10
సాయంత్రం అయిదున్నర గంటల వేళ సారంగ తువ్వాలుతో తడి ముఖాన్ని తుడుచుకుంటూ బాత్ రూమ్ లో నుంచి ఇవతల కొచ్చాడు.
ఖరహర ప్రియ కలకల లాడుతూ ఎదురొచ్చింది ..లేతాకు పచ్చ నైలాన్ చీర, ముదురాకు పచ్చ నూలు జాకెట్టు చేతికి ఆకుపచ్చని గాజులు-- రామచిలుకలా కనిపించింది.
"నువ్వు అన్నీ ఇంతేలే అన్నయ్యా? అన్నీ నాకు తెలీకుండా దాచి పెడతావ్?' అంటూ ఆనందాతిశయంతో అడిగింది ప్రియ.
తువ్వాలు స్టాండు మీద పడేస్తూ సారంగ అయోమయంగా చూశాడు.
ప్రియ మూతి వంకర్లు తిప్పింది. తెచ్చి పెట్టుకున్న కోపంతో ముఖం మరో వైపుకి పెట్టింది. సారంగ మాత్రం ఇవేవీ పట్టించుకోకుండా తన గది వేపుకు వెళ్తున్నాడు. ప్రియ సారంగను వెళ్ళనివ్వలేదు. గభాలున వెనక్కి తిరిగి దారి కడ్డంగా నించుంది.
"అడ్డం లేవే బేబీ!"
ప్రియకిసారి నిజంగానే కోపం వచ్చింది. అయితే ఏం చేయటం? అన్నయ్యకు చెబితేనే గాని ఏదీ అర్ధం కాదు.
"నా జడ చూడన్నయ్యా! బాగుండలేదూ?" అంది ప్రియ కదలకుండా నిలబడుతూ.
ప్రియ జడ కేసి చూసేసరికి సారంగ కు మతి పోయింది. భుజాలు దాటని ప్రియ జడ మూడింతలు ఎదిగి కూర్చున్నది! వత్తుగా, నల్లగా పిరుదలు దాటి వ్రేలాడుతున్న త్రాచు పాము లాంటి జడ!
ప్రియ గిర్రున ఇటు తిరిగింది.
"ఎంత బాగుందన్నయ్య సవరం! నాకు చెప్పకుండా డ్రాయరు లో దాచి పెడితే కనుక్కోలేనేమిటి?" అంది గారాలు గడుస్తూ.
సారంగ ముఖాన కత్తి వెతుకు నెత్తురు చుక్క లేదు.
జడ ముందు - వేసుకుని మురిసిపోతూ ప్రియ "ఏరా అన్నయ్యా! మాట్లాడకుండా అలా బెల్లం కొట్టిన రాయిలా నిలబడతావేం?' అంది.
సారంగ కాస్త ధైర్యం తెచ్చుకుని ప్రియకు దగ్గరగా వెళ్ళాడు.
'అది బేబీ....అది ....నా ఫ్రెండ్ ది!"
ప్రియ నవ్వింది.
"చాల్లే అన్నయ్యా నీ జోక్! మీ ఫ్రెండ్ సవరాలు వేసుకుంటాడా?"
"వాళ్ళ చెల్లెలు కోసం తెమ్మంటే....."
ప్రియ నిర్లక్ష్యంగా తల తిప్పింది.
"ఆ అమ్మాయికి మరొకటి కొనివ్వచ్చులే...." అంటూ వీధిలోకి నడిచింది.
గేటు తలుపు తీసుకుని వెళ్తున్న చెల్లెల్ని చూసి సారంగ కు నోట మాట రాలేదు!
ప్రియ హుషారుగా నడిచి వెళ్తున్నది.....
ఇలాంటి సవరం కోసం తను ఎన్నాళ్ళనించో తపిస్తున్నది! ఏడిపించటానికి కాకపొతే తనకోసం తెచ్చి ఎవరో స్నేహితుని చెల్లెకి తెచ్చాడట! అన్నయ్యను యిలా కాదు, వీలుచూసుకుని గట్టిగా ఎడిపించాలి!
ప్రియ రీడింగ్ రూం దరిదాపుల్లోకి వచ్చింది. రోడ్డు కార్లు, రిక్షాలు, పెట్టె బళ్ళతో సందు లేకుండా ఉంది. రోడ్డు మీద మనుష్యులు సందడిగా తిరుగుతున్నారు. మసక చీకటిగా ఉంది కాని ఇంకా లైట్లు వెలిగించలేదు....
ప్రియ అడ్డంగా వచ్చేవారిని తప్పించుకుంటూ మందగమనం తో నడుస్తున్నది -- ఉన్నట్టుండి ప్రియ తల స్పింగు లా వెనక్కి వంగి లేచింది. ప్రియ చటుక్కున వెనక్కు తిరిగి తన జడ గుంజిన పోకిరీని ఒక చేత్తో పారిపోకుండా పట్టుకుని, రెండో చేత్తో కాలిజోడు వూడలాగి రెండు దవడల మీద శక్తి కొద్దీ ఆడా పెడా వాయించింది. ఈ గొడవకు చుట్టూ చిన్న గుంపు తయారైంది. కొందరు హేళనగా చూస్తున్నారు. మరికొందరు నవ్వుతూ నిలబడ్డారు.
చెప్పుదెబ్బలు తిన్న అబ్బాయి దవడల మీద చేతులుంచుకుని "అబ్బా!' అని మూలిగాడు.
ప్రియ తేరిపార చూసి కంగారు పడింది.
"అరె! నువ్వా అన్నయ్యా?....పద! ఇంటికి పోదాం!" చుట్టూ ఉన్న గుంపును తోసుకుంటూ వెళ్ళి ఒక రిక్షాను బేరమాడి తీసుకొచ్చింది ప్రియ. సారంగను అందులో కూర్చోబెట్టి తనూ ఎక్కింది. దారి పొడవునా సారంగ పడిపోకుండా మీద చేతులేసి గట్టిగా పట్టుకుంది.
త్రోవలో ప్రియ క్షమార్పణ చెప్పుకున్నది.
"నువ్వనుకోలేడురా అన్నయ్యా.!.... బాగా నొప్పెడుతున్నదా?"
సారంగ మాట్లాడకుండా మూలిగాడు.
'ఆడపిల్లల జడలు గుంజటం ఎప్పటి నించి? అమ్మమ్మతో చెప్తా నుండు!" అంది కోపంగా ప్రియ.
సారంగ బుగ్గల మీది నుంచి చేతులు తీసి దీనంగా ప్రియ రెండు చేతులూ పట్టుకున్నాడు.
"అమ్మమ్మతో కాని తాతయ్య తో కాని ఆ మాట అనకే బేబీ! నువ్వు ఎంతో మంచిదానివి!" అన్నాడు నెమ్మదిగా ఆగి ఆగి మాట్లాడుతూ.
సారంగ కళ్ళలో కనబడుతున్న దిగులును ప్రియ చూడలేకపోయింది. ఏం చేయలేక అరచేతులు కేసి చూసుకుంది. సత్తువ కొద్ది లాగి....పాపం! అన్నయ్యకు ఎంత బాధగా ఉన్నదో?
రిక్షా గేటు ముందు ఆగేసరికి ప్రియ తన ఆలోచనలో నుంచి తెప్పరిల్లింది. వరండా లో మెర్కురీ బల్బు వెలుగులో అమ్మమ్మ మెట్ల కానుకుని కూర్చుని ఉంది. సారంగ కు ప్రాణాలు యెగిరి పోయినంత పనయింది. అయినా చేతులు క్రిందికి దించుకుని ధైర్యంగా దాటుకుని పోబోతున్న సారంగ ను అమ్మమ్మ చెయ్యి పట్టుకుని ఆపింది.
"సారంగా! మీ ఫ్రెండేవరో ఇప్పుడే వచ్చి వెళ్ళాడు!" సారంగ "ఊ" అనక ముందే అమ్మమ్మ సారంగ ముఖం కేసి తేరిపార చూచి గబగబా లైటు క్రిందికి ఈడ్చుకొని వెళ్ళింది. ముఖం మీద కొట్టిన ఆనవాళ్ళు చూసి అమ్మమ్మ కంగారు పడింది.
"అయ్యో! ముఖం మీద ఇదేమిటిరా?.... అయ్యో! అయ్యో!" అంటూ అమ్మమ్మ బుగ్గలు నొక్కుకున్నది.
రంభ తోకాడించుకుంటూ సారంగ దగ్గరకు వచ్చింది.
సారంగ బాధ లేనట్టు నటిస్తూ గొంతుకని ప్రయాస తో హెచ్చిస్తూ అన్నాడు.
"బేబీని తమాషా చేద్దామని జడ పట్టుకుని గుంజితే ఆ రోడ్డు మీదే నించో పెట్టి ఎడాపెడా వాయించింది అమ్మమ్మా!"
అమ్మమ్మ ప్రియ కేసి మందలిస్తున్నట్టు చూసింది.
"అదేమిటే? సరదాకు పట్టుకుని లాగితే చచ్చేట్టు కొట్టావ్?' ప్రియ బిక్క ముఖం వేసుకుని నిలబడింది.
సారంగ అడ్డుకున్నాడు.
"అది కాదు అమ్మమ్మా! బేబి ఎవరో పోకిరి వెధవ అనుకున్నదట!...."
అమ్మమ్మ ముఖం వికసించింది.
ప్రియ వంక ఆప్యాయంగా చూస్తూ "అది అల్లరి చిల్లరి పిల్లా కాదురా -- మన బేబి లాంటి బుద్దిమంతురాలు లోకంలో కాగడా పెట్టి వెదికినా కనబడధనుకో!" అంది.
సారంగ మూలుగు విని అమ్మమ్మ గబగబా సారంగ ను గదిలోకి తీసుకెళ్ళి పక్క మీద పడుకో బెట్టింది. రంభ కూడా వెనకాలే వచ్చి దిగులుగా మంచాని కెదురుగా పడుకుంది.
"కుక్క విశ్వాసం దేనికీ ఉండదు!' అనుకున్నాడు సారంగ అంత బాధలోనూ చిన్న బోయినా రంభ ముఖం చూసి.
"శోంటి అరగదీసి పట్టు వేస్తె సలుపెం ఉండదురా!' అంటూ అమ్మమ్మ లోపలి కెళ్ళింది.
ప్రియ అపరాధి లా కళ్ళ నీళ్ళు పెట్టుకుంటూ తొందరపాటు చేటు అని వూరికే అన్నారా?.... ఒక్క క్షణం ఆగి ముఖం వంక చూస్తె ఏంటయేది? అన్నయ్య నోరెత్తడానికి కూడా సందు ఇవ్వలేదు....రోడ్డు మీద అందరూ నిలబడి తమాషా చూస్తుంటే తనూ, అన్నయ్య ఏం జరగనట్టు రిక్షాలో కూర్చుని వచ్చేశారు. ఇప్పుడా దృశ్యాన్ని తలచుకుంటే తల తీసేసినట్టుగా ఉంది .... నడి రోడ్డులో "తమాషా' ఏమిటి? ఎవరి జడ లాగబోయి తన జడ లాగాడో?
సారంగ మెల్లిగా "బేబీ" అని పిలిచాడు.
ప్రియ కళ్ళు నీళ్ళు తుడుచుకుని మంచానికి దగ్గరగా వెళ్ళింది.
"గట్టిగా కొట్టానా అన్నయ్యా! నువ్వనుకోలేదురా? ... కోపం వచ్చిందా?' అంది మళ్ళా నొచ్చుకుంటూ.
సారంగ లేచి కూర్చుని తలగడను వళ్ళో పెట్టుకున్నాడు తలగడ మీద ముడుకులాన్చి ముఖాన్ని చేతుల్లో దాచుకున్నాడు. కాస్సేపయ్యాక సర్దుకుని కూర్చుని "బేబీ! నాకో సాయం చేసి పెట్టవూ?" అనడిగాడు దీనంగా చూస్తూ.
ప్రియ మౌనంగా సారంగ వంక చూసింది.
సారంగ గొంతుక సవరించుకున్నాడు.
"ఆ అమ్మాయి లేదు బేబీ?..... ఆ అమ్మాయిని మనింటికో మాటు తీసుకు రావూ?"
ప్రియ నవ్వింది.
"ఆ అమ్మాయంటే ఏ అమ్మయ్యో నాకేం తెలుస్తుంది?"
సారంగ గుమ్మం కేసి అమ్మమ్మ రావటం లేదని ధైర్యం తెచ్చుకొని గొంతుక తగ్గించి చెప్పాడు.
"అదే!..... ఆరోజు నువ్వు వెంటబెట్టుకుని తీసుకురాలా ఇద్దరమ్మాయిల్నీ?....అందులో తెల్లగా ఉన్న అమ్మాయి గాక మరో అమ్మాయి..."
"చిత్రా?" అంటూ ఆశ్చర్యంగా చూసింది ప్రియ. మళ్ళీ 'ఆ అమ్మాయితో మీకేం పనీ?" అంది గట్టిగా.
ఆమ్మమ్మ వింటుందేమోనని హడలుకున్నాడు సారంగ.
సారంగ క్రిందకు పెట్టిన కాళ్ళను మంచం మీది కెత్తి నీరసంగా పడుకున్నాడు.
"బేబీ!...ఇది నా డెత్ బెడ్....!' అన్నాడు మెల్లిగా.
ప్రియకు నోట మాట పెగిలి రాలేదు... రెండు బుగ్గలూ ఇంతెత్తున వాచీ, సెప్టిక్ అయి అన్నయ్య నిజంగానే....! అన్నయ్య మళ్ళా మనుష్యులలో పడి తిరగ్గలడా? ఏ ప్రాయశ్చిత్తం చేసుకుంటే తను అన్నయ్యను రక్షించుకోగలదు?
'అన్నయ్యా!' అంటూ బావురుమంది ప్రియ.
సారంగ కంగారు పడ్డాడు.
"నేను నిక్షేపంలా బ్రతుకుతాను.... నువ్వు కనక చిత్రను ఇక్కడకు తీసుకు వచ్చావంటే...."
ప్రియ మనస్సు తేలికయింది.
"అమ్మయ్య! ఎంత కంగారు పెట్టావ్?.... చిత్రను రేపే తీసుకొస్తాను..."
అమ్మమ్మ చిన్న గంధం గిన్నెతో మెల్లిగా నడిచి వస్తున్నది.
"నేను రమ్మన్నట్టు మాత్రం చిత్రకూ చెప్పేవు సుమా బేబీ!' అంటూ అమ్మమ్మ కు వినబడకుండా ప్రియను హెచ్చరించాడు.
అసలు సంగతి చిత్రకూ ఏ ముఖం పెట్టుకుని చెప్పటం? తనంటే అసలే మండి పడుతుంది. అలాంటిది నిజం వప్పుకుంటే తనను క్షమిస్తుందా? అయినా తన మనస్సుకు పశ్చాత్తాపం క్రుంగదీస్తున్నది. తనను నాలుగు మాటలన్నదని ఎంత మోటుగా ప్రవర్తించాడు! చిత్ర కాళ్ళ మీద పడి బ్రతిమాలుకుంటాడు. కనికరిస్తుందో , కాఠిన్యాన్ని వహిస్తుందో మరి ఆపైన ఆమె చిత్తం.
* * * *
