"సరే .....నువ్వెళ్ళు"
కొండలు వెళ్ళిపోయిం తర్వాత శ్రీనివాసరావు సీతని పిలిచి చెప్పేడు.
"ఆఫీసరు వచ్చేరట. కబురంపేడు"
"ఇందిర వచ్చిందా?"
"ఆ విషయం ఏడు కొండలకెందుకు చెబుతాడాయన? కొంచెం కాఫీ యిస్తావా? వెళ్ళి వస్తాను."
"ఇప్పుడే వెళ్ళాలా? .....మీ వంట్లో...."
"పిచ్చి మొహమా ? నాకేం భయం లేదే సీతా! సెలవులు వృధాగా మురిగిపోతున్నాయని నాలుగు రోజులు పెట్టేను. అంతే నాకేం?.....నీకు తెలుసో తెలీదు మొన్న నాకు తెలిసిన డాక్టరోకాయన దగ్గిరికి వెళ్ళెను. ఆయనేమో నెత్తురు పరీక్ష వగైరాలు చేసి "నీకు జబ్బు లేదు -- పోమ్మన్నాడు. వెళ్ళు వెళ్ళు ......ముందు కాఫీ పట్రా."
సీత అక్కణ్ణించి వెళ్ళిపోయింది.
(నాకేం పరవాలేదని ఎవరైనా డాక్టరు బాబు హామీ ఇస్తే బాగుండిపోను బ్రదర్, ఇది ప్రమాదకరమైన వ్యాధి, వుత్త కాస్ట్రీ ఎఫైర్! అంత ఖర్చు పెట్టె తాహతు నీకున్నా నీ బతుక్కి మాత్రం గారంటీ ఇవ్వలేను - అనేస్తే నా గతేం గాను? ఆ చెప్పిన మరుసటి రోజు నేనుండను సీతా! కొంచెం ఓపిక పట్టు.....నా జబ్బేమిటో తెలీక మానదు. అంతవరకూ నన్ను విసిగించకు)
సీత ఇచ్చి కాఫీను తాగి అతను అఫీసరింటికీ వెళ్ళేడు.
శ్రీనివాసరావుని చూస్తూనే కళ్ళనిండా ఆనందాన్ని నింపుకుని , మాటలో ఆత్మీయతని జోడించి అన్నారు.
"రండి, రండి , ఇదిగో .....మన రావుగారు వచ్చేరు. రండి లోపలికి."
రావ్ ఎంతో ఆనందించేడు. బహుశా ఇందిర వచ్చి వుంటుందని భావించేడు."
ఆ రోజు ఆఫీసరూ, అయన సతీమణి కలిసి అతన్ని లోపలికి ఆహ్వానించడం కొత్తగా వుంది. అతను సిగ్గుతో లోపలికి వెళ్ళేడు. మరునిమిషంలోనే అతను పసిగట్టేడు. ఇందిర ఇంట్లో లేదని. అందుచేత అతను బిక్కుబిక్కుమంటూ ఆఫీసరు కళ్ళలోకి చూసేడు.
"కూర్చోండి ముందు" అన్నారాయన.
శ్రీనివాసరావుతో పాటు ఆఫీసరూ కుర్చుని అన్నారు.
"ఏమిటో అనుకున్నాను రావ్ గారూ! చూస్తుంటే నా మతి పోయిందనుకొండి- వారికి, అదే మీ ముకుందం గారికి మీరంటే ఎంత ప్రేమా, ఎంత అభిమానమనీ! కారెక్కి వెళ్ళిపోయేవారు కాస్తా మమ్మల్ని చూచి - ఎలా పోల్చుకున్నారో ఏమో ఆగిపోయి 'శ్రీనివాసరావు తరుపునోచ్చారా ?' అన్నారు. మేము తలలూపేం. అంతే అయన కారేక్కలేదు. మమ్మల్ని వెంట పెట్టుకుని లోపలికి వచ్చేసేరు. మా కళ్ళ ముందే ఎవరికో ఫోన్ చేసి గంట ఆలస్యంగా వస్తానని చెప్పేరు. నిజం చెప్పేద్దు ! ఆ స్థితికి ఎదిగిన మీ మిత్రుడు ఇంకా మిమ్మల్ని అభిమానిస్తున్నారని తెలిసి నేనెంత ఆనందించేననుకున్నారూ?"
శ్రీనివాసరావు కళ్ళలో నీళ్ళు తీరిగే ప్రమాదమానన్నమాయినప్పుడు , అతను వెంటనే తల దించేసుకున్నాడు.
"మీ క్షేమ సమాచారములతోటే అరగంట గడిచిపోయింది. నేనక్కడికి వెళ్ళింది అమ్మాయిని తెచ్చుకునేందుకా , లేక మీ స్నేహితుడికి మీ క్షేమాలు చెప్పేందుకా - ఆయనదేమీ పట్టించుకోలేదు."
"ఇందిర వచ్చిందా సార్?"
అయన ఆనందంగా తల ఊపి చెప్పేరు.
"రాక ఏమవుతుంది? అమ్మాయిని మా కప్పగించేరు. ఇందిరకి కొన్ని సలహాలు యిచ్చేరనుకొండి. అది వేరే విషయం. - కాని , రావుగారూ , నిజంగా మీరు అదృష్టవంతులండి."
ఆవిడగారు కాఫీలు పట్టుకు వచ్చి ఇద్దరికీ యిచ్చి, తనూ కూర్చుని అన్నది -
"ఏమిటో సినిమా మనుషులంటే నాకు గిట్టేది కాదా, మీ ముకుందాన్ని చూచి తరవాత ఆ అభిప్రాయాన్ని మార్చున్నాను బాబూ! ఎంత వినయం, ఎంత మంచితనం .....మేమక్కడ ఉన్నంతసేపూ మీ విషయాలే మాటాడెం . అవునూ .....మళ్ళీ మీరంతా కలిసి నాటకమేదో...."
అఫీసరందుకున్నాడు.
"అవునండోయ్ నే నా విషయమే మరిచెను. రెండు నెలల్లో మీ కాలేజి లో ఓల్డ్ స్టూడెంట్స్ ఫంక్షన్ ఏదో వుందిటగా. ఆర్గనైజరు ముకుందంగారెనట. ఆనాటికి , మళ్ళీ నాటకం ఏదో మీతో కలిసి వేస్తారుట. నాటకం పేరు కూడా చెప్పారండి. నీకు గుర్తుందేమిటి?"
"దేవుడు!"
"కరెక్ట్ దేవుడే! ఆ నాటకం పూర్వం మీరంతా కలిసి వేసేరట?"
"నాకీ విషయాలేమీ అతను రాయలేదు."
"నెమ్మదిగా రాస్తారు లెండి"
"బహుశా మళ్ళీ నేను ఆ నాటకంలో వుండనెమో."
"అదేం?"
"నాకు ఆరోగ్యం బాగాలేదు."
"అదేం కుదరదు పాపం. ఆయన్నీ బాధ పెట్టకండి . నెలకాకపొతే , రెండు నెలలు సెలవు పెట్టండి. నో వర్రీ.....మీ సీటు వెంకటాచలం గారు చేస్తార్లెండి . ఆ అడ్జెస్ట్ మెంట్ నేను చూస్తాను."
శ్రీనివాసరావు ఈ విషయమై ఏమీ మాటాడదలచుకోలేదు.
"అమ్మాయిని వాళ్ళ మేనమామగారింట్లో దిగబెట్టి వచ్చేం రావుగారూ! వచ్చే ఏడాది దాని పెళ్ళి జరిపిస్తాం. అంతగా సినిమాల్లో చేరాలని వుంటే వాళ్లాయన్ని ఒప్పించి ఒకమాట ముకుందం గారితో చెప్పి - అప్పుడేదైనా చేయవచ్చనుకొండి. అది వేరే విషయం . అంతేగాని , పెళ్ళి పెటాకుల్లేకుండా సినిమాలంటే ఎంత అప్రతిష్ట ఆలోచించండి. ఏవంటారు?' అన్నారాయన.
కాసేపటికి మళ్ళీ ఆవిడ మాటాడింది.
"ఏమిటమ్మా వాడి పేరు.....చందుగదూ? చందమామేనండి వాడు. మీ ముకుందంగారబ్బాయి. చందుట పేరు. ఎంతందంగా వుంటాడనీ! కాన్వెంట్ లో చదువుట. రోజస్తమానం ఇంగ్లీషె! పొట్టనిండా మాటలే. వచ్చేటప్పుడు వాడిని వదిలి రాబుద్దిపుట్టలేదనుకొండి. నిజంగా చందమామే వాడు."
(మీకు తెలీదమ్మా? గోప్పొడి పిల్లలు చందమామలే. నేనూ చిన్నతనంలో చందమామనే. నా ఖర్మం కాలి నే నెదిగిన తరవాత రాహువుగాడు మింగేడు నన్ను, రాహువు నోట్లో ఉన్న ఈ చందమామ పిల్లలు ఈసురోమని బతుకుతున్నారు. లేకపోతే . అమ్మా! నా పిల్లలు చందమామని తలతన్నేలా వుండేవారు. కాన్వెంట్ చదువే - పదేళ్ళ వయస్సులో మిల్టన్ షెలీలైపోయేవారు. స్టేటస్, తల్లీ - అదెంత పనైనా చేస్తుంది.)
శ్రీనివాసరావుకి యింకా ఎక్కువగా వినాలనిపించలేదు. అతను లేచి నించుని వెళ్ళి వస్తానన్నాడు.వాళ్ళు అతన్ని కాసేపు కూచోమన్నారు గానీ ఒంట్లో బాగాలేదని చెప్పి యింటి మొహం పట్టేడు.
(రక్షించేర్రా నేస్తాలు! లేకపోతే ఒరేయ్ , ఈ దౌర్భాగ్యుడి జీవితానికి ఆమాత్రం అలంకారాలు మీనుండి రాకపోతే నేనెప్పుడో మసైపొయి వుందును. చవటను గనక నేను ఇన్ ఫీరియారిటీ వ్యాధికి గురైపోయేను. తప్పు నాదే! థేంక్స్ ఫ్రెండ్స్ , స్నేహాన్ని బతికించేరు.)
