Previous Page Next Page 
స్త్రీ పేజి 26

 

    "ఇది గైనిక్ పోవలసిన కేసు. తనని తను మోసం చేసుకుంటూ మనల్ని కూడా మోసం చెయ్యగల ననుకుని ఇక్కడి కొచ్చిందా పిల్ల. పి.వి. చేస్తే నిజం తెలియవచ్చు. జస్ట్ ఇది నా సస్పిషన్" అంది పద్మజ.
    "సత్యవతి కి ప్రెగ్నెన్సీ! ఎలా? ఆమె అన్ మేరీడ్ కదూ?' ఆశ్చర్యపడ్డాడు జార్జి. అతనా క్షణంలో వైద్యం చదువుతున్నానన్న సంగతే మరిచి పోయినంత అమాయకంగా కనిపించాడు.
    పద్మజ నవ్వి అంది: "పెళ్ళి కాని వాళ్ళకి గర్భం రాకూడదన్న సైన్స్ మైనా చదివారా మీరు?"
    "ఆమె ఇండియన్ లేడీ! ఎంతో బుద్ది మంతురాలుగా, అమాయకంగా కన్పిస్తోంటే!" జార్జి ఆశ్చర్యం నుంచి చాలాసేపు తేరుకొనే లేదు. అసలు జార్జి సత్యవతి విషయంలో ఏమంత శ్రద్ధతో పరీక్ష చెయ్యలేదు. పద్మజ ఎంత అందమైనదో తను చూస్తూనే ఉన్నాడు. చాలా తెలివైందని కూడా విన్నాడు. అనుకోకుండా అసిస్టెంట్ పద్మజ ను తనకు అటాచ్ చేస్తే థాంక్స్ చెప్పబోయాడు. పద్మజ పరిసరాల్లో తను రోగిని పరీక్షించటంలో ఏకాగ్రత చూపించ లేకపోయాడు. సత్యవతి అమాయకత్వం , పసితనం, మాంగల్యం లేని ఆ బోసి కంఠం -- మరో అనుమానమేమీ రానివ్వనే లేదు.
    జనార్ధన్ నవ్వుతూ అన్నాడు: "సత్యవతిని గైనిక్ కి పంపి, పి.వి చేయించి ఫైండింగ్స్ చూద్దాం."
    ఆ మర్నాడు పురుళ్ళ వార్డు లో సత్యవతి ని మరో డాక్టర్ ఒంటరిగా పరీక్ష చేసింది. నాలుగవ నెల గర్భం తో ఉన్నట్టు నిర్ధారణ చేసింది. భయం భయంగా ఏడుస్తున్న సత్యవతి బాధ ఎవ్వరికీ అర్ధం కాలేదు.
    "నీకు నాలుగో నెల కడుపు. మంచి ఆహారం తీసుకొంటూ ఉండాలి. విశ్రాంతి తీసుకోవాలి. చాలా నీరసంగా ఉన్నావు." అంటూ హెచ్చరించి సాగనంపారు.
    అసిస్టెంట్ సన్న సన్నగా వేసిన చివాట్లు తిని, తల దించుకు నడుస్తున్న జార్జి వెనకే నడిచింది పద్మజ. గేటు దాటుతుంటే అప్రయత్నంగా పిలిచింది! "మిస్టర్ జార్జి! జస్టే మినిట్!"
    జార్జి వెనక్కు తిరిగి నీలిరంగు కళ్ళతో విస్మయంగా చూశాడు. "మిస్ పద్మజ! మీరు.....పిలిచారా?"
    "కొంచెం మాట్లాడాలి. నిన్న మీరు పరధ్యానంగా ఉన్నారు కదూ? లేకపోతె మీ డయాగ్నాసిస్ తప్పటం ఏమిటి ?"
    "నో, నో! దానికి నేనేం మైండ్ చేయటం లేదు."
    "చెయ్యకూడదు కూడా. పొరపాట్లు మానవ సహజమే."
    "ఆమె స్థితి చాలా పాదటిక్ గా ఉంది కదూ , మిస్ పద్మజా? అసలు సంగతి తనకేం తెలీనట్టు కనిపించింది. ఎంత అడిగినా చెప్పకుండా దాచింది. అయితే హాస్పిటల్ కెందుకు వచ్చినట్టు?"
    "తప్పు జవాబు లిస్తే మరేదో జబ్బుగా భావించి అది పోయేందుకు మందులూ, ఇంజక్షన్లూ ఇస్తాం కదా? వాటితో కడుపు పోతుందని ఆశ పడింది. ఇండియా లో ఇలాంటి అమాయకుల్ని మీరు చూడనే లేదా?"
    చూడకపోయినా సత్యవతి ని మిస్ పద్మజతో పోలిస్తే , ఇండియా లో మరే స్త్రీ అయినా పద్మజ కన్నా అమాయకురాలేనేమో అనిపించింది జార్జికి.
    "మిస్ పద్మజా! ఆమె ఏం కావాలి? మీ కస్టమ్స్ చాలా స్ట్రిక్టు కదూ?"
    'చెయ్యగలిగితే రహస్యంగా ఎబర్షన్ చేసుకోటానికి ప్రయత్నిస్తుంది. అవమానానికి తట్టుకునే ధైర్యం లేకపోతె ఆత్మహత్య కు పూనుకుంటుంది. సత్యవతి ఏం చేస్తుందో మనకి తెలీకపోయినా సాధారణంగా జరిగేది మాత్రం ఇదే!"
    "కాని , ఇన్ని నిబంధనల మధ్య మసిలే ఇండియన్ స్త్రీ కి అసలీ స్థితి ఎలా సంభవిస్తుంది?"
    'అదే నేచర్! దాని ప్రభావాన్ని  ఏ నిబంధనా అరికట్టలేదు, మిస్టర్ విలియమ్స్!"
    అనుకోకుండా జార్జీ కీ, పద్మజ కూ ఎక్కువ సంభాషణే జరిగిందా రోజు.
    జార్జి కన్నులో ఆ లేత నీలి రంగులో తొణికిసలాడే ఆర్ధతే అమితంగా ఆకర్షించింది పద్మజను.

                             *    *    *    *
    "నువ్వు డాక్టర్ వి కదా, జార్జ్? ఎందుకలా  ప్రతి విషయానికి చలించి పోతావు?" అంటుంది పద్మజ.
    "డాక్టరు డ్యూటీ వరకే. దేనినీ నేను డాక్టర్ దృష్టి తో చూడను. నా మనస్సు చాలా బలహీనం కావచ్చు, పద్మజా!' అంటాడు జార్జి.
    "కాని, డాక్టరు సామాన్యమైన అనుభూతులకు కాస్త దూరంగానే ఉంటాడు. చిన్న ముల్లు గుచ్చుకుని రక్తం కారుతోంటే కెవ్వుమని అరిచే మామూలు వ్యక్తికీ, బ్రతికిన వాళ్ళని నిలువునా చీల్చి అతికే డాక్టర్ కీ ఎంతైనా తేడా ఉంది. కాదంటావా?" అని వాదిస్తుంది పద్మజ.
    ఓసారి పద్మజ జార్జి వాళ్ళింటికి టీకి వెళ్ళింది. అదే మొదటిసారి. జరీ అంచు తెల్ల చీర కట్టుకుని ఎర్రటి బ్లౌజు వేసుకుంది. వాలుజడ బారుగా అల్లుకుని విడిచింది. తిలకం చిన్నగా గుండ్రంగా దిద్దుకుంది. జడలో ఒకే ఒక తెల్ల గులాబీ పెట్టుకొంది. విలియమ్స్ కుటుంబం లో అంతా ఆనందంగా ఆహ్వానించారు పద్మజ ను. జార్జి తల్లి మేరీ విలియమ్స్ కాన్వెంటు లో హెడ్ మిస్ట్రెస్ గా పని చేస్తుంది. తమ్ముడు అగస్టీన్, చెల్లెలు ఎలీజా చదువుకుంటున్నారు స్కూల్స్ లో. జార్జి తల్లి పద్మజ తో అతి అభిమానంగా గడిపి తరుచూ వస్తూ ఉండమని కోరింది. ఏనాడో ఇండియాకు వచ్చి, స్థిరపడి పోయి, బిద్దలందర్నీ ఇండియా లోనే కనిపెంచిన ఆవిడకు ఇండియాతో చాలా అనుబంధం ఉంది. ప్రత్యేకించి ఇండియాలో స్త్రీలంటే అవిడికో విధమైన గౌరావం ఉంది. పద్మజ లా పెద్ద చదువులు చదువుతూ స్వేచ్చగా తిరిగే ఇండియా స్త్రీల పట్ల ఆవిడకు చాలా ఇష్టం ఉంది. జార్జి తమ్ముడూ, చెల్లెలు కూడా పద్మజ ఉన్న అరగంటా నవ్వుతూ త్రుళ్ళు తూ కాలం గడిపేస్తారు. వాళ్ళిద్దరి తగువు లకూ పద్మజ ను జడ్జిగా నియమించుకుంటారు. జార్జి ఒక్కడే గాక ఆ కుటుంబం అంతా తనకు అప్తులే ననిపిస్తుంది పద్మజ కు. విలియమ్స్ కుటుంబంతో పార్టీలూ, పిక్చర్ లూ, పిక్నిక్ లూ బాగా అలవాటయ్యాయి పద్మజకు.
    తెలుగు జానపద చిత్రాలు జార్జి చాలా ఇష్టపడతాడు. అష్టకష్టాలు పడి రాక్షసులందర్నీ చంపి, మాయతివసీలూ, మంత్రదండాలూ వశం చేసుకుని గగన కుసుమాలు దక్కించుకుని, అప్సరస తో పాటు రాకుమారిని కూడా పెళ్ళాడుతూ గర్వంగా నవ్వే హీరో అంటే , అతని కెంతో ప్రేమ.
    "జీవితం ఎప్పుడూ సుఖంగా ఉండాలి. అలా ఉంచుకునే వాళ్ళంటే నాకు చాలా ఇష్టం."
    "జీవితాన్ని సుఖంగా ఉంచుకోవటం, ఉంచుకోక పోవటం మన చేతుల్లోనే ఉందా?" విస్మయంగా చూసింది పద్మజ.
    "ఉందనుకునే ప్రయత్నిస్తే తప్పకుండా ఉంటుంది." మాటినీ చూసి బీచ్ కేసి నడిచారిద్దరూ.
    ఎగిరెగిరి పడే కెరటాలను చూస్తూ, సముద్రపు హోరు వింటూ ఇసక లో నడిచారు చాలా దూరం. ఉన్నట్టుండి నవ్వుతూ అన్నాడు జార్జి! "నాకు నువ్వు తెలుదు నేర్పాలి, పద్మజా! వ్రాయనూ చదవనూ కూడా నేర్చుకోవాలనుకుంటున్నాను."
    "ఊ, నేర్చుకుని?"
    "నేర్చుకుని మరెవరికైనా నేర్పుతాను."
    "వద్దులే . ఎందుకా ప్రయాస నీకు?" నవ్వింది పద్మజ.
    కోపం నటించాడు జార్జి. "అయితే నేర్పవా నాకు?"
    "నేను కోరినంత జీతం ఇచ్చుకోగలవా?"
    "ఇవ్వలేకపోతే ఋణపడి ఉంటాను."
    "నాకేం ప్రయోజనం?" జార్జి కన్నుల్లోకి లోతుగా చూస్తూ నవ్వింది పద్మజ. ఆ నీలి రంగు , ఆ రంగు లోని మృదుత్వం పద్మజ జు కావాలనిపించింది. ఆ పసుపు రంగు చెంపల్ని తాకుతూ, తేనే రంగు జుట్టు నిమురుతూ , అలా కనుపాపల్లోకి చూస్తూ కాలం గడిపెయ్యాలని పించిందో క్షణం.
    "పద్మజా! ఏమిటలా చూస్తావ్?' విస్మయంగా అడిగాడు జార్జి.
    మృదువుగా నవ్వింది పద్మజ. "నీ అందం."
    "హాస్య మాడుతున్నావు."
    "అవును. నీతో కాకపొతే మరెవరితో?"
    పద్మజ ఏం మాట్లాడుతుందో కూడా అర్ధం కాలేదు జార్జికి. అక్కడితో ఆ ప్రసక్తి తప్పిస్తూ, "చూడు, జార్జ్! అటు చూడు! సముద్రం ఎంత ఉల్లాసంగా వుందో. పట్టరాని సంతోషంతో కేరింతలు కొడుతోంది కదూ?' అంది.
    "ఇవ్వాళ పౌర్ణమి. గుర్తు లేదా?"
    "మనస్సు ఆలోచనలతో వేగి పోతుంటే ఎన్నని గుర్తు ఉంటాయి?' క్రీగంట చూస్తూ అంది.
    "నీ మనస్సు బాగా లేదా, పద్మా?"
    "ఊహూ బాగా లేదు. ఏం? నీ మనస్సు హాయిగా ఉందా?"
    "నా మనస్సు ఎప్పుడూ హాయిగానే ఉంటుంది."
    "కొంచెం కూడా దిగులు లేదా?"
    "ఎందుకూ? దిగులెందుకు?"
    "నీకేమీ  కావాలనిపించటం లేదా, జార్జ్?"
    జార్జి తదేకంగా పద్మజ మొహంలోకి చూశాడు. "నిజమే పద్మా! ఇలా నీకేసి చూస్తోంటే ఏదో కావాలనిపిస్తోంది. కాని, అదేమిటో తెలీటం లేదు.
    "తెలుసుకోటానికి ప్రయత్నించరాదూ?"
    మౌనంగా కూర్చున్నాడు జార్జి.
    వెన్నెల కాంతి సముద్రపు నీటి మీద పడి చెదిరి పోతుంది.
    "వెళ్దాం జార్జి! చాలాసేపైంది. " లేచింది పద్మజ.
    గదిలో కూర్చుని పుస్తకం తెరిచిందే కానీ చదువు మీద మనస్సు లగ్నం కాలేదు. ప్రయత్నించి చదవలేక విఫలురాలై లేచి లైటార్పి వరండా లోకి వెళ్ళి నించుంది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS