Previous Page Next Page 
స్త్రీ పేజి 27

 

    చందమామ గుండ్రంగా ఉంది. అంతులేనంత వెన్నెల కాస్తుంది. అంత చల్లదనం లోనూ పద్మజ వెచ్చగా నిట్టూర్చింది.
    జార్జి లో ఏం చూసి తనింత మతి పోగొట్టుకుంటుంది? జార్జి నీ కెందుకంత ఇష్టమని ఎవరైనా అడిగితె ఏం జవాబు చెప్తుంది? అన్నిటికీ కారణాలు ఉంటాయా? ప్రతి ప్రశ్నకూ జవాబు వస్తుందా?
    జార్జి తనకు ఇష్టం! ఆ నీలి రంగు కళ్ళు తనకు కావాలి. అతి మృదువుగా చూసే ఆ చూపులు తనకు సన్నిహితంగా , అతి సన్నిహితంగా.... అంతే ఆ కోరికకు కారణం లేదు. ఉందేమో తనకు తెలీదు.
    ఆలోచనల నుంచి తేరుకోగలిగే సరికి ఎంత సేపైందో తెలియలేదు. హాస్టలంతా నిశ్శబ్దంగా నిద్ర పోతుంది. పద్మజ గదిలోకి వచ్చి బద్దకంగా పక్క మీద వాలింది. మనసంతా ఆరాటంగా ఉంది. చటుక్కున గుర్తు వచ్చిన దానిలా లేచి లైటు వేసి పెన్ను తీసుకుంది. "పారూ! నా మనస్సెంతో ఆవేదనగా ఉంది. ఎవరికైనా చెప్పుకుంటే ఆ బాధ శాంతించవచ్చుననిపిస్తుంది. బహుశా రఘూ విషయంలో నువ్వు ఇలాంటి అనుభూతే పొందిఉంటావేమో? నీలి నీలి కన్నులతో నవ్వుతూ చూసే జార్జి.... జార్జి....' కలం సాగలేదు. వ్రాయవలసింది తోచలేదు. విసుగు వేసి వ్రాసిన కాగితం నిలువుగా చించేసింది. కళ్ళకు అరచేయి అడ్డంగా పెట్టుకుని పడుకొంది.
    బీచ్ లో ఇసక తన్నుకుంటూ నడుస్తూ అతి సహజంగా అడిగాడు జార్జి" పద్మా! మీలో వర్ణాంతర వివాహాలు , మతాంతర వివాహాలు జరుగుతూనే ఉన్నాయి కదూ?"
    విస్మయంగా చూసింది పద్మజ. "ఏం? ఎందుకలా అడిగావు?"
    "తెలుసుకుందామని."
    "తెలుసుకుని?"
    "తెలుసుకుని, ఏమాత్రం అవకాశమున్న ఇండియన్ లేడీనే వివాహం చేసుకుందామని." చిలిపిగా నవ్వాడు జార్జి. జార్జి నవ్వులో, మాటల్లో వింతదనం కనిపించిందా క్షణం.
    "ఏం? ఎందుకలా అనుకుంటున్నావు?"
    "మీ స్త్రీలు భర్త పట్ల చాలా వినయ విదేయతలతో ప్రవర్తిస్తారని విన్నానులే. నాకూ అలా సుఖపదాలని ఉంది."
    "పాపం, ఎంత ఆశ"
    "దురాశ కాదుగా?"
    "ముమ్మాటికీ . ఈనాటి భారత స్త్రీ కూడా సమానత్వం కోరుతుంది. నీనుంచి పరిపూర్ణ మైన ప్రేమ, పొందగలిగినప్పుడే నీకు అంతటి సుఖ శాంతులు ప్రసాదిస్తుంది. ఏ స్త్గ్రీ గానీ, ఏ  దేశం కానీ ఈ మనస్తత్వం ఎక్కడా ఒక్కటే."
    "నే నడిగినదానికి నువ్వు జవాబు చెప్పనే లేదు, పద్మజా! నా కోరిక తీరదంటావా?"
    "తీరకపోవచ్చు."
    "ఎందుకని?"
    "నువ్వు సాహసిస్తే సరిపోతుందా? అవతలి స్త్రీ మూర్తి అంత సాహసం చూపించవద్దా?"
    "ఎవ్వరూ సాహసించలేరా?"
    "నాకెలా తెలుస్తుంది?"
    "పోనీ, నీకూ ఆ సాహాసం లేదా?"
    జార్జి సంభాషణ ధోరణి చివరికి అదే ప్రశ్న మీద నిలుస్తుందని ఊహించగలిగిన పద్మజ ఒక్క క్షణం మౌనం వహించింది. "సాహసం ఉన్నా నాకా కోరిక ఉండాలి కదా , జార్జ్?" పద్మజ పెదవుల్లో దాచుకోబోయిన చిరునవ్వు జార్జి మొహం లోకి తొంగి తొంగి చూసింది.
    జార్జి చటుక్కున పద్మజ చెయ్యి పట్టుకున్నాడు. "ఇప్పుడు చెప్పు. నీకా కోరిక లేదూ? లేదని చెప్పు."
    "లేదు. నిజంగా లేదు." ఫక్కుమని నవ్వేసింది పద్మజ.
    "ఏం? నిన్నే పెళ్ళి చేసుకోవాలని నేను కలలు కంటున్నానా?" చిరు కోపం నటిస్తూ అడిగింది.
    "నీ కలలు తెలియవు గానీ నీ మనసు నాకు తెలుసు పద్మా."
    పద్మజ తనువూ పులకరించింది. హృదయం సముద్రంతో పోటీ పడుతూ ఉప్పొంగింది. ఎంతో సేపు సముద్ర గర్భంలోకి చూస్తూ కూర్చుంది.
    "పద్మా!"
    "ఊ!"
    "ఎందుకంత మౌనంగా కూర్చున్నావు?"
    "నువ్వూ నాలాగే కూర్చున్నావుగా?"
    "నేను నిన్ను చూస్తూ కూర్చుంటే నువ్వు ఎటో చూస్తున్నావు?"
    'అనంతమైన ఆ జలరాశి కేసి చూస్తున్నాను. సముద్రం అంటే నాకు చాలా ఇష్టం."
    "ఎందుకని?"
    'అన్నిటికీ కారణాలుండవు."
    "ఎందుకుండవు? ఏదో చిన్న కారణం లేకుండా అనురాగం పుట్టదు."
    "అయితే నేనంటే నీ కెందుకంత ఇష్టం?" కళ్ళెత్తి జార్జి కన్నుల్లోకి చూసింది పద్మజ. జార్జి తదేకంగా చూస్తూ అన్నాడు: "నీ కళ్ళు విశాలంగా, నల్లగా నిగనిగలాడుతూ ఉంటాయి, పద్మా! చూసిన కొద్ది చూడాలనే ఉంటుంది."
    పద్మజ చటుక్కున కనురెప్పలు వాల్చుకుంది. పద్మా! నువ్వు నిజంగా నాకోసం సాహసం చెయ్యగలవా?" జార్జి కంఠస్వరంలో చిత్రమైన ఆవేశం ధ్వనించింది.
    పద్మజ పెంకిగా నవ్వింది. "ఏం? నీకోసం నే నెందుకంత సాహసం చెయ్యాలి?"
    "చెప్పాలి, పద్మా! నువ్వు నాకే కావాలి. నాకోసం దేన్నయినా సునాయాసంగా త్యజించాలి."
    "అసాధ్యం! నా తల్లితండ్రులు ఇష్టాలు, మా వంశా చారాలూ, హిందూమత నియమాలు-- ఇవన్నీ ఏం కావాలి?"
    "అదేం నాకు తెలీదు. వాటి ప్రసక్తి మరెప్పుడూ తేకు. నాకు నువ్వే కావాలి. నిన్ను పెళ్ళి చేసుకుని జీవితమంతా స్వర్గ ధామంలా గడిపేస్తాను."
    నిండుగా నవ్వింది పద్మజ. జార్జి లో పసితనమే కాదు! పురుషత్వం కూడా ఉంది. అమాయకత్వమే కాదు; ఆవేశం కూడా ఉంది.
    లేచి నడుస్తున్న పద్మ చేయి గుప్పిట్లోకి తీసుకున్నాడు జార్జి. "నాకు మాటివ్వాలి , పద్మా! తప్పదు."
    నవ్వుతూ చేయి విడిపించుకోటానికి ప్రయత్నించింది పద్మజ. "మాటల ద్వారా మనుషుల్ని బంధించటం వివేకం అనిపించుకోదు."
    "మరి?"
    "నా మనసు నీకు తెలుసన్నావుగా?"
    "పద్మా!"
    "నిజం, జార్జ్! నేను నీకేప్పుడో బందీనై పోయాను."
    ఎన్నడూ ఎరగని సిగ్గుతో చూపులు దించేసుకుంది.

 

                               
    తను జార్జికి మాట ఇచ్చేసింది.
    అతనికి బందీ అయిపోయిందనీ, తన మనస్సంతా అతని రూపంతో నిండి పోయిందనీ మనస్పూర్తిగా అంగీకరించింది.అతన్నే వివాహం చేసుకుని తన జీవితంలో కోరికలన్నీ తీర్చుకుంటుందని నమ్మబలికింది.
    ఆ క్షణంలో తనకు సర్వ స్వతంత్రాలు ఉన్నాయనే విశ్వసించింది. ఇష్టమైన వ్యక్తిని వివాహం చేసుకుని ఆ భర్త సన్నిధిలో సుఖించాలని స్త్రీలాగే కోరుకుంది.
    తనేమీ ప్రకృతి కి విరుద్దంగా ప్రవర్తించలేదే? పద్మజ నిట్టుర్పు గాలిలో కలిసిపోయింది.
    ట్రెయిన్ దిగి వస్తూనే జార్జి కి ఫోన్ చేసింది. ఓ అరగంటలో అతను రావచ్చు. బట్టలైనా మార్చకుండా మంచం మీద పడుకుండి పోయిన పద్మజ లేచి కూర్చుంది. తండ్రి ఒక్కడైనా తన కోరికను అర్ధం చేసుకుంటే ఈ వేదన ఉండేది కాదు. భర్తను నిర్ణయించుకో గలిగే ధైర్యం, వివేకం తనకు ఉన్నాయని అయన స్వయంగానే అన్నాడు. తను ఇష్టపడే వ్యక్తీ తోనే వివాహం జరిపిస్తానని సంతోషంగా చెప్పాడు. తీరా తన కోరిక వినేసరికి తట్టుకోలేకపోయాడు. ఆ కొద్ది నిమిషాలలోనే తండ్రి పడిన క్షోభ పద్మజ ను రంపపు కోత కొస్తుంది. తను జార్జి నే వదులు కుంటే? అన్న ఆలోచనకు కూడా అవకాశమిస్తుంది. తనేం చెయ్యాలి? ఏం చెయ్యగలదు?
    మతానికి మతానికీ తేడా ఉంది.
    జాతికీ జాతికి తేడా ఉంది.
    వంశానికి, వంశానికి తేడా ఉంది.
    అందుకే మనిషికి మనిషికి కూడా తేడా ఉంది, తండ్రి దృష్టి లో.
    జార్జీ కీ, తనకూ ఎంత మాత్రం సంబంధం పనికి రాదని అయన ఉద్దేశ్యం.
    తను మాత్రం దాన్ని అంగీకరించదు.
    జాతి మత ప్రభావాలు మనిషి మీద ఉండవచ్చు కొంతవరకూ. అన్ని విధాలా మనిషి ఆ ప్రభావానికి బానిసై పోనంతవరకే. అసలు జాతి మతాలను ఏర్పరచుకున్న ఉద్దేశ్యమేమిటో మనిషి గ్రహించగలిగిన నాడు అవి లేకుండానే బ్రతకగలడు. వాటి ప్రయోజనాన్ని పొందటం ఒక్కటే ధ్యేయంగా పెట్టుకుంటాడు. ఏ జాతి గానీ, ఏ మతంకానీ మనిషిని మనిషిగా బ్రతకాలనే ఉద్భోదిస్తుంది. ఏ యిద్దరు మనుషులు మానవత్వానికి తేడా లేదనే తన ఉద్దేశ్యం.
    తనేమీ పొరపాటుగా ప్రవర్తించలేదు.
    పసితనం నుంచీ అల్లారు ముద్దుగా పెంచి తన ముద్దు ముచ్చట్లన్నీ తీర్చిన తండ్రి హృదయానికి పెద్ద అఘాతమే కలిగించింది. అది తన దౌర్భాగ్యమే. ఆలోచనల ఉదృతం తగ్గితే మనస్సు కొంత తేలికైంది.
    హూలాల్ విప్పుకుని ఇస్త్రీ చీరా, టవలూ తీసుకుని బాత్ రూమ్ కేసి నడిచింది.
    జడ అల్లుకొంటూ నౌకర్ని పిలిచి కాఫీ వంపించింది.
    డాక్టర్ జార్జి విలియమ్స్ నీలురంగు కారు చప్పుడు లేకుండా వచ్చి ఆగింది. జార్జి బూట్లు టకటక లాడించుకుంటూ పైకి వచ్చాడు.
    పద్మజ ఎప్పటి లా ఫ్రెష్ గా ఉంది . అదే చిరు నవ్వు! అదే గంభీర్యం!
    "గుడ్ మార్నింగ్ , పద్మా!"
    'మార్నింగ్! కూర్చో!"
    జార్జి సోఫాలో పద్మజ పక్కనే కూర్చున్నాడు.
    "చాలా తొందరగా వచ్చేశావ్!"
    "వచ్చేశాను."
    "ఒక వారం రోజులైనా అవుతుందన్నావు కదూ?"
    "అనుకున్నాను. అవసరం లేకపోయింది."
    జార్జి పద్మజ చేయి తీసుకుని మొహంలోకి చూశాడు.
    "ఎందుకంత ముక్తసరిగా మాట్లాడుతున్నావు?"
    పద్మజ నవ్వి అంది: "నాకు నీమీద కోపం వచ్చింది."
    "అన్యాయం! నేనేం చేశాను? ఈ మూడు రోజుల నుంచీ క్షణం యుగం లాగ పిచ్చి వాడిలాగే గడిపాను. నీ ఫోన్ కాల్ వస్తే నమ్మలేక పోయాననుకో. ఇవ్వాళ డ్యూటీ కి లీవ్ పెట్టి వచ్చేశాను.' జాలిగా చూశాడు జార్జి.
    పద్మజ దీర్ఘంగా నిట్టూర్చింది. "నువ్వు నా జీవితంలో ప్రవేశించకుండా ఉంటేనే బావుండేది, జార్జి!'
    "పద్మా!"
    పద్మజ జార్జి హృదయానికి తల అనించుకొంది.
    "నీకోసం నేను అందర్నీ వదులుకొని వచ్చేశాను."
    "నిజం?" అర్ధం కాని ఆందోళనతో పద్మజ భుజాలు పట్టి ఊపాడు జార్జి. పద్మజ జార్జి గుండెలకు మరీ గాడంగా అతక్కుపోయింది. "నువ్వు తప్పితే నాకిప్పుడేవ్వరూ లేరు, జార్జి!"
    పద్మజ గడ్డం పట్టుకుని కళ్ళలోకి చూశాడు జార్జి. "నిజం చెప్పు , పద్మా! నాకోసం....ఇంత త్యాగం చేశావా?"
    పద్మజ కళ్ళలో నీరు చిందింది. ఆవేదనగా నవ్వింది.
    "నీకోసం కాదు. ఎవరి కోసమూ నేనే త్యాగం చెయ్యలేను. అంతా నాకోసమే చేసుకున్నాను. నా సౌఖ్యం కోసం, నా సంతోషం కోసం, నా సంతృప్తి కోసం, నా శాంతి కోసం -- అంతా నా కేసమే చేసుకున్నాను. నాకున్న స్వార్ధం చాలా మందికి ఉండదు, జార్జ్!"
    జార్జి పద్మజ తల మీద చేయి వేశాడు. "నువ్వు బాధ పడుతున్నావా పద్మా? అసలేం జరిగిందో నాకు చెప్పవా?"
    "అంతా నేనన్నట్టే జరిగింది. నాన్నగారు చెప్పిన సంబంధం నా కిష్టం లేదని చెప్పేశాను. పోనీ, నాకిష్టమైన వివాహమే చేస్తానంటే నీ గురించి చెప్పాను."
    "ఊ ఏమైందప్పుడు? వారికి చాలా కోపం వచ్చింది కదూ?"
    "కోపాన్ని దాచుకోగలిగారు కానీ బాధని అణుచుకోలేకపోయారు. కొంతవరకూ చెప్పి చూశారు. నా నిర్ణయం మారదని తెలుసుకుని నా దారిని నన్ను పంపించి వేశారు."
    'చాలా చిత్రంగా ఉంది. మీ కుటుంబాలలో ఇంత సంస్కారం కలిగిన వ్యక్తిని గురించి నేనెన్నడూ వినలేదే! చివరికి వారు నిన్ను క్షమించి నట్లేనా?"
    'ఆ సంగతి నేను తెలుసుకోలేదు. ఆయనకు బాధ కలిగించెంత తప్పు చేస్తూ అయన నుంచే క్షమ నర్ధించే అర్హత లేదు నాకు. శాశ్వతంగా అందర్నీ వదులుకుని వచ్చేశాను."
    "పద్మా!" గాడంగా హృదయానికి హత్తుకున్నాడు జార్జి. అపూర్వమైన పెన్నిధి లభించినంత అపురూపంగా పద్మజ శరీరం చుట్టూ చేతులు చుట్టి పదిలపరుచుకున్నాడు. "పద్మా!" పద్మజ తో ఏంతో చెప్పాలని ఉంది జార్జికి. ఏమీ చెప్పలేకపోయాడు. తన మనస్సు ను వేల్లాడించాలనే కాంక్షతో పద్మజ పెదవుల మీద గాడంగా ముద్దు పెట్టుకున్నాడు. "మనం సాధ్యమైనంత తొందరగా పెళ్ళి చేసుకుందాం, పద్మా!"
    పెదవులు కంపిస్తుంటే మృదువుగా నవ్వింది పద్మజ.
    "అవును, రేపు వీలైతే రేపే చేసుకుందాం."
    "నీ తల్లిదండ్రులనీ, అందర్నీ వదిలి వచ్చేశావు. నువ్విక ఒక్క ఘడియ కూడా ఒంటరి తనంతో బాధ పడకూడదు."
    "నువ్వుండగా నేనెప్పుడూ ఒంటరిని కాను, జార్జ్!"
    జార్జి నీలి నీలి కళ్ళలోకి కాంక్ష గా చూసింది పద్మజ.
        
                                *    *    *    *


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS