Previous Page Next Page 
స్వాతి జల్లు పేజి 28

 

                                    11

    సుందర్రావు కు మిత్రుడైన శెట్ , తిరిగి వచ్చాడు. సుందరరావుకు విదేశాల నుండి కొన్ని బహుమతులు కూడా తీసుకొచ్చి, తన ఇంటి నింతకాలం భద్రంగా కాపాడినందుకు, కృతజ్ఞతలు చెప్పుకొన్నాడు. పెద్దపార్టీ ఏర్పాటు చేసి, సుందర్రావు ప్రభ్రుతుల నందరినీ, ఆహ్వానించాడు. అందరిలో సుందర్రావు తన ఇంటినింత కాలం భద్రంగా రక్షించినందుకు మరొకసారి కృతజ్ఞతలు చెప్పుకొన్నాడు. సుందర్రావు వినయంగా, అందులో పెద్ద పొగడవలసింది లేదనీ, అది కేవలం స్నేహ ధర్మమని సమాధాన మిచ్చాడు.
    ఇదంతా జరిగిన వారం రోజులకు శెట్ , స్వయంగా సుందర్రావు ఇంటికి వచ్చాడు. సుందర్రావునతడిని సగౌరవంగా ఆహ్వానించి, తన డ్రాయింగ్ రూంలో కూర్చోబెట్టాడు.
    "సుందర్రావు గారూ! ఈ విషయంలో మీ బాధ్యత ఎంతవరకో నాకు తెలియదు. కాని, ఎంత స్నేహమైనా కొన్ని లక్షల నష్టాన్ని, నేను భరించలేను."
    సుందర్రావు తెల్లబోయాడు.
    "అసలు విషయ మేమిటండి?"
    "నేను నా పడక గదిలో , రహస్యంగా నేల బీరువా కట్టించి, అందులో జహ్వారీ అంతా దాచినట్లు మీకూ తెలుసు! అంత బంగారం దాచడానికి ప్రభుత్వం ఒప్పుకోదు గనుక బెంక్స్ లో ఉంచలేదు. దాన్ని భ్రడంగా కాపాడమనీ, ఆ విషయం రహస్యంగా ఉంచమనీ, మరీ మరీ చెప్పాను. ఇప్పుడా బీరువా ఖాళీగా ఉంది."
    సుందర్రావు ముఖం పాలిపోయింది.
    'అదేమిటీ? నేనసలా గది తలుపులు తెరువందే!"
    శెట్ తమాషాగా నవ్వాడు.
    "అదంతా నాకేం తెలుసు? ఆ గదిలో నేల బీరువా ఉన్నట్లు ఎవరికీ తెలియడానికి అవకాశం లేదు. నేనంత కట్టుదిట్టం చేసాను. తెలిసినవాళ్ళు తప్ప ఎవరూ తియ్యలేరు."
    కోపంతో అవమానంతో సుందర్రావు ముఖం  ఎర్రబడింది.
    "మీరనేది....."
    "నేను ఏమి అనటం లేదు. ఆ బీరువా లో సుమారు అయిదు లక్షల విలువ చేసే నగలున్నాయని కూడా మీకు చెప్పాను. మీరు భద్రంగా కాపాడుతానని మాటిచ్చారు. ఇప్పుడవి పోయాయి. అంత నష్టం నేను భరించలేను. కనీసం మూడు లక్షలయినా మీరిచ్చినట్లయితే, నేను మాట్లాడక ఊరు కుంటాను. నాకు రెండు లక్షల నష్టం! కానీ, ప్రభుత్వానికి నేను బంగారం దాచినట్లు తెలియదు! మీకు మూడు లక్షలు నష్టం! కానీ, మీ పరువు బజారు కేక్కదు!"
    మూడు లక్షలు! సుందర్రావు కు మతి పోయింది. ఎక్కణ్ణించి తేగలరు/ ఏదో, రెండు వేలూ, మూడు వేలూ, అయితే మనోరంజని కళ్ళు గప్పి తేగలడు కానీ, మూడు లక్షలోక్కసారిగా ఎలా వస్తాయి.?
    "నా దగ్గిర అంత డబ్బు లేదు!"
    "మీరు ఇయ్యక తప్పదు!"
    "ఈ బెదిరింపేమిటి? పుణ్యానికి పొతే, పాపమేదురైనట్లు, మీ ఇల్లు కాపాడినందుకు నా మీద నింద వేస్తారా?"
    శెట్ కొంత వికటంగా నవ్వాడు.
    "పుణ్య పాపల సంగతి నాకేం తెలియదు. సుందరరావు గారూ! కానీ, నేను లేనప్పుడు, మీరు నా ఇంటిని వాడుకున్నారని , అందులో ఎవరెవరో కొన్నాళ్ళ పాటు ఉన్నారనీ నాకు తెలియ వచ్చింది. అవసమయితే , ఇది కోర్టులో ఋజువు చేయగలను కూడా! అంతేకాదు , మొదట నా ఇల్లు మీ కప్పజెప్పేటప్పుడు మనతో ఉన్న మూడో వ్యక్తీ మా లాయరు. ఆరోజు మనం మాట్లాడుతున్న మాటలన్నీ ఒక్క  అక్షరం పొల్లు పోకుండా ఏ క్షణంలో కావాలంటే ఆ క్షణంలో టేప్ రికార్డర్ ద్వారా వినిపిస్తాడు. ఆలోచించుకోండి ! మూడు లక్షలను వదులుకొంటారో, లేక మీపరువు మర్యాదలను వదులుకొని జైలుకు వెడతారో?"
    "కోర్టుకు వెడితే, మీరు బంగారం దాచి పెట్టిన నేరానికి సమాధానం చెప్పుకోవద్దా?
    "వెర్రి సుందర్రావు గారూ! నాకీ నగలోక్కటే కాదు. కోట్లు ఖరీదు చేసే వ్యాపార ముందని మీకూ తెలుసు! సంఘంలోనూ ప్రభుత్వం లోనూ అంతులేని పలుకుబడి ఉంది. నేనా బంగారం ప్రభుత్వానికి అప్పగించాలనే ఉద్దేశం లోనే ఉన్నాననీ అత్యవసరంగా విదేశాలకు వెళ్ళవలసి రావటం వలన, వచ్చిన వెంటనే ఇచ్చేయాలను కొన్నానని తేలిగ్గా నమ్మించ గలను. ప్రభుత్వాని కిస్తే పేరు ప్రఖ్యాతు లయినా వస్తాయి. ఇలా వ్యర్ధంగా పారేసు కోవటం వల్ల లాభమేమిటి?"
    శెట్ వెళ్ళి పోయాడు. సుందర్రావుకు తల పగిలి పోతుంది. ఏం చెయ్యగలడు? వ్యాపార మంతా మనోరంజని పేరు మీద ఉంది. కేవలం దానిని నడిపే వాడు మాత్రమే తను! మనోరంజని స్వయంగా ఎప్పటికప్పుడు లెక్కలు చూసుకొంటూ ఉంటుంది. తను ఎలాగో రెండు వేలు మూడు వేలు సర్ధగలడు! అంతకంటే తన చేతులలో లేదు.!
    అయినా ఈ స్నేహలత కా బంగారం సంగతి ఎలా తెలిసింది? తను ఆమె కాగది తాళం చెవులియ్యలేదే? ఆగదిలో నేల బీరువా ఉన్నట్లు ఎవరికీ తెలిసే అవకాశం లేదే?
    అన్ని తాళాలు ఇచ్చి, అ ఒక్క గదిది ఇయ్యాక పోవటం వలన స్నేహలత ఏదో ఉపాయంతో ఆగది తెరిచి ఉంటుంది. ఆగదిలో ఏమీ కనుపించక పోయేసరికి, నేలను కూడా శోధించి , ఎలాగో బీరువా విషయం కనిపెట్టి ఉండవచ్చు. అన్ని తాళాలతో పాటు ఆ గది తాళం కూడా ఇచ్చేస్తే ఏ అనుమానమూ తాకపోనేమో? "దొంగాడా! చెవి కోరికేవురా!' అన్నట్లు చేసి కొన్నాడు తను! ఏమనుకుంటేనేం? బంగారం పోయింది. తేలుకుట్టిన దొంగలాగ వూరుకొవాలే తప్ప, ఇప్పుడు పోలీసు రిపోర్టు మాత్రం యేమని ఇవ్వగలడు.
    సుందర్రావు తిన్నగా మనోరంజని దగ్గిరకు వెళ్ళాడు. మొదటి తారీఖు దగ్గిర పడటం వలన నౌకర్ల కు గుమాస్తాలకు ఇయ్యవలసిన జీతాలు లెక్కలు చూస్తోంది మనోరంజని. సుందర్రావు మనోరంజని ప్రక్కన కూర్చున్నాడు. ప్రయత్నించినా అతని పెదవుల మీదకు చిరునవ్వు రావటం లేదు.
    "మనో, డియర్!"
    "యస్, హానీ!"
    "ఎప్పుడూ ఎందుకిలా శ్రమ పడతావు? కొంచెం సేపు విశ్రాంతి తీసికొరాదా? ఇలా శ్రమ పడితే ఆరోగ్యం దెబ్బ తింటుంది తెలుసా?"
    మనోరంజని సుందర్రావు ముఖం లోకి చూసి నవ్వింది.
    "భయం లేదు డార్లింగ్ నా ఆరోగ్యం చాలా మంచిది. ఇంతకూ , అంతకూ పాడు కాదు. ఇవాళ సాయంత్రం షాపింగ్ కి వెళదామా? నేను చీరలు కొనుక్కొని నెల రోజులయింది. కొత్తవేం లేవు."
    "తప్పకుండా వెళ్దాం, కానీ స్వీట్...."
    సుందర్రావు మనోరంజని చేతిని తన చేతిలోకి తీసికొన్నాడు.
    "వూ!' అంది మనోరంజని గారాబంగా.
    "నేనొక చిన్న చిక్కులో పడి పోయాను డార్లింగ్! నువ్వు నన్ను కాపాడాలి"
    "చిక్కా?! ఏవిటీ?
    "శెట్ గారింట్లో అయన దాచుకొన్న బంగారమంతా పోయింది! అయన ఇంటి తాళాలు  నా దగ్గిర ఉంచుకోవడానికి ఒప్పుకున్నందుకు ఆ నష్టమంతా నన్ను భరించ మంటున్నాడు. లేకపోతె కోర్టు కేక్కుతా నంటున్నాడు నన్ను దోషిగా నిరూపించడానికి కావలసిన ఆధారాలతని దగ్గిర ఉన్నాయి."
    మనోరంజని ఒక్క క్షణం నిర్ఘాంత పోయింది. మరుక్షణం పకపక నవ్వుతూ "నువ్వు రవి కోసం పన్నిన వలలోని ఎర ఎత్తుకు పోయిందా?" అంది.

 

                   


    సుందరరావు వంచిన తల యెత్తలేదు.
    తార ఆత్మహత్య చేసుకొన్న తరువాత మనోరంజని ఒక్కటొక్కటిగా అన్ని విషయాలూ తెలిపాడు. సుందర్రావు చేసిన పని ఆమె కేమాత్రమూ నచ్చలేదు. అయినా మాట్లాడక వూరుకోంది. మనోరంజనికి భగవంతుడు సౌందర్యాన్నివక పోయినా తెలివి తేటల నిచ్చాడు. ఆమెకు ఎవరితో ఎప్పుడు ఎలా వ్యవహరించాలో తెలుసు! ఆమెకు సుందర్రావు ప్రేమ కావాలి! ఆ కారణం చేతనే, ఆమె కిష్టం లేని పనులనకేం సుందర్రావు చేస్తున్నాడని తెలిసినా, తెలియనట్లు వూరుకొంటుంది. కానీ, ఎన్నడూ తన స్థానం నుండి కొంచెమయినా దిగ జారిపోదు. సంసారంలో తమ స్థానానికి భంగం కలిగే పరిస్థితులు తటస్థిస్తే మాత్రం తీవ్రంగా ప్రతిఘటిస్తుంది.
    మనిరంజని ఎసమాధానమూ ఇవ్వక హేళనగా నవ్వి వూరుకోవటం తో సుందర్రావు జాలిగా "మై స్వీట్" ఇప్పుడెం చెయ్యాలి నేను అన్నాడు.
    "దీని కాలోచన ఎందుకు? పోలీసులకు రిపోర్టువ్వు!"
    'అప్పుడు ఆవిడెవరు? నేనా ఇంట్లో ఎందుకు ఉంచవలసి వచ్చింది? అనే ప్రశ్నలు రావా?"
    "చెప్పు!"
    "అప్పుడు నా పరువేం కావాలి మనో?"
    సుందర్రావు మనోరంజని వంక ప్రాధేయపూర్వకంగా చూసాడు.
    మనోరంజని నిర్లక్ష్యంగా నవ్వింది.
    "నీకు బోలెడు పరువుంది. అందులో కొంత నష్టపోతే మాత్రమేమి? మళ్ళీ సంపాదించుకోవచ్చు!"
    సుందర్రావు ముఖం చిన్న బోయింది.
    "ఇది పరిహాసాలకు సమయం కాదు. మనో!"
    "అసలింతకూ నువ్వు భరించ వలసినది ఎంత?"
    "కొంచెం ఎక్కువే! మూడు లక్షలు!"
    మనోరంజని చిన్న కేక పెట్టింది.
    "మూడు లక్షలా? అయ్యబాబోయ్! మన దగ్గిర ఎక్కడిది?"
    "మనకు నాలుగిళ్ళు ఉన్నాయి కదా! రెండు అమ్మేద్దాం!"
    "ఇళ్ళు అమ్మటమా? అయినా ఎంత వస్తుంది? ఒక్కొక్కదానికి యాభై వేలు వేసుకున్నా లక్ష కంటే ఎక్కువ రాదు కదా?"
    "మన బాంకీ ఎకౌంట్స్, నీ నగలు, కారూ " మనోరంజని త్రుళ్ళిపడింది.
    "ఇంత సర్వ నాశనమా? ఎందుకూ? ఒక బజారు ఆడదాని కోసమా? వీల్లేదు! నువ్వు పోలీసు రిపోర్టిచ్చి దాన్ని పట్టియ్యి"
    "లాభం లేదు మనో! తాళాలిచ్చింది నాకు! జవాబు దారీ నేను. స్నేహలతకేమీ బాధ్యత లేదు. ఆమె నాకేమీ తెలియదన్నా ఎవరూ ఏమీ చెయ్యలేరు!"
    "ఎందుకూ? ఆధారాలు దొరకవా? ఆ నగలు గుర్తు పట్టరా?"
    "ఇంత దొంగతనం చేసిన వాళ్ళకు, ఆ మాత్రం తెలివి ఉండదా? ఈపాటికి కరిగించేసి ఉంటారు. దొంగతనం జరిగిన వెంటనే రిపోర్టిస్తే ఏమయి ఉండేదో? అసలు దొంగతనం జరిగినట్లే ఇంత వరకూ తెలియలేదు, ఇప్పుడు రిపోర్టిచ్చినా నవ్వుల పాలు కావటం తప్ప ప్రయోజనం ఉండదు! ఇప్పుడు మనం కొంత నష్ట పోయినా మళ్ళీ మన వ్యాపారంలో అంతా రాబట్టు కోవచ్చు మనో!"
    "ఉన్నదాన్ని నాశనం చేసికొని, ఏదో వస్తుందని కలలు గనేటంత తెలివి హీనురాలిని కాను."
    "మనో, మై డార్లింగ్!'  
    "సారీ , మై స్వీట్! నేను నిన్నెంత ప్రేమిస్తున్నానో నీకు తెలుసు! నీ ప్రేమ నాకు కావాలి . నావంటి మీద నా నగలు లేకపోతె , నీ ప్రేమను నేనెలా పొందగలనూ? నీ ప్రేమ లేని బ్రతుకెందుకు?"
    మనోరంజని కళ్ళు తుడుచుకుంది.
    సుందర్రావు నిర్ఘాంత పోయాడు.
    "మనో డియర్! నీ నగలు లేనంత మాత్రాన నీమీద ప్రేమ పోతుందా? నన్నింత ఆపదలో కాపాడిన నీ మేలు మరిచి పోతానా? నా పరువు పొతే, నీ పరువు పోయినట్లు కాదూ?"
    "మై స్వీట్ హార్ట్! భగవంతుడు ఈ లోకంలో నేనూ ఒక మనిషిగా నిలబడేటందుకు నా కిచ్చిన ఒకే ఒక శక్తి ఆ నగలు! అవి లేనప్పుడు నేను మనిషినే కాదు. ఇంక ప్రేమా, పాడూ ఏమీటీ? నాకున్న సమస్తమూ నశించి, నా అస్తిత్వమే నశించినా నీకేం నష్టం? స్నేహలత, మంజులత, ప్రేమలత...... వృక్షం ఉండాలే కాని లతలకేం తక్కువ?"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS