ఇతను యింటికి దగ్గిరవుతుండగా , ఆ యింట్లో ఏదో ప్రళయం జరిగినట్లు గమనించేడు. అతనికి దడ యెక్కువగా! గబగబా నడిచి ఇల్లు చేరుకున్నాడు. పక్కింటావిడ నవ్వుతూ అన్నది.-
"మీ అన్నగారట - అయన వచ్చేరు బాబూ!"
శ్రీనివాసరావు ఒక్క గెంతున అమ్మగది చేరేడు. అక్కడే వున్నాడు గిరి.
చేయ్యేత్తు మనిషి, పుష్టిగాతెల్లగా వున్నాడు. వాడి మోహంలో , వాడి కళ్ళల్లో తేజస్సు మిలమిలా మెరిసిపోతుంది. బారెడు మీసాలూ దర్జాగా వుండి వాడి మగతనాన్ని హెచ్చరిస్తున్నాయి. టేరిలిన్ బట్టల్లో వాడు ఖరీదుగా ఉన్నాడు. అమ్మ పక్కన వాడు హుందాగా కూర్చుని ఉన్నాడు.
"నాన్న కాదు గదా వీడు" అనుకున్నాడు శ్రీనివాసరావు.
గుమ్మం దగ్గిరే ఆగిపోయి తనవంక తదేకంగా చూస్తున్న తమ్ముణ్ణి పలకరించేడు గిరి. ఆ పలకరింపులో కావలసినంత కురుకుతనం ఉన్నట్టుంది.
'అమ్మా! వీడా మన శ్రీను/ ఏమిట్రా?.... ఏమిటీ దారుణం. అంత.....అంతలా బలిసిపోయేవెంరా? ఇక్కడికి రా!"
శ్రీనివాసరావు భయం భయంగా అన్నని చేరుకున్నాడు. గిరి, లేచి నించుని శ్రీనివాసరావు భుజం మీద చేతులతో తట్టినప్పుడు, శ్రీనివాసరావు తల ఎత్తి చూస్తేనే తప్ప అన్నయ్య కళ్ళని చూడలేకపోయేడు. ఆ కాళ్ళ చివర్ని నీళ్ళు తిరగడం గమనించేడు కూడాను.
"పిటీ! ఒరేయ్ శ్రీను! ఏమిటిలా తయారయ్యేవ్? నన్ను మించి ఉండేవాడివి కదురా! నాన్నగారి గుండేవి కదూ నువ్వు, ఏం జరిగిందని ఇలా కుంగిపోయేవు"
శ్రీనివాసరావుకి ఏడుపు పెల్లుబికి వస్తున్నా, అతి కష్టం మీద ఆపుకుంటున్నాడు. అతని ముగ్గురు పిల్లలు ఆ అన్నదమ్ముల చుట్టుతా నించున్నారు.
'అవున్రా! అమ్మనే కాకుండా నిన్ను నువ్వూ పాడు చేసుకుంటున్నావన్నమాట."
(అన్నయ్యా! మమ్మల్ని దెప్పి పొడిచేందుకు నీకు హక్కు లేదురా! ఇక అమ్మ సంగతి ఎత్తకు. ఒరేయ్, నీ కసాయితనం నాకు తెలుసురా ....నేను భరించనది.)
"ముగ్గురు పిల్లలు నీకు! చూడరా , వాళ్ళంతా ఎలా ఉన్నారో? అమ్మా, ఈ ఇల్లింత చీకాగ్గా వుందేమిటి' అని అడిగేడు తల్లిని.
"ఇది ఎవరి శాపమో అని గాని, శ్రీను అప్రయోజకత్వమానాకు వాడు ఒప్పుకోడు" అన్నదావిడ.
"అమ్మా!" శ్రీనివాసరావుకి కోపం వచ్చింది. "మీకేం మతులు పోలేదు గదా! ఎందుకు నన్ను హింసిస్తారు? నేనేం తప్పుడు పనులు చేస్తున్నానా. నా ఒంట్లో శక్తి వున్నంతవరకూ....."
"నోర్ముయ్ రా . అమ్మని మాటవేసేంత ధైర్యం గూడాను. వీడి ఒంట్లో శక్తిట! శక్తి! నీకంటే పెద్దవాడినిరా నేను. నేనెలా వున్నానో చూడు. బులెట్ ప్రూఫ్ శరీరం నాది. కావచ్చునురా .....నేను దేశ దిమ్మరినే ! నీకేం నిక్షేపంగా చదువుకుని వుద్యోగం చస్తున్న కుర్రాడివిగదా. అమ్మనిలా అన్యాయంగా మంచానికి వదిలేయడం ధర్మమా?"
'అన్నయ్యా!"
"నాతొ మాటాడకు. నేను రౌడీ వెధవనని అమ్మా నాన్న గాలికి వదిలేరు. నిన్ను నెత్తి మీద పెట్టుకుని, అతి గారభంగా పెంచినందుకు, ఇప్పుడు నువ్వేం చేస్తున్నావ్ అమ్మకి నెలనెలా మందు కొనలేని దుస్థితా నీది? నమ్మనురా!"
"అంటే నే నోక్కడ్ని నా యిష్టం వచ్చినట్టు నా సరదాలకే ఖర్చు పెట్టుకుంటున్నాననా నీ వుద్దేశం."
"నీ అవతారాన్ని చూస్తుంటే నువ్వంతటివడివనీ తోచడం లేదు."
(ఒరేయ్ అన్నా! మిలటరీ బుద్దిరా నీది. తాగి , తినటం తప్పించి అక్కడ నీకు పనిలేదేమో! దేశ సేవగాళ్ళు మీరు. నేను ఒప్పుకున్నాను. పెళ్ళి పెటాకుల్లేని నీకు జీవితం గురించి తెలుసంటే మాత్రం నే నొప్పుకున్నాను. నువ్వు పెళ్ళి చేసుకుని, ముగ్గురు బిడ్డల్ని కని, గుమస్తా గానే వుండి - అప్పుడు మాటాడు. తలవంచుతాను. అంతేగాని ......నో .....నీతో వాదించి ప్రయోజనం లేదు. చిన్నప్పుడే నువ్వు ఎస్కేపయ్యావ్. జ్యుష్టుడివయ్యి గూడా నీ తమ్ముడికి సుఖం లేకుండా చేసేవ్. అమ్మ నెవడురా కనిపెట్టుకునుండవలసినది? నువ్వా, నేనా పోరా పో. నీతో నేను మాటాడనుగాక మాటాడను.)
శ్రీనివాసరావు అక్కణ్ణించి లేచి తన గదిలోకి వచ్చేసేడు . మంచం మీద వాలిపోయేడు. ఆ గదిలోకి తల్లీ , పెద్ద కొడుకుల మాటలు వినిపిస్తూనే వున్నాయి.
ముగ్గురు పిల్లల్ని అన్నయ్య దగ్గిరికి తీసుకున్నాడు కాబోలు, ఒక్కోడి పేరు అడిగి తెలుసుకుని - వాళ్ళతో తమాషాగా మాట్లాడుతున్నాడు. బుజ్జిగాడే మొదట "పెదనాన్నా' అని వుంటాడు. గనకనే మిగతా ఇద్దరు పిల్లలూ అతి చనువుతో పెదనాన్నా అని గోలచేసి పారేస్తున్నారు.
పిల్లలందరికీ అట వస్తువులూ అవీ పట్టుకు వచ్చేడు కాబోలు -- గుర్రమని ఒకడూ, కారని ఒకడూ , కుక్క కోతీ అని ఒకడూ గొంతులు చించుకుంటున్నారు.
(అమ్మా అన్నయ్య , చివరికి నా పిల్లలు అందరూ అవకాశవాదులే. వట్టి గాలివాటు మనుషులు.)
సీత అతని గదిలోకి వచ్చి నించుని చేతిలో ఉన్న బట్టల పేకెట్ ని స్టూలు మీద పెట్టి అన్నది -
"చాలా ఖర్చు పెట్టి తెచ్చినట్టున్నారు. చూడండి. కళ్ళు జిగేల్ మంటున్నాయి."
"నేను చూడను. వాటి నిక్కడ్నించి తీసుకుపో. వాడు మాంత్రికుడు సీతా! మనల్ని హిప్నటైజ్ చేసి పారేయగలడు."
సీత మందహాసం చేస్తూ అన్నది -
"జెలసి!"
"అవునే సీతా. నేనుత్త జెలసి గాడినే. వాడు మీ అందరికీ ఎంచక్కా బట్టలు తెచ్చేడు గదూ! వాడేమో దేవుడు. రోజూ ఈ పండగ చేయగలడా వాడు. ఈ ఒక్కరోజుతో వాడు చేతులు దులుపుకు పోతాడు. నాన్న చావుకి రాలేదు వాడు. మన పెళ్ళికి రాలేదు. ఎట్టకేలకీ వేళ వచ్చేడు. ఎన్నో సంవత్సరాల తరవాత ఇప్పుడు వచ్చ్దేడు. వచ్చినవాడు తిన్నగా వెళ్ళక మిమ్మల్నందరినీ నా మీద ఉసిగొల్పి వెడతాడు. యుద్దాల మనిషి వాడు. మీకూ , నాకు ఈ యింట్లో చిన్న సైజు 'వార్' సృష్టించి గాని వెళ్లడు. వాడు వెళ్ళిన మళ్ళీ కొన్ని సంవత్సరాలకి గాని రాడు. ఈలోగా నేను చచ్చినా అంతే. అవునా..... అప్పుడు వచ్చి నీకూ పిల్లలకి యింకో 'వార్' సృష్టించేసి గాని వెళ్ళడు. ఆ యుద్దాల మనిషిని నమ్మకండే బాబూ ! బట్టలు తెచ్చేట్ట బట్టలు."
"మీకూ తెచ్చేర్లెండి...."
"నాకక్కర్లేదు. ఆ పాడు బట్టల్తో నా శవాన్ని కప్పండంతే గాని, నేను బతికుండగా వాటిని కట్టుకొను. ఎంత మాటన్నాడే వాడు - నేనుట అమ్మకి అన్యాయం చేస్తున్నానట. నువ్వామాట నమ్మగలవా సీతా."
సీత తిన్నగా శ్రీనివాసరావుని చూచి అనేసింది -"
"మీకోపం నాకు తెలియంది కాదు. అయన ముచ్చట కొద్దీ ఏవోతెస్తే, అవి మీకు చూపించడమే నా తప్పు. బుద్ది చెప్పేరు."
ఆ బట్టల పేకెట్ ని తీసుకుని వెళ్ళిపోయింది.
చీకటి పడుతుండగా , గిరి స్నానం ముగించి , పిల్లలందరికీ స్నానాలు చేయించి వాళ్ళకి కొత్త బట్ట్టలు తనే స్వయంగా తొడిగి ఒకే రిక్షాలో వాళ్ళని బజారు తీసుకువెళ్ళేడు.
అంతసేపూ , తమ్ముడితో నోరు విప్పి ఒక్కమాటైనా మాటాడలేదు.
ఆ రాత్రి పిల్లలతో గిరి , ఇంటికి ఆలస్యంగా వచ్చేడు. బజారులో ఎంత ఖర్చు పెట్టేడో ఏమో గాని సగం బజారునే కొన్నట్టున్నాడు.
