సిద్దార్ధ కూర్చున్నాడు. ఇంత శుభ్రత వెనుక అంత కుళ్ళా!
"చెప్పండి"
"చెప్పటానికి రాలేదు. అడగటానికి వచ్చేను" అన్నాడు.
"అడగండి"
"జంగయ్యది సహజ మరణమా!"
జోస్ ముఖం చిట్లించాడు. ఒక్క నిమిషంలో అతని ముఖంలో రంగులు మారిపోయాయి.
"మీకేం కావాలి?"
"నేను అడిగిన ప్రశ్నకు జవాబు కావాలి."
"నువ్వెవరు, నీ హోదా ఏమిటి! ఏ అధికారంతో నన్నీ ప్రశ్న వేస్తున్నావ్! నా రిపోర్టు పోలీసుల కిచ్చాను......."
"నో! అబద్దం రిపోర్టు ఇచ్చారు" బల్లమీద గుద్దాడు సిద్దార్ద.
"మిస్టర్! మెంటల్ హాస్పత్రిలో చేర్పవలసి ఉంటుంది. నేను ప్రభుత్వం నౌకరీ చేస్తున్నాను. ప్రభుత్వానికే జవాబు చెప్పాలి." అన్నాడు.
"అయితే ప్రజల ప్రభుత్వం అని తెలియదా! ఆ ప్రజలల్లో ఒక్కడిని నేను"
"ప్రతిఒక్కడికి జవాబు చెప్పాల్సి న అవసరం లేదు."
"న్యాయంగా మీ రిపోర్టు ఇచ్చినప్పుడు అది వర్తిస్తుంది" అన్నాడు కోపంగా.
"డాడీ........" ఇద్దరు పిల్లలు వచ్చి తండ్రిని కౌగిలించుకుని బావురుమన్నారు.
"ఏం లేదమ్మా......నథింగ్ టు వర్రీ......." పిల్లల్ని దగ్గరకు తీసుకున్నాడు. వాళ్ళిద్దరూ సిద్దార్ధవంక భయంగా చూచారు.
"పాపా! వీళ్ళను తీసుకువెళ్ళు........."
పాప ముప్పైయేళ్ళ స్త్రీ, వచ్చి పిల్లలను తీసుకు వెళ్ళింది.
"మాకు ఆశయాలు ఉడుకురక్తం లేకకాదు. బరువు బాద్యతలు ఉన్నాయి మిష్టర్ నాకు తల్లిలేని ఇద్దరు బిడ్డలున్నారు." అన్నాడు.
"ఒహో......" అన్నాడు సిద్దార్ధ.
"మొదట మీ ఇల్లు బాగుచేసుకుని, తరువాత మాట్లాడండి."
"వాట్ డూ యూ మీన్?"
"అయి మీన్ కరెక్ట్ లీ........"
"సిద్దార్ధకు అర్ధం అయినట్టు కానట్టు ఉంది.
అతను బయటికి వచ్చేసరికి ప్రకృతి చీకటి ముసుగు కప్పుకుని. నల్లబడింది. అతని మనసు మహాసాగరం అయింది. భుజానికి బ్యాగు తగిలించుకుని వస్తూ శ్వేత కనిపించింది.
"హల్లో!"
"హల్లో! డాక్టరుగారి దగ్గరకు వెళ్ళేరా?"
"మీకెలా తెలుసు!"
"డాక్టరుగారి రిపోర్టు చూచిన వారెవరయినా ,మీరు వెళ్ళి పోట్లాడతారని అనుకుంటారు."
"అయిసీ........" అన్నాడు యెటో చూస్తూ.
"రండి. కరీమ్ చాచా ఇంటిముందు కూర్చుందాం. ఇక్కడ నీడలో తిరిగినా రంకు అంటగడతారు." అన్నది.
