"అవసరంలేదు!"
అతన్ని ఎన్నో అడగాలనిపించింది....కాని ఒక్కటీ అడగలేదు. అడగలేకపోయాడు!
టకటక మ్రోత చేసుకుంటూ గుర్రపు బండి ముందుకు కదిలింది. తనని ఏదో భయంకర ప్రదేశానికి మేళతాళాలతో, తీసుకువెళుతున్నట్లుగా వున్నది ఆ గుర్రపు బండి మ్రోత... క్షణక్షణానికి మనిషిని భయం ఆవరించగా ఉరికంబానికి దగ్గిర పడుతున్నట్లుగా ఫీలవ్వసాగాడు.... వళ్ళంతా చెమటలు పట్టసాగింది.
అరుంధతీ నాకెలాంటి పరీక్ష పెట్టావ్?
కొద్దిక్షణాలలో -నీవు నన్ను అనుమాన మనే చట్రంలో బిగించి గిరగిరా త్రిప్పి పాతాళంలోకి విసిరివేయవు గదా అరుంధతీ?
నేను నీకేం హాని చేశాను?
నేనేం పాపం చేసుకున్నాను?
-శరీరమంతా ఆవిర్లలో తేలిపోతుంది. ఒక్కసారి ఆ పోతున్న గుర్రపుబండి లోపల నుండి బయటపడి, ఏ దూరతీరాలకో-అరుంధతిని జీవితంలో మరి చూడకుండా పారిపోవాలని పిస్తోంది-
ఆ ఆవేశాన్ని ఆపుకోలేక పోయాడు.
అవును అరుంధతిని చూడదు-చూడలేడు-ఆమె చేతిలో పరాభవం పొందలేడు
"ఏయ్ బండి ఆపు" పెద్దగా అరుద్దామన్నంత ఉద్రేకంతో ముందుకు వంగబోయాడు.
అప్పటికే ఆ గుర్రపుబండి రెండతస్థుల మేడ ముందు ఆగి వున్నది బండతను దిగి వెనక్కు వచ్చి నిలబడ్డాడు.
ఇక చేసేదే వున్నది? - చిన్నగా ముందుకు వంగి, ఎదురు హ్యాండిల్ పట్టుకొని, చెక్కమెట్టు మీద కాలుపెట్టి క్రిందకు దిగాడు.
ఆ ఇంటి ముందు ఎడంప్రక్కగా పాదు చేసుకున్న బఠాణీ చెట్టు పై భాగాన్నంతా కప్పి వేసింది. ఒక ప్రక్కగా విచ్చీ విచ్చని రెండు మొగ్గలతో వున్న గులాబీ చెట్టు అంత పెద్ద ఖాళీ స్థలంలో ఒంటరి తనాన్ని ఫీలవుతున్నట్లుగా విచారంతో తలవంచుకొని వున్నది.
చిన్నగా ఎడంకాలు టకటకా మ్రోత చేయసాగింది.
బండిలో కూర్చొని వుండగా ఆవరించిన ఆవేశమంతా వీడిపోయి నట్లనిపించింది. ప్రశాంతంగా -ఏదో తెలియని- ఎవ్వరూ లేని-లోకంలోకి వెళ్ళిపోతున్నట్లుగా లోపలకు అడుగులు వేయసాగాడు.
అరుంధతీ ఎక్కడున్నావ్?
ముందు గదిలోకి వెళ్ళాడు.
"అరుంధతీ!" తెలియని మృదుత్వం కంఠం నుండి జారింది. "అరూ!.."
అరుంధతిని చూచి ఎన్నాళ్ళయింది?
ఇంకా రెండడుగులు ముందుకు వేశాడో లేదో, ఎదురుగా వున్న కర్టెన్ తొలగించు కొని-
-తొలగించుకొని.....
అతడి కళ్ళు తిరగసాగినయ్..
ఆమె అరుంధతి.
...అరుంధతే! ఆమె?
..అరూ..పెద్దగా, పిచ్చిగా కేకవేశాడు
ఆమె ముఖాన బొట్టు ఏమైంది? ఆమె చేతి గాజులు ఎందుకు తీసివేశారు.
"భగవాన్"
* * *
"కూర్చో బావా"
దూరంగా, తలుపు ప్రక్కగా పీటవేసింది.
తలవంచుక కూర్చున్నాడు. ప్రపంచం సర్వనాశనమైపోతే, తను ఒంటరిగా మిగిలి పోయినప్పుడు-ఏం చేయాలో తోచక గిల గిలలాడే వ్యక్తిలా-కూర్చున్నాడు రాజ శేఖరం అరుంధతికి ఎదురుగా.
అరుంధతి తలవంచుకొని కూర తరుగుతుంది.
"అరూ....ఏమిటిది?... ఎందుకిలా జరిగింది?.. అసలు ఎలా సంభవించింది అరుంధతీ?" కంటి వెంట నీరు పొర్లుకొచ్చేలా వున్నది.
"బావా ఎంత చేస్తే అంతే మనకు దక్కుట!... దానికి ఈనాడు బాధపడటం దేనికి?.. నా జీవితం అనుకోని మలుపు తిరిగిన మాట వాస్తవమే గాని.. అది సరైన మలుపేనని మాత్రం నాకనిపిస్తోంది. చేసిన పాపం ఊరికే ఎన్నడూ పోదు బావా."
అరుంధతి ఆ మాటలు ఏ ఉద్దేశ్యంతో అన్నదో గ్రహించలేనంత తెలివితక్కువ వాడు గాదు రాజశేఖరం!
తనని ఒకనాడు తిరస్కరించింది-దాని ఫలితం ఇది అంటోంది!
కాని-ఆమె తనని తిరస్కరించినంత మాత్రాన ఆమెకు ఇలా జరగాలని తను కలలో కూడా అనుకోలేదు-తనకి అరుంధతి మీద కోపం కలిగిన మాట వాస్తవమే....ఆ కోపంలో ద్వేషించిన మాటా వాస్తవమే. కాని......కాని.....కాని...
ఇది మాత్రం తను భరించలేని నగ్న సత్యం!
"లేదు.....అరుంధతీ... లేదు!. నీవు ఇది భరించవలసినంత తప్పు చేశావా?"
"లేదంటావా?" తలెత్తి సూటిగా రాజశేఖరం కళ్ళల్లోకి చూడసాగింది.
ఆమె చూపులో చూపు కలపలేక పోయాడు రాజశేఖరం. ఆమె కుంకుమ లేని మొఖాన్ని చూడలేకపోయాడు. విచలితుడయి తలదించుకున్నాడు.
అప్పటివరకు గూడు కట్టుకొని వున్న నీరు కనురెప్పల క్రింద నుండి జారి ఒళ్ళో పడింది.
అరుంధతి పేలవంగా నవ్వింది. "పిచ్చి బావా! ఎమ్మే చదివిన నీవు ఈ ప్రపంచంలో ఇలా వుండిపోయావంటే.. నీ అమాయకత్వమే కారణం బావా!"
అర్ధంకాలేదు రాజశేఖరానికి!
"స్నానం చేద్దువుగానిలే.. భోజనం చేసిన తరువాత తీరిగ్గా కూర్చొని ఈ అరుంధతిని గురించి ఆలోచిద్ధువు గాని!" అన్నది తిరిగి నవ్వటానికి ప్రయత్నిస్తూ.
"జబ్బు ఏమిటో చెప్పనే లేదు.....!" అన్నాడు రాజశేఖరం. ఇంకా అతడు ఆ షాక్ నుండి కోలుకోనేలేదు.
"బావా!... మనిషి చచ్చిపోవటానికి జబ్బే కారణమైతే ఏ జబ్బైనా ఒకటే....ఇప్పుడవన్నీ ఎందుకు..లేలే! సూర్యుడు అప్పుడే నడినెత్తికొస్తున్నాడు!" అన్నది కత్తిపీట పక్కన పడేసి.
లేచి, రాజశేఖరం ముందుగా నడిచి బయటకు వస్తూ, "గోపన్నా!" అని పిలిచింది.
రాజశేఖరాన్ని తీసుకువచ్చిన బండి అతడు వచ్చాడు.
"మధ్యాహ్నం భోజనానికి ఇక్కడికి రా. నీకూ వండుతున్నాను!"
"సరేనమ్మా!.."
తిరిగి వెనుదిరిగి వస్తూ, "ఒక్కొక్కసారి అనిపిస్తుంటూంది. దేవుడున్నాడో లేడో నాకయితే తెలియదుగాని... మనం గడిపే ఈ జీవితం మాత్రం మన చెప్పు చేతుల్లో లేదూ అని!" అన్నది మొఖాన్ని పక్కకు తిప్పుకుంటూ.
"అరుంధతీ!" ఆవేశంగా తలెత్తాడు రాజశేఖరం.
"లేదు బావా!. ఇప్పుడవన్నీ ఎందుకులే, లే!...పద.. స్నానం చేద్దువుగాని..!" అన్నది చీరె చెంగుతో కళ్ళొత్తుకుంటూ.
ఆమె అతడి కర్రకాలు వంక ఒక్క క్షణం నిర్జీవంగా చూచి ముందుకు అడుగులు వేసింది.
"గోపన్నా! అయ్యగారికి నీళ్ళు తోడి వెళ్ళు!"
చిక్కుకున్న ఆవేదనా వలయం నుండి బయట పడుతున్నట్లుగా చిన్నగా తలుపు ఆసరాతో నిలబడి మధ్యగదిలోకి వచ్చాడు.
స్నానంచేసి ఉతికిన గుడ్డలు కట్టుకొని తిరిగి అరుంధతి ఎదురుగా పీట మీద కొచ్చి కూర్చున్నాడు.
తరువాత అరగంటకు అన్నం వడ్డిస్తూ రాజశేఖరం వైపు చూడకుండానే, "నాకీ జీవితంలో మిగిలినవి మూడే బావా!" అన్నది కంఠం జీరబోయింది.
నోట్లో పెట్టుకోబోతున్న ముద్దను అలాగే చేతిలోనే వుంచుకొని, కళ్ళు పెద్దవి చేసుకొని ఆశ్చర్యంతో, "ఏవిటవి?" అన్నాడు.
"నీవు, అరుణ, ఈ యిళ్ళు-కాదంటే కాస్తో కూస్తో డబ్బు!" ఆమె కంటి వెంట నీరు బోట బోట కారసాగింది. అందుకే ఆమె తన మొఖాన్ని రాజశేఖరం తలవంచుకునేటంతవరకు ముందుకు తిప్పలేదు.
బాధతో చేతిలో ముద్ద కంచంలో పడేస్తూ చేత్తో కెలకసాగాడు.
రెండు సంవత్సరాల క్రితం అరుంధతి కంఠానికి, ఈ కంఠానికీ పోలికే లేదనిపించింది.
"అరూ...!" బాధతో మూలిగేడు.
అరుణ ఎవరు అని అడుగుతాడేమోనని-తలెత్తి రాజశేఖరం మొఖంలోకి చూడసాగింది.
బాధను భరించలేనట్లుగానే కంటిలోని నీటినీ ఆపుకోలేకపోతున్నాడు రాజశేఖరం.
అరుంధతి కళ్ళు రెపరెపలాడించి, "కానియ్ బావా! భోజనం చేశేయ్!" అన్నది.
ఒక్కక్షణం అరుంధతి మొఖంలోకి తలెత్తి చూచి గబగబా అన్నం కలుపుకు తినసాగాడు.
* * *
సరిగ్గా పన్నెండు గంటలయింది.
గోడనున్న గడియారం కొట్టిన పన్నెండు గంటలను, తనకుంటి ఎడంకాలు మీద బెల్ట్ తీసేసిన మేర చేత్తో రుద్దుకుంటూ లెక్కవేశాడు.
"నిజంగా అరుంధతి జీవితం- వెన్నెల వెలుగుతో గడిచిపోవాల్సిన ఆమె జీవితం- ఎలా అయిపోయింది?"
-తన జీవితం మాత్రం?
తలుపు మీద ఎవరో కొడుతున్నారు.
లేవబోయాడు. క్రింద వున్న చేతికర్రను తీసుకునేటందుకుగాను వంగి చేత్తో తడమసాగాడు.
అప్పటికే అరుంధతి వచ్చింది. "నీవు పడుకో బావా!.. నేను తీస్తాను.. అరుణ వచ్చింది.!
ఇందాక అరుంధతి మాటల్లో అరుణ పేరు ఓసారి విని వున్నాడు. అందుకనే ఆత్రంగా తెలియని ఉత్సుకతతో, తీసిన తలుపు వంక చూడసాగాడు.
అరుణ లోపల కాలు పెట్టింది.
చామనచాయ రంగులో వున్న ఆమె మొఖం ఎండకు కంది వింతగా మెరుస్తోంది. చేతిలోని పుస్తకాలు పట్టు తప్పు తున్నట్లు బరువుగాజారుతున్నాయి. అసలే కందిన మొఖం పరపురుషుడిని చూడటంతో మరింత ఎర్రబడింది.
"నా అరుణ!" అంది అరుంధతి రాజశేఖరం వంక చూస్తూ. ఎందుకో ఆమె అలా అంటున్నప్పుడు కంఠంలో గర్వం తొణికిసలాడింది.
అరుణ కళ్ళు సగం ఎత్తి, సిగ్గుతో తలవాలుస్తూ "నమస్కారం!" అన్నది.
"నమస్కారమమ్మా!"
అరుణ పక్కగదిలోకి వెళ్ళిపోయింది.
దారి తప్పినట్లు అరుంధతి ఆ గది లోనే ఇంకా తచ్చట్లాడసాగింది.
"ఎవరీ అమ్మాయి?" రాజశేఖరం కంఠంలో ఉద్విగ్నత ఉబికింది.
"ఓ గులాబీ!" సూటిగా రాజశేఖరం మొఖంలోకి చూస్తూ అన్నది.
"పెంచుకుంటున్నావా?"
అరుంధతి కనబడింది. మొఖంలో కలవరమూ పొడసూపింది. నిగ్రహించ కుంటూ, "అవును.. అవును.." అన్నది త్వరత్వరగా.
"ఏం చేద్దామనుకుంటున్నావ్?" అసంగతమైన ప్రశ్నే అనిపించినా, ఒక్కక్షణం తటపటాయించి అడిగేశాడు.
"నా దేవుడికి సమర్పిద్దామనుకుంటున్నాను" తూలుతున్నట్లుగా అడుగులు పక్కగదిలోకి వడివడిగా వేయసాగింది.
పక్కగదిలో గాజుల చప్పుడయింది.
"ఏ డేవుడు?" ఆమె నడుస్తున్నంత వడిగానే అడిగేశాడు-కాని, అప్పటికే ఆమె వెళ్ళిపోయింది.
అయితే, ఆమె మాటలు మాత్రం వినపడ్డాయి.
"కాళ్ళూ చేతులూ కడుక్కొని రా అరుణా అన్నం పెడతాను"
* * *
"నీవు కాదనటానికి వీల్లేదు బావా ఈ ప్రపంచంలో నన్ను అర్ధం చేసుకున్న వారెవ్వరూ లేరు. నీ మటుకు నీవు అర్ధం చేసుకున్నావో లేదోగాని నాకు మాత్రం నమ్మకమున్నది నీవు నన్ను అర్ధం చేసుకో గలవని. ఇక ఏ ఆచ్చాదనా లేకుండా దూరంగా నిన్ను వుండనీయలేను బావా నేను..."
"నీ మాట ఎలా కాదనాలో నాకు అర్ధం కావటం లేదు అరుంధతీ..కాని నా మీదఆశలు పెట్టుకున్న కొంతమంది విద్యార్ధులను నిరుత్సాహపరచాలంటే బాధగా వున్నది.. వాళ్ళకు నాలుగయిదు రోజుల్లో వస్తానని వాగ్ధానం చేసి వచ్చాను." అన్నాడు తల రుద్దుకుంటూ రాజశేఖరం.
అరుణ లోపల గదిలో కిటికీ ప్రక్కగా పేము కుర్చీలో కూర్చొని రాజశేఖరం మాట లను ఆసక్తిగా వింటున్నది.
"ఈ రోజే ఉత్తరం వ్రాసేయ్ బావా!...రాలేకపోవటానికి విచారం వ్యక్తపరుస్తూ-వాళ్ళకు నిరాశ కలిగిస్తున్నందుకు క్షమాపణలతో!"
"అరుంధతీ! పరీక్షల ముందు వాళ్ళను దగా చేస్తే ఎంతగా నొచ్చుకుంటారో వూహించుకో అరూ!"
అరుంధతి నిట్టూర్పు విడిచింది. తల పక్కకు తిప్పుకుంటూ, ఒక్కసారి పెదిమను పంటి కొసతో కొరుక్కొని, "సరే బావా ఇక చేయగలిగిందేవున్నది.... నేనూ అరుణా గూడా వస్తాం!.. ఈ రాత్రికే వెళ్దాం పద!.. వాళ్ళ పరీక్షలయిపోగానే తిరిగి వచేద్దాం!" అన్నది.
