"ఏం యిలా వచ్చేరు? ఇందిర యింట్లో లేదు."
"అవునండి నాకా విషయం యిప్పుడే తెలిసింది."
"ఏమిటి? మీ కిప్పుడే తెలిసిందా?"
శ్రీనివాసరావు ఆయనకి ఉత్తరాన్ని యిచ్చి నించున్నాడు. అయన ఉత్తరం పూర్తిగా చదివి అన్నాడు.
"ముందు.....ముందు మీరలా కూర్చోండి రావ్ గారూ!"
"ఫరవాలేదండీ."
'అలాక్కాదు. మీరు కుచోవాలి . ప్లీజ్...."
శ్రీనివాసరావుకి కూర్చోక తప్పింది కాదు. ఆఫీసరు ముందుకు ఒరిగి, రహస్యంగా అడిగినట్టు అడిగేరు.
"చూడండి రావ్! ఈ విషయం యింకా ఎవరికైనా తెలిసిందా?"
"మా యింట్లో తెలుసు."
"మీ యింట్లో చెప్పండి రావ్. ఈ విషయం పదిమందికి తెలియకూడదు. ప్లీజ్. రావ్ గారూ, నేను....నో.... అలాక్కాదు. ముందు మీరో సాయమ చేసి పెట్టండి. వెంటనే మీ ఫ్రెండ్ కి వైరివ్వండి. మనం బయలుదేరి వస్తున్నట్టూ, అమ్మాయి కనిపిస్తే వారింట్లోనే ఉంచేయ\మనీను. ఒక్కగానొక్క కూతురు , రావ్!.....నా స్థితిని నేను చెప్పుకోను. ఇంటావిడ భోజనం ముట్టి చాలా రోజులైపోయింది. ఉండండి ఒక్క క్షణం....ఇప్పుడే వస్తాను."
అయన దాదాపు పడిపోతూ లోపలికి వెళ్ళేడు. రెండు నిమిషాల్లో ఆ యింట్లో నించి ఇందిర ఏడుపు వినిపించిందతనికి. కాసేపటికి అఫీసరతన్ని ఇంట్లోకి పిలిచేడు గూడాను.
అప్పుడే మొట్టమొదటి సరిగా ఇందిర తల్లిని చూసేడు శ్రీనివాసరావు. ఆవిడ ఇందిరంత అందంగానూ వుంది. ఇంత శోకంలోనూ ఆ తల్లి కళావిహీనంగా కనిపించలేదు.
"మీకు రెండు చేతులూ ఎత్తి నమస్కారం చేస్తాను బాబూ! అమ్మాయిని యిక్కడికి రప్పించే విధానం ఆలోచించండి. ఇలా మదరాసు వెళ్ళి వచ్చిందని మా బంధు వర్గంలో తెలిస్తే దానికీ జన్మలో సుఖం వుండదు. పిచ్చి తల్లి! నాతొ నోరువిప్పి ఒక్కమాటైనా చెప్పకుండా వెళ్ళిపోయింది. ఆవతలేమో లక్షాధికారుల సంబంధం వచ్చి కూర్చుంది. వాళ్ళకి విషయం తెలిస్తే నా పిల్లగతేం గాను/ బాబూ! మీకు పుణ్యముంటుంది అమ్మాయిని రప్పించే భారం మీది" అన్నదామె వెక్కుతూ
ఆ తల్లి తాపత్రయం అతనికి అర్ధమైంది.
అప్పటికప్పుడే ఆఫీసరు బట్టలు మార్చుకుని వచ్చేసేరు.
"రండి , రావ్ గారూ! ముందు వైరిచ్చే యేర్పాట్లు చూద్దాం. పది గంటల బండి మీద మదరాసు వెడదాం. కమాన్ క్విక్...."
"ఒక చిన్న విషయం సార్!"
"చెప్పండి."
"నేను మదరాసు రాలేను. అమ్మాయిని అప్పగించే బాధ్యత మా ఫ్రెండే పుచ్చుకుంటాడు. అంతవరకూ హామీ యివ్వగలను."
"మీరు రారా? .....ఆయనెవరో మాకు తెలీదాయే."
"అదేం ఫరవాలేదు. అతను నాకు ప్రాణ మిత్రుడు. నా మాట అతను కాదనడు."
"అది తరవాత చూద్దాం. ముందు వైరిచ్చి వద్దాం రండి."
ఆయనే స్యయంగా కారుని గెరేజ్ నుంచి తెచ్చేడు. రావ్ కారెక్కి కూర్చున్న తరవాత వేగంగా ఆ కారుని పోస్టాఫీసు వేపు డ్రైవ్ చేసేరాయన.
అరగంటలో పని పూర్తీ అయింది. ఇద్దరూ తిరిగి యింటికి వచ్చేసేరు. మధ్య హల్లో కూచున్నాక , అయన శ్రీనివాసరావుని నింపాదిగా అడిగేరు.
"మీరు మాతో పాటు మదరాసు రావడానికేమైనా అభ్యంతరమా?"
(మీతో రావడానికి నాకేం అభ్యంతరం? అదేం కాదు సార్! వాడు .....అ ముకుందం గాడికి నేను దూరంగా వుండాలని ప్రయత్నం చేస్తున్నాను. నా గొప్ప స్నేహితుల్ని నేనెంత త్వరగా దగ్గిర చేసుకోలేను)
"నాకెందుకో మదరాసు రావాలని లేదండి. మీరు వెళ్ళండి. అమ్మాయిని వెంట బెట్టుకుని రండి. ఒక కాగితమిస్తే .....మా ఫ్రెండ్ కి ఉత్తరం రాసిస్తాను."
ఆయనింక ఎదురు చెప్పలేదు.
ఆయనిచ్చిన కాగితం మీద శ్రీనివాసరావు ముకుందానికి నాలుగు ముక్కలు రాసేడు. ఆ కాగితం ఆఫీసరుకిచ్చి లేచి నించున్నాడు వస్తానంటూ. అయన తలూపేడు. అతను గుమ్మం దాటకముందే మళ్ళా హెచ్చరించేరు.
"ప్లీజ్ , రావ్ గారూ! ఈ విషయాన్ని ఎవరికీ చెప్పకండి. అమ్మాయి భవిష్యత్తు మీ అందరి చేతుల్లోనూ వుంది."
శీనివసరావుకి జాలి కలిగింది.
అయితే ఆ జాలిని అక్కడ ప్రదర్శించేందుకు అతనికి హక్కు లేదు గనక తల ఆడించి వచ్చేసేడు.
ఆ రాత్రే జరిగిన విషయం యావత్తు యింట్లో చెప్పి , ఈ రహస్యాన్ని అల్లరి చేయకండని హెచ్చరించేడు.
8
రెండు రోజుల నించి శ్రీనివాసరావు ఇల్లు కదలడం లేదు.
నాలుగు రోజులు సెలవు పెట్టి మంచం ఎక్కేడు. అతనిది చిత్రమైన రోగం. ఈ రోగాన్ని అంటిపెట్టుకున్న లక్షణాలు చెప్పేందుకు వేళాకోళంగా కనిపిస్తుంటాయి. గుండెల్లో దడా, భయమూనూ, ప్రత్యేకించి వాటికో కారణం కనిపించదు.
నడుస్తుండగా , ఎక్కడైనా తూలి పడే ప్రమాదం రావచ్చని కూడా అతని అనుమానం.
ఎలాగో ఆఫీసరూ లేడు గనక చెక్కులు రాసే హడావుడి వుండదు. అందుచేతనే అతను నాలుగు రోజులు సెలవు పెట్టేడు. శ్రీనివాసరావు సాధారణంగా సెలవు పెట్టడు. సెలవనేది ఎవరో కొందరు అదృష్టవంతులు సరదా కోసం ఏర్పాటు చేసుకున్న విరామ సమయమని అతని అభిప్రాయం. అలాంటప్పుడు శ్రీనివాసరావు ఆ రూలుకి సంబంధించడు.
అతను సెలవు పెట్టిననాడు , తప్పనిసరిగా యింటి దగ్గరే గడపాలి. ఇంటి దగ్గిర కాలం అంత హాయిగా జరగదు. అది అతనికి బాగా తెలుసు. పోనీ పొరుగూరు వెళ్ళి , రెండు రోజులు ఖర్చు చేసి వచ్చేందుకా -- అతనికి తాహతు లేదు.
రెండోవాడు పుట్టేవరకూ అతని సెలవలన్నీ నాటకాలకే ఖర్చయ్యాయి. అప్పటివరకూ అతను కొంచెమో, గొప్పో జబర్దస్తీగానే బతికేడు. ఆస్తి అమ్ముడై, నాన్న చేసిన అప్పులు తీరగా, కొంత పైకం అమ్మ దగ్గిరే ఉండేది. కళ్ళ ముందే జరిగిన అన్యాయాన్ని మరిచిపోవడానికి అతను నాటకాల వలలో చిక్కుకున్నాడు. ఆ తరవాత మెల్లిగా తల్లి దగ్గర పైకం అయి పోవడంతోనూ , మూడో వాడు జన్మించి పిల్లలెక్కువనే సిద్దాంతాన్ని మనసులో తలవడం చేతనూ ఆ నాటకాలని విరమించవలసి వచ్చింది.
అందుచేత, అతనప్పటినించీ సెలవల్ని వృధా చేయడం మానుకోవాల్సి వచ్చింది.
మూడో రోజు సాయంత్రం నాలుగు గంటల వేల శ్రీనివాసరావుకి ఒళ్ళంతా నొప్పులుగా ఉన్నప్పుడు - కొండలు యింటికి వచ్చేడు.
కొండల్ని చూడటం తోనే శ్రీనివాసరావు మంచం దిగి కంగారుగా అడిగేడు -
"ఏమిటిలా వచ్చావ్?"
"మిమ్మల్ని అర్జంటుగా రమ్మన్నారు అయ్యగారూ!
"అయన వచ్చేరా?"
"వచ్చేరు ఆఫీసుకి రాలేదు. మిమ్మల్ని తిన్నగా యింటికి రమ్మని ఫోన్ లో చెప్పేరు."
