"చేయలేదంటవా? అన్నయ్యని దూషించడం , అమ్మ మీద విసుక్కోవడం ఇవన్నీ తప్పులు కావూ?"
"కావేమో."
"సీతా!"
"అవును నిజం. దీనిలో మీ తప్పేమీ లేదు."
"థాంక్స్ సీతా! థాంక్స్ . నీకు నేను తెలుసు. నేనెంత మంచివాడినో నీకోక్కర్తికే బాగా తెలుసు. పెంచిన అమ్మ గూడా ఒక్కోసారి నన్ను అపార్ధం చెసుకుందేమో గాని నువ్వు నన్ను కచ్చితంగా అర్ధం చేసుకున్నావు. మా అన్నయ్య అవకాశవాది. అయితేనేం -- వాడూ మంచివాడే పాపం!"
సీత గలగలా నవ్వింది.
"ఎందుకు నవ్వుతావ్ సీతా?"
"మన బుజ్జికంటే అమాయకంగా మాటాడుతున్నారు మీరు. అవును గాని శ్రీవారూ! అమ్మని కంటికి రెప్పగా చూచుకుంటానన్న బావగారిని కాదన్నారే -- మీరావిడకి ఏ విధంగా సేవ చేయదలుచుకున్నారు?"
"ఇన్నేళ్ళూ చేయలే."
"ఇన్నేళ్ళూ సేవ చేసారా? హవ్వ ...... ఆవిడ అదృష్టం బావుండి ఇన్నాళ్ళయినా మన ముందున్నారు గానీ లేకపోతేనా?"
"లేకపోతే ఏమయ్యేదంటావ్?"
"నా నోటితో ఎందుకు'లెండి. చెప్పడం. దూరం ఆలోచిస్తే మీ తప్పేమీ లేదు. ఆర్ధికంగా మనం వెనుకబడిపోయేం. అన్న కాదు గదా తండ్రి సహాయమైనా మన కవసరం లేదని ఖచ్చితంగా చెప్పగల అభిమానదనులం మనం."
"...... ఇంతవరకూ నేను చేసింది తప్పు కాదని చెప్పి యిప్పుడు మళ్ళీ నామీద దాడికి దిగావేం?"
"దాడికి దిగడమేమిటి? ఉన్న విషయమే అన్నాను. మీరు నా ప్లాన్ కి తలూపితే మనం మంచి రోజులు చూడగలమని గూడా చెబుతాను."
"ఏమిటో ఆ ప్లాను?"
"వింటానని ముందు మీరు మాటివ్వాలి."
"అర్ధమైంది సీతా! నీ ప్లానేమిటో అర్ధమైంది నాకు. నేను చస్తే మాటివ్వను. చెక్కులు రాసే గుమస్తానే గావచ్చు. ఆఫీసు దగ్గిర నాకు గిరాకీ ఉండవచ్చు." కాని సీతా, నేను లంచానికి చేయి జాచను."
"భలేవారే! నిప్పులాంటి మిమ్మల్ని అవినీతికి లొంగిపొమ్మని నేనెలా సలహా యిస్తాననుకున్నారు. తప్పు కాదూ?"
"మరి.....మరేమిటి నీ ప్లాను."
"నేనూ ఉద్యోగం చేస్తాను. అదిగో .....అప్పుడే మీరెలా మారిపోయారో! నేను ఉద్యోగం చేయడం నీచమేమీకాదుగా! చదువుకున్న దాన్ని, నా చదువుకి ఈ విధంగానైనా ప్రయోజనం దక్కుతుంది. వేన్నీళ్ళకు చన్నీళ్ళుగా నేనూ కొంతో గొప్పో ఆర్ధికంగా సహాయపడవచ్చు గదా. సహధర్మచారిణి అన్నారు పెద్దలు. మీ కష్టాలు, సుఖాల్లో నాకు భాగం వుంటుంది. ప్లీజ్...."
శ్రీనివాసరావు లేచి కూర్చున్నాడు . మాట తడబడుతుండగా , గట్టిగా అరిచేడు.
"నోర్మూయ్ సీతా! ఉద్యోగం చేస్తుందిట ఉద్యోగం. ఉద్యోగం చేస్తున్న ఆడవాళ్ళని నేనెంతమందిని చూళ్ళేదు. నువ్వేం చేయ్యక్కర్లేదు. నేను తెచ్చింది జాగ్రత్తగా వాడడం నేర్చుకో చాలు. ఉద్యోగం చేసి నన్ను వుద్దరిస్తుందట అమ్మగారు! సిగ్గు లేకపోతే సరి!"
"సిగ్గెందుకు ? ఉద్యోగం చేసే ఆడపిల్ల సిగ్గుపడాలా?"
"నన్నాట్టే వాగించకు. నీకంత సరదాగా వుంటే చూడూ - నేను పొయిం తరవాత ఎంచక్కా వుద్యోగం చేసి పిల్లల్ని ప్రయోజకుల్ని చేయి. అప్పుడు నేను హర్షిస్తాను. అంతేగాని, నన్ను యింట్లో కూర్చోబెట్టి నువ్వు పోషించే అవకాశం ఈ జన్మకి వద్దు సీతా!"
"మరి....మనం ఆర్ధికంగా బాగుపడేదెప్పుడు?"
"బాగుపడకపోతే అందరం కలిసికట్టుగా చద్దాం! ఉద్యోగమంటే ఏదో సరదాగా కాలక్షేపం చేయడమనుకుంటున్నావేమో! అదేం గాదు . బానిస బ్రతుకది. యజమాని చీవాట్లు పెట్టినప్పుడు తలదించుకు వచ్చేయాలి . వాళ్ళముందు నిన్ను నీ యజమాని - కావచ్చు , పనిలో నీ పొరపాటు వుండొచ్చు - చీవాట్లు ఆడవాళ్ళ కుండవని గ్యారెంటీ ఏది? నువ్వు సంపాయించి తెచ్చి పెట్టె ముష్టి వందరూపాయల కోసం మరో మగాఫీసరు చేత నువ్వు చీవాట్లు తినే జాతకానికి గురైనప్పుడు నేను సహించి బ్రతకడం కష్టం. సీతా! ఆ పొరపాటు పనిచేసి నన్ను హింసించకు."
"ఎంత దారుణంగా మాటాడుతూన్నారు! సివిలిజేషను...."
"నా కొద్దీ అర్ధం లేని సివిలిజేషన్. నేను రాతియుగంలోనే వుంటాను గానీ అనేకమంది పరాయి మగాళ్ళ మధ్య భార్య చేత ఉద్యోగం చేయించి, ఆ రకంగా నన్నాదుకునే ఆర్ధిక సహాయానికి ఒకే ఒక నమస్కారం! ఇవాళే నాకో సర్టిఫికేట్టివ్వు సీతా! ఈ మనిషి పురోగామికాదు. వయసున చిన్నవాడైనా మనసుపరంగా శతవృద్దుడు! నిత్య శంకితుడు! ఆడదాన్ని అబలగా చూస్తున్న దుర్మార్గుడు! వీణ్ణి నడివీధిలో పెట్టి కాల్చండి! - నీ యిష్టం . ఏ రకంగా రాసినా ఆ సర్టిఫికేట్ పుచ్చుకుంటాను. నువ్వు మాత్రం ఉద్యోగం చేయడానికి వీల్లేదంతే."
సీత అతని ఆవేశానికి నిజంగానే భయపడింది. తన చేతిని అతని నోటికి అడ్డుగా వుంచి అన్నది."
"ప్లీజ్ ....పడుకోండి . నేను వినలేనింక."
9
ఇంటి పరిస్థితికి భిన్నంగా వుంది ఆఫీసు. అక్కడటానికి యిప్పుడు రద్దీ తగ్గింది. అతనికి సహాయం చేసే నిమిత్తం కొత్తగా వచ్చిన కుర్రగుమస్తాని యిచ్చేరు. అతనేమో కత్తిలాటి కుర్రాడు.
"మీరుండండి సార్! ఆ చెక్కులు నేను రాస్తాను."
"గురుగారూ! ఆ ఫైలిలా ఇవ్వండి నేను చూస్తాను."
"సినిమాకి వెళ్ళేరా? సోఫియాలారెన్ బాగుంటుంది గదండీ."
"మీ ప్రమోషన్ ఎందుకింత లేటయింది సార్!"
"నేనో ఉపాయం చెబుతాను గాని , మీరస్తామానం దిగులుతో కుంగిపోకండి."
ఈ మొదలైన అతని హెచ్చరికలతో, పరామర్శలతో, సాయంతో శ్రీనివాసరావుకి పని కొంచెం తెరిపిన పడినట్టుంది.
కాని ఒక రోజున కుర్ర గుమస్తాని శ్రీనివాసరావు గట్టిగానే హెచ్చరించేడు. ఒక్క మాటలో అతనికి గీతాగోవిందం భోదించడనే చెప్పాలి. జరిగిన దిది "
కాంటీన్ లో యిద్దరూ కాఫీ తాగుతుండగా కుర్ర గుమస్తా నసుగుతూ అన్నాడు.
"మరి మీరు గ్రహించారో లేదో గాని గురూగారూ! మన సీటుకి డిమెండ్ ఎక్కువ"
"అంటే?"
"పేమెంట్స్ సీటుగదండి ! ఊళ్ళో పెద్ద మనుషులందరితోనూ పనులాయే. రాత్రి సినిమాకి వెళ్ళెను లెండి - సీన్ కాన్ రీ స్ప్రై ఫిలిం. అక్కడ వీరభద్రం గారు కలిసేరు."
"వీరభద్రమా?"
'అంత కోపమేమిటండి బాబూ! అవునాయనే కలిసేరు మీ గురించి గూడా చెప్పేరు లెండి."
"ఏమని?"
