Previous Page Next Page 
ఒప్పందం పేజి 27

 

    "పోదామా? ఏం కాదా?" ఆశగా అనుమానంగా అడిగాడు శీనయ్య. అతనికి లోపలి కెళ్ళి ఒక్కసారి ఆ గోడలు చేత్తో తాకాలని ఉంది. నిలువెత్తు అద్దాల్లో తనని తాను చూసుకోవాలని ఉంది. నీడలారే ఫ్లోరింగ్ మీద తన నీడ చూసుకోవాలని ఉంది. ఆకాశాన్ని తాకుతున్నట్టున్న ఆ హోటల్ పైకెళ్ళి ఒక్కసారి చేత్తో అందితే ఆకాశాన్ని అందుకోవాలని ఉంది.
    ఇంతలో వరసగా నాలుగు ధగధగ లాడే కార్లు వచ్చాయి. ఆ కార్లను చూసిన కొంతమంది పెద్దవాళ్ళు హడావుడిగా కార్లకు ఎదురెళ్ళరు. కార్లలో నుంచి అందమైన అబ్బాయిలు, అమ్మాయిలూ దిగారు. వాళ్ళని చూసిన ఆర్కెస్ట్రా ఊపందుకుంది.
    "అరేయ్...చిరంజీవిరా... చిరంజీవి వచ్చిండు,..... నడవండిరా పోదాం.... చిరంజీవి ని చూద్దాం.... అదిగో జయప్రద.... అరె.."
    "ఆమె శ్రీదేవి కాదూ, అరె రాండిరా" అందరి కన్నా సినిమాలు ఎక్కువగా చూసే శీనయ్య ఉత్సాహంగా అరిచాడు.
    "అవునురోయ్...వాళ్ళు సినిమావాళ్ళే....చిరంజీవి వచ్చిండురాయ్...." అన్నాడు సిద్దయ్య.
    "పదండి రా పోదాం.....ఐదుగురు ఆపుకోలేని ఉత్సాహంతో మెయిన్ గేటు దాటి లోపలికి వెళ్ళబోతుంటే చేతులు అడ్డంగా పెడుతూ వచ్చారు ముగ్గురు  బలంగా ఉన్న గేటు కీపర్లు.
    "ఏయ్....ఎక్కడికిరా.... నడవండి బైటకి.... కనిపించడం లేదా ....పెద్దపెద్ద వాళ్ళున్నారు లోపల. ఎక్కడికి వస్తున్నారు?" అదిలిస్తూ వాళ్ళని నెట్టేయబోతుండగా అన్నాడు ఎంకటేశు...."మేమే గీ హోటలు కట్టినోళ్ళం...."
    "అయితే.... మీ పేరు మీద రాసిచ్చాడా సారు.... ఎక్కువ మాట్లాడకుండా పొండి....నడవండి బైటకి.... " వాళ్ళని తోస్తూ మెయిన్ గేటు  బైటకి తీసుకొచ్చాడు.
    వాళ్ళందరికీ కోపం వచ్చింది. దుఖం వచ్చింది. రోషం వచ్చింది. కానీ ఏదీ ప్రదర్శించలేని నిస్సహాయతతో గేటు బైట ఆశగా, ఆసక్తిగా, ఓపిగ్గా అలా నిలబడి మెరిసిపోతున్న హోటల్ అందాలను, కనిపించీ కనిపించకుండా అలా కనిపించి ఇలా మాయమైన సినీ తారలను కాళ్ళు ఎత్తి వేళ్ళ మీద నిలబడి కాసేపు కాంపౌండ్ వాల్ మీద నుంచి మెడ ఎత్తి కాసేపు వాచ్ మాన్ చూడనప్పుడు గేటుకి దగ్గరగా వెళ్ళి కాస్సేపు చూస్తూ నిలబడ్డారు.
    కొన్ని నిముషాలు గడిచాక హటాత్తుగా ఆర్కెస్ట్రా ఆగిపోయింది. సూటు బూటు వేసుకున్న మగవాళ్ళు, ఆధునికంగా ఖరీదైన చీరలు, నగలతో తయారైన ఆడవాళ్ళు గుంపుగా చేరగా వాళ్ళను జరగమని చేతుల్తో సైగ చేస్తూ చేతిలో కెమెరా లతో విలేకరులు , వాళ్ళ కెమెరాల ని క్లిక్ మనిపిస్తుంటే, ఆ మెరుపుల వెలుగుల్లో చిరునవ్వుతో ఠీవిగా రిబ్బన్ కట్ చేసి హోటల్ ప్రారంభం చేశాడు వాళ్ళ అభిమాన హీరో....చప్పట్లు మారుమోగాయి.
    అప్రయత్నంగా ఆ పది చేతులు చప్పట్లు కొట్టాయి. ఆనందంతో వాళ్ళ గుండెలు ఎగేరేగిరి పడ్డాయి. మేము కట్టిన హోటల్ మా హీరో ప్రారంభించాడు. కాస్సేపు వాళ్ళ మనస్సులో గర్వం తొణికిసలాడింది. గుంపు చెదిరింది.... చేతిలో కెమెరాలతో విలేకర్లు, వీడియో గ్రాఫర్లు ఆ హీరో ని వెంబడిస్తూ హోటల్ లోపలికి వెళ్ళారు. మిగతా వాళ్ళంతా వాళ్ళని అనుసరించారు.
    వీడియో హోటల్లో ని ప్రతి అణువునీ, కెమెరాల్లో బంధిస్తోంది. ఆ కట్టడానికీ, దానికి తగ్గట్టుగా అలంకరించిన ఫర్నిచర్ ని, ఇంటీరియాల్ డెకరేషన్ ని పోగుడుతోంటే హోటల్ యజమాని పొంగిపోతున్నాడు. అయన హైదరాబాద్ లో ఉన్న సంపన్ను లలో మూడో వ్యక్తిగా పరిగణించబడినవాడు. పొలిటికల్ పవర్ ఉన్నవాడు. అతని వెనకాలే ఆ హోటల్ కాంట్రాక్ట్ పొందిన కంట్రాక్టర్ వినయంగా పెంపుడు కుక్కలా తిరుగుతున్నాడు. మళ్ళీ అయన చేయబోతున్న మరో వెంచర్ కి తానే కాంట్రాక్ట్ అందుకోడానికి తనవంతు పైరవీ కృషి చేస్తున్నాడు.
    పలచబడిన ఆవరణ లో ఆ ఐదుగురి కళ్ళు ఆ కంట్రాక్టర్ కోసం గాలిస్తున్నాయి. అతను కనిపిస్తే తప్పకుండా తమని లోపలికి తీసి కేల్తాడన్న ఆశ వాళ్ళల్లో మెదుల్తోంది.
    కొద్దిసేపట్లో అందరూ బైటకి వచ్చి లాన్ లో గుండ్రంగా వేసిన కుర్చీల్లో కూర్చున్నారు. మళ్ళీ యధాప్రకారం ఆర్కెస్ట్రా మొదలైంది.
    లోపల్నుంచి వెయిటర్స్ రకరకాల ఆహార పదార్ధాలు తీసుకొస్తూ టేబిల్స్ మీద పెడుతున్నారు. డ్రింక్ చేసేవాళ్ళు, భోం చేసేవాళ్ళు.... కబుర్లు చెప్పుకుంటున్న వాళ్ళు... సినీ తారలతో ఫోటోలు తీయించుకుంటున్న వాళ్ళు....
    ఆ కమ్మటి వంటల సువాసనలు గాలిలో తేలి మెయిన్ గేటు దాకా వచ్చి ఆ ఐదుగురి నాసికా పుటాలను తాకాయి. అప్పటిదాకా అణచి పెట్టిన ఆకలి విజ్రుంభించింది. ఇప్పుడు వాళ్ళ కళ్ళు గుత్తేదారు కోసం వెతకడం ప్రారంభించాయి. అతను కనక తమల్ని చూస్తె తప్పకుండా లోపలికి తీసికెళ్ళి కమ్మటి వంటలతో తీపి పదార్ధాలతో ఖరీదైన ఐస్ క్రీమ్ తో కడుపు నిండా తిండి పెట్టిస్తాడన్న ఆశ.... విశ్వాసం.... అలా ఎదురు చూడడం లో వాళ్ళకి సమయం తెలియలేదు. బైట ధగధగ ల్లో బాగా చీకటి పడిపోయిందని అర్ధం  కాలేదు. నెమ్మది, నెమ్మదిగా కార్లు వెళ్ళిపోతున్నాయి. జనంపల్చబడ్డారు. రాజకీయ నాయకులు, సినిమా తారలు అంతా వెళ్ళిపోయారు. మిగతా అతిధులు కూడా దాదాపు వెళ్ళిపోయారు.
    'అదుగోరా మన సారు" గట్టిగా అరిచాడు సిద్దయ్య.
    ఐదుగురూ ఆశగా, ఆదుర్దాగా, చూశారు. ఖరీదైన సూటు లో ఉన్న వ్యక్తితో  మాట్లాడుతూ కంట్రాక్టర్ ....ఆ సూటు వాలానే హోటల్ యజమాని సుదీర్ కుమార్.
    ఐదుగురూ ఇంక ఒక్క క్షణం ఆలస్యం చేయలేదు. ఎక్కడ లేని శక్తితో పరుగు పెట్టారు. ఆగండి, ఆగండి అంటూ గేటు కీపర్లు వెంట బడుతున్నా కాళ్ళల్లో అంత శక్తి ఎలావచ్చిందో ఐదుగురూ ఆయాసపడుతూ కంట్రాక్టర్ ని చేరి ఏక కంఠం తో "సార్" అని పిలిచారు.
    సుదీర్ తో సహా కంట్రాక్టర్ కూడా ఉలిక్కిపడి చూశాడు. లైట్ల వెలుగులో వెలసిపోయిన పాతగోడల్లా కనిపించారు వాళ్ళంతా.... "ఏంట్రా...." ఎప్పుడు వచ్చారు? "చాలా ప్రేమగా అడుగుతూ సుదీర్ తో చెప్పాడు. "వీళ్ళు కూలీలు సార్....ఎదో పాపం ఇనాం ఆశిస్తున్నారు' అంటూ వెనకాలే పరిగెత్తు కొచ్చిన గేటు కీపర్ తో అన్నాడు. "వీళ్ళ కి ఏమన్నా స్వీట్స్ ఉంటె ఇచ్చేయండి. కూలీలు కదా.... వాళ్ళకి తప్పకుండా పెట్టాలి. పొండిరా.... లోపలికి వెళ్ళకండి.దూరంగా ఉండండి." అంటూ ముందుకు నడిచాడు. సుధీర్ కుమార్ తో కలిసి అతని కారు దగ్గరకు వెళ్తోన్న కంట్రాక్టర్ ని నిర్ఘాంత పోయి చూస్తూ ప్రతిమల్లా నిలబడ్డ ఆ ఐదుగురి చేతుల్లో పేపర్ ప్లేట్స్ లో కట్టిన ఐదు బాదం బర్ఫీలు ముక్కలు, ఐదు జీడు పప్పులు తీసుకొచ్చి ఇంద....తీసుకెళ్ళండి అంటూ వాళ్ళ చేతుల్లో కుక్కి వాళ్ళ భుజాలు పట్టుకుని మెయిన్ గేటు దాకా తీసుకొచ్చి బైటికి నెట్టారు గేటు కీపర్లు.
    ఏం జరుగుతుందో వాళ్ళ మెదడు గ్రహించే లోపల అప్పటి దాకా హోటల్ ఆవరణ లో దేదీప్యమానంగా వెలుగుతోన్న లైట్లు ఒక్కొక్కటే ఆరిపోవడం ప్రారంభించాయి.

                                                           ***


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS