డాక్టర్ చదువంత ఇబ్బంది పెట్టె చదువు మరింకొకటి లేదు. పొద్దున్న ఏడింటికి వెళ్తే వార్డులన్నీ చుట్టుకొని ఏ సాయంత్రం ఏడింటికో ఇల్లు చేరుకోవడం.! ఇంత శ్రమ పడినా ఎవడికే రోగమో ఎంతకీ వెధవ బుర్రకి అంతుబట్టదు. అంతుబట్టే లాగుంటే మూడో యేడు దాటకుండా ఎందుకుంటాడు.
ఎమర్జన్సీ నుంచి కొన్ని కోర్సుల వ్యవధి తగ్గించేస్తున్నారు కదా డాక్టర్ కోర్సు మాత్రం ఎందుకు తగ్గించకూడదు?.... తగ్గిస్తే రోగులు కూడా యమర్జెంటుగా వైకుంఠం చేరుకుంటారు. అటు జనాభా సమస్యకూ సాయం చేసినట్టవుతుంది......
అడ్డం ముందు నిలబడి క్రాఫింగు దువ్వుకుంటున్న ప్రభాకర్ కు మరో గదిలో మంచం మీద లేచి కూర్చుని బద్దకంగా వళ్ళు విరుచుకుంటున్న నాన్నగారు అద్దంలో అల్లావుద్దీన్ కు పద్మిని కనిపించినట్టుగా కనబడ్డారు.

నాన్నగారు నిద్రమత్తులో ఉన్నప్పుడు చాలా సౌమ్యంగా ఉంటారు. ఎన్నో రోజుల నుంచో ఉషను గురించి ఆయనకు చెప్పాలని ...ఎప్పటి కప్పుడు ఆయన్ని చూడగానే ధైర్యం చాలక చల్లగా జారుకోవడం.... అడక్క పొతే అమ్మయినా పెట్టదుట! ఉన్నసంగతి చెప్పకపోతే నాన్నగారి కేం తెలుస్తుంది? ఆ తర్వాత హటాత్తుగా ఎవరో అమ్మాయిని తీసుకొచ్చి మంగళసూత్రం కట్టమంటే తన 'ప్రేమ' ఏం కాను?.... పెళ్లి సంగతి ఖచ్చితంగా తండ్రితో తేల్చుకోవలసిందే.......
ప్రభాకర్ అద్దం ముందు నుండి కదిలి తండ్రి ఉన్న గదిలోకి కెళ్ళాడు. లావుగా, బీకరంగా కనబడుతున్న ఆకారం-- వంటి మీద షర్టు లేకపోగా మరీ నిండుగా కన్పిస్తున్న విగ్రహం , మెలుకువ వచ్చినా ఇంకా నిద్రమత్తు వదలని కళ్ళు --
ప్రభాకర్ కనబడగానే అయన "ఏం రా?' అనడిగారు ఆవులిస్తూ.
ప్రభాకర్ నసిగాడు.
"అది కాదండి! నేను ఒక తెలిసిన వాళ్ళమ్మాయిని ప్రేమించాను.... పెళ్లి చేసుకుంటాను!"
తండ్రి అర్ధం కాని చూపు చూచాడు.
"ఏమిట్రా నీ గొడవ తెల్లవారక ముందే!... మూడో ఏడులో కూర్చుని ఎన్నో ఏడు..!' అనడిగాడు ప్రభాకర్ ను పరికించి చూస్తూ.
ప్రభాకర్ చేతులు నలుపుకుని "మూడో ఏడు...." అని జవాబిచ్చాడు.
"ముందర ఈ మూడో యేడు గట్టెక్కు! తర్వాత పెళ్ళి సంగతి ఆలోచించవచ్చు -- " అంటూ తండ్రి బద్దకంగా మరొకసారి ఒళ్ళు విరుచుకుని మంచం మీది నుంచి క్రిందకు దిగబోయాడు.
"అదేనండి నేను చెప్పేది!.... ఆ అమ్మాయి దగ్గరుంటే చెవులు మెలేసైనా గట్టేక్కిస్తుంది!"
తండ్రి మంచం మీంచి దిగి నిలబడుతూ "ఇంతకీ ఎవర్రా ఆ అమ్మాయి?" అన్నాడు చిరాగ్గా నిర్లక్ష్యంగా.
"రామయ్య గారమ్మాయి ....ఉష . మేమిద్దరం ప్రేమించుకున్నాం...."
తండ్రి ప్రభాకర్ వంక పక్క చూపులు చూశాడు.
"నాకీ ప్రేమ గీమల్లో నమ్మకం లేదురా అబ్బాయ్"
"అయ్యో రామా! ఇప్పుడు మిమ్మల్నేవరు ప్రేమించమన్నారండీ!"
"ఎడిశావులే! బుద్దిగా వెళ్ళి చదువుకో!.. తరువాత వాళ్ళ నన్నొచ్చి అడిగితె ఆలోచిద్దాములే!' అంటూ తండ్రి పెరట్లోకి దారి తీశాడు.
ప్రభాకర్ సంతోషంతో కావలించుకోవాలనిపించినా తమాయించుకుని తండ్రిని వెళ్ళనిచ్చాడు.... రామ్మయ్య గారి అభ్యంతరం ఏముంటుంది? ప్లీడరు గారి ఏకైక పుత్రుడు తను-- పైగా ఎం.బి.బి.ఎస్ చదువుతున్నాడు. నిక్షేపం లా కళ్ళకద్దుకుని ఉషను చేతిలో పెడతాడు....ఉషకీ సంగతి చెప్తే ఏం చేస్తుంది? సరదా పడుతుందా? సిగ్గు పడుతుందా?... రిస్టు వాచీ కేసి చూసుకుంటే టైం ఏడు దాటుతున్నది. బస్సు కోసం ఎదురు చూసి స్టాన్లీ కెళ్ళే వేళకు ఎలా లేదన్నా ఎనిమిదవుతుంది. ఈరోజు ఈ ఉడ్ బీ డాక్టర్ వెళ్ళక పొతే బెంగ పెట్టుకు పోయే రోగెవడూ ఉండడు.
ప్రభాకర్ సరాసరి ఉష ఇంటి దారి పట్టాడు. గేటు తీసుకొని లోపలికెళ్ళేసరికి డ్రాయింగ్ రూమ్ లో రామయ్య గారు కాఫీ తాగుతూ కనిపించాడు. ప్రభాకర్ ను చూడగానే రామయ్య గారు సంతోషం తో కుర్చీలో నుండి కదిలి , కాఫీ గబగబా త్రాగేసి , కప్పు కింద పెడుతూ ప్రభాకర్ ను మరో కుర్చీ లో కూర్చోమని సైగ చేశారు. ప్రభాకర్ కూర్చోనెంతలోనే పంచలో మూతి తుడుచుకుంటూ "కులాసా? కనిపించటమే మానేశావయ్యా!" అన్నారు.
"తీరికుండడం లేదండీ!" అంటూ సంజాయిషీ చెప్పుకున్నాడు ప్రభాకర్.
"మంచి సమయానికే వచ్చావు లేవయ్యా! శుభవార్తా విని వేల్దూవు గాని....మా అమ్మాయికి సంబంధం కుదిరింది--"
ప్రభాకర్ గుండె లాగినంత పనైంది. అయన తనసంగతి పసిగట్టి వెక్కిరింతగా అనటం లేదు కదా?
"ఏ అమ్మాయి?" అన్నాడు రామయ్య గారికి అయిదుగురమ్మాయిలని స్పురణకు వచ్చి.
రామయ్య గారు ఎంత బడుద్దాయి వయ్యా అన్నట్టు చూశారు.
"మా పెద్దమ్మాయికళ. సుధాకర్ ని నా ఫ్రెండు కొడుకులే. లెక్చరర్ చేస్తున్నాడు.... నిన్ననే అక్కడి నుండి ఉత్తరం వచ్చింది కళను చేసుకుంటారని..."
ప్రభాకర్ తేలిగ్గా వూపిరి తీసుకున్నాడు.
"చాలా సంతోషం'! రాకరాక వచినందుకు మంచి శుభవార్త చెప్పారు!"
రామయ్య గారు సంతోషంలో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
"మొదట కళను మా మేనల్లుడికి ఇవ్వాలనుకున్నామయ్యా....అయినా వాళ్ళిద్దరికీ నచ్చలేదు కాబోలు మా మేనల్లుడు కళకు వేరే సంబంధం చూసుకోమని రాశాడు.... పోనీ మా రెండో అమ్మాయిని చేసుకోవాలని ఉందేమో రాసి కనుక్కోవాలి...."
ప్రభాకర్ ఆసక్తి లేకుండా వింటున్నాడు....
"సుధాకర్ జాతకం పంపించమని రాయాలి.... అన్నట్టు నీకు చక్రం చూడ్డం వచ్చునా?"
"నన్ను తమాషా చేయడాని కడుగుతున్నారు. కాని, మీకు రాదా ఏమిటి?' అన్నాడు ప్రభాకర్ ఉష పలుకులు జ్ఞాపకం వచ్చి.
రామయ్య గారు ఉబ్బిపోయారు.
"వచ్చునుకోవయ్యా! అయినా ఇంట్లో వాళ్ళకి చూసేటప్పుడు భయంగా ఉంటుంది...."
ఏదో జ్ఞాపకం వచ్చినట్టు చూసి "ఇంతకీ నాకు వచ్చన్న సంగతి ఎలా కనిపెట్టావయ్యా?' అన్నారు.
"ఇందులో నేను కనిపెట్టిందేముంది లెండి నా మొహం! ఉష చెప్పింది...."
రామయ్య గారు పిడుగు పడినట్టు చూసేసరికి ప్రభాకర్ కంగారు పడ్డాడు. ఉష పేరెత్తినందుకు నిలువునా నీరై పోయాడు. ఎలాగూ ఉష ప్రస్తావన వచ్చింది కాబట్టి అసలు సంగతి మెల్లిగా రామయ్య గారి చెవిని వేస్తేనో? అగ్గిరాముడై పోడు కదా?... అయన మాత్రం కరివేపాకు కోస్తున్న వాళ్ళావిడ్ని చూసి ప్రేమించలేదూ? ఇప్పుడు ఉషకి , తనకు మధ్య అడ్డం ఎందుకు వస్తాడు?
"మరి...మరి... మీ మూడో అమ్మాయి జాతకం, నా జాతకం ఫస్టుగా కలిశాయి.... మీకిష్టమైతే ఉషని నేను చేసుకుంటాను..."
ఇంత ధైర్యంగా చెప్పగల్గింది తనేనా ఆశ్చర్యపోయాడు ప్రభాకర్ తర్వాత.
రామయ్య గారు కుర్చీలో నుంచి లేచారు. ప్రభాకర్ రెండు బుగ్గలూ ఫేడేలు మనక తప్పదనుకున్నాడు గాభరాగా. నీరసంగా ఒక్క నిమిషం కళ్ళు మూసుకున్నాడు. రామయ్య గారు వెనక్కి చేతులు కట్టుకుని పచార్లు చేస్తూ "ఏమిటీ?" అన్నారు.
ప్రభాకర్ మెల్లిగా కళ్ళు విప్పి చూశాడు. రామయ్య గారు కొట్టలేదు. అంతవరకు మంచి వారే! ధైర్యే సాహసే లక్ష్మీ... కాదు కాదు ఉష!--
"మీరు కరివేపాకు చెట్టు గురించి చెప్పారు కదండీ.. అలాగే నేను, ఉష బస్సు స్టాపింగు లో...."
కరివేపాకు చెట్టు మాట వినగానే రామయ్య గారు మెత్తబడ్డారు. ముఖం ప్రసన్నంగా మారింది.
"ముందు మా రెండో అమ్మాయి పెళ్ళి కానియ్యవయ్యా! దాని పెళ్ళయక అలాగే చేసుకుందురూ కాని.... మా మేనల్లుడు వప్పుకుంటే సరేసరి! లేదా దానికి వేరే సంబంధం చూడాలి...."
నక్క తోకకు తొక్కి రాలేదు కదా అనుకున్నాడు. ప్రభాకర్ పట్టలేని సంతోషంతో. ఆనందాతిశయం తో గుండె ఆగిపోతుందేమో అనుకున్నాడు కాని అలా ఆగకుండా టకటకా కొట్టుకుంటూనే ఉన్నది. అమ్మయ్యా! ఉషకి తాను కట్టబోయే మంగళసూత్రం గట్టిది!
రామయ్య గారి దగ్గరి నుంచి సెలవు తీసుకుని వెళ్ళాడు ప్రభాకర్. రామయ్య గారు గుమ్మం దాటేంత వరకు నాలుగు వీధులూ తిరిగి మళ్ళా వచ్చాడు. తలుపు తట్టేసరికి గీత వచ్చి తలుపు తీసింది. ప్రభాకర్ పలకరించి డ్రాయింగు రూంలోకి తీసుకెళ్ళింది గీత.
దిగులుగా కనబడుతున్న గీతను చూసి ప్రభాకర్ 'అలా ఉన్నారేం?" అనడిగాడు సోఫాలో కూర్చుంటూ.
"తల నొప్పిగా ఉంది. ఉషను పంపిస్తానుండండి." అంటూ లోపలి కెళ్ళింది గీత.
పాల నురగ లాంటి తెల్లని వాయిల్ చీర , తెల్లని జాకెట్టు తో చెవుల కున్న బెంగాలీ రింగులు ఆడించుకుంటూ మౌనంగా నడిచి వస్తున్న ఉషను చూసి ప్రభాకర్ దేవలోకం నుండి దిగి వస్తున్న ఈ అప్సరస ఎవరా అనుకుంటూ విస్మయంగా చూపులు సారించాడు.
"మీరు....మీరు....ఉషేనా?"
"సోఫాకు ఎదురుగా కుర్చీలో కూర్చుంటూ ఉష చిరుకోపంతో ముతి ముడుచుకుంది.
"మీరెప్పుడూ ఇంతే! నేను మీ కెక్కడ జ్ఞాపకం ఉంటాను లెండి!...ఉష నంటూ ఎవరు దగ్గర కొచ్చినా నిజమే అని నమ్మేస్తారనుకుంటా...."
ప్రభాకర్ సోఫాలో నుంచి ఉష దగ్గర కొచ్చాడు. కుర్చీ మీది నుంచి ఉష మెళ్ళో చేతులు వేస్తూ "అవున్లెండి! అందుకే యిప్పుడోచ్చి మీ నాన్నగారి కాళ్ళు పట్టుకున్నాను.... కోరిన వాడిని పెళ్ళి చేసుకోవటం కోసం పార్వతి తపస్సు చేసింది... మీరు నాకోసం ఏం చేశారు చెప్పండి?"
ఉష ప్రభాకర్ చేతులను మెల్లిగా విదిపించుకుంటూ నవ్వింది.
"శివుడు నాట్యం చేస్తాడు....మరి మీ కెంత మాత్రం వచ్చో చూడనివ్వండి!"
ప్రభాకర్ నవ్వేశాడు.
"మనం పార్వతీ పరమేశ్వరులం కానక్కర్లేదు లెండి -- ఉషా ప్రభాకర్ లలాగే ఉండి పోదాం!.... మరి మన పెళ్ళికి మీ నాన్నగారు వప్పుకున్నారు.... మరో రెండు మూడు నెలల్లో...."
ఉష గంబీరంగా చూస్తూ నిట్టూర్చింది.
"గాలి మేడలు కట్టకండి!"
ప్రభాకర్ కు ముఖం మీద ఈడ్చి పెట్టి తన్నినట్టనిపించింది.
"గాలి మేడలెం కాదు లెండి. మీ నాన్నగారు, మా నాన్నగారు వప్పుకున్నారు...."
ఉష నెమ్మదిగా పెదాలు కదిపింది.
"గీతక్క పెళ్ళి కానివ్వండి. అప్పుడు ఆలోచించుకోవచ్చు మన పెళ్ళి మాట!"
ప్రభాకర్ నిర్లక్ష్యంగా నాలిక చప్పరించి అన్నాడు.
"అదా మీ బెంగ! మీ బావకు ఉత్తరం రాస్తా నన్నారు...."
"గీతక్క బావనేం చేసుకోదు లెండి!"
ప్రభాకర్ నిర్లక్ష్యంగా ఈల వేశాడు.
'ఆవిడకు ఇష్టమైన వాడినే చేసుకోనివ్వండి. అందులో దిగులు పడాల్సిందెం ఉంది?"
