Previous Page Next Page 
అయిదు రెళ్ళు పేజి 26

   
                                   9
    సుధాకర్ పోస్టు మేనిచ్చిన కవరు తీసుకుని ఆతృతగా చింపాడు. అది మోహన్ వ్రాసిన ఉత్తరం అని తనకు తెలుసు. అందులో మనస్సుకు ఊరట కల్గించే విషయాలేమైనా ఉన్నాయేమో.
    "డియర్ సుధాకర్!
    నీకు, కళకు పెళ్ళి జరిపిస్తానని నేను మాట ఇచ్చాను. ఏ సందర్భంలో కూడా నే మాట తప్పను. మీ ఇద్దరి పెళ్ళికి శత విధాల ప్రయత్నిస్తాను. ఈలోగా నువ్వు మీ నాన్నగారికి కళను చేసుకుంటానని చెప్పు. అయన రామయ్య గారికి ఉత్తరం రాస్తే ఏమని జవాబోస్తుందో చూడు. ఒకవేళ రామయ్య గారు కాదన్నా నువ్వు బెంగ పెట్టుకోకు. ఆయనకు తగ్గ ఎత్తులు నేను వెయ్యగలను....

                                                                                             నీ
                                                                                         మోహన్."
    మోహన్ ఉత్తరం చదివేసరికి సుధాకర్ కు ఎక్కడ లేని సత్తువ వచ్చినట్టయింది. మోహన్ పూనుకున్నాడంటే కళతో తన పెళ్ళి తప్పకుండా జరుగుతుంది. ఆ నమ్మకం తనకుంది.
    మధ్యాహ్నం అందరి భోజనాలు పూర్తీ అయ్యాక వంటిల్లు చక్క బెట్టుకుని సుధాకర్ తల్లి చావిట్లో గుమ్మం మీద తల పెట్టుకుని ఆయాసంగా సాగిలబడింది. ఆవిడకి నలుగురు కొడుకులు, ముగ్గురు కూతుళ్ళు. అందర్లోకి సుధాకర్ చిన్నవాడు. సుధాకర్ కి తప్ప అందరికీ పెళ్ళిళ్ళు జరిగాయి. పెద్ద కొడుకులు ముగ్గురూ వేరే ఊళ్ళ లో ఉద్యోగాలు చేస్తున్నారు. కోడళ్ళు మంచి బుద్దిమంతులు. అత్త మామల్ని అభిమానంగా చూస్తారు. అయినా సుధాకర్ ఒక్కడే హోటల్ తిండి తింటూ ఏం ఉంటాడు? వాడి కోసం కొన్నాళ్ళు శ్రమపడక తప్పదు. వాడి క్కూడా పెళ్ళి చేసేస్తే తను విశ్రాంతి తీసుకోవచ్చు. తను ఎక్కడ ఉన్నా వాడి నెవరు చూస్తారా అనే బెంగ ఉండదు.
    సుధాకర్ మెల్లగా వచ్చి తల్లి పక్కన కూర్చున్నాడు.
    "ఎరా?' అన్నది తల్లి ఆలోచనలో నుండి తేరుకుంటూ.
    సుధాకర్ నేల మీద చేత్తో రాస్తూ "మెడ్రాస్ ఎంత బాగుంటుందమ్మా? నువ్వు రమ్మంటే రాలేదు గాని....' అన్నాడు.
    "నేనెలా వచ్చేదిరా? నువ్వు మీ నాన్నగారి స్నేహితుడింట్లో మఠం వేస్తె? ఆవిడ నాకు తెలుసునా ఏమన్నానా?.... వాళ్ళమ్మాయిలు చక్కగా ఉంటారట....నీకు ఒక్క పిల్లా నచ్చలేదాయే! ఇంకెవరినన్నా చూసుకురా. ఈ ఏడాది ఎలాగైనా నీ పెళ్ళి జరగాలి....ఇద్దరం పెద్దవాళ్ళం అయిపోయాం. ఏ క్షణం లో వెళ్ళిపోతామో చెప్పలేం. వెళ్ళే ముందు నీ పెళ్ళి చూడాలి...."
    జవసత్వాలుడిగి నీరసంగా కనబడుతున్న తల్లి కళ్ళల్లో అచంచలమైన ప్రేమ పొంగి పొరలుతుంది. ఆ ప్రేమ వాహిని లో సుధాకర్ పిరికితనం కనబడని దూరానికి కొట్టుకుని పోయింది.
    "వాళ్ళ పెద్దమ్మాయి కళ చక్కగా ఉంటుందమ్మా. పైగా మంచి పిల్ల--"
    "అదేమిటిరా? .... ఆ అమ్మాయికి మేనరికం ఉన్నదట." అంటూ పక్కకు వట్టిగిల్లింది తల్లి.
    రెండు రోజుల క్రితం రామయ్య గారి దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది. పెద్దమ్మాయి కి మేనరికం ఉన్నదని, ఆ అమ్మాయితో పాటే రెండో పిల్ల పెళ్ళి కూడా చేయాలని ఉందని, అయినా భగవత్క్రుప ఎలా ఉన్నదో అని వ్రాశారాయన గడుసుగా, సూటిగా పెళ్ళి మాట ఎత్తకుండా. ఆడపిల్లను కన్న తండ్రికి అంత గడుసు తనం పనికి రాదను కుంది ఆవిడ.... అతను ఖచ్చితంగా అడగనంత వరకు సుధాకర్ దగ్గర ఆ మాట ఎత్తకూడదనుకుంది.
    "మరి ఆ సంగతి నాకు ముందే ఎందుకు చెప్పలేదు?' అంటూ సుధాకర్ దూకుడుగా లేచాడు.
    తల్లి తెల్లబోయింది.
    "ఉంటె ఉన్నది లేరా....ఈ రోజుల్లో మేనరికం ఎవరు చేసుకుంటున్నారు? మీ నాన్నగారిని ఉత్తరం రాయమంటానులే!"
    సుధాకర్ చల్లబడి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.
    పాపం! వాడికి ఆ అమ్మాయి మీద ఎంత ప్రేమో అనుకుంది తల్లి.....
    వీలు చూసుకుని తల్లి సుధాకర్ సంగతి భర్త చెవిని వేసింది. అయన కసురుకున్నాడు.
    "వాడేమో పెద్ద పిల్లకి ,మేనరికం ఉందని ఖచ్చితంగా రాస్తే ఇప్పుడు నేను మా అబ్బాయికి ఆ పిల్లే నచ్చిందని రాయమంటావా?"
    సుధాకర్ తల్లి మెల్లిగా సర్ది చెప్పింది.
    "ఈ రోజుల్లో మేనరికం చేసుకుంటున్నదేవరు? మీ స్నేహితుడికి చేసుకోవాలని ఉన్నా అ అబ్బాయి తలూపుతాడో లేదో? పెద్ద పిల్ల నిస్తే సుధాకర్ కు చేసుకుంటామని రాయండి.... మనవాడు అల్లుడు కావడమే అదృష్టం.... నిక్షేపంలా వప్పుకుంటాడు..."
    ఆగ్రహం తగ్గాక సుధాకర్ నాన్నగారు పెళ్ళాం చెప్పినట్టు రామయ్య గారికి ఉత్తరం వ్రాసి పడేశారు. ఆ ఉత్తరానికి జవాబు ఏం వస్తుందో అని సుధాకర్ గుండెలు బిగపట్టుకుని కూర్చున్నాడు.

                            
    ఒకనాటి సాయంత్రం వేళ జానకమ్మ తీరిగ్గా పెళ్ళి మాట కదిపింది జయమ్మ తో.
    "నాదేముంది వదినా! పిల్లలిద్దరూ ఇష్టపడాలి కాని!" అంది జయమ్మ పైకి లోపల ఎటువంటి సందేహం లేకపోయినప్పటికీ.
    "దాని మొహం దానికేం తెలుస్తుంది?.... అయినా నీకంత అనుమానంగా ఉంటె అడిగితె తీరిపోతుంది" అంటూ జానకమ్మ గదిలో కూర్చుని కలలు కంటున్న కళను పిలిచింది. ఆశల బరువుతో అలసిపోయిన కళ నెమ్మదిగా అడుగు లేసుకుంటూ సావిట్లో కి వచ్చింది.
    జానకమ్మ నవ్వుతూ అడిగింది.
    "బావ నీకు నచ్చాడో, లేదో నని అత్తకు అనుమానంగా ఉంది."
    కళ ముఖంలో సిగ్గు దోబూచులాడుతుందని, ఆ సిగ్గు తెరలు చక్కని ముగ్గులై కళను కన్నుల పండువుగా అలంకరిస్తాయని జయమ్మ ఆశ పడింది. మందహాసంతో కళను కన్నార్పకుండా చూసింది. కళ సిగ్గుపడలేదు కాని దిగ్గున లేచింది.
    జయమ్మ గబగబా దగ్గర కెళ్ళి కళ చెయ్యి పట్టుకుని "అంత సిగ్గయితే ఎలాగే?" అంది చిరునవ్వుతో.
    కళ ముఖం పక్కకు తిప్పి "నేను బావను చేసుకోను!" అంది.
    జయమ్మ, జానకమ్మ ఇద్దరి మీదా పిడుగు పడినట్టయింది. ఎవరి నోటి వెంటా మాట రాలేదు. కాస్సేపటికి తేరుకుని జయమ్మ "అదేమిటే? తమాషా కంటున్నావా?' అంది నమ్మలేనట్టు -- ఆ కంఠస్వరం లోని దీనత్వం కళను కలచి వేసింది. కటువుగా చెప్పాలనుకున్న జవాబు కంఠం దాటి రాలేక గింజుకున్నది.
    చివరికి అస్పష్టంగా గొణిగింది.
    "బావ నాకంటే పొట్టి!...."
    జయమ్మ కళను అర్ధం చేసుకోలేక పోయింది. పైగా పకాలున నవ్వింది.
    "ఓస్! అదటే నీ బెంగ! వాడూ, నువ్వు సమానంగానే ఉన్నారు.... ఒకవేళ పొట్టిగా ఉంటె మాత్రం మీ నాన్న మీ అమ్మ కంటే పొట్టి కాదటే? మరీ విడ్డూరంగా మాట్లాడతావు కాని....ఒరేయ్ ! శేఖరా! ఇలారా ఓ మాటు !' అని కేకేసింది జయమ్మ.
    జానకమ్మ ఉలుకు, పలుకు లేకుండా జరిగేదంతా చూస్తున్నది.
    శేఖర్ తన గదిలో శారద కు చదువు చెప్తున్నాడు..... శారద ను ఒప్పించి మెట్రిక్ పుస్తకాలన్నీ కొన్నాడు. రోజూ ఒకటి రెండు పాఠాలు బోధపరచటం , శారద చేత చదివించటం , చదివిన దాంట్లో ప్రశ్నలు వేయటం , జవాబులు చెప్పలేక పొతే కసురుకోవటం . శారద కన్నీరు పర్యంతం చేసుకుని "నాకీ చదువు రాదంటే వినిపించుకోవు! నువ్విలా చేసావంటే నేను మా ఊరు వెళ్ళిపోతాను బాబూ!' అనటం, దాంతో శేఖర్ కాళ్ళ బేరానికొచ్చి "నీ ఇష్టం వచ్చినట్టు నెమ్మదిగానే చాడువుకోవే! నేనేం అనను-- ఇంగ్లీషు రాకపోతే నలుగురిలో ఎంత చిన్నతనంగా ఉంటుందో ఆలోచించు!" అని నచ్చ చెప్పటం -- ఇదీ వారం రోజులుగా శారద, శేఖర్ మధ్య నడుస్తున్న కధ! ఈరోజు జయమ్మ శేఖర్ ను పిలిచేసరికి కధ చివరి ఘట్టం లో ఉన్నది. శారద అలిగి కూర్చున్నది. శేఖర్ బ్రతిమాలబోతున్నాడు. ఇంతలో జయమ్మ పిలుపు! శేఖర్ చటాలున లేచి వెళ్ళాడు.
    జానకమ్మ గోడ కానుకుని నీరసంగా, కూర్చున్నది...ఆవేదన, అశాంతితో కళ ముఖం కళ తప్పి ఉన్నది. జయమ్మ కళకు కాస్త దూరంలో నిలబడి శేఖర్ రాకకు ఆతృతగా చూస్తున్నది. గదిలో అడుగు పెట్టగానే శేఖర్ పరిస్థితిని అర్ధం చేసుకున్నాడు.
    శేఖర్ ను చూడగానే జయమ్మ "శేఖరా! ఇలా వచ్చి కళ పక్కన నించో! కళ నువ్వు తన కంటే పొట్టి అని అనుకుంటున్నది...." అంది హడావిడిగా.
    శేఖర్ గాభరా "కళ నాకంటే లావు -- " అన్నాడు గుమ్మం లోనే భయంగా నిలబడి పోతూ.
    కళ శేఖర్ కేసి తీక్షణంగా చూసింది. అదేమిటనుకుని ఆశ్చర్యపోయాడు శేఖర్.
    శేఖర్ మాటలు విని జయమ్మ, జానకమ్మ ఇద్దరూ నవ్వారు. ఎందుకంటె శేఖర్, కళ ఇద్దరూ సన్నమే!
    "నేం లావు కాదు...." అంటూ ముఖం కందగడ్డలా చేసుకున్నది కళ.
    ఆడవాళ్లు లావుగా ఉన్నా లావంటే వప్పుకోరు. అందానికి సన్ననితనానికి ముడి పెట్టి సన్నంగా ఉన్నా మనుకుంటారు. అందరూ అలా అన్నారని ఆరాట పడతారు. లావుగా ఉన్నావంటే ఘోరంగా అవమానించినట్టూ బాధపడతారు. అలాంటిది కళకు కోపం రాదూ?
    "లావూ కాదు, పొట్టి కాదు. ఊరుకోండి! ఇంక ఆకతాయి మాటలు కట్టి పెట్టి!" అంది జయమ్మ నవ్వు ముఖంతో వాళ్ళ మాటల్ని నిర్లక్ష్యంగా త్రోసి పారేస్తూ.
    జయమ్మ ధోరణి చూసి కళ కంగారు పడి శేఖర్ మాటను ఎందుకు కాదన్నానా అని నాలిక కొరుక్కున్నది. ఇంక తనే మాట చెప్పినా నమ్ముతుందా అత్తా? చిలిపిగా అల్లరి కోసం అన్నమాట లనుకుంటుంది కాని! అలా అని నోరు మూసుకుని ఊరుకుంటే అంగీకారం క్రింద తీసుకుంటేనో? కళను బాధ భయం రెండూ చుట్టూ ముట్టాయి.
    "నవ్వుతాలు కోసం చెప్పటం లేదు. నిజంగా నేను బావను పెళ్ళి చేసుకోను!" అంది కళ విసురుగా అక్కడి నించి వెళ్ళిపోతూ.
    గదిలో మంచం మీద పడుకుని కళ్ళు మూసుకుంది. అత్త ఇదంతా ప్రణయ కోపం అనుకుంటుందేమో అనుకుని బెంబేలు పడుతూ.
    శేఖర్ కూడా "నేను కళను చేసుకోను!" అంటూ మరి వెనక్కి తిరిగి చూడకుండా తన గదిలోకి వెళ్ళాడు.
    శేఖర్ మీది కోపంతో మూతి ముడుచుకున్న శారద చెంపకు చెయ్యి చేర్చి ముని పంటితో క్రింది పెదవి కొరుకుతూ ఆలోచన సాగిస్తున్నది....
    చామనచాయ మీద ఊదారంగు వోణీ వింత కాంతు లీనుతూ కొంగ్రొత్త తళుకును, సోయగాన్ని తెచ్చి పెడుతున్నది... మూగ వోయిన వాణి ఇంత ముగ్ధ మనోహరంగా ఉంటుందా?
    శేఖర్ ను కనులెత్తి చూసింది శారద. మూసుకున్న పెదాలు మెల్లగా కదిలాయి.
    'అక్కను ఎందుకు చేసుకోనన్నావ్?"
    శేఖర్ అపరాధి లా చూశాడు.
    "కళే నన్ను చేసుకోనన్నది...."
    శారద మాట్లాడలేదు. మెల్లిగా లేచి పుస్తకాలన్నిటినీ దొంతరగా పేర్చి బల్ల మీద సర్దింది.... మౌనాన్ని ఆరాధించే మగువ మనస్సులో ఎటువంటి ఆవేదనలుంటాయో ఎవరికి తెలుసు? ఆడదాని మనస్సు సముద్రం కంటే లోతు!
    భరించలేని మౌనం శేఖర్ ను భయపెట్టింది.
    "నా మీద కోపమా?" అన్నాడు మెల్లిగా శారద ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేసింది.
    "ఎందుకు?"
    శేఖర్ కాస్త ముందుకు వెళ్ళాడు.
    "కోపం లేదంటే ఇప్పుడు నాతొ సినిమాకు రావాలి మరి!"
    శారద ఉలిక్కిపడింది.
    "అత్త....అమ్మా....ఏమనుకుంటారు?" అంది తడబడుతూ వినపడని స్వరంలో.
    'అనుకునేదేమిటి? నేను పర్మిషన్ తీసుకుంటాను. నువ్వు నిమిషం లో ముస్తాబు చేసుకు రావాలి! వూళ్ళో మంచి ఇంగ్లీష్ సినిమా ఆడుతున్నది...." అంటూ శేఖర్ గదిలో నుండి నిష్క్రమించాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS