Previous Page Next Page 
కాంతి రేఖలు పేజి 28

   
    ఆరాత్రి స్నేహితుడి గదిలో గడిపి, మర్నాడు ఐ.జి.పి. ఇంటికి వెళ్ళాడు. అక్కడ హాలునిండా జనం కిట, కిట లాడుతున్నారు. యెక్కడో దొమ్మి జరిగిందట. సబ్ ఇన్ స్పెక్టర్, సర్కిల్ ఇన్ స్పెక్టరు శ్రద్ధ తీసుకోవటం లేదు. జనం వెళ్ళేవరకు కూర్చుని, అతనితో విషయం చెప్పాడు.

    "అతని విషయాలలో నీకేం ఇంటరెస్ట్!" ఠీవిగా అడిగాడు.

    సిద్దార్ధ గబ, గబా విషయాలన్నీ విపులంగా చెప్పాడు.

    "మా అన్నగారని కాదు సర్. అతను దేశానికి చీడ పురుగు మీరు త్వరగా యాక్షన్ తీసుకోకపోతే ఇంకా కొన్ని హత్యలు జరుగుతాయి" అన్నాడు ప్రాధేయ పూర్వకంగా.   

    అతను అంతా శ్రద్దగా విని, యెవరికో ఫోన్ చేశాడు.

    "ఖాదర్ సాబ్ ను పిలవు" అన్నాడు.

    అటునుండి ఏం రెస్పాన్స్ వచ్చిందోగాని, అతను ఆశ్చర్యంగా విన్నాడు.

    "ఒహో! అంత గ్రంధం నడుస్తుందా! తెలియదే........" అన్నాడు.
 
    "మీరు వెళ్ళండి. నేను చూచుకుంటాను" అని సిద్దార్ధ వైపు చూచాడు.

    సిద్దార్ధ లేచి బయటికి వచ్చాడు. ఈ మధ్యకాలంలో మనుషుల్లో యెందుకింత తపన పెరిగింది. సంపాదించాలన్న తాపత్రయం పెరిగిందో అర్ధం కాదు.

    సిద్దార్ధ బయటికి వచ్చాడు రాధిక కోసం రెండు, మూడు మంచి పుస్తకాలు కొని ఇంటికి వచ్చాడు.

    పురుషోత్తమరావు చిందులు వేస్తున్నాడు.

    "ఏమిట్రా.........ఏమిటి నీ ఉద్దేశం! పెళ్ళి నా కనుకున్నావా! ఏం చూచుకుని మీకీ నిర్లక్ష్యం!"
 
    "నాకు ఉద్యోగం దొరికిన తరువాత పెళ్ళి చేసుకుంటాను నాన్నా అది నాకు నచ్చిన అమ్మాయిని, మీ కిష్టమైన సంబంధం చూచి నాకు అంటకట్టవద్దు" అన్నాడు.

    "ఒహో! చాలా వరకు వచ్చిందే చూచావా! భార్యామణి. నా కొడుకు, నా బంగారు అంటావు. మధుకు పెళ్ళి అయి బయటికి వెళ్ళిపోయినా ఈ నాటికి ఎదురు మాట్లాడి ఎరుగునా!"

    "సిద్ధూ! ఏమిట్రా ఇది!"

    "అది కాదమ్మా! మారుతున్న కాలాన్ని ఎందుకు అర్ధం చేసుకోరు. మీకంటే చిన్నప్పుడే పెళ్ళి అయింది. మీ ఇష్టా అయిష్టాలు లేవు. మా ఇష్టం ప్రకారం పెళ్ళి చేసుకుంటామంటే ఆ పెళ్ళికొడుకును చంపించటమో పెళ్ళి కూతుర్ని వంచించటమో చేస్తారు."

    "నోరుముయ్యి........" సిద్దార్ధ చెంపలు పగిలిపోయేవే. అంతగట్టిగా కొట్టాడు.

    "ఏమిటండీ ఆవేశం!"

    "ఆవేశం! ఉహు! ఈ నాటికి వీడిచేత మాటలు పడాల్సిన ఖర్మ పట్టింది. నాకు......" అన్నాడాయన ఆవేశంగా.

    "అయితే అంతా మీకు తెలిసే జరుగుతుందన్నమాట...."
 
    "ఏమిట్రా..... ఏం కూసావ్!"

    "శ్రీనివాస్ ఏమయ్యాడు!"

    "శ్రీనివాస్ దగ్గర నన్ను కాపలా ఉంచావా పళ్ళురాలగొడతాను" ఆయన ఆవేశంతో ఊగిపోతున్నాడు.

    సిద్దార్ధకు విషయం అర్ధం అయింది. తండ్రిని నిలదీసినా లాభం లేదు. ఇంకా వివరంగా మాట్లాడితే రాధిక వింటుంది. మౌనంగా వెళ్ళి పోయాడు బుగ్గలు తడుముకుంటూ అతనికేం కోపంగాలేదు. తన తండ్రికి కొట్టేహక్కు ఉంది.



                                    7


    మర్నాడు అతను లేచి కాఫీ త్రాగుతుంటే యశోదమ్మ అనునయంగా పిలిచింది.

    "సిద్దూ! ఊరి విషయాలు నీకెందుకురా! ఉండి ఉద్దరిస్తావా బాగుచేస్తావా! వుద్యోగం రాగానే వెళ్ళిపోతావు. అంతకాడికి ఈ గొడవలు దేనికి నాయనా!"

    "చేతులు ముడుచుకుని కూర్చోవాలా!"

    "అయితే మన పొలాలు చూచుకో" అన్నది. 

    "ఏం చూడాలి!"

    "మనకు ఊరవతల ఉన్న పొలంలో బావి త్రవ్విస్తున్నాము. వెళ్ళి చూడు." అన్నది.
 
    "అలాగే........" అన్నాడు


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS