బంధితులు
హెమింగ్వే మీద అభిమానం చాలా వున్నది నాకు. ఆయన రాసిన పుస్తకాలన్నీ చదువనూ లేదు. చదివిన ఒక్క పుస్తకంలోనే ఆయనంటే ప్రాణం పెట్టే స్థితి కొచ్చేను. 'ఓల్డు మాన్ అండ్ దిసీ!'
నా పెళ్ళినాడు ఓ మిత్రుడు ఆ పుస్తకాన్ని కానుకగా యిచ్చేడు. 'తోచినప్పుడల్లా చదువుకో, మంచి పుస్తకం' అని చెప్పి రెండుముక్కలు ఇంగ్లీషులో మొదటి పేజీమీద రాసి వుంచాడు.
వయస్సు ముదిరిన బెస్తవాడు, అతనికి మనోహరమైన కొన్ని జ్ఞాపకాలు, అతనికో కుర్రనేస్తం, వాళ్ళిద్దరి స్నేహం, సముద్రం, దానిలోని సొరచేపలూ, సముద్రంమ్మీద ఎగిరే చిన్న చిన్న పిట్టలూ - వీటన్నిటితో సంబంధమైన కథ తయారయింది. రాసిన పద్దతికి చేతులు రెండూ జోడించేయాలి.
ఆ మధ్య పెళ్ళయిన కొత్తలో (ఆషాఢమాసంలో కాబోలు) ఆ కథను యావత్తూ తెలుగులో రాసేను. స్నేహితులకు చూపించాను. చదివి బాగుందని మెచ్చుకున్నారు. ఆనక, అసలు పుస్తకమూ చదివేశారు.
ఆ పుస్తకానికొక యోగ్యతాప్రతి మివ్వడం నా ఉద్దేశం కాదు. అందుకు నా స్తోమతెంత? నాకు నచ్చిన పుస్తకం గురించి పదిమందికి చెప్పుకోడం, వాళ్ళది చదివారని తెలిసినా గూడాను (నా అలవాటు)
ఈ కథకీ ఆ పుస్తకానికీ ఏ విధమైన సంబంధమూ లేదు. కాకపోతే ఆ పుస్తకాన్ని మూడో తడవ చదవటానికి ప్రారంభించిన వేళా విశేషం చెప్పుకోదగ్గది! ఒక పేజీ తిప్పేనోలేదో నా గది గుమ్మం ముందు ఓ కుర్రాడు తారట్లాడుతూ కనిపించేడు.
చాలామంది కుర్రాళ్ళనింతకుముందు నేనెన్నో సార్లు చూసేను. మా అక్కయ్యకీ, అన్నయ్యకీ పిల్లలున్నారు. అవకాశం దొరికితే నెత్తికెక్కి రాజ్యంచేసేందుకు పెంకి ఘటాల్లో క్లాస్ వన్ రౌడీలు! అస్తమానూ అల్లరి. అయినా ముద్దుగానే వుంటారు.
ఈ కుర్రవాడి విషయం వేరు. తొమ్మిదేళ్ళ వయస్సుంటుందేమో. బొమ్మలా, అచ్చుపోసిన బంగారు బొమ్మలా మెరిసి పోతున్నాడు. తృటిలో నన్ను ఆకర్షించాడు. పుస్తకం మూసి వాడివేపు కన్నార్పకుండా చూడటం మొదలుపెట్టాను.
నా గది గుమ్మమెక్కి వీధివేపు చూస్తూ నించున్నాడు వాడు. కాసేపలా నించుని, అకస్మాత్తుగా గంతు వేయడంతో విశేషమేదో జరిగుంటుందని అనుమానించేను.
లేచి వెళ్ళి వాడి పక్కన నించుని చూసేను. గుమ్మం ముందు నిల్చిన వర్షపునీట్లో రెండు కాగితప్పడవులున్నాయి. ఓ పడవ మునిగిపోయి వుంది. రెండోదానికి రాయి అడ్డు తగలడంతో ఆగిపోయి వుంది.
నేను వాడిపక్కన నించుని వున్నట్లు గమనించేడు కాబోలు, తలెత్తి నావేపు చూసేడు. అనక గుమ్మం దిగి నీళ్ళలో నించున్నాడు. తర్వాత అన్నాడు.
"మా బుజ్జి పడవ మునిగిపోయింది."
"మంచి పని జరిగింది. రెండోది నీదేమిటి?"
తలూపేడు. వాడి మొహంలో వెల్తురు. తళుక్కున మెరిసింది. అప్పుడు మరింత ముచ్చటగా కనిపించేడు.
కాసేపటికి వాడి పడవ రాయిని తప్పించుకొని ముందుకు సాగింది. కదుల్తోన్న పడవని చూస్తున్నాడు.
'నీ పేరేమిటోయ్!"
"పార్ధు" స్పష్టంగా చెప్పాడు.
"పడవలు చేయడం నీకు బాగా చాతొచ్చేమిటి?"
"....."
"ఏం చదువుతున్నావ్?"
"నాలుగు"
వాడి పడవ దూరంగా వెళ్ళింది. పార్ధుడు జారిపోతున్న తన నిక్కర్ని పైకి లాక్కుంటూ ఆ పడవని వెంబడించాడు. అక్కడక్కడ వాడితో పాటు నాకూ ఆడుకోవాలనిపించింది. గది తలుపు వేసి గుమ్మం దిగేనన్నమాటే గాని మరో అడుగు ముందుకు వేయలేకపోయేను.
సరిగ్గా నా గది ముందు ఓ డాబా వున్నది. ఆ డాబా మీద ఓ ఆడకూతురు తీరిక చేసుకుని పార్ధుడివైపు కుతూహలంగా చూస్తోంది. నన్ను చూచి గూడా ఆమె అక్కడ్నుంచి కదల్లేదు. నా పెద్దరికం చప్పున గుర్తుకు రావడంతో మళ్ళీ వెంటనే గదిలోకి వొచ్చేసి తలుపు వేసేను.
ఈ వూరికి ప్రత్యేకమైన ఆఫీసు పనిమీద వొచ్చేను. మూడు నెలలపాటు నేనీవూళ్ళో వుండాలి. మా వాళ్ళందరినీ వొదిలేసి నేనొక్కడ్నే అక్కడికొచ్చేసేను. ఈ గది కుదుర్చుకోడం చాలా సులభంగా జరిగిపోయింది. అన్ని సదుపాయాలూ వున్నాయి. మంచి పొరుగు. ఈ వూరొచ్చిన పదిరోజుల్లో రాసిన అయిదుత్తరాల్లో శ్రీమతికీ విషయాలన్నీ రాసేను. శ్రీమతి నుంచి ఆవాళ వొచ్చిన జాబులో నేతీసుకున్న గది తాలూకు సదుపాయాల గురించి రాయమని రాసింది. ఏమిటో ఖంగారు మనిషి.
నాకు గదినిచ్చిన శ్రీధరరావుగారు బడిపంతులు. ఇంటి దగ్గర 'ప్రైవేట్లు' ఏర్పాటు గొడవున్నది. కేవలం ఆయన స్వార్జితంతోనే లంకంత యిల్లు కట్టేశాడు. ఆయన ముందు చూపున్న మనిషనీ, రెండో పెళ్ళితో సుఖంగా వున్నాడనీ టూకీగా ఆయన గురించి తెలిసిన వివరాలు.
ఇంట్లో మొత్తం ఎంతమంది జనాభా వున్నారో తెలీదు. చాలా నిశ్శబ్దంగా వుంటుంది ఇల్లు. అప్పుడప్పుడూ పార్ధూ, బాబ్జీల సందడి మినహాయిస్తే మరే యితరుల గొంతూ సాధారణంగా వినిపించదు.
ఓ రోజు బాగా పొద్దుపోయింతర్వాత గదికొచ్చేను. మనసంతా ఇంటిమీద వుండడం చేత త్వరగా నిద్రపట్టింది కాదు. ఏమైనా చదివేందుకు మనసొప్పలేదు. లైటు ఆర్పి సిగరెట్టు ముట్టించేను. నోరు చేదుగా తయారయ్యేంతవరకూ సిగరెట్లు కాల్చాను. రాత్రి పది దాటిందనుకుంటాను. పక్క వాటాలో పార్ధుడేదో గొణుగుతున్నాడు ఎవరో సముదాయిస్తున్నారు. కాసేపటికి పార్ధుడు పాట పాడమని అడిగేడు. ఆవిడ పాడింది.
గోపాలకృష్ణుడు నల్లన
గోకులములో పాలు తెల్లన
కాళీందిలో నీళ్ళు చల్లన
పాటపాడవే నా గుండె ఝల్లున....
