Previous Page Next Page 
ఆదివిష్ణు కథలు పేజి 26


    ఎవరో కళ్ళద్దాలాయన నన్ను గురించి వేణుబావతో అన్నాడు -
    "అవునోయ్ వేణూ! మీ లాయరేమయ్యాడేమిటి? ఇతన్ని పెట్టుకున్నారు."
    "వాడు, వాళ్ళూరు అలిగి వెళ్ళిపోయేడు. ఇతన్ని మా వూరునుంచి పట్టుకొచ్చేం" అన్నాడు వేణు బావ.
    "అయితేనేంలే. లాయర్ని మించిపోయేడు?"
    కళ్ళద్దాలాయన నన్ను మెచ్చుకోవడంలో నేను వుబ్బిపోలేను గానీ వేణుబావ నా గురించి పదిమందిలోనూ అలా చెప్పడంతో నొచ్చుకున్నాను. నేనీ వూరొచ్చింది వీళ్ళింట్లో వంటమనిషిగా కుదరడానికా? ఈ వూళ్ళో నే చేయబోయే విలువైన ఉద్యోగం ఇదేనా? గబగబా అక్కన్నుంచి ఒచ్చేసి వోమూలగా నించుని కళ్ళొత్తుకున్నాను. భుజం మీద చేయి పడటంతో ఉలిక్కిపడి చూసేను.
    భాస్కరంగారూ!
    ఆయన వేణుబావకి స్నేహితులు. ఇద్దరూ కలిసి చదువుకున్నారు. తరచూ ఆయన ఇక్కడికి వస్తుంటారు. వచ్చినప్పుడు నన్నూ పలకరించేవారు. ఈ తడవ ఆయన నన్ను పలకరించి పోడానికి రాలేదు. పాఠం చెప్పేందుకొచ్చానని ఆయనే అన్నారు.
    "నువ్వీ స్థితికి వొస్తావని నాకు తెలుసు. గొప్పింటి బిడ్డలకు నువ్వు పురుగులాంటి వాడివి. నువ్విక్కడికి రావడమే పొరపాటు. ఇవాళ నిన్ను అవమానపరిచాడని బాధపడకు. ఇలాంటప్పుడే కొంచెం స్థిమితంగా ఉండాలి. అలా ఉండి, నీ బాగు కోసం నీ ప్రయత్నాలు చేస్తూండు. ఏదైనా సాయం కావలిస్తే నన్నడుగు సందేహించకు."
    ఈ రెండు ముక్కలూ చెప్పి ఆయన వెళ్ళిపోయారు.
    దుఃఖం పొంగి పొర్లి వచ్చింది. ఆ రాత్రికి రాత్రే మావయ్యను ధైర్యంగా అడిగేయగలిగాను.
    "నాకు ఉద్యోగం కావాలి!"
    ఆయన నావేపు చిత్రంగా చూచి అన్నారు.
    "ఉద్యోగం లేకపోతే నీ కొచ్చే యిబ్బందేమిటి చెప్పు?"
    "ఇబ్బంది గురించి కాదు. నేనడిగేది. ఉద్యోగం నేనీ వూరొచ్చింది ఉద్యోగం కోసం."
    "అవునయ్యా! ఉద్యోగం ఎందుకు చేస్తారంతా! పొట్టనింపుకోడానికవునా? ఇప్పుడు నువ్వు ఉద్యోగం చేయకపోయినా భోజనం జరుగుతుంది కదా! మరింకెందుకలా ఆవేశపడతావ్. మాతో పాటే ఉండిపో. ఇంట్లో వాళ్ళం ఏం తింటున్నామో? అదే నువ్వూ తిను. సరిపోలే."
    మావయ్య మాటల్లో దాగిన తిరకాసు నా కర్ధమయ్యింది. నా గొంతులో అసహాయత నిండుకున్నది. ఏం మాటాడాలో తెలిసింది కాదు.
    "ఈ మాత్రందానికి అన్నయ్యను ఒదిలి రావాలా నేను. వాళ్ళూ నా పొట్టకింత పెట్టి పోస్తున్నారు గదా! కానీ నా ఉద్దేశం అది కాదు మావయ్యా! మీ అందరి దగ్గరా వూడిగం చేయాలని కాదు. నాకు చాలా కలలున్నాయి మావయ్యా. వాటికోసమే బ్రతుకుతున్నా నేను. నన్ను బ్రతకనివ్వండి! మావయ్యా! బ్రతకనివ్వండి!"
    మావయ్యకి కోపం వచ్చింది.
    "పెద్దంతరం చిన్నంతరం లేకుండా కూస్తున్నావురా నువ్వు. ఆనాడు మీ అప్పాయిల్లాగే మెరిగి యిప్పుడు నెత్తి మీదికి తెచ్చుకుంది. దాని మొగుడు చావు బతుకుల మధ్య నలిగిపోతూంటే డబ్బు పంపు మావయ్యా, మందులు కొనాలి మావయ్యా అని రాసింది. ఆనాడు నేను గానీ, మీ అన్నగానీ కనిపించలేదు. ఈనాడు మేం కావలసివచ్చాం. ఇదిగో ఉత్తరం చదువుకునేడువ్. దాని కుక్క బతుకు తెలుసుకు బుద్ది తెచ్చుకుంటావ్. ఇక్కడ నే చెప్పినట్టు పడుండు. లేదూ - నువ్వూ ఆ దిక్కుమాలిన చావుకు నోచుకో. పో... రేపీ వేళకి నీ నిర్ణయం చెప్పు."
    ఇది కుట్ర, పక్కా దగా, మోసం, అన్యాయం.
    
                                     *    *    *
    

    నా నిర్ణయం మావయ్యకి తెలిసే ఉంటుంది!
    ఇక్కడ బావగార్ని చూస్తూంటే గుండె తరుక్కుపోతోంది. మంచానికి అంటిపెట్టుకున్నారాయన. రోజు రోజుకీ ఆయన స్థితి భయంకరంగా తయారవుతోంది.
    అక్కయ్య కళ్ళల్లో మునుపటి వెల్తురు లేకపోడానికీ, అక్కయ్య మాటల్లో మునుపటి సందడి లేకపోటానికీ బావ జబ్బే కారణమని చెప్పగలను. ఇరవై నాలుగ్గంటలూ బావని చూస్తూ కూర్చుంటుంది. దీనికితోడు చిట్టిగాని అల్లరొకటి!
    ఇదీ నా అక్కయ్య ఇల్లు!
    ఈ ఇల్లు చేరినది మొదలు నాకో క్షణమైనా తీరుబడి చిక్కడం లేదంటే ఒప్పుకుంటాను. వంటా వార్పూ, బాబుని బుజ్జగించడం, మందులు తీసుకురావడం -అన్నీ, అంతా నేనేనంటే అవునంటారు.
    ఒక్కటి మాత్రం నిజం. నేనింతకు మునుపు రెండిళ్ళలో 'ఊడిగం' చేశాను. అభిమానం చంపుకొని కొంతా, భయం చేత కొంతా, ఫలించని ఆశ చేత కొంతా నేను నౌకరీ సన్నాసిగా ఆ యిళ్ళలో చెల్లుబడి అయ్యేను. కానీ - యిది వేరు.
    ఇది నా ప్రాణం లాంటి అక్కయ్య ఇల్లు. నా సేవ వల్ల మా బావకి స్వస్థత చిక్కుతుందనే ఆశకి నా సర్వాన్నీ అర్పించగలను. చదువుకుని బాగుపడి, ఉద్యోగం చేసి వగైరా నా కమ్మటి కల లెవర్నుద్దరించడానికి? నన్నూ, మా అక్కయ్యనీ అలాంటి అక్కయ్యకీ యిప్పుడు నేనెంత చాకిరీ చేసినా అది నా నెత్తుర్ని చల్లపరచదు. నా అభిమానాన్ని తినేయదు. పైపెచ్చు నా మనసులో అమోఘమైన తృప్తొకటి నిలిచిపోతుంది. దేవతలాంటి అక్కయ్య అవసరాలకి నా చాతకొచ్చిన సాయం చేశాననే ఆనందం స్థానం చేసుకుంటుంది.
    కాని భాస్కరరావుగారు యివన్నీ వో పట్టాన గ్రహించలేకపోయారు: నామీద ఆయనకున్న వాత్సల్యం యెంత విలువయినదో తెలియజేసుకున్నాడే గానీ, ఆయనలా అన్న తర్వాత నా మనసెంత బాధపడుతుందో తెలుసుకోలేకపోయేరు.
    ఈ వూళ్ళోనే ఆయన కలిశారు. బావగారికి మందు తీసుకొస్తుండగా, మా వీధిలోనే ఆయన నన్ను చూసేరు. గబగబా నా దగ్గరకొచ్చి అన్నారు -
    "నువ్వు వెళ్ళిపోతున్నట్లు నాకు చెప్పగూడదూ!"
    మాటాడలేదు నేను.
    "ఊ... ఇక్కడేం ఉద్యోగం చేస్తున్నావ్ మీ అక్కయ్యగారింట్లో వెట్టిచాకిరీయేనా?"
    "డాక్టరుగారూ!"
    అరిచేసేను. నా కళ్ళు చూచి ఆయన కొంచెం సర్దుకున్నారు. ఆ తర్వాత నేను సిగ్గుపడ్డాను.
    "క్షమించండి. మీరోమాటు మా బావగార్ని చూడండి. మా యిల్లిక్కడే. మా అక్కయ్యని కూడా చూద్దురుగాని. చూసి మీ నోటికొచ్చినట్టు అనేయండి. అప్పుడు నేను బాధపడను. రండీ, డాక్టరుగారూ!"  
    అదే వేరొకరయితే - నా పరిస్థితిని యింత విపులంగా చెప్పే అవసరముండేది కానే కాదు. ఆయన మనసున్న మంచి మనిషి మంచి మనుషుల్ని ఆయన అపార్ధం చేసుకోడం నా కిష్టం లేదు. అందుచేతనే మా యింటికి తీసుకెళ్ళి, అన్ని పరిస్థితులూ వివరించి చెప్పేను.
    ఆయనేమనుకున్నాడో ఏమో! మరేం చెప్పలేదు. బావగార్ని పరీక్ష చేశారు. చిట్టి బుగ్గమీద చిటిక వేశారు. చేతులూపుకుంటూ బైటకొచ్చారు. నేనాయన్ను అనుసరించేను.
    "నీకు చదువుమీద అభిలాష వున్నట్టు నువ్వు నాతో చాలాసార్లు చెప్పేవు. నీమీద జాలి కలగడానికి కారణాలు చాలా ఉన్నాయి. ఇవన్నీ నేను ప్రత్యేకించి చెప్పను. నువ్వు చదువుకునేందుకు ఏర్పాటు చేద్దామనుకున్నది నిజం. ఆ మాట నీతో చెప్దామనుకునేంతలో నువ్వీవూరు వొచ్చేసావ్. ఇప్పుడు...." ఆయనేదో చెప్పబోయేడు.
    ఆయన మాటకి అడ్డు తగిలాను.
    "వద్దు డాక్టరుగారూ! నాకిప్పుడా కోరికలేదు. నాక్కావలసింది మా అక్కయ్య సుఖం. మా బావని మీరు చూశారు. మీకు చేతనయిన సాయం మీరు చేయండి. మా బావని బ్రతికించండి. అది చాలు అదే చాలు"
    నా భుజం తట్టారాయన. వెళ్ళిపోతూ అన్నారు. "భూమ్మీద చాలామంది దురదృష్టవంతులు పుడతారు. వాళ్ళని బాగుచేయడం మానవ సాధ్యం కాదు."
    ఆయన వెళ్ళిపోతూ అన్న మాటలు ఎవర్ని ఉద్దేశించి? నా దౌర్భాగ్యం గురించేనా? లేక మంచం మీదవున్న బావ నుద్దేశించా?
    భగవంతుడా! ఆయనన్న మాటలు నాకు సంబంధించినవని చెప్పు! నేనే దౌర్భాగ్యుడిని, నేను....
    
                                           *    *    *


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS