* * * *
సినిమా హల్లో కూర్చున్నాక శారద అడిగింది.
"ఇంగ్లీష్ సినిమా నాకేం అర్ధమవుతుంది? చెబితే వినిపించుకోవు కాని!"......
శేఖర్ షర్టు కాలరు పైకెత్తాడు.
"నాలుగు సినిమాలు చూస్తె అదే అలవాటవుతుంది..." మాసిపోయిన పంచ, పై మీద కండువా, చేతిలో కాలుతున్న చుట్ట, చెవులకు కాడ, ముక్కుకు కాడ, కిర్రు చెప్పులతో ఒక పల్లెటూరతను సరాసరి కుర్చీ వరసల కేసి వస్తున్నాడు. అతడు వచ్చి "శేఖర్ పక్కన ఉన్న కుర్చీలో కూర్చున్నాడు.

సినిమా హాలు , ఫస్టు బెల్లు కొట్టటం తో గిరగిర తిరుగుతున్న ఫంకాలు , తెర, లోపలి కోస్తున్న జనం కేసి వింతగా, విస్మయంగా తలతిప్పి చూస్తుంటే పల్లేటూరతని పిలక జోరుగా నాట్యం చేస్తున్నది.... శేఖర్ కు నవ్వొచ్చింది. చేతి రుమాలు నోటి కడ్డం పెట్టుకుని శారద మీదికి వంగి మెల్లిగా అన్నాడు.
"నీ కంతా అనుమానమే.... నా పక్కన కూర్చున్న బైతుకేం అర్ధమవుతుంది నీకే తెలియకపోతే?"
శారద కుర్చీలో నుంచి కాస్త ముందుకు వంగి ఆ పల్లెటూరి మనిషిని చూసింది... ఆ మనిషి కుర్చీలో సాగిలబడి నిర్భయంగా చుట్ట నట్టుకుని కాలుస్తున్నాడు.....
శారదకు నవ్వుతో పాటు ఆశ్చర్యం కూడా వేసింది.
"వీడికేమైనా బోధ పడుతుందా బావా?" శేఖర్ వెక్కిరింతగా కనుబొమ్మలు ఎగరేశాడు.
'అడగమంటావా?' అంటూ శేఖర్ అటు తిరిగేసరికి శారద గాభరా పడింది.
"నీ పుణ్యం ఉంటుంది: లేనిపోని తగువులు తేకు!"
శేఖర్ ఇటు తిరిగి చిలిపిగా నవ్వాడు.
"పోనీలే నీ కంత భయమైతే ....ఇంగ్లీషు సినిమాల్లో స్టంట్లవీ ఎక్కువగా ఉంటాయి. భాష రాకపోయినా అందరికీ అర్ధమవుతాయి. భలే బాగుంటాయిలే--"
శారద ఒక నిమిషం వూరుకుని అడిగింది.
"నీకు స్టంట్లు నచ్చుతాయా?"
"మజాగా ఉంటాయిలే.... ఒకడి మీద మరొకడు పడి సీసాల్లా దొర్లటం, పీకలు నొక్కుకోవటం ఫెడీ ఫెడీమని తగల్నివ్వటం , కుస్తీపట్లు...."అభినయంతో సహా హుషారుగా చెప్పుకుపోతున్న శేఖర్ ను శారద మధ్యలో అడ్డగించింది.
'అంత సరదా అయితే నువ్వు యుద్దంలో కెళ్ళాల్సింది!"
శేఖర్ కంగారుగా చూశాడు.
"మరి....మరి ....నేను యుద్దంలోకి వెళ్తే నీకు బాధగా ఉండదూ?' అనడిగాడు.
శారద సమాధానం ఇవ్వకముందే సినిమా ప్రారంభం అయింది. పాడు సినిమా! అని తిట్టుకున్నాడు శేఖర్. శారద ఏమని జవాబిచ్చేదో?
అట మధ్యలో శారద అడిగింది.
"ఆ మనిషి ఏం అంటున్నది బావా?.... నాకేం అర్ధం కావటం లేదు...." అంది చేత్తో తెరకేసి చూపించి.
ఏం అంటున్నదో గొడవ! వెధవ ఇంగ్లీష్! మూతి ముందుకు పెట్టి "ష్! ష్' అనటం తప్ప ఇంకేం తెలీదు! ఒక్క ముక్క అర్ధమైతే రెండోది 'ష్ ష్' అంటూ వినపడుతుంది. దానర్ధం ఏమిటో ఎవడికి తెలుస్తుంది?,.... శారదకు ఏదో ఒక జవాబు చెప్పకపోతే ఎలా?
"వాడిని రేపు వాళ్ళింటికి రమ్మని పిలుస్తున్నదిలే--"
శేఖర్ ఇలా చెప్పాడో లేదో తేర మీద అమ్మాయి, అబ్బాయి కొట్టుకున్నంత పని చేశారు.
శారద శేఖర్ కేసి తీక్షణంగా చూసింది.
"నీకు నాపాటి కూడా తెలిసినట్టు లేదు. వాడిని చూస్తేనే మండి పడుతున్నది కాని వాడి నెందుకు రమ్మంటుంది?... ఇంగ్లీష్ చదువుకున్నావు. ఏం లాభం?"
శేఖర్ కు తల తీసేసినట్టనిపించింది.
"అది కాదె శారూ! సినిమా ఇంగ్లీష్ వేరేగా ఉంటుంది!"
శారద కళ్ళు పెద్దవి చేసి చూసింది. "ఏమిటీ?' అన్నట్టు. శేఖర్ గాభరాగా అన్నాడు.
'అదే...అదే....తెలుగులో పుస్తకాల్లో భాష, మాట్లాడుకునే భాష అని లేవూ? అలాగే...."
"మరి తెలుగులో సినిమా భాష లేదుగా? ఇంగ్లీష్ లో ఎందుకున్నది?" అంటూ నిలవేసింది శారద.
శేఖర్ కు ఆపద్భాందవుడిలా అడ్డుకున్నాడు పక్కన కూర్చున్న పల్లెటూరీ బైతు. భుజం మీద బరువుగా , బలమైన చెయ్యి పడేసరికి శేఖర్ ఉలిక్కిపడి అటు తిరిగాడు. బైతు ఇరికించాడు.
"నాకు తెలీక అడుగుతాను కాని బాబూ! ఆ తెర మీదపడే ఆడమనిషి ఇంతకీ ఎవడి పెళ్ళాం బాబూ? అడి మీదా పడిపోద్ది, ఈడి మీదా పడి పోద్ది....అదుగో చూడు బాబూ! సంకల మీదికి గౌనేసుకుంది ఆ మనిషి మాటే బాబూ!' అనడిగాడు గట్టిగా.
ముందు వరసల్లోని వాళ్ళు కోపంగా వెనక్కి తిరిగి చూశారు సినిమా వినపడకుండా పోయినందుకు.
చేతిలో రుమాలు మూతి ముందుకు రాకముందే శేఖర్ కు నవ్వు ముంచు కొచ్చింది. నవ్వుతూనే తెరకేసి తేరిపార చూశాడు. హీరోయిన్ చాలా రోజులకి తండ్రిని, అన్నని కలుసుకున్నది. తండ్రి, అన్న ఒకరి తర్వాత ఒకరు గట్టిగా కావలించుకుని, వదలకుండా ముద్దులు కురిపిస్తున్నారు.
"ఏటి బాబూ! మాటాడకుండా నవ్వేసుకుంటావ్?"
ఏదో ఒక జవాబు చెప్పకపోతే వూరుకునే రకం కాదు!
"ఆ అమ్మాయికి ఇంకా పెళ్ళే కాలేదు....' అని చెప్పాడు శేఖర్. పాపం! అతనికి కధ బొత్తిగా అర్ధం కానందుకు జాలేసింది.
బైతు చటాలున కుర్చీలో నుంచి లేచి మీద కప్పుకున్న కండువా గట్టిగా దులుపుతూ , "గుడిసేటిదేటి బాబూ! చస్! ఇంగ్లీష్ సినిమాలు బెమ్మాండంగా ఉంటాయంటే నిజమే అనుకున్నాను.... ఈ బూతులు సూపెట్టటానికి నా దగ్గర రూపాయి లాగాడు!" అంటూ పెద్ద గొంతుకతో తిట్టుకుంటూ వెళ్ళిపోయాడు.
తెరమీది దృశ్యాలను చూడలేక తల దించుకుంది శారద.
"మనం కూడా పోదాం రా బావా! ఏం ఇంగ్లీష్ సినిమాలు! పచ్చి బూతులు !.... ఇంగ్లీష్ వాళ్ళకి నీతేమిటి నా మొహం! ...నీతో రావటం నాదే బుద్ది తక్కువ!" అని సన్నగా గొణిగింది.
శేఖర్ శారదను చేతులతో వారించాడు.
"అమ్మమ్మ! ఎంత మాటన్నావ్? ఇంగ్లీష్ వాళ్ళ నీతి ఈ మధ్య ప్రపంచ ప్రఖ్యాతి పొందితెను? ఒక మంత్రి ఎవరితోనో తిరిగాడట. అందుకని ఆ మంత్రి పనిలో నుంచి తప్పుకున్నా కేవలం 'నీతి' అనే మాట కోసం ఇంగ్లీష్ వాళ్ళు పిలకా పిలకా పట్టుకుని పోట్లాడుకున్నారు."
శారద పకాలుమంది. శేఖర్ తెల్లబోయాడు.
"ఇంగ్లీష్ వాళ్ళు పిలకలు పెట్టుకోవటం ఎప్పటి నించి?" శేఖర్ తేలికపడి నవ్వాడు.
"అదే! హేటు హేటు పట్టుకుని హాట్ హాట్ గా ....వాట్ వాట్?"
శేఖర్ శారద వెనకాతలే పరిగెత్తాడు . సినిమా హాలు మరుగయ్యాక "నీతో ఇంకెప్పుడూ చస్తే ఇంగ్లీష్ సినిమాకు రాను!" అంది శారద దూకుడుగా.
శేఖర్ గుండె నిమురుకున్నాడు.
"అమ్మయ్య! తెలుగు సినిమా లైనా వస్తావు కదా!" శారద మాట్లాడలేదు.
"నా కిష్టమైనప్పుడు అమ్మకు శారదంటే ఎందు కిష్టం ఉండదూ?' అనుకున్నాడు శేఖర్ మనస్సులో.
* * * *
మరో రెండు రోజుల తర్వాత శేఖర్ తన మనస్సు మార్చుకోవలసి వచ్చింది. లేకపోతె తన కోసం నిక్షేపం లాంటి శారద ప్రాణాలు గాలిలో కలసిపోతాయి.... రామన్న శారదను ఖూనీ చేసి పారేస్తాడు. అలా అని వాడి దగ్గర్నించి ఉత్తరం వచ్చింది.
మళ్ళా ఒకసారి జేబులో నుంచి ఉత్తరం తీసి చదువుకున్నాడు శేఖర్.
"ఖబడ్దార్!
నీకిది నా హెచ్చరిక. నువ్వు మళ్ళా నీ మరదలితో కలిసి కంటబడ్డావా మీ ఇద్దరి ప్రాణాలు దక్కవు. నీ కళ్ళ ముందు నీ మరదల్ని ఖూనీ చేసి తర్వాత నీ పని పడతా. జాగ్రత్త! నీ మరదలు బ్రతకాలని ఉంటె ఆవిడతో నీ పెళ్ళి మాట అనుకోకు....
......."
శేఖర్ ఉత్తరం మీది ముద్ర కేసి పరిశీలనగా చూశాడు. రామన్న కు తన మీద ఎంత కసి! ఇంతకీ రామన్న ఏ వూళ్ళో ఉన్నాడో?
ఎప్పుడోచ్చిందో కాని శారద శేఖర్ కు కాస్త దూరంలో వరండా లో స్తంభాని కానుకుని కూర్చుని ఉంది.
"ఏమిటి బావా? అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావ్?"
శేఖర్ దిగులుగా శారద కేసి చూశాడు.
"రామన్న ఉత్తరం రాశాడు...."
"రామన్నేవరు? మీ స్నేహితుడా?"
శేఖర్ మాట జారినందుకు నాలిక కరుచుకున్నాడు.
ఏమీ తెలియని శారదకు తను ఆశలు కల్పించాడు. ఇప్పుడు ఆ ఆశలను త్రుంచి వేస్తె సుకుమారి శారద భరించగలదా? మగవాడికి ఆడదాని కన్నా గుండె నిబ్బరం ఎక్కువ. అలాంటిది తనకే కాళ్ళూ చేతులూ ఆడటం లేదు. రామన్న సంగతి చెప్పి శారద నెందుకు బాధ పెట్టడం?
శేఖర్ మాట్లాడకుండా లేచి లోపలకు వెళ్ళాడు. కళ హెచ్చరించక పొతే కళకు డీ కొట్టేవాడే!
"అదేమిటి బావా! అంత పరాకుగా నడుస్తున్నావ్?"
శేఖర్ శూన్యంగా కళ కళ్ళలోకి చూశాడు. కళకు గుండెల్లో దేవినట్టయింది. బావ తన కోసం త్యాగం చేయటం లేదు కదా అనుకున్నది బాధగా.... నిన్నటి దాకా ముక్కూ ముఖం తెలియని సుధాకర్ మీద తనకెందుకో ఈ మమకారం? కనీసం సుధాకర్ తనను పెళ్ళి చేసుకుంటాడనే ఆశ కూడా లేదు. తనని చేసుకోవాలని ఉంటె నాన్న కా సంగతి చెప్పేవాడేగా? విధి వ్రాత కాకపొతే తన జీవితంలో సుధాకర్ ఎందుకు తారస పడాలి? తారస పడినంత మాత్రాన హృదయాన్ని అర్పించుకోమని ఎవరు చెప్పారు? బావతో తనకు పెళ్ళి కాకుండా ఉంటె సుధాకర్ తనవాడు కాగలడని మనస్సులో ఓమారు మూల కించిత్తు ఆశ.... తన భవిష్యత్తు బావ చేతిలో ఉంది.
తప్పుకుని వెళ్ళబోతున్న శేఖర్ తో "బావా!" నాకు నీ సాయం కావాలి!" అనడిగింది కళ ప్రాధేయపడుతున్న ధోరణి లో.
శేఖర్ ఆశ్చర్యపోయాడు. తను చేయగల సహాయం ఏమై ఉంటుందా అని.
"నా చేతిలో ఉన్న సాయమైతే తప్పకుండా చేస్తాను కళా! ఇంతకీ ఏమిటది?"
కళ పమిట చెంగు చేతి వేలికి చుట్టుకుంటూ క్రిందికి చూస్తూ అన్నది.
"నాన్నగారికి నువ్వు ఉత్తరం రాయకూడదూ?'
"ఎందుకు రాయకూడదు?' అన్నాడు శేఖర్ అయోమయంగా.
కళ గొంతుక తగ్గించి మెల్లిగా వినీ వినపడనట్టు అంది.
'అదే....నీకు నన్ను పెళ్ళి చేసుకోవటం ఇష్టం లేదని...."
శేఖర్ నిట్టూర్చాడు. పెళ్ళి మాట ఎత్తితే మనస్సు కలుక్కుమంటున్నది. కళను చేసుకోవటం ఇష్టం లేదు. శారదను చేసుకోవాలన్నా చేసుకోలేడు......
శేఖర్ జాగ్రదావస్థలోకి వచ్చి "నువ్వు ఎలా చెబితే అలాగే రాస్తాను. లేదా నువ్వు రాసి అడుగున సంతకం పెట్టమంటే పెడతాను.... కాయితం , కలం తీసుకుని రానా?" అంటూ బల్ల దగ్గరకు వెళ్ళబోయాడు.
కళ వారించింది.
"ఆ ఒక్క ముక్కా చాలు బావా! నువ్వే రాసి పడెయ్యి...." అంటూ అక్కడ నించి కదిలి వెళ్ళిపోయింది.
