తప్పెవరిది
"మాధవి వస్తోంది తెలుసా..." విశాల్ చేతికి కాఫీ కప్పు అందిస్తూ చెప్పింది అపర్ణ.
చదువుతున్న న్యూస్ పేపర్ మీంచి చూపు తిప్పి ఆమె చేతిలోంచి కప్పు అందుకున్నవాడల్లా ఆ మాట విని కళ్ళెత్తి చూశాడు. అపర్ణ మోహంలో ఒవిధమైన భయం కనిపించింది. అతని చూపులతో చూపు కలిపి ఒక్కసారి కనురెప్పలు వాల్చేసింది.
"ఎప్పుడు?" ఎవరు చెప్పారు?" అడిగాడు కనుబొమ్మలు ముడుస్తూ.
"వసంత గారు చెప్పారు. నిన్న శ్రావణ శుక్రవారం వ్రతం నోము పేరంటానికి మాధవి వాళ్ళింటి కి వెళ్ళారుట... ఇల్లంతా చిన్న చిన్న మార్పులు చేసి గోడలకు, తలుపులకు రంగులు వేశారుట... ఇండియన్ టాయిలెట్స్ స్థానం లో వెస్ట్రన్ టాయిలేట్ కట్టించారుట....చాలా హడావుడిగా ఉన్నారుట శాంతగారు వాళ్ళు...." కొంగు వెలికి చుట్టుకుంటూ చెప్పింది.
"అలాగా....' విశాల్ కాఫీ కొద్దిగా సిప్ చేసి మౌనంగా ఎటో చూస్తూ ఉండిపోయాడు. కొద్ది క్షణాలు అతనేమన్నా చెప్తాడేమో అని ఎదురు చూసి అతనేమీ మాట్లాడక పోవడంతో అపర్ణ నిశ్శబ్దంగా లోపలి కెళ్ళిపోయింది. ఆమెకి ఆ తరువాత ఏపని మీదా ఏకాగ్రత కుదరలేదు. నిన్న వసంత నోటి నుంచి మాధవి వస్తోందన్న వార్త తెలిసిన దగ్గర్నించీ మనసులో విపరీతమైన ఆందోళన మొదలైంది. భవిష్యత్తు అగమ్య గోచరంగా కనిపిస్తోంది. సైనికులు నిత్యం కాపలా కాస్తున్న పటిష్టమైన కోట లోంచి తననెవరో దట్టమైన అడవిలోకి విసిరేస్తున్న అభద్రతాభావం ఆమెను నిలువెల్లా వణికిస్తోంది. ఎలా? ఇప్పుడెలా? ఎక్కడి కెళ్ళాలి? ఇది మాధవి ఇల్లు....మాధవి సామ్రాజ్యం.... పరాయి దేశం పైకి దండెత్తి అక్రమంగా ఆక్రమించుకున్న దురాశ పరుడైన రాజులా తను ఈ ఇంటిని ఆక్రమించుకుంది.
ఇలా జరగడంలో తన తప్పెంత? అవును తప్పు తనేదేనా? తన నిస్సహాయతదా? తన పేదరికానిదా? తన స్వార్దానిదా? ఉలిక్కిపడింది అపర్ణ , నేను స్వార్ధపరురాలినా? ఎదుటి వాళ్ళ అవసరాన్ని అవకాశంగా తీసుకునితాత్కాలిక ఆశ్రయాన్ని శాశ్వత స్థావరంగా మర్చుకుందా? ఇందులో విశాల్ తప్పేం లేదా? మరణించిన ప్రభావతి గారి తప్పు లేదా? ఎవరిది తప్పు?
ఆలోచనలు కందిరీగల్లా మెదడుని కుడుతున్నాయి. అపర్ణ కి తెరలు, తెరలుగా దుఃఖం వస్తోంది. కానీ ఆ దుఃఖం బైటికి రావడం లేదు. గుండెల్లో ఉండలు,ఉండలుగా చుట్టుకుంటూ గొంతుకీ, గుండెకీ అడ్డంగా నిలబడింది. ఒక్క కన్నీటి చుక్క చెంపల మీదికి రాలినా, చాలు కొంతన్నా ఉపశమనం కలుగుతుంది. అదెవిటో నిన్నటి నుంచి, వసంత గారు మాధవి రాక గురించి చెప్పిన దగ్గర్నించీ మనసు పెద్ద కొందరాయిని మోస్తున్నంత బరువుగా మారింది.
తప్పు చేసి దొరికిపోయినదానిలా నేరస్తురాలిగా ఆత్మన్యూనతా భావం నిలువెల్లా కాలుస్తోంది. నిజానికి తనీ ఇంటికి స్వార్ధంతో రాలేదే.... ఆరోజు... అమ్మ తనని ఒంటరిని చేసి వెళ్ళిపోయిన రోజు.... ఉన్న ఆర్ధిక సౌలభ్యం మేనేజరు కలం పోటుతో కుప్ప కూలిన రోజు దిక్కుతోచక , దిక్కు లేకా పుట్టేడు దుఖంతో అగంయగోచారంగా నిలబడిన రోజు, పక్కింటి రాగిణి న్యూస్ పేపర్ లో విశాల్ ఇచ్చిన ప్రకటన చూపించింది. వెంటనే పరుగులు పెడుతూ విశాల్ ని కలిసింది. తన నిస్సహాయస్థితి వివరించి తనకి అతని ఇంట్లో ఆశ్రయం ఇవ్వమని వేడుకుంది. విశాల హృదయంతో విశాల్ అంగీకరించాడు. ఉన్న కొద్దిపాటి సామాను సర్ది రాగిణి ఇంట్లో దాచేసి, తన బట్టలు మాత్రం సూట్ కేసు లో పెట్టుకుని ఇల్లు ఖాళీ చేసి సరిగ్గామూడేళ్ళ క్రితం ఈ ఇంట్లో అడుగు పెట్టిన రోజు తనకేమీ అనిపించలేదు. వాళ్ళ కోక తోడూ తన కోక నీడ దొరికింది అనుకుంది. మంచాన పడిన ఓ వృద్దు రాలికి సేవ చేయడం అదృష్టంగా భావించింది. ఆమెని కంటికి రెప్పలా చూసుకుని, ప్రశాంతంగా ఆమె మరణించడానికి తనవంతు కర్తవ్యాన్ని ఆనందంగా నిర్వర్తించించి. చివరిసారిగా ఆమె తన వైపు చూస్తూ ప్రదర్శించిన కృతజ్ఞతాభావంతో మనసంతా ఆనందంతో నిండిపోయింది. కన్నీళ్ళతో తన కొడుకుకి తోడుగా ఉండమని అడిగితె ముందు తన అదృష్టానికి ఆశ్చర్య పోయింది. ఆ తరువాత ఆలోచించింది కానీ ఆ పరిస్థితుల్లో ప్రభావతి గారి నిష్క్రమణం తరువాత తనకి మళ్ళీ భవిష్యత్తు శూన్యంగా మారబోతుందన్న భయం ఆలోచనని అణిచేసి, అంగీకారాన్ని తెలిపింది. అదే ఇంట్లో ఓ సేవకురాలిగా కాక, ఓ గృహిణిగా నిలదొక్కుకుంది.
ఇప్పుడు - అయాచితంగా లభించిన అదృష్టాన్ని ఎత్తుకు పోవడానికి గద్దలా మాధవి వస్తోంది ఎలా? ఎలా ఈ ఇంట్లో తన స్థానం కాపాడుకోవాలి? తనేం చేయగలదు? తనకి స్థానం ఇచ్చిన వ్యక్తీ మౌనంగా ఉన్నాడు. అతనేదన్నా అభయం ఇస్తాడని నీ స్థానం ఎక్కడికీ పోదు.... ఎవరు వచ్చినా, ఏం జరిగినా నీకు ఎటువంటి హనీ జరుగదు అని ధైర్యం చెప్తాడనుకుంది. ఇప్పుడు... ఇప్పుడు అతనేం మాట్లాడలేదు. ఇక తనీ ఇంట్లోంచి వెళ్ళిపోవాల్సిందేనా? వెళ్ళి ఎక్కడ ఉండాలి? ఎలా బతకాలి? ఉద్యోగం చేయాలంటే మళ్ళీ క్రూరమృగాల స్థావరం లోకి వెళ్తున్న భావన... భయం. ఒంటరిగా ఉండాలంటే భయం... ఈ సమాజంలో తను ఒంటరిగా బతకగలదా? మార్కెట్టుకి వెళ్ళి కూరలు కొనలేదు. ఇంట్లోకి కావలసిన సామాను కొనలేదు. బ్యాంక్ లో అకౌంట్ ఓపెన్ చేయడాని క్కూడా విశాల్ సాయం తీసుకున్న తాను, వేయి రూపాయలు పట్టుకెళితే మిగిలిన చిల్లర లెక్క పెట్టుకోడం రాని తను.... అన్నిటికీ విశాల్ మీద ఆధారపడి బతుకుతోన్న తను ఒంటరిగా ఎలా బతకగలదు? నో బతకలేదు... అలా అనుకుంటుంటే ఎందుకో మొదటి సారిగా తన మీద తనకే చిరాకేసింది అపర్ణకి.
పరాధీన....తాను పరాధీన.... ఛీ తనకసలు వ్యక్తిత్వమే లేదా? అసలిలా ఎలా తయారైంది? ఎందుకు భయం? జీవితమంటే భయం... ఏదో ఫోబియా.... దేనికో తెలియదు.... బైటి కెళ్ళాలంటే భయం... ఉద్యోగం చేయాలంటే భయం... వంటరిగా ఉండాలంటే భయం.... తను ఒంటరిగా ఉంటోందన్న వాస్తవం సమాజానికి తెలపాలంటే భయం... ఈ భయంతోటే ఇలా పరాధీనురాలైంది ఎలా ఈ భయం పోతుంది.
అసలు ఆరోజు ప్రభావతి గారు మాధవి గురించి చెప్పిన రోజే తన వివేకం ఎందుకు పనిచేయలేదు. చట్టపరంగా తన స్థానం పదిలంగా ఉంటుందన్న భరోసా ఆవిడ నుంచి కానీ, విశాల్ నుంచి కానీ తనెందుకు కోరలేదు. ఏ ధైర్యంతో ఈ ఇంట్లో గృహిణిగా ఉంది. తోటి స్త్రీ తాత్కాలికంగా భర్తకు దూరమైపోగానే ఆ స్థానం తన అవసరానికి స్వంతం చేసుకోడం నీచం.... ఎంత నీచమైన పనిచేసింది . విదేశాలకు వెళ్ళి ఉన్నత చదువులు చదివి వస్తోన్న ఆమె తనని ఎంత అసహ్యించు కుంటుందో.... ఏమంటుందో.... మెడపట్టి బైటికి నెడుతోందా? అపర్ణ కి కాళ్ళ నుంచి తలదాకా ఒక్కసారి ఒళ్ళంతా మంచులా చల్లగా అయి చలనరహితంగా అయినట్టు అనిపించింది.
'అపర్ణా...ఏం చేస్తున్నావు?" విశాల్ పిలుపుతో పాటు అతని చేయి భుజం మీద పడడంతో తుళ్ళి పడి చూసింది. రక్తం గడ్డకట్టి నట్టు చైతన్య రహితంగా నిలబడి గాజు కళ్ళతో తనవైపు చూసిన ఆమె పాలిపోయిన మొహం చూసి కంగారుగా అడిగాడు విశాల్. "ఏంటి? ఏమైంది? అపర్ణా! అరెరే ఏమైంది?" తన చేతుల్లో వాలిపోతున్న ఆమెని పట్టుకుని కుదుపుతూ అడిగాడు.
ఒక్కసారిగా భళ్ళున బద్దలైనట్టు ఆమె నోటి నుంచి పెద్దగా ఏడుపుతో కూడిన శబ్దం వినిపించింది.
అతని గుండెల పైన వాలిపోయి వెక్కివెక్కి ఏడవసాగింది అపర్ణ.
విశాల్ కి అర్ధమైంది. మాధవి వస్తోందన్న వార్తతో ఈమె భయపడుతోంది. అభద్రతా భావం ఈమెని ఆవహించింది. అతనికి జాలేసింది. మార్దవంగా పిలిచాడు....'అపర్ణా!"
అపర్ణ జవాబు చెప్పలేదు. అతని పిలుపులోని ఆప్యాయతకి అప్పటిదాకా ఘనీభవించిన గడ్డలుగా మారిన కన్నీరు ఒక్కసారి గా కరిగి ప్రవహిస్తోంది. కుళ్ళీ కుళ్ళీ ఏడుస్తోంది.
విశాల్ కి ఏం చేయాలో, ఎలా ఓదార్చాలో అర్ధం కాలేదు. ఆమె మానసిక స్థితి అతనికి పూర్తిగా అర్ధమైంది. తల్లి బలవంత పెట్టి ఆమెని భార్యగా స్వీకరించమన్న రోజు ముందు ఆలోచించినా, మాధవి మీద కోపంతో ఉన్న తను ఆమె తనని నిర్లక్ష్యం చేసినందుకు శిక్షగా అపర్ణని స్వీకరించాడు. కానీ, ఒక్క క్షణం మాధవికి, ఈ ఇంటి మీదా, తన మీదా చట్టపరంగా ఉన్న హక్కుల గురించి ఆలోచించలేకపోయాడు. మనిషిని కోపం వివేకశూన్యుడిని చేస్తుందన్న వాస్తవం తెలిసేటప్పటికి తల్లి మరణించడం, అపర్ణ భార్యగా తన స్థానం పదిలం చేసుకోడం జరిగింది. ఆ ఇంట్లో తను ఎప్పుడూ అమెని సేవకురాలిగా చూడలేదు. నిద్రలేచాక కమ్మని కాఫీ నుంచి రాత్రి డిన్నర్ దాకా రుచికరమైన వంటలు, అమ్మ విషయంలో చీకూ చింత లేని విధంగా ఆమె తీసుకున్న బాధ్యత, ఇల్లంతా ఎప్పుడూ శుభ్రంగా కళకళలాడుతూ ఉంచిన తీరూ ఆ ఇంట్లో అపర్ణ ని ఒక మెంబర్ గానే చూశాడు. కాకపోతే, ఆ మెంబర్ షిప్ లోని రిలేషన్ షిప్ గురించి ఏనాడూ ఆలోచించలేదు. అమ్మ పోయే ముందు నేను పోయాక నిన్నెవరు కనిపెట్టి ఉంటారు నాయనా.... వేళకి తిండి, ఇంట్లో మాట్లాడే దిక్కు లేకపోతె నువ్వేమై పోతావురా నామాట విను, ఆమ్మాయి బుద్ది మంతురాలు....ఈ ఇంటికి తగిన కోడలు అని బలవంతం చేస్తే ఆమెకి ఆలోచనా రహితంగా మాట ఇచ్చాడు. ఆమె ఎదురుగా అపర్ణ మెడలో పసుపు తాడు కట్టాడు. పిచ్చిపిల్ల ఆ తాడు చూసుకుని ఎంత మురిసి పోయిందో.... విశాల్ గుండెల్ని చీల్చుకుంటూ నిట్టుర్పు వచ్చింది. తాళి అనే రెండు బంగారు నాణాలు, ఒక పసుపు తాడు కోసం ఆడవాళ్ళు ఎంత పరితపిస్తారు!
