Previous Page Next Page 
ఒప్పందం పేజి 26

 

                           ఐదు  నక్షత్రాల వెలుగు

    సమయం సాయంత్రం అరవుతోంది. చలికాలం... నవంబరు నెల... కార్తీకమాసం....ఆరోజు ఏకాదశి. అది హైదరాబాదు లో అత్యంత ధనికులుండే జూబ్లిహిల్స్ ప్రాంతం. విశాలమైన ఖాళీ స్థలంలో కొత్తగా కట్టిన ఐదు నక్షత్రాల హోటల్ ప్రారంభోత్సవం జరిగుతోంది ఆరోజు. అసలే అందమైన కట్టడం ....అలంకారాలతో మరింత అందంగా అలరాడుతోంది.పూలదండలతో, రంగురంగుల బల్బుల తోరణాలతో, రకరకాల బెలూన్లతో అలంకరించిన ఆ బిల్డింగ్ దాని ముందు ఉన్న లాన్ లో మొక్కలకు అలవోకగా అలంకరించిన సీరియల్ బల్బులు... ధగధగ లాడిపోతోంది. ఎత్తుగా, బలంగా కట్టిన ఖరీదైన గేటు నుంచి మరో నాలుగు అపార్ట్ మెంట్స్ కట్టడానికి వీలున్నంత ఖాళీ స్థలం.... అందులో సగం అందమైన లాన్.... రెడీమేడ్ మొక్కలు, ఇత్తడి కుండీల్లో క్రోటన్స్ .....లాన్ మధ్యలో పౌంటైన్లు ....లోపలంతా అందమైన షాండియర్స్ , అద్భుతమైన ఇంటీరియాల్ డెకరేషన్. అపూర్వంగాహైదరాబాద్ లో నెంబర్ వన్ స్థానాన్ని అక్రమించేలా ఉందా హోటల్.
    
                                  ***

    మెయిన్ గేటులోంచి ఖరీదైన కార్లు ప్రవేశించి పార్కింగ్ ప్లేస్ వైపు వెళ్తున్నాయి. అవన్నీ నగరంలో ప్రముఖులుగా పేరుగాంచిన బడా బాబుల కార్లు యూనిఫామ్ లో ట్రిమ్ గా ఉన్న వెయిటర్స్ అటూ, ఇటూ తిరుగుతున్నారు హడావుడిగా లాన్ లో గుండ్రంగా వేసిన కుర్చీలు, మధ్యలో గుండ్రటి టేబుల్స్, వాటి పైన చక్కని ప్లవర్ వాజ్ లు.... పూగుత్తుల్లా తయారు చేసి గాజు గ్లాసుల్లో అమర్చిన పేపర్ నాప్ కిన్స్, పెద్ద పెద్ద ప్లేటు ల్లో చక్కగా పద్దతిగా పెట్టిన స్పూను లు, ఫోర్కులు బాగా ఎత్తుగా కట్టిన వేదిక మీద ఆర్కెస్ట్రా గ్రూపు ప్రారంభించబోయే కార్యక్రమానికి సన్నాహాలు చేసుకుంటోంది.
    బైట మెయిన్ గేటుకి కుడి పక్క కొంచెం దూరంలో ఒక పెద్ద వేపచెట్టు ఉంది.
    దాని కింద ఐదుగురు వ్యక్తులు కూర్చుని ఉన్నారు. వాళ్ళ వయసు సుమారు 45,46 ఉంటుంది. కానీ, రావాల్సిన దానికన్నా ముందే వృద్దాప్యం వాళ్ళని అవరించినట్టు ఉన్నారు. వాళ్ళ కున్న బట్టల్లో కొంచెం పరిశుభ్రంగా ఉన్న బట్టలేసుకు కున్నారు. వాళ్ళ మోచేతులు , మోకాళ్ళు సిమెంటు పని, మట్టి పని చేసి చేసి బండబారి పోయి, గరుకుగా పొడిబారి ఉన్నాయి. వాళ్ళు లైట్ల వెలుగులో ధగధగ లాడుతోన్న ఆ హోటల్ వైపు తృప్తిగా , ఆనందంగా చూస్తున్నారు. వాళ్ళ కళ్ళల్లో ఆహోటల్ కట్టడం లో తాము పడిన శ్రమ, కష్టం కంట్రాక్టర్ కరుకుదనం అన్నీ సన్నగా మేదుల్తున్నాయి. అయినా ఏదో సంతృప్తి, ఏదో సాధించామన్న విజయం కనిపిస్తోంది. ఈ అందమైన హోటల్ కట్టిన చేతులు ఇవేనా? అనుకుంటున్నట్టుగా వాళ్ళ చేతుల వైపు చూసుకున్నారు. ఆతరువాత ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకున్నారు. వాళ్ళ పెదవుల పైన చిన్న చిరునవ్వు కదిలింది.
    "ఎరా ఎంకయ్యా మనల్ని పిలుస్తారంటావా?" అడిగాడో వ్యక్తీ.
    "ఈడికన్నీ అనుమానాలే.... పునాదులేసినోళ్లం....రాయేసినొల్లం... మట్టేసినొల్లం....ఇయాల ఈ బిల్డింగు ఇంత పెద్దగై, ఇంతమంది సార్లు ఈడికొచ్చి న్రంటే మన కష్టం కదరా.... మనకి అన్నదానం చేయందే, ఇంకెవరికీ చేయకూడదని ఆ సార్లకి తెలుసు. తప్పకుండా మనల్ని పిలుస్తారు. కాకుంటే జరసేపు ఓపిక పట్టాలే" అన్నాడు మరోవ్యక్తి.
    "గుత్తేదారు రమ్మన్నాడని కదా వచ్చినం...ఇయాల ఒటేలు పారంబం.... రాండిరా మిఠాయిలిస్తరు. మీకు ఇనామిస్తారు అని అన్నాడనే కదా...."
    "గది నిజమే కానీ, గుత్తేదారు కనబడలే కదా..."
    "ఉంటరు యాడనో లోపల... జర ఓపిక పట్టాలే...."
    వాళ్ళలా మాట్లాడు కుంటుండగానే పరిసరాలను చైతన్య పరుస్తూ ఆర్కెస్ట్రా మొదలైంది. ఐదుగురూ కూర్చున్న చోటు నుంచి లేచి గేటు దగ్గరగా నడిచారు. గేటు బైట కొంచెం దూరంలో నిలబడితే ఆర్కెస్ట్రా వాళ్ళున్న వేదిక కనిపిస్తుంది. కొత్త సినిమాల్లో పాటలతో గాయని, గాయకులూ పాటకు అనుగుణంగా వేదిక మీద డాన్సులు చేస్తూ వేదికని  అదర గొడుతున్నారు. కార్లలో వచ్చిన ఖరీదైన బాబులంతా పరస్పర పరిచయాలతో కరచాలనాలు చేసుకుంటూ మధ్య, మధ్య వేదిక వైపు చూస్తూ హోటల్ మొత్తం చూడడానికి లోపలికి వెళ్లి వస్తున్నారు. వాళ్ళంతా కళ్ళు తిప్పుకోకుండా హోటల్ ని పరిశీలించడం గమనించిన ఆ కూలీల గుండెల్లో ఆనందం వెల్లివిరిసింది.
    ఇంత అందమైన ఈ హోటలు ఎవరూ కట్టారు అని వాళ్ళు ఆడిగుంటారు. తప్పకుండా తమ పేర్లు వాళ్ళకి గుత్తేదారన్నా హోటల్ యజమానులన్నా చెప్పి ఉంటారన్న గట్టి నమ్మకం వాళ్ళ మనసులో పడింది.
    అడుగడుగునా కళాత్మకత ఉట్టి పడేలా చెక్కిన గోడలు, ఆ చెక్కడం లో కోసుకు పోయిన మోచేతులు.... కాళ్ళకు అయిన గాయాలు, కళ్ళల్లో పడిన సిమెంట్ రేణువులు.... మండిన కళ్ళు.... రాత్రి ఇంటికి వెళ్ళాక భార్యలు కళ్ళల్లో పోసిన చల్లని పాలు ...అన్నీ గుర్తొస్తున్నాయి.
    'అరె రోజు కూలీ వస్తుంది కదా అని సంవత్సరాలకు సంవత్సరాలు చేయరు కద....ఖచ్చితంగా రోజూ వచ్చి పనిచేయండి. పన్నెండు గంటలు పని చేయకుంటే కూలి కోస్త...."గుత్తేదారు వార్నింగులు, మధ్యమధ్య కొందరు చిన్న కూలీలు రాకపోతే ఆ పని కూడా తమ చేత చేయించిన అతని కాఠిన్యం... అన్నీ గుర్తొస్తున్నాయి.
    నిజం చెప్పాలంటే ఈబిల్దింగు కట్టడానికి సిమెంటు లో నీటి కన్నా తమ చెమటే ఉపయోగించారు. అందుకేనేమో అంత అందంగా ఉందా బిల్డింగు అనిపిస్తోంది వాళ్ళకి.
    తాను నాటిన మొక్క ఎదిగి పెద్ద చెట్టై బోలెడన్ని ఫలాలిచ్చినప్పుడు ఆ తోటమాలికి కలిగే ఆనందం, తొమ్మిది నెలలు మోసి కన్నబిడ్డ పెద్ద వాడై వృద్ది లోకి వచ్చినప్పుడు తల్లి పొందే సంతోషం ఇప్పుడా ఐదుగురు పొందుతున్నారు. తామ చేతుల్లో రూపుదిద్దుకున్న ఆ హోటల్ ఎంతో అందంగా కళ్ళముందు కనిపిస్తోంటే ఖరీదైన ఫర్నిచర్ తో, తివాచి లతో, మిగతా అలంకారాలతో , విద్యుద్దీపాలతో దేదీప్యమానంగా వెలిగి పోతోంటే, ఒక్కసారి లోపలికి వెళ్ళి చూడాలన్న ఉబలాటం చిన్నగా మొదలైంది అందరికీ.
    "ఒరేయ్ సిద్దయ్యా....ఓసారి లోనకెళ్ళి చూద్డామారా....' అడిగాడు ఎంకయ్యా.
    "పోవచ్చునో లేదో" దిగులుగా అన్నాడు సిద్దయ్య.
    "రానిస్తారో లేదో" అన్నాడు శీనయ్య.
    'అరె ఎందుకు రానియ్యర్రా....మనం కట్టిన ఒటేలది.... మనల్నెందుకు రానియ్యరు....ఇల్లు కట్టినప్పుడు గృహ ప్రవేశం చేసి, మనల్ని కూడా పిలుస్తారు కదా బైట సార్లు....ఒటేలు కెందుకు పిలవరు.... నడువుండ్రి పోదాం" అన్నాడు శంకరయ్య పోచయ్య.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS