చేస్తున్నావ్" అన్నాడు రంగనాధం.
    మనకి టిఫిన్లు చేసి పెట్టటాన్కి వియ్యాలవారి ఇల్లేవిటండీ ఆ అమ్మాయి బంధువులింటి కొచ్చిందికానీ అంటూ దీర్ఘం తీసి నవ్వి కొడుక్కీ ఆయనకీ చెరొక ప్లేట్లో బజ్జీలు పెట్టి ఇచ్చింది జానికమ్మ.
    శ్రీనివాసరావు ఇష్టా ఇష్టాలతో ప్రమేయం లేకుండా చూపులకి ప్రయాణమయ్యారు. జానికమ్మా రంగనాధం. అతనేమో చెప్పబోతూ 'అమ్మా'!.....పీల్చిందేతడవు. నీకేం తెలియదు శ్రీనూ.. నాన్నగారూ చెప్పినట్టూవిను. 'జానికమ్మ హితవు. "నాన్నా! "ఎందుకురా ప్రతిసారీ తూలగొట్టిస్తావ్.? అమ్మాయి నీకు నచ్చనిదీ లేనిదీ చెప్పు.... అంత దాకానే... తర్వాత మిగతా విషయాలు నేను దూసుకుంటాను" రంగనాధం మందలింపు.
    "యాంత్రికంగా బుద్దిమంతుడిలా వారి వెనుక నడిచాడు శ్రీనివాసరావు.

                                      *    *    *

    కనులెత్తి రమవైపు చూసిన శ్రీనివాసరావు చాలిస్తే ఆ కాలం ఆమె కనిపించదన్నట్టు. ఆమె అలంకరణా అందంచూసి ముగ్దుడయిపోయేడు.
    మౌనంగా వాలుచూపులు చూస్తూ నును సిగ్గులు ఒలకబోసింది రమాదేవి.
    ఆమెతో ఏవో మాట్లాడాలనుకున్నాడు. ఆమె గొంతు ఎలా ఉంటుందో వినాలనుకున్నాడు. ఆమెజీవితం ఎలా మలుచుకోవాలనుకుంటోందో. ఆమె అభిప్రాయంలోలేదో తన అభిప్రాయాలతో ఆమె ఏకీభవిస్తుందో లేదో అడగాలని. ఇంకా ఇంకా ఎన్నో గమ్యంలేని ఆలోచనలూ నిలకడ లేని మనస్సూ, ధైర్యంచాలక కర్తవ్య మూడుడై కాఫీ టిఫినూ కానిచ్చి తల్లి తండ్రుల వెనుక ఇంటికొచ్చేశాడు.
    "పిల్ల బంగారుబొమ్మ కదండీ" కాబోయే కోడలి అందాన్ని చూసి మురిసిపోతూ అంది జానికమ్మ భర్తవైపు.
    "పట్టి బంగారుబొమ్మకాదు. నీలా మోదుగ పువ్వునుకున్నావేమిటి? బి.ఎ. ప్యాసై టెలిఫోన్ ఆపరేటరుగా పనిచేస్తూంది. ఆ అమ్మాయికి మంచి భవిష్యత్తుంది. అబ్బాయ్. శ్రీనూ.....ఖాయపరిచేస్తాను" ఉత్సాహంగా సంతోషంగా అన్నారు రంగనాధం.
    "ఆ అమ్మాయితో నేనొకసారి మాట్లాడాలి నాన్నా!" శ్రీనివాసరావు గొంతు దృఢంగా ధ్వనించింది.
    తేలిగ్గా నవ్వేశారు రంగనాధం "నీ మొహం ఏం మాట్లాడతావు? చదువూ ఉద్యోగం విన్నావు. అమ్మాయిని చూశావు. మిగతా విషయాలు, తల్లీ తండ్రీ లేరుబామ్మ పెంచింది...."
    "అది సరే .. నాకు ఆ అమ్మాయితో ఓ సారి.... అంటే ఆ అమ్మాయి అభిప్రాయాలు తెల్సుకోవాలనుంది."
    "ఏమిట్రా! అభిప్రాయం. నా అభ్యంతరం లేదు. ఇష్టమే అని వాళ్ళ బామ్మతో చెప్పిందిట. అంతకన్నా సంసారింటి ఆడపిల్ల ఏం చెబుతుంది!.... సినిమా! నాటకం రిహార్సుల్లా బాగుంది."
    "ఛ.....పాతకాలపు మనుషులు మీరు. బి.ఏ. ప్యాసై ఆరునెలలై ఉద్యోగం చేస్తూన్న అమ్మాయి. ఆ అమ్మయికో వ్యక్తిత్వం, అభిప్రాయం ఉంటుంది నాన్నా! దైవం వక్రించి మా ఇద్దరి వ్యక్తిత్వాలూ, అభిరుచులూ, భిన్న మయితే దక్షిణ ఉత్తరధృవాల్లా."
    "నీ మొహం, ప్రతివాడికీ సినిమాలూ, పుస్తకాలూ కావుగాని. వాగుడూ, అర్ధంలేని ఆలోచనలూ లావయ్యాయి. ఇద్దరూ చదువుకున్నారు. ఒకరినొకరు అర్ధంచేసుకు కాలక్షేపం చెయ్య లేరూ?"
    "కాలక్షేపంకోసమా నాన్నా పెళ్ళీ?" నవ్వాడు శ్రీనివాసరావు.
    "అబ్బబ్బ.....నీకు చెప్పలేనురా శ్రీనూ.....నన్ను వేధించి చంపుతున్నావ్! మీ అమ్మాయి మావాడికి నచ్చలేదు. అని కబురుచేసేస్తాన్లే!" లేచి నిల్చున్నాడు రంగనాధం.
    "నచ్చలేదని ఎవరన్నారు నాన్నా!" చిరాకు అణచుకుంటూ అన్నాడు శ్రీనివాసరావు.
    "అహ నచ్చిందికదా! మరి మాట్లాడకు" అంటూ వెళ్ళబోతూన్న రంగనాధం. "ఆ అమ్మాయి ఉద్యోగం చెయ్యడం నాకు యిష్టం లేదు" అన్న కొడుకు మాటకు వెనుదిరిగి చిన్నగా నవ్వుతూ "మూడు ముళ్ళూ పడ్డాక నువు వద్దంటే మానెయ్యదూ! ఆ శాస్త్రులు గారిని కలుసుకుని వాళ్ళ కీ భోగట్టా చెప్పివస్తాను. ఏమేవ్ తలుపేసుకో..." అంటూ వెళ్ళిపోయారు  రంగనాధం.
    బోనులో పులిలాగ గబగబా పచార్లు చేశాడు శ్రీనివాసరావు. పెళ్ళి అయ్యాక ఆ అమ్మాయి ఉద్యోగం మానకపోతే? తన మాట నిర్లక్ష్యం చేస్తే! తనని చిన్నచూపు చూస్తే! ఉహూ....జుట్టు పీక్కున్నాడు కణతలు రుద్దుకున్నాడు.....తల్లితో ఆ అమ్మాయితో మాట్లాడే అవకాశం కల్పించమని అడగాలనుకుని. 'ప్చ్' లాభం లేదని ఆ ప్రయత్నం విరమించిన వాడిలా, నిరాశగా, నిస్పృహగా మంచంమీద బోర్లా పడుకున్నాడు.
    "మరి ముహూర్తాలు లేవు. ఈ ముహూర్తమే బేషుగ్గా ఉంది" అన్నాడు ఆ మరునాటి ఉదయమే పొడుం పీలుస్తూ ప్రత్యక్షమయ్యాడు శాస్త్రులు.
    "శుభం! తథాస్తు! కావివ్వండి. మీ చేతుల మీదుగానే" అంటూ శాస్త్రులుగార్ని గదిలోకి తీసుకెళ్ళి ఏమేమో గుసగుసలాడారు రంగనాథం.

                                      *    *    *

    అనుకున్న ముహూర్తానికి ఘనంగా పెళ్ళి జరిగిపోయింది రమ తరపున ఆమె బామ్మ. మగా ఆడా స్నేహితులూ ఎవరో దూరపు బంధువులు నలుగురైదుగురూ హాజరయ్యారు.
    పెళ్ళికిముందు కట్నం తీసుకోకండి నాన్నా! అని శ్రీనివాసరావు చెప్తూన్నప్ప్డుడు వట్టి అమాయకుణ్ణి చూసినట్టు జాలిగా చూశారు రంగనాధం కొడుకు వైపు.
    మరొకసారి హెచ్చరించాడు కట్నం రూపంలో ఏమిచ్చినా తీసుకోవద్దని.
    "ఇన్నిసార్లు చెప్పాలేవిట్రా అబ్బాయ్." అంటూ తేలిగ్గా నవ్వేశారు రంగనాధం.
    గృహప్రవేశం రోజున ఊరిప్రజలంతా విరగబడి చూశారు రమని రంగనాధంగారి కోడలొచ్చిందని ఆమె అందాన్ని మెచ్చుకుంటూ అలంకరణమని విమర్శించి నవ్వుకున్నారు.

                 


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS