ఆ నగరంలో నాకో ఉద్యోగం చూపించగల బాధ్యత తాను తీసుకున్నట్టు రాశాడు. "వున్నపళంగా నన్ను పంపించేయమని" అన్నయ్యని ఆదేశించేడు. ఆ క్షణంలో చచ్చిన నా కలల మనిషి మళ్ళా బతికేడు. అదీ అంతులేని రంగులకల ప్ర్రారంభమయ్యింది.
నేనూ ఉద్యోగస్తుడిని. ఉద్యోగం చేస్తూ పెద్ద చదువులు చదువుకోడానికి అవకాశం అక్కడ బాగావుంది. చదివి బాగు పడిపోయిన నేను నా కళ్ళముందు వెలుగుతూ నించున్నాడు.
తెల్లచొక్కా, తెల్లషరాయి వేసుకున్నాను. ఎడం చేతికి ముచ్చటైన వాచీ ఉంది. అందమైన నా ఉంగరాల జుత్తు నిగనిగలాడుతోంది. జుత్తునుంచి వచ్చే ఖరీదైన తలనూనె వాసన మనసుకి హాయిగా వుంది. రోడ్లుమీద అన్నయ్యకంటే దర్జాగా నడుస్తూన్నాను. చేతిలో ఆఫీసు ఫైలు నన్నుద్దరించేదిగా ఉంది. జనం రద్దీగా వున్నచోట అకస్మాత్తుగా ఆగిపోయేను. ఎవరు? ఎవరది?
అక్కయ్యా!
అక్కయ్య గుర్తుకు రావడంతో నా కల ఆగిపోయింది. ఉద్యోగం వచ్చిన తర్వాత అక్కయ్యని వెతికి ఆ దేవత కాళ్ళమీద పడిపోవాలి. 'నేనున్నాను అక్కయ్యా! తోడు నేనున్నాను. నా చిన్నతనంలో, నా అజ్ఞానంలో, నా అసమర్ధతతో నువ్వెళ్ళిపోయావు. నిన్ను వెళ్ళగొట్టేరు. నేనిప్పుడు అన్నివిధాలా పెద్దవాడినయ్యేను. మావయ్య దయవల్ల. ఉద్యోగం సంపాయించి స్వశక్తిమీద చదివి హోదాని పెంచుకుని నీముందు మేరుపర్వతంలా నించున్నాను. నన్ను గుర్తు పట్టలేదా. నేను నీ తమ్ముడ్ని. నీ చిట్టిని."
గుండె బరువుగా ఉండటంతో మావయ్య రాసిన ఉత్తరాన్ని గుండెకి హత్తుకున్నాను. అది నాపాలిట అదృష్టదేవత. అంతలోనే అన్నయ్య వచ్చేడు -
'ఎన్ని వగలు పోతున్నావురా! పట్టపగలే కలలు కంటున్నావు. ఆకాడికి, ఇన్నేళ్ళూ యిక్కడ కష్టపోయినట్టు. వెళ్ళిరా." అన్నాడు ఈసడింపుగా -
అన్నయ్య ఆదినా నన్ను వదలించుకున్నందుకు ఆనందించే ఉంటారు. బానిస అమాయకత్వాన్ని భరించగలరు గానీ, హక్కులూ, విధులూ, న్యాయం చట్టం ఇవన్నీ తెలిసిన బానిసని యే యజమానీ భరించలేడు. అందుచేతనే వాళ్ళిద్దరూ ఆనందించి ఉంటారు. రైలెక్కే ముందు గూడా అన్నయ్య కళ్ళలో ఆప్యాయతని చూడలేదు నేను.
హద్రాబాద్ చేరేను ఇంద్రభవనం లాంటి మావయ్యా వాళ్ళ యింట్లో అడుగు పెడుతూండగా భయం వేసింది. ఇంత హోదాలో బతుకుతూన్న మావయ్యా అండన నేనెలా ప్ర్రవర్తించాలి?
మావయ్య దేవుడులాటి మనిషి, భయంతో ఒణికిపోతూన్న నన్ను మందహాసంతో హెచ్చరించేరు. 'ఈ యిల్లు నీది. ఈ యింట్లో నువ్వూ ఒహడివి' అనే భావం ఆయనే మందహాసంలో స్ఫురించింది.
అత్తయ్య నాతో చనువుగా మాట్లాడకపోయినా వేణుబావా, సుగుణమ్మ నన్ను కొత్తగా చూచేవారు కానే కాదు. వేణుబావ డాక్టరీ పూర్తి చేశాడు. సుగుణమ్మ కాలేజీ చదువుతోంది.
బొమ్మల్లా వుంటారిద్దరూ. ఖరీదైన శరీరాలు వాళ్ళవి. విలువైన మనసులు వాళ్ళవి. నా అంతస్తెక్కడ? నేనెంత? అయినా వాళ్ళ అభిమానంతో యివన్నీ మరిచిపోయేను. నన్నింత అలరింపజేస్తోన్న అదృశ్యశక్తులు వెయ్యి దేవుళ్ళకి చేతులు రెండూ జోడించేను.
హైద్రాబాద్ వచ్చి రెండు నెలలు గడిచేయి.
మావయ్య యిరవై నాలుగ్గంటలూ యేవో పనుల్లో ఒత్తిడిగా వుండేవాడు. నాకై నేను ఆయనెదుటపడి ఉద్యోగ విషయం అడగటానికి భయం వేసింది.
ఒకరోజు వేణుబావ నాతో అన్నాడు.
"నువ్వు కాఫీ బ్రహ్మాండంగా చేస్తావు."
సిగ్గువేసింది.
"అవునూ..... ఈ వంటా వార్పూ నేర్చుకుందికి యెన్నాళ్ళు పట్టిందేమిటి? ఎవరి దగ్గిర నేర్చుకున్నావ్. మొన్నీ మధ్య నువ్వు చేసిన వంకాయకూర లవ్లీగా వుంది. చెప్దామనుకుంటూనే మర్చిపోయేను. మా అమ్మ కూడా అల్లా వండదనుకో!" అన్నాడు నా కళ్ళలోకి చూస్తూ.
"అన్నయ్య వాళ్ళింట్లో నేనే వంట చేసేవాడిని. అయితే వాళ్ళెప్పుడూ నన్ను మెచ్చుకోలేదు."
"వాళ్ళ మొహం వాళ్ళకేం తెలుసు రుచి"
బావ నన్ను ఆకాశాని కెత్తేశాడు. అదే సమయమని నా విషయం చెప్పేను.
"మావయ్య నాకింతవరకూ ఉద్యోగం వేయించలేదు. నువ్వైనా నా మాట ఆయన చెవిలో వేయి బావా! నేనే మాటాడుదామనుకుంటే భయంగా ఉంది!"
బావ పకపకా నవ్వేసేడు.
"భయమేమిట్రా బొత్తిగా! ఆయన పులికాదుగా, నిన్ను మింగేయడానికి. సరేలే నేనే ఆడుతాను" అన్నాడు.
నేనొచ్చేస్తూండగా సుగుణమ్మ గదిలో నవ్వులు వినిపించేయి. మరో యిద్దరు స్నేహితురాళ్ళు సుగుణతో యేదో బాతాఖానీ వేస్తూ నవ్వుతున్నట్టు గమనించేను. సరదాగా తలాడిస్తూ వంటగదివేపు వెళ్ళబోయేను. అంతలో సుగుణమ్మ నన్ను పిలిచింది. అంతమంది వున్న పరాయి ఆడపిల్లల గదిలోకి బిక్కుబిక్కుమంటూ వెళ్ళేను.
"ఈయనే మా నలమహారాజు. ఇప్పుడు మీరు మెచ్చుకుంటున్న కాఫీ చేసింది సాక్షాత్తు వీరే. వీరు మా మేనబావగారు. చదువులోనూ, వయస్సులోనూ చిన్నవారు గనుక నేను వారికి పత్నిని కాలేకపోయాను. వీళ్ళిద్దరూ నా ఫ్రెండ్సు బావా!" అన్నది సుగుణ చమత్కారంగా.
మిగతా యిద్దరూ గబగబా నవ్వేశారు. నేనే గది లోంచి బైటకొచ్చేశాను. సుగుణ అన్నమాటలు యింకా వినిపిస్తూనే వున్నాయి. 'వయసులోనూ, చదువులోనూ' చిన్న వాడిని. మరే రకంగానూ కాదు. చాలు సుగుణకి నా పట్ల హీనభావం లేదు. ఇక్కడ నాకు ప్రాణం పోసే మనుషులున్నారు.
ఆ మరుసటిరోజు వేణుబావ పుట్టినరోజు పండుగ. పెద్దెత్తున ప్రయత్నాలు ఆ రోజు ఉదయంనుంచీ చేతినిండా పని తగిలింది. ఉక్కిరిబిక్కిరైపోయాను.
ఆ సాయంత్రం వేణుబావ వాళ్ళ స్నేహితులందరూ వచ్చేరు. సగానికి సగం మంది చొప్పున ఆడపిల్లలూ వున్నారు. నా చేతిమీదుగా తయారు చేసిన పదార్ధాలు వాళ్ళ ముందుంచేను. కళ్ళు జిగేలుమనిపించే అందరిమధ్య నేను తిరుగుతుంటే యేదో హాయిని అనుభవించేను. ఇల్లంతా కన్నుల పండువగా ఉంది. అక్కడ చేరిన వాళ్ళ మాటలూ, నవ్వుల్తో సందడిగానూ ఉంది.
