ఈ తమాషా చూస్తున్న శ్రీనివాసరావుకి ఒళ్ళు మండిపోయింది.
భోజనాలు చేస్తున్నప్పుడు మాత్రం గిరి తమ్ముడితో మాటాడేడు.
"ఒరేయ్.....అమ్మ కాదు గదా. దేవుడే దిగివచ్చి చెప్పినా నేను పెళ్ళి చేసుకోను. శ్రీను! బుజ్జిగాడిని నాకిచ్చేయ్ రా. నా అంతటివాణ్ణిగా చేసి పారేస్తానంతే . ఆ....."
ఆ మాటకి శ్రీనివాసరావు నొచ్చుకున్నాడు.
ఆ మరుసటి రోజు కూడా గిరి తాలుకూ అల్లరితోనే గడిచిపోయింది. ముగ్గురు పిల్లలూ అతన్ని అమితంగా ప్రేమిస్తున్నారు. తల్లి శ్రీనివాసరావుని పూర్తిగా మరిచిపోయింది. సీత సంగతి సరేసరి - బావగారికి టిఫిన్లూ, కాఫేలూ తయారు చేయడంలోనే సరిపోతుంది.
ఒక్కణ్ణి గురించి యిల్లంతా మారిపోవడం శ్రీనివాసరావుకి చిత్రంగా తోచింది. గిరి అదృష్టానికి అతను అబ్బుర పడిపోయేడు.
ఆ రాత్రి, తప్పనిసరిగా వెళ్ళిపోవాలని గిరి తల్లితో అన్నప్పుడు, మరో నాలుగు రోజులు గడిపి వెళ్ళమని బతిమిలాడిందామే.
"మళ్ళా మళ్ళా నిన్ను చుస్తాననుకోవడం లేదు నాయనా! రాక రాక వచ్చేవు. నేనా ఇవాళ రేపుల మధ్య బతుకుతున్నాను. నాలుగురోజులు - ఒక్క నాలుగు'రోజులుండి పో...."
"నువ్వేం బెంగపడకమ్మా! నీకు వచ్చిన భయం లేదు. నేను చెబుతున్నాగా, ఇన్నేళ్ళూ అయిపోయిందేదో అయిపొయింది. ఇకనుండి నెలనెలా వంద రూపాయలు పంపుతాను. డాక్టరు యింటికే వచ్చి చూచి వెళ్ళే ఏర్పాటు తమ్ముడి చేత చేయించు. అందుకయ్యే ఖర్చు నేను భరిస్తాను . సరేనా."
"తమ్ముడీ యిబ్బందులు పడలేడురా గిరి! చూస్తివిగా వాడు పూచిక పుల్లై పోయేడు. అదేక్కడి మాయదారి రోగమో ఏమో మనిషిని పీల్చి పిప్పి చేస్తుంది పాపం."
శ్రీనివాసరావుకి ఆ తల్లీ కొడుకుల మీద కోపం వచ్చింది
"మీరెవ్వరూ నా మీద దిగులు పడక్కర్లేదమ్మా౧ అన్నయ్య హామీ లిస్తున్నడుగా ఇకనేం , ఎంచక్కా జరిగిపోతుంది కాలం! అన్నయ్యా, నువ్వేన్నైనా చెప్పు, నేను వినదలచుకోలేదు. ఈ పేద తమ్ముడి మీద నీకు నమ్మకం లేకపోతే అమ్మని నీ వెంట తీసుకెళ్ళిపో. అంతేగాని, అమ్మని గురించిన భాద్యతల్ని పంచకు. నాకు తలనొప్పి. అమ్మ మీద నీకంత మమకారమే వుంటే , అల్ రైట్ , ఇప్పుడే అమ్మ ప్రయాణానికి ఏర్పాట్లు చేస్తాను. ఇద్దరూ వెళ్ళిపొండి."
"శీనూ!" అన్నది అమ్మ.
"అవునంతే క్షమించు. నేను కటువుగా మాటాడి వుండొచ్చు. నాచాతకాని తనమే నన్నిలా మాటాడించవచ్చు. ఏనాడూ నిన్ను నిర్లక్ష్యం చేయలేదు నేను. ఇవాళ అన్నయ్య వచ్చి నన్ను ఎద్దేవా చేస్తుంటే సహించలేనమ్మా! అతని దయాదాక్షిణ్యాలతో బతకడం యిష్టం లేదు నాకు. అతని సయం ఈ యింట్లో ఎవరికీ అక్కర్లేదు. అంతగా కావలసిన వాళ్ళు అన్నయ్యతోనే వుండొచ్చు."
గిరి రౌద్రంగా తమ్ముడి వైపు చూసేడు.
"అంటే ఏమిటి? అమ్మ చావుబతుకుల మధ్య కొట్టుకుంటుంటే నీలా నన్ను చేతులు కట్టుకోమంటావుట్రా."
"ఆ మాట నేననలేదు. కళ్ళల్లో పెట్టుకుని కాపాడగలనని నమ్మకముంటే కూడా తీసుకెళ్ళమంటున్నాను."
"నీలాగా నాకు యిల్లూ వాకిలి లేవురా!"
"ఇవన్నీ వుంటే అమ్మ మీద నీకింత మమకారం వుండేదే కాదు. నువ్వు నాలాగా చేతులు కట్టుకునే ఉండేవాడివి."
"ఎందుకురా నా మీద నీ కింత కసి?"
తల్లి కలుగ జేసుకుంది.
"కసి కాదురా గిరి! అది కసి కాదు. వాణ్ణి గురించి నాకు తెలుసు"
"ఏమిటి తెలుసమ్మా నీకు? ఇప్పుడీ క్షణమే చెప్పు. నా గురించి ఏమి తెలుసో."
తల్లి ఏమీ చెప్పలేదు. కళ్ళు మూసుకుంది. గిరి నాన్చుతూ అన్నాడు.
"అవుతే నన్నేం చేయమంటావు?"
"అమ్మని మరిచి పోమంటాను. ఇన్నేళ్ళూ అమ్మని వదిలి ఎలా తిరిగేవో ఇప్పుడూ అలాగే తిరగమంటాను. నా నెత్తిమీద యిన్ని బరువులు పెట్టి తప్పించుకుపోయిననాడు లేని జాలి యివాళ ప్రదర్శించ'కూడదంటాను . అంతే"
"ఒరేయ్ శ్రీనూ! ఏమిట్రా నీ మాటలు. వాడు నీ అన్నరా."
గిరి తమాషాగా అన్నాడు.
"పోనీలె అమ్మా! తమ్ముడేగా . అననివ్వు. నాకేం బాధలేదు. అలాగేరా , నువ్వు చెప్పినట్లే చేస్తాన్రా శ్రీనూ. మళ్ళీ నా పాడు మొహం నువ్వు చూడవులే. వస్తానమ్మా వస్తాన్రా.....పిల్లలూ , మీ పెద్దనాన్న వెళ్ళి పోతున్నాడురా ! వస్తానమ్మాయ్."
శ్రీనివాసరావు తన గదిలోకి విసురుగా వెళ్లిపోయేడు.
గిరి రిక్షా ఎక్కినప్పుడు ఇంట్లోని పిల్లలు రాగాలు ప్రారంభించగా , శ్రీనివాసరావు గది నుంచి బయటికి వచ్చి పిల్లలకి రెండు వడ్డించేసాడు. సీత అడ్డుపడి పిల్లల్ని లోపలికి తీసుకువెళ్ళింది.
వీధీ తలుపులు వేసి వస్తున్నప్పుడు శ్రీనివాసరావుకి తల్లి ఏడుపు వినిపించింది. అతను గభాలున తల్లి గదిలోకి వెళ్ళి , ఆమె కాళ్ళ దగ్గిర కూచుని అన్నాడు -
"నన్ను క్షమించమ్మా! క్షమించు. నోటికి వచ్చినట్టు పేలేను. వాణ్ణి బాధపెట్టి పంపేను."
చెంగుతో కళ్ళు తుడుచుకుందామే. కొడుకు తల నిమిరింది.
"పిచ్చినాన్న! ఎంత అభిమానం రా నీకు" అన్నది.
శ్రీనివాసరావు ఆ అభిమానమనే మాట విని కరిగిపోయేడు. తల్లి ఒళ్ళో తల పెట్టుకుని వలవలా ఏడవడం ప్రారంభించేడు.
పిల్లల ఏడుపు సముదాయించి సీత అక్కడికి వచ్చి శ్రీనివాసరావు ఏడుస్తున్న పద్దతి చూచి విసుక్కుంటూ అన్నది.
"ఎందుకిప్పుడు ఏడవడం? ఇంత వయస్సులో తల్లి దగ్గిర కూచుని ఎడ్చేందుకు మీకు సిగ్గువేయడం లేదూ?"
అతనా గదిలోంచి వచ్చేస్తూ సీతతో అన్నాడు.
"ఐ యామ్ ఫూల్ సీతా!"
ఆ రాత్రి పిల్లలంతా నిద్రపోయిన తరవాత సీత శ్రీనివాసరావు వేపు చూచింది. అతను కళ్ళు తెరిచి ఏదో ఆలోచిస్తూనే ఉన్నాడు. సీత మెల్లిగా అడిగింది.
"ఏమిటి ఆలోచిస్తున్నారు."
"మామూలే - మన బ్రతుకులను గురించి."
"నన్నడుగుటే , ఈ ఆలోచనలు తగ్గించేస్తే మీ ఆరోగ్యం కుదుటపడుతుందని చెబుతాను."
'అలవాటైపోయింది . కొన్నాళ్ళు ప్రయత్నించి విజయం పొందేననుకున్నాను గానీ ఇక ఈ జన్మకి అలొచనలు దూరంగావనే నిర్ణయానికి వచ్చేను."
"పోనీ, ఇలా ఆలోచించడం వాళ్ళ ప్రయోజనమేమిటో చెబుతారా?"
"నీకు కావలసిన ప్రయోజనమేమిటో నాకు తెలీదు గాని సీతా, నాకు దీనిలో కావలసినంత తృప్తి వుంటుంది. నా ఆలోచనల్లో చేసిన తప్పులన్నీ గుర్తుకు వస్తాయి. పశ్చాత్తాపం కలుగుతుంది. కాసేపు ఏడుస్తాను. క్షమించమని అందర్నీ వేడుకుంటాను. అనక మనసు తేలిక పడుతుంది. ఆ తరవాత గానీ సుఖంగా నిద్రపోలేదు. సుఖమైన నిద్ర లేకపోతే అదో అనారోగ్యం , ఆ నిద్ర కావాలనుకుంటే , ఈ ఆలోచనలు అవసరం"
"ఇప్పుడు మీరేం తప్పు చేసేరని ఈ ఆలోచనలు?"
