Previous Page Next Page 
మౌనవిపంచి పేజి 28

 

    "గుర్తించావన్న మాట!" నవ్వుతో పిలిచాడు.
    
    జవాబివ్వకుండా చకచకా నడిచింది ఆమె. సినిమాల్లో హీరోయిన్ లాగే ప్రవర్తిస్తున్నారే!" అన్నాడు మళ్ళీ.
    
    "షటప్!" అంది కోపంగా.
    
    "ఒహో! కాలేజీలో చేరగానే ఇంగ్లీషు వంటబట్టిందే!" హేళనగా అన్నాడతను.
    
    "కొందరికి కాలేజీలో ఎన్ని సంవత్సరాలు చదివినా కొద్దిగానయినా సంస్కారం అలవడదు!" అది వాళ్ళ దౌర్భాగ్యం! ఎంత చేసినా ఉల్లి మల్లి కాదు. పన్నీట్లు ముంచినా దాని కంపు కంపే" అని చకచకా నడిచి తన ఫ్రెండ్స్ ని కలుసుకుంది నంద.
    
    పళ్ళు నూరేడు ప్రమోద్.
    
    అది జరిగిన సాయంకాలం నుండి అతని పిల్లికూతలు, కోతిచేష్టలు ఎక్కువై భల్లూకపు పట్టుదల ఎక్కువైంది.
    
    నందకోపాన్ని తీర్చుకునే మార్గం ఆలోచిస్తూ ఉంది.
    
    అతను ఆమెను సాధించే మార్గాలు ఆలోచిస్తూ వున్నాడు.
    
    ఒకరోజు సాయంకాలం కాలేజీ నుండి వస్తోంది నంద.
    
    ఫ్రెండ్స్ అందరూ విడిపోయారు.
    
    ఒక్కతే వస్తోంది ఆమె.
    
    "నిలు!"    

 

    ఆ పిలుపు విని హఠాత్తుగా ఆగిపోయింది. ఏదో ఆలోచనలతో పరధ్యానంగా నడుస్తున్న నంద!
    
    ప్రమోద్ కుమార్, అతని స్నేహితులు ముగ్గురు చుట్టుముట్టారు. ఆమెని ఇతరులూ చూసేందుకు ఏదో పరిచయం ఉన్నవాళ్ళు మాట్లాడుతున్నట్లుగా వున్నారు నలుగురూ, వెనుకగా ఒకరు ఇద్దరటూ యిటూ ప్రమోద్ కాస్త ముందుకూ నడుస్తూ వస్తున్నారు.
    
    "ఎలా వుంది ఒళ్ళు!"
    
    జవాబివ్వలేదు నంద.
    
    "జిల్ జిల్ అంటుందా ఏమిటి? నోరు పెగలడం లేదా! హేళనగా అడిగాడు.
    
    "ప్రమోద్!" ఏ మాత్రం తొణక్కుండా పిలిచింది కోపంగా. "నువ్వు అమ్రయాదగా ప్రవర్తించావా పరిస్థితులు ఇంకోరకంగా తయారవుతాయి జాగ్రత్త! ఏమనుకుంటున్నావో నువ్వు!!" అంది సీరియస్ గా చెబ్తోన్నట్టుగా.
    
    పకపక నవ్వాడు ప్రమోద్.
    
    "ఇదిగో నందా! మేం నలుగురు వున్నాం. ఇంకో వంద గజాలు నడిస్తే మన వీధికి తిరిగే మలుపు వస్తుంది. అక్కడకు వెళ్ళగానే నిన్ను కార్లోకి లాక్కుని తీసుకెళతాం! ఇకనువ్వు మళ్ళీ ప్రపంచాన్ని చూసేది సూర్యోదయం అయ్యాకే! ఎలా తిరిగి వెళతావు ఇంటికి? ఏ ముఖం పెట్టుకుని వస్తావు కాలేజీ! గుర్తుంచుకో ఈ ప్రమోద్ తో పేచీ అంత మంచిది కాదు. చాలా ప్రమాదకరం!" అన్నాడు దర్పంగా.
    
    ఒక్క క్షణం ఆమె గుండెలు దడదడలాడాయి. తెలియని ఆపద రాబోతోందా అనుకుంది ఈ వెధవలు అంత పనీ చేస్తారేమో అనిపించింది. జాగ్రత్తతో మెలిగి, ప్రమాదాన్నుంచి వివేకంగా తప్పుకుని బుద్ది చెప్పాలనుకుంది.
    
    "మర్యాదగా క్షమాపణ చెప్పుకో!" ఇంకో అబ్బాయి అన్నాడు. అతడు మాజీ ఎం.ఎల్.ఎ. గారి అబ్బాయి.
    
    "మా వాడితో ఫ్రెండ్లీగా ఉండు" మరో అబ్బాయి అన్నాడు వాడు ఎం.పీ గారి తమ్ముడి కొడుకు.
    
    "ఇదిగో నందా ఈ టక్కులు మానుకో! అన్నాడు మాజీ ప్రెసిడెంట్ తమ్ముడు.
    
    ఒక్కొక్కరు ఒక్కో రాక్షసాంశ సంభూతుడన్నట్టుగా తమ ఠీవి, దర్పం తెల్పుతూ అన్నారు! నలుగురూ నలుగురే!
    
    సమాధానం యివ్వకుండా మెల్లగా నడుస్తుంది నంద.
    
    అంతలో హారన్ మ్రోగించుకుంటూ వచ్చింది ఏదో జీప్! అంతదాకా దార్లో అటూఇటూ చూస్తూ తెలిసిన వాళ్ళెవరయినా కనిపిస్తారేమోనని ఆశగా చూస్తోన్న నందకి ఒక్కసారిగా ప్రాణాలు లేచి వచ్చాయి!
    
    ధైర్యం పుంజుకుంది.
    
    పోలీస్ జీప్ ఎదురుగా వస్తోండటంచూసి దేవుడున్నాడనిపించింది! భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పుకుంది.
    
    జీప్ దగ్గరికి రాగానే హెల్ప్ అని బిగ్గరగా అరిచింది.
    
    జీప్ చప్పున ఆగింది. సడన్ ఎయిర్ బ్రేక్ తో.
    
    నలుగురూ క్షణంపాటు నివ్వెరపోయారు. నంద అంతగా సాహసిస్తుందనీ, పోలీసులు అలా హఠాత్తుగా వస్తారనీ అనుకోలేదు.
    
    జీప్ దిగేడు ఇన్ స్పెక్టర్.
    
    "నమస్తే సర్! నేను ఇంటర్ చదువుతున్నాను. నా పేరు ఆనంద. వీళ్ళు ముగ్గురు నన్ను అరగంట నుంచి వేధిస్తున్నారు. వెకిలివేషాలు వేస్తున్నారు. చండాలంగా మాట్లాడుతున్నారు" అంది నిర్భయంగా ధైర్యంగా.
    
    "గెటింటు ది జీప్!" కొత్తగా వచ్చిన యస్సై నలుగురినీ తీక్షణంగా చూశాడు. "గెటిన్! స్టేషన్ కి పదండి! అన్నాడు కఠినంగా.
    
    "సర్!" ఏదో చెప్పబోయారు వాళ్ళు.
    
    "నో! ఆర్గ్యుమెంట్స్! స్టేషన్ కి పదండి! అన్నాడు తిరిగి "ఏం చెప్పినా విన్నా అక్కడే" అన్నాడు.
    
    చేసేదిలేక నలుగురూ జీప్ ఎక్కేరు.
    
    నంద కూడా వెళ్ళి రిపోర్టు ఇచ్చింది. తనని గతంలో వెంటాడుతూ ఎలా ప్రవర్తించాడో చెప్పింది. తిరిగి జీప్ లో ఇల్లు భద్రంగా చేరింది. జీప్ లోంచి దిగుతున్న కూతుర్ని చూసి భయపడిన తల్లితో, తండ్రితో జరిగిన విషయాలన్నీ చెప్పింది. అంతావిన్న తరువాత భయపడిపోయాడు నారాయణ.
    
    మరుసటిరోజు మామూలుగా కాలేజీకి వెళ్ళింది నంద. జరిగినదాన్లో ఏ తప్పూ లేని కూతుర్ని వద్దనటానికి కారణం కనిపించలేదు నారాయణకి.
    
    కాలేజీకి వెళ్ళగానే ప్రిన్సిపాల్ కి రిపోర్టు ఇచ్చింది నంద. తన మాన ప్రాణాలకి ఏం నష్టం వాటిల్లినా అది ఆ నలుగురి వల్లనే అని పోలీసులకి రిపోర్టు ఇచ్చింది కూడా. ఆ రిపోర్టులో రాసి యిచ్చింది.    

 

    ఆ ప్రిన్సిపాల్ నారాయణస్వామిగారు మిలిటరీలో పని చేసిన వ్యక్తి. ప్రస్తుతం ఎన్.సి.సి. ఆఫీసరు కూడా ఆయనకి క్రమశిక్షణ తప్పటం బొత్తిగా నచ్చదు.
    
    వెంటనే పోలీసులకు రిపోర్టు ఇచ్చిన విషయం కనుక్కున్నాడు. నలుగురినీ పిలిచి స్టేట్ మెంట్స్ అడిగాడు. వాళ్ళు యివ్వటానికి నిరాకరించారు. అంతలోనే మాజీ ఎం.ఎల్.ఏ సమితీ ప్రెసిడెంట్ వచ్చారు.
    
    పోలీసులు రిపోర్ట్ తీసుకోలేదని చెప్పారు. ఎం.పీ.గారి జోక్యం చెప్పారు. ఎం.ఎల్.ఏ. గారు హైదరాబాద్ నుంచి ఫోన్ చేసిన విషయమూ చెప్పారు. తమ నిస్సహాయతనీ వెల్లడించారు.
    
    నిర్ఘాంతపోయాడు ఆయన. రాజకీయాలు ఇలా నైతిక విలువలని ఖూనీ చేస్తుండటంవల్లనే దేశం ఇలా తగలడుతూంది. మీరు వత్తిడి తెచ్చి రిపోర్ట్ మాఫీ చేయవచ్చు-
    
    అబ్బాయికి ఏ శిక్షాపడకుండా చూడవచ్చు. గానీ అది సమాజానికి ఎంతో హానీ అని మీకు తెలియదు. మీ అబ్బాయి సేఫ్ గా బయటపడటమే మీకు కావలసింది. మీ అవసరమైతే సి.యం.కి కూడా విషయం చెబుతాడు. ఐ.జి.తో ఫోన్ కొట్టిస్తారు. సెంట్రల్ హోం మినిష్టర్ జోక్యం చేసుకోవచ్చు. కానీ వాడిలో నైతిక విలువలు నశిస్తాయి. వాడిలో ప్రతీకార వాంఛ చెలరేగుతుంది. విచ్చలవిడిగా ప్రవర్తిస్తారు. కాలేజీ అన్నా, ప్రిన్సిపాల్ అన్నా నా దృష్టిలో నయాపైసా అంత విలువ! అంతే!


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS