Previous Page Next Page 
స్త్రీ పేజి 28

 

    వారం రోజులలోపునే డా. పద్మజ , డా. జార్జి విలియమ్స్ ల పెళ్ళి ఫోటోలు పత్రికలలో అచ్చయ్యాయి. సంఘ సంస్కరణాభిలషులు కొందరా వివాహాన్ని పురస్కరించుకుని వ్యాసాలు వ్రాశారు. మరికొందరు ప్రముఖులు ఆ ఆదర్శ  దంపతులని సన్మానించటానికి సంసిద్దులయ్యారు.
    లోకం ఎప్పుడూ బహు ముఖాలుగానే ప్రవర్తిస్తుంది. పద్మజా విలియమ్స్ ల వివాహాన్ని గురించి పరిచితులూ అపరిచితులూ కూడా తమకు తోచిన విధంగా విమర్శించుకుంటూ నవ్వుకున్నారు. నోటితో మెచ్చుకుని నొసలు తో వెక్కిరించే వ్యక్తులకూ, వ్యంగ్యంగా విమర్శించే లోకానికి 'హనీ మూన్' నెపంతో సుదూరంగా వెళ్ళిపోయారా నూతన దంపతులు.

                             *    *    *    *
    "ఎంతైనా పద్మజ స్వార్ధంగా ప్రవర్తించింది' అనుకున్న పార్వతి ఒకటి రెండు రోజుల్లో తన అభిప్రాయం చాలా వరకు మార్చుకుంది. పద్మను తను అపార్ధం చేసుకుంటుందేమో? పసితనం నుంచీ పద్మజ తనకు తెలిసివున్నా ఆ సాహసం ఎలా అర్ధమౌతుంది తనకు?
    ఆఫీసు నుంచి వచ్చి తాళం తీసుకుని గదిలో అడుగు పెట్టేసరికి కళ్ళ పడిందో కవరు. స్నేహితురాలి ధ్యాస లోనే ఉన్న పార్వతి అది పద్మజ వ్రాసిందే కావచ్చునని ఆత్రుతగా వంగి తీసుకుంది.
    "పార్వతి అక్కయ్యా!
    "నీకు ఉత్తరం వ్రాయాలని వారం రోజుల నుంచీ ప్రయత్నం! నేను వ్రాయబోయే విషేషమేమిటో అందరి లాగా నీకూ తెలిసే ఉంటుంది. అక్కయ్య ఇంత కర్కశంగా అనురాగాలు తెంచుకు వెళ్ళి పోయిందంటే ఎంత ఆశ్చర్యంగా ఉందొ అంత సహజంగానూ ఉంది.
    "డాక్టర్ పద్మజా దేవీ , డాక్టర్ జార్జి విలియమ్స్ ల పెళ్ళి ఫోటో పడ్డ పేపరు ఇక్కడికి, ఇంట్లోకి వచ్చినప్పుడు పరిస్థితి ఎంత అల్లకల్లోలమై పోయిందో నేను వ్రాయకుండానే నువ్వు ఊహించుకాగలవు.
    "ఈ సంగతి అమ్మ మొదట నమ్మలేదు. అమ్మే కాదు, అక్కయ్య ఇంత పని చేసిందంటే ఇప్పటికీ నేను నమ్మలేక పోతున్నాను. ఈ యింటి ఆచార వ్యవహారాలలో ఏ చిన్న సంఘటన గుర్తు పెట్టుకున్నా అక్కయ్య ఇంత సాహసం చెయ్యగలిగేది కాదు.
    "ఆనాటి నుంచీ ఇంట్లో ఎవ్వరికీ నిద్రాహారాలు లేదంటే అతిశయోక్తి కాదు, పార్వతీ, అన్నయ్య కోర్టుకు వెళ్ళటం లేదు. నాన్నగారు పక్క విడిచి లేవటం లేదు. అయన బ్లడ్ ప్రెషర్ అధికమయింది. అమ్మ మాట సరే! ఆ మూల గది విడిచి రావటం లేదు. వదినా, నేనూ మాత్రం వంట గదిలో కూర్చుని బిక్కుబిక్కుమంటూ రోజులు దొర్లిస్తున్నాము.
    "నీ పరిస్థితినీ మనస్సుకు పట్టించుకోకుండా కష్టానికీ, సుఖానికీ ఒక్కలాగే చిరునవ్వు నవ్వగలిగే నాన్నగారు ఎంత మారిపోయారో, అయన గంభీర్యమంతా ఏమైపోయిందో నువ్వు చూస్తె గాని నమ్మవు. ఈ అప్రతిష్ట తో ఇక అయన లోకం మొహం చూడరనుకుంటే విశేషం కాదు.
    "అమ్మ గురించి వ్రాయాలంటే ఏం వ్రాయగలను? కంటికీ మంటికీ ఏకధారగా ఏడుస్తుందనే వ్రాయనా? తనలో తను కుళ్ళీ కృశించి పోతుందనే వ్రాయనా? ఈ వారం రోజులకే పోలిక దొరకనంత చిక్కి శల్య మైందని వ్రాయనా? ఏమీ వ్రాసినా ప్రయోజనం ఒక్కటే! రాత్రింబవళ్ళు అమ్మ నోటి మీదుగా వచ్చేది ఒక్కటే మాట. "ఆ పాపిష్టి దానికి అకస్మాత్తుగా ఏదో రోగం వచ్చి చచ్చిందని తెలిస్తే ఒక్క ఏడుపు ఏడిచి ఊరుకునేదాన్ని. లోకంలో అందరికీ వచ్చే కష్టం నాకూ వచ్చిందని సరిపెట్టుకునేదాన్ని. కావలసినవాళ్ళంతా దగ్గర చేరి ఓదార్చుతుంటే కొండత ధైర్యం తెచ్చుకునేదాన్ని. ఇదేం ప్రారబ్ధం రా భగవంతుడా! ఆ ఏడుపుకి కూడా దూరం చేసింది నన్ను. ఇంటా వంటా లేని ఆ ప్రాచ్యపు పని చేసింది. అగ్ని హోత్రంలా వెలిగే కుటుంబానికి మాయని మచ్చ తెచ్చింది. నీతినియమాలతో బ్రతుకుతున్న వాళ్ళను అప్రదిష్టల పాలు చేసింది. చివరికి ఒక్కసారి తండ్రి మొహం, కన్న తండ్రి మొహమైనా గుర్తు తెచ్చుకోలేక పోయింది.' అంటూ తనలో తను ఏడ్చుకుంటూ పడి వుండే అమ్మను చూస్తుంటే అమ్మ పిచ్చిదై పోతుందేమో ననిపిస్తుంది ప్రతి క్షణం.
    "పద్మజా ఇలా చేసిందని తెలిసింది . నిజమేనా? ఈ ముక్క మీకు ముందే తెలీకుండా ఉంటుందా? ఆడపిల్లల్ని బొత్తిగా అలా వదిలేస్తే మన బ్రాహ్మణ్యం మంట కలవక ఏమౌతుంది? ' అంటూ దూరపు బంధువు' ఒకాయన మహా కోపంగా వ్రాసిన ఉత్తరం మొన్ననే అందింది. నాన్నగారు చదువు కున్నారు గానీ అమ్మకు చూపించలేదు.
    "నిన్న వొక తెలిసినావిడ పని గట్టుకు వచ్చింది. అమ్మను ఒదార్చడానికి. "అయ్యో! ఇంత పని జరిగిందా? అయిందేదో అయిందిలే. నువ్వేం బాధపడకు, వదినా! పాడు ప్రపంచంలో ఎన్ని వింతలు జరగటం లేదు గనకా? ఇదీ అందులో ఒకటి. మరేం చేస్తాం?' అంటూ ఓ గంట సేపు కూర్చుని అమ్మను మరీ ఏడిపించి వెళ్ళింది. మమ్మల్నందర్నీ ఇంత అప్రదిష్టకూ, ఇన్ని అవమానాలకూ , ఇందరి సానుభూతికి గురి చేసిన అక్కయ్యను ఏం చేస్తే పాపం ఉంది? ఈ స్థితిలో అక్కయ్యను కలుసు కోగలిగితే ఎన్ని మాటలైనా అడుగుతాను. చదువు చడువి డాక్టర్ కాగానే సర్వ స్వతంత్రురాలినై పోయా ననుకుందా? ఆ చదువు ఎవరు చెప్పించారో , అంత స్వతంత్ర్యం ఎవరు ప్రసాదించారో , తన ఔన్నత్యాని కసలేవరు కారణ మయ్యారో ఒక్కసారైనా ఆలోచించిందా? రెక్కలు మొలిచి మొలవగానే ఎగిరెగిరి పడే పక్షి  పిల్లలా మంచి చెడ్డలు విస్మరించి ఇంత అవివేకంగా ప్రవర్తించటం తగుననుకొందా?
    "అక్కయ్య ను ఇంతగా విమర్శించి అసహ్యుంచుకునే రోజు వస్తుందని ఏనాడైనా అనుకున్నానా నేను? ఊహ తెలిసిన క్షణం నుంచీ అక్కయ్య నెంతగా ఆరాధించానో , అక్కయ్య ఔన్నత్యం చూస్తూ ఎంత గర్వించానో , డాక్టరై పేరు తెచ్చుకుంటున్న అక్కయ్య ను తలుచుకుని ఎంత మురిసి పోయానో ఎలా చెప్పను? అక్కయ్య లా పెద్ద చదువు చదివి, పేరు తెచ్చుకుని, అక్కయ్య అడుగు జాడలలోనే నడుస్తూ జీవితాన్ని తరింప చేసుకోవాలని ఆశా సౌధాలు నిర్మించుకున్న నేను ఈనాడీ విఘాతానికి తట్టుకునే శక్తి లేక, గడిచిన రోజులు తలుచుకునే ధైర్యం లేక , నా ఆశలు నెమరు వేసుకునేందుకైనా సాహసం చాలక పిచ్చి దాన్నై పోతున్నానంటే నమ్ముతావా, పారూ?
    "మొన్న కొకరోజు ఏం జరిగిందో వ్రాస్తాను. ఒక టెక్ట్స్ బుక్ కొనాలని అన్నయ్య దగ్గరి కెళ్ళి డబ్బు లడిగాను.
    "వింత వ్యక్తిని చూస్తున్నట్టు అన్నయ్య నన్ను చిత్రంగా చూస్తుంటే అర్ధం గాక తికమక పడుతూ నించున్నాను. ఎందుకో అపరాధిలా తల దించుకున్నాను.
    'ఇంకా కాలేజీ కి వెళ్ళాలనేనా, సుజా?" అన్నయ్య అంత నెమ్మది లోనూ ఎంతో కర్కశంగా అడిగాడు. మొట్టమొదట అర్ధం గాక అర్ధం కానట్టే చూశాను.
    'ఇక ఏ పుస్తకాలూ కొనక్కర్లేదు. కాలేజీ కి వెళ్ళనూ అక్కర్లేదు. ఇప్పటికి జరిగిన పరాభవం చాలు. లోపలికి వెళ్ళు."
    "అన్నయ్యా!"
    "వెళ్ళు, సుజా! ఇక మాట్లాడకు. లోకం మరోసారి నవ్వి పోకముందే మన జాగ్రత్తలో మనం ఉండటం మంచిది.'
    పార్వతీ! ఆ క్షణం లో నేనొక ఇసక రేణువు నై గాలిలో కలిసి పోనందుకు ఎంత సిగ్గిలిపోయానో ఊహించగలవా? నేను కూడా అక్కయ్య లాగే చేస్తానని కదూ అన్నయ్య భయం? ఒకసారి నవ్వగలిగిన లోకానికి మరోసారి నవ్వే అవకాశం ఇవ్వకూడదనే కదూ అన్నయ్య ఆరాటం? కాని....కాని, నన్ను అర్ధం చేసుకోటానికైనా అన్నయ్య ప్రయత్నించలేదా? నేను బాధపడతనానైనా ఆలోచించలేదా? స్వార్ధ పరురాలైన అక్కయ్య తోనే నన్నూ పోల్చి చూశాడా? నా ఆశలూ, ఆశయాలూ , ఊహలు , వాస్తవాలు వేటినీ అన్నయ్య ఆమోదించలేడా? అక్కయ్య చేసిన పనికి, అందరి కన్నా మిన్నగా నే నెంత బాధపడుతున్నానో అన్నయ్య కేలా చెప్పను? నన్ను చూసి ఎప్పుడూ లోకాన్ని నవ్వనీయనని ఎలా నమ్మించను? నేను....నేను సుజాను! పద్మను కాను. తల్లుదండ్రుల బిడ్డనే గాని ఆ పవిత్ర హృదయాలను చీల్చి చెండాడే కఠినాత్మురాల్ని కాను.
    "అన్నయ్యా! నన్ను అర్ధం చేసుకోవూ?' అని ఏడావాలనిపించినా ఏమీ చెయ్యలేకపోయాను. ఒక్క కన్నీటి బొట్టు ద్వారానైనా నా ఆవేదన వెల్లడించలేకపోయాను. నోరు తెరిచి జవాబే చెప్పలేక తాల దించుకు నిలబడ్డాను.
    'ఇటు రా, సుజా!' అంటూ లేచిన అన్నయ్య వెనకే అయోమయంగా నడిచాను. అమ్మ పడుకుని ఉన్న గది గుమ్మం ఎదటి కెళ్ళి పిలిచాడు. 'అమ్మా! అర్ధం కాక నా గుండెలు కొట్టుకున్నాయి.
    "నీరసంగా కళ్ళు విప్పి చూస్తున్న అమ్మతో అన్నాడు: 'సుజా కొత్త పుస్తకం ఏదో కొంటా నంటోంది. పది పదిహేను రోజుల్లో కాలేజీ తెరుస్తారుగా?"
    'అన్నయ్యా!' కోపం ఆపుకోలేక అరిచాను. 'నువ్వు చెప్తే వినననే అమ్మతో ఫిర్యాదు చేస్తున్నావా? నన్నిక చదివించటం మీ కిష్టం లేదంటే రాద్దాంతం చేస్తాననుకున్నావా? మన పరువు మర్యాదల కన్నా నా కాలేజీ చదువు ఎక్కువేం కాదన్నయ్యా! నేను కాలేజీ మానుకోవటం తోనే మన పరువు నిలుస్తుందంటే సంతోషంగా మానేసుకుంటాను.' అన్నాను ఆవేశంగా. ఎన్నడూ నేనలా పెద్దవాళ్ళతో ధైర్యంగా మాట్లాడలేదు. నేనంటే ప్రాణాలు పెట్టె అమ్మ విషయం అర్ధం చేసుకుని దీనంగా చూసింది. వెక్కివెక్కి ఏడుస్తున్న నన్ను గుండెల్లో దాచుకుంది. 'పోనీ, దీన్ని చదువు కొనియ్యి, శాస్త్రీ! సుజా ఎప్పుడూ అలా చెయ్యదు.'
    'వద్దమ్మా , వద్దు. నేనిక చదువుకోను. నేను చదువు మానేస్తేనే అమ్మ సంతోషిస్తుంది అమ్మ సంతోషం కోసం ఏమైనా చేస్తాను.
    'అమ్మా, సుజా, ఏడుస్తున్నావా?"
    'లేదమ్మా, లేదు, లేదు.' దుఃఖాన్ని అరికట్టుకోవాలనే ప్రయత్నించాను.    
    నా బిడ్డవి నువ్వే, తల్లీ! నువ్వే! నేను కన్నవాళ్ళు ఇద్దరే! ఆ యిద్దరూ నా కళ్ళ కెదురుగానే ఉన్నారు.' వెర్రి పట్టినట్లు తదేకంగా అన్నయ్యనూ, నన్నూ మర్చి మార్చి చూడసాగింది అమ్మ.
    "బాగా చదువుకుని ఏదో అయి పోదామన్న ఆశ గాలిలో కలిసి పోతుంటే ఒక్క నిట్టుర్పు మాత్రం విడిచాను. హృదయం తేలికైంది. అమ్మకోసం, అమ్మ సంతోషం కోసం ఇంకా ఏమైనా చెయ్య గలిగితే ఎంత బావుండును! అక్కయ్య చేసిన అఘతాన్ని పూడ్చగలిగితే అమ్మా అంతా మరిచిపోయి నవ్వుతూ తిరగాడితే-- దానికి నేనేమైనా చెయ్యవలసి వస్తే తప్పకుండా చేస్తాను, పార్వతీ! చేసి చూపిస్తాను.
    "ఇలా అనుకుంటున్నప్పుడంతా నువ్వే నాకు గుర్తు వస్తున్నావు. ఇంత దుఃఖం లో కూడా అమ్మ నిన్ను మరిచిపోలేదు. నీతో స్నేహం చేసిన అక్కయ్య కు నీ భావం ఒక్కటీ అర్ధం గాక పోయిందేమో అని బాధ పడుతుంది. ఒక్కసారి నువ్వు వచ్చి- ఒడార్చితే అమ్మ కొంతైనా తేరుకుంటుంది. అమ్మను ఊరడించవలసిన ధర్మాన్ని అక్కయ్య లాగ నువ్వూ వదిలేసుకోవుగా?

                                                                                 నీ రాక కోసం నిరీక్షిస్తూ,
                                                                                          సుజా."
    తెలీకుండానే పార్వతి చెంపల మీదుగా కన్నీటి బొట్లు జారిపడ్డాయి. దీర్ఘంగా నిట్టూర్చింది. తనకు రుక్కుతో కూడా లేని అనుబంధమేదో ఈసుజాతో ఉందనిపిస్తుంది. అప్పుడప్పుడూ తోడబుట్టిన పద్మజకు దూర దూరంగానే ఉండే సుజా తన దగ్గర మాత్రం అటువంటి దూరభారాలు మరిచి మనస్సు విప్పి వెళ్ళబోసుకుంటుంది.
    సుజా చదువు ఆగిపోయిందంటే పార్వతి కెంతో బాధ కలిగింది. పద్మజ చాలా తప్పే చేసిందనిపించింది. సుజా వ్రాసిన ఉత్తరం పద్మజకు పంపితే ఏం చేస్తుంది? నిర్లక్ష్యంగా చించేస్తుందా? చదువుకున్నా నిరభిమానంగా నవ్వు కుంటుందా? పద్మజ అంత కర్కశంగా మారిపోయిందా? పార్వతి అంతరాత్మ ఆ ఆలోచనలతో ఏకీభవించలేదు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS