"వాటికి మీరు భయపడుతున్నారా!"
"లేదు. మీ కోసం. లక్షల కట్నం తెచ్చే కల్పతరువులు మీరు."
"నాకు లక్షలు ఇచ్చేవాడు నా వెనుక ఉన్న లక్షలు చూస్తాడు గాని, నా గుణ, గణాలు కావు," ఇద్దరూ నడుస్తున్నారు.
వారిద్దరిని చూస్తే చక్కని జంట అనుకుంటారు యెవరయినా, ఆ నిమిషంలో ఆమె ఒక ఉద్యోగాన్వేషణలో తిరుగుతున్న స్త్రీ అని తనొక పురుషుడని మరిచిపోయాడు. అతనికి ఒకే ఒక విషయంగుర్తుంది. ఆమె ఒక మంచి మిత్రురాలని, తన క్లాసుమేటో, పరిచయస్తురాలో అన్న భ్రమ కలుగుతుంది.
ఇద్దరూ మొదట ఒకరి గురించి, జాగ్రత్తగా ఉండాలనుకున్నారు కాని, ఆ విషయమే మరిచిపోయారు. ఇద్దరూ కరీమ్ చాచా ఇల్లు చేరుకున్నారు.
"ఆవ్ బేటా....ఆవ్...." ఆయన ఆనందంగా ఆహ్వానించాడు.
ఇద్దరూ వెళ్ళి కూర్చున్నారు.
శ్వేత నిరుత్సాహంగా తన అనుభవాలు చెప్పింది.
"ఈ ఊరు వసూ నేను ఎన్నో ఆశించాను. అన్నీ తారుమారు చేసారు మీ వాళ్ళు. ప్రతి నిమిషం నన్ను నేను రక్షించుకోవాలని తాపత్రయపడాలి" అన్నది బాధగా.
"దాదాపు మన పల్లెలన్నీ అలాగే ఉన్నాయి"
"బాగు చేద్దామన్నా బాగుపడవు."
చాలాసేపు ఇద్దరు ఆ విషయం చర్చించారు. సిద్దార్ధ తన అన్న విషయం ఏమిటో తేల్చుకుంటానని హామీ ఇచ్చాడు.
అతనికి ఇంటికి వెళ్ళాలనిపించలేదు. రాధిక దీనంగా చూస్తుంది. ఆవేశంలో అతడిని అభిమానించిందనుకున్నాడు కాని, ఆమె నిజంగా అతని క్షేమం కోరుతుందని అర్ధం అయింది.
దీపాలు పెట్టెవేళ ఇంటివైపు నడక సాగించాడు. ఈ రెండు, మూడు సంవత్సరాలలో చాలా మార్పులు వచ్చాయి. వీధికి నాల్గు సారా కొట్లు వెలిసాయి. రోడ్డు ప్రక్కన మహాత్మాగాంధీ బీర్ పాలెస్' అంటూ బోర్డు కనిపించింది.
ఏమిటని చూస్తే ఒక పెద్ద కొట్టులో కొందరు త్రాగి తందనాలు ఆడుతున్నారు.
మరో ప్రక్క పేకాడుతున్నారు.
అక్కడ రాములు' అనే రౌడీ కూర్చున్నాడు.
"తాగినోడు అబద్దం చెప్పడు భయి. జంగయ్య చచ్చిపోలేదు........ చంపేసిండ్రు......"
"ఛ.....ఏమిటి గొడవ........"
"గొడవకాదు నిజం" వరిచ్చండ్రుడిలా నిజం........ చెబుతున్నాను. 'సాములోరు మఠం సంగతి పోలీసులకు చెప్పనా' అంట నిన్న కాదు...... మొన్న గిక్కడే........ గీతావున కూసోని...... దొరముందు సవాల్ జేసిండు. ఏ దొరనుకున్నావు....... సిన్నదొర.... గదే.... గదే........ మధుమూర్తి దొరముందు సవాల్ జేసిండు........ఆఁ......."
అన్నపేరు వినిపించగానే అలర్ట్ అయ్యాడు సిద్దార్ధ వెళ్ళి కూర్చున్నాడు ఓ మూల.
"మధుమూర్తి చంపించాడంటావా!"
"అంటానా ఏమిటయ్యో! జరిగింది గంతే. ఇక్కడినుంచి ఇద్దరూ ఖాళీగ బొయ్యిండ్రు......." అన్నాడు.
సిద్దార్ధకు అర్ధం అయింది. వెంటనే అతను లేచి పోలీసుల దగ్గరకు వెళ్ళాడు. విషయాలు చెప్పాడు.
వారు ఒక్క నవ్వు నవ్వారు.
"మీకు పిచ్చి ఉందా సార్! ఇందాక బాలరాజే వచ్చి స్టేట్ మెంట్ ఇచ్చాడు. తన తండ్రికి శత్రువులంటూ యెవరూ లేరు. అతనికి గుండెజబ్బు ఉందట." అని నిర్లక్ష్యంగా వార్తా పత్రిక చదువుతూ వెనక్కు వాలాడు ఎస్సై.
"అది కాదండి....." ఇందాక రాములు విషయం చెప్పాడు.
"గిట్టని వారు ఎన్నో మాట్లాడుకుంటుంటారు. వాటన్నిటిపై మేం చర్యలు తీసుకుంటే బాగు పడ్డట్టే....." అన్నాడు నిర్లక్ష్యంగా.
సిద్దార్ధకు విపరీతమైన కోపం వచ్చింది.
తను చెప్పింది వాళ్ళకు లక్ష్యం లేదా! యెవరు చెప్పినా అంతే చేస్తారా అర్ధం కాలేదు.
"వెళ్ళండి సర్! ఇంతకీ మీరెవరు?"
