Previous Page Next Page 
అయిదు రెళ్ళు పేజి 25

 

    గీత, మోహన్ ఒక హోటల్లో కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ టిఫిన్ తింటున్నారు. ఇంతలో గూడ కట్టు కట్టుకున్న ఇద్దరు మగవాళ్ళు గబగబా వచ్చి దగ్గరగా ఉన్న మరో బల్ల ముందు కూర్చున్నారు. నలబై, నలబై అయిదు మధ్య వయస్సు వాళ్ళు. చదువుకున్న వాళ్ళలా లేరు. వాళ్ళు రావటమే లోడలోడమని వాగుతూ వచ్చారు. కూర్చున్నాక ఇంకా స్థిమితంగా మాటలు దోర్లిస్తున్నారు. గీత మోహన్ కు ఒకళ్ళ మాటలు మరొకళ్ళ కు వినిపించటం మానేశాయి. దాంతో మాట్లాడుకోవటం మానేసి వాళ్ళ మాటలే వింటూ కూర్చున్నారు.
    "అంద గవర్నమెంటు వెరీగుడ్ . టుడే అప్లయ్ టుమారో రిప్లయ్. ఇంద గవర్నమెంట్ నో గుడ్ అప్లయ్, అప్లయ్ అప్లయ్ నో రిప్లయ్!"
    గీత కిసుక్కుమంది "వాళ్ళ ఇంగ్లీష్ చూశారా?" అంటూ మోహాన్ నవ్వాడు.
    "వాళ్ళ ఇంగ్లీష్ కేం? చక్కగా పాయిట్రి లా ఉంటేను..... ఫైన్ రైమ్స్!"
    "నేను ఫారిన్ వెళ్ళినప్పుడు ఇలాగే మాట్లాడుతాను కాబోలు..." లనుకుంది గీత ఖాళీ చేసిన ప్లేటు దూరంగా తోస్తూ.
    మోహన్ బజ్జీ నోట్లో పెట్టుకునిబోతున్న వాడల్లా ఆపేసి ఆశ్చర్యంగా చూశాడు.
    "మీరు ఫారిన్ వెళ్తారని ఎవరు చెప్పారు? వెస్ట్రన్ మ్యూజిక్ నేర్చుకోవడానికి వెళ్ళాలను కుంటున్నారా?' అంటూ బజ్జీ నోట్లో వేసుకుని ఖాళీ చేశాడు.
    గీత కోపంగా మూతి ముడుచుకుంది.
    "ఎవరు చెప్తే ఏం? నేను ఫారిన్ వెళ్ళకూడదా?.... ప్రభాకర్ గారని ఉన్నారు లెండి. అయన చెయ్యి చూసి చెప్పారు.... భ్రుగునాడట! మీరెప్పుడన్నా విన్నారా? ఆయనకి ఎక్కడెక్కడ సంగతులూ తెలుసు!"
    ఎవరూ? ప్రభాకరే? వాడి మొహం! భ్రుగునాడి గురించి వాడికి నేనే చెప్పాను. నాకు భలే సరదా లెండి భ్రుగునాడి చూపించుకోవడమంటే."
    గీత చెయ్యి కడుక్కోటానికి కుళాయి దగ్గరకు వెళ్ళటానికి లేస్తూ "మీ సంగతే కాబోలు అయన చెప్పారు 'నా స్నేహితుడొకడికి భ్రుగునాడంటే తగన వెర్రి' అని...." అంది.
    మోహన్ ఆలోచనలో పడ్డాడు.
    ప్రభాకర్ గీత కెందుకు జాతకం చూసినట్లు?..... అరి భగవంతుడా! ఆరోజు కీరో పుస్తకం తెచ్చుకోవటానికి లైబ్రరీ కి వెళ్ళాడు కదా పైగా 'ప్రేయసి కోసం వేస్తున్న వేషం' అన్నాడు కూడా!
    "ప్రేయసి కోసం వస్తున్న వేషం!" అంటూ మోహన్ పైకి గట్టిగా అనేసరికి గీత అదురుకుని చెవులు మూసుకుంది.
    "సినిమాల్లో డైలాగులు వల్లిస్తున్నారా?' అంటూ కుళాయి దగ్గర కెళ్ళింది.
    చెయ్యి కడుక్కుని రుమాలుతో తుడుచుకుంటూ వస్తున్న గీతను చూసి మోహన్ కుతకుత లాడిపోయాడు. నవ్వుతూ, అమాయకంగా కనబడుతున్న గీత! ఎంత నటన? ఆడవాళ్ళు పైకి ఎంత అమాయకంగా కనబడతారు!
    మోహన్ సర్వర్ చూడకుండా ప్లేటులో చెయ్యి కడిగేసి , గీతను దూసుకుంటూ బైటికి వెళ్ళిపోయాడు. "ఎక్కడికి?" అని గీత ప్రశ్నకు జవాబు చెప్పకుండా. గీత నివ్వెర పాటుతో కుర్చీలో కొచ్చి కూర్చుంది... బల్ల మీద రెండు గ్లాసుల కాఫీ చల్లగా చల్లారిపోయింది. మోహన్ ఎందుకలా వెళ్ళిపోయినట్టు? నాన్నగారు కాని..... తను పుట్టిన దగ్గర్నించి నాన్నగారు హోటల్ కెళ్ళటం తను చూడలేదు.... అలాంటిది ఇవ్వాళ పని కట్టుకు వస్తారా? మరీ మోహన్ ఎందుకలా పరిగెత్తినట్టు? తలచుకుంటే గీతకు చెప్పలేనంత భయం వేసింది.
    "అరె! మీరా?"
    మోహన్ తిరిగి వచ్చాడని గీత సంతోషంగా తలెత్తి చూసింది. ఎదురుగా తెల్లబోతూ నిలచున్న ఉష, పక్కనే నిలబడి తనను పలకరిస్తున్న ప్రభాకర్! గీత తెల్లగా పాలిపోయింది.... గీత తేరుకునేటప్పటికి ప్రభాకర్ సర్వర్ కు ఏవేవో తెమ్మని చెబుతున్నాడు. ఉష గీత పక్కకు వచ్చి కూర్చుంది. ప్రభాకర్ బల్ల కవతల వైపు గీతకు ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చున్నాడు.
    "మీరు ఎందుకో బాధపడుతున్నారు?"
    ప్రభాకర్ జాలిగా చూస్తున్నాడు.... అల్లకల్లోలంగా ఉన్న మనస్సుకు చల్లని అనునయం! గీత క;కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. బలవంతాన వాటిని బైటికి రాకుండా ఆపుకుని తెచ్చి పెట్టుకున్న నవ్వుతో "మీరు ఇట్టే కనిపెడతారు.... తల నొప్పిగా ఉంది...." అంది.
    మోహన్ సంగతి చెబితే బాగుంటుందా? అతను తక్షణం ఎందుకలా లేచి వెళ్ళిపోయాడో? ప్రభాకర్ స్నేహితుడు కదా? బహుశా అతని మూడ్స్ ప్రభాకర్ కు తెలిసే ఉంటాయి. అదీగాక మగవాడి మనస్సు మగవాడికి అర్ధం కాకుండా ఉంటుందా?.... మోహన్ తను హోటల్ కొచ్చినట్టు ఎలా చెప్పటం ?.... ఏం ఉష, తను రాలేదు?
    గీత మెల్లిగా అడిగింది.
    "ఎవరన్నా మాటల మధ్యలో సందర్భం లేని వాక్యం ఒకటి తీసుకొస్తే దానర్ధం ఏమిటండీ?'
    ప్రభాకర్ తల గోక్కున్నాడు. వెంటనే జవాబు తట్టింది.
    "అలాంటి వాటిని కొటేషన్లంటారు లెండి. ఏ షేక్ స్పియర్ అన్నదో మాటల్లో పెట్టి కొందరు అర్ధం లేకుండా మాట్లాడతారు..."
    గీతకీ జవాబు రుచించలేదు... అసలు విషయం మెల్లిగా చెప్పటానికి ఉపక్రమించింది.
    "మీకు మోహన్ గారు తెలుసునట కదూ?"
    "అబ్బే! దీన్ని కొటేషన్ అని ఎవరంటారు?'
    ఉష, గీత ఒకేసారి నవ్వారు.
    "అనకపోతే అనకపోయారు. ఈ ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నాను. జవాబు చెప్పండి!" అనడిగింది గీత.
    ప్రభాకర్ సర్వర్ కోసం చూపులు సారిస్తూ "ఏ మోహన్?" అన్నాడు.
    "సినిమాల్లో వేస్తారు.... అయన! ఇంత సేపూ ఇక్కడే ఉన్నారు. సరిగ్గా మీరోచ్చేముందు బైటి కెళ్ళారు. బహుశా మీకు కనబడే ఉంటారు." అని చెప్పింది గీత నెమ్మదిగా మాట్లాడుతూ.
    "ప్రభాకర్ ఉష కేసి చూశాడు.
    "వాడు మా కెక్కడ కనబడలేదే?"
    గీత పైకి తెలియకుండా నిట్టూర్చింది.
    "ఆయనెక్కడ కనబడతార్లెండి! విమానం లా దూసుకు పోతారు!"
    ప్రభాకర్ కుతూహలంగా అడిగాడు.
    "ఇంతకీ వాడి సంగతి ఏమిటంటారు?"
    గీత చూపులు క్రిందికి దించి బల్ల మీద మెల్లిగా చేత్తో రాస్తూ "ఏం లేదు! మీరు నేను ఫారిన్ వెళ్తానని చెప్పలేదూ? ఆ ముక్కే ఆయనతో అంటే అయన నిర్ఘాంత పోయారు....' అంది.
    ప్రభాకర్ గతుక్కుమన్నాడు. మోహన్ గాడిని చీరేసినా పాపం లేదనుకున్నాడు కోపంగా. తనకు పామిస్ట్రీ  రాదనీ బైట పెట్టకపోతే నోరు మూసుకుని వూరుకోకూడదూ?
    గీత మళ్ళా మొదలు పెట్టింది.
    "వెంటనే అయన "ప్రేయసి కోసం వేస్తున్న వేషం!" అంటూ కుర్చీలో నించి లేచి వెళ్ళిపోయారు."  
    ప్రభాకర్ చేతి వ్రేళ్ళతో నుదుటి మీద టకటకా కొట్టుకున్నాడు.
    "ఎక్కడో విన్నట్టే ఉంది సుమండీ!..... ఆ జ్ఞాపకం వచ్చింది. ఇది కన్యాశుల్కం లోది --!
    ఆశగా చూస్తున్న గీత కళ్ళల్లో నిస్పృహ తొంగి చూసింది.
    "అయన కన్యాశుల్కాన్ని కంటితో కూడా చూసి ఉండరు!...."
    "అయితే ఏ సినిమాచేలాగో అయి ఉంటుంది."
    "ఏమో మరి! మీ గురించి మాట్లాడుకుంటున్నాం . మీరు ఫారిన్ రేఖ ఉందన్నారుగా? దాని గురించి.... గభాలున ఆ సినిమా డైలాగు ఎందుకు జ్ఞాపకం వచ్చిందో?"
    ప్రభాకర్ ఆలోచనలో పడ్డాడు.... ఇదేదో చిన్న విషయం కాదు. తన గురించి మాట్లాడుతూ ప్రేయసి నెందుకు తల పోసుకున్నట్టు? అదీ గీత ముందు!
    ప్రభాకర్ కళ్ళు మూసుకున్నాడు.... 'ప్రేయసీ కోసం వేస్తున్న వేషం!' ...... మబ్బుల మాటున దాగిన చందమామ మబ్బులు తొలగి పోగానే ప్రకాశిస్తూ ప్రత్యక్షమవుతాడు. ఇంతవరకు పాత స్మృతులను మరపు అనే మబ్బు కప్పి వేసింది. ఆ మబ్బు విడిపోవటంతో పాత స్మృతులు కట్టెదుటకు వచ్చి నిలిచాయి. ప్రభాకర్ ఉలిక్కి పడ్డాడు.... ప్రభాకర్ అన్న పలుకులా ఇవి?...తొందరగా మోహన్ దగ్గర కెళ్ళాలి.
    సర్వర్ ఫలహారం ప్లేట్ల ను బల్ల మీద పెట్టి వెళ్ళాడు. వేడి వేడి ఇడ్లీలు, పొగలు గ్రక్కుతున్న సాంబారు! అయినా ప్రభాకర్ చలించలేదు. గభాలున లేచి "నేను అర్జంటుగా వెళ్ళాలి!" అన్నాడు.
    గీత తెల్లబోయింది. మగవాళ్ళు ఇంత చిత్రంగా ప్రవర్తిస్తారెందుకని? అర్జెంటు పనుంటే హోటల్ కెందు కొచ్చినట్టు? ఇవన్నీ ఎందుకు తెప్పించుకున్నట్టు? మగవాళ్ళకి మనస్సు, మాట రెండూ నిలకడగా ఉండవు.
    "మేం కూడా వెళ్ళాలి!" అంటూ గీత, గీత వెంట ఉష లేచారు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS