Previous Page Next Page 
అదివిష్ణు నవలు -2 పేజి 25

 

    అ డాక్టరు సహృదయుడు గనక, ఆ పేదవాడి భుజం తట్టి నవ్వి అంటాడు.
    "నువ్వు చెప్పింది నిజమనే తోస్తుందోయ్."
    శ్రీనివాసరావుకి అసలు నిజం అప్పటికి గాని గుర్తు రాలేదు. నాటకంలో నారాయణరావు చెప్పినదెంతో నిజమని తోచినప్పుడు అతను భయపడటం మానుకున్నాడు. అందుచేత అతను సిగరెట్లు కొనుక్కుంటూ ఆ కిళ్ళీ బడ్డీ యజమానిని, "నీకు పిల్లలెంతమంది " అని అడిగేడు. ఆ బడ్డీ కొట్టు యజమాని సిగ్గుపడుతూ లేరన్నప్పుడు , మళ్ళా తనకి తెలిసిన థియరీ తప్పేమో అనుకున్నాడు.
    అతనా రోజు ఆఫీసులోనూ ప్రశాంతంగా లేడు. లంచి అవర్లో తన చుట్టూతా చేరిన గుమాస్తాలందర్నీ పలకరించి , వాళ్ళకి పిల్ల లెంతమందో తెలుసుకున్నాడు. ఈ కార్యక్రమం జరుగుతుండగా ఆఫీసరు గదిలోంచి బయటకు రావడం చూచి మాటలాపేడు.
    ఆయనో క్షణం అక్కడ నుంచుని జనాంతికంగా అన్నట్టు అనేసేరు.
    'నా ఒంట్లో బాగోలేదు . నేను యింటికి వెళ్ళిపోతున్నాను. అర్జంట్ పేపర్సు రేపు ఉదయం చూస్తాను."
    ఆఫీసరు వెళ్ళిపోవడం కళ్ళప్పగించి చూస్తుండిపోయాడు శ్రీనివాసరావు.
    "అవును, గురువుగారూ! ఈ మా రాజింత మారిపోయడెం? దిగులు మాత్రం మింగిన పేషెంట్ లా అలా నేరంగా తయారవుతున్నాడెం ఖర్మ?" అన్నాడు వెంకటాచలం శ్రీనివాసరావు నుద్దేశించి.
    "నాకు తెలీదు."
    "వాళ్ళమ్మాయికి జ్వరమట!"
    "అనే విన్నాను."
    "ఏమిటో చెడ్డ రోజులు."
    శ్రీనివాసరావుకి మళ్ళా ఇందిర గుర్తు వచ్చేసింది. ఇవాళ ఎలాగైనా సరే వెళ్ళి ఆ పిల్లని చూడాలని తీర్మానించుకున్నాడు.
    అతనారోజు పెందరాళే యింటికి వచ్చేడు. స్నానం ముగించి , కాఫీ తాగి బయటికి రాబోతుండగా సీత అతన్ని అడిగింది.
    "ఎక్కడికి?"
    ఇవాళ డాక్టరు దగ్గరికి వెళ్ళమని తల్లి చెప్పిన సంగతి గుర్తుకు వచ్చి గూడా దాన్ని పూర్తిగా మరిచినట్టు నటించి అన్నాడు.
    "ఇందిరను చూద్దామని."
    "ఉందా యిక్కడ?"
    "నీకేం పిచ్చేక్కలేదు గదా! పాపమూ పిల్లకి జ్వరమని చెప్పేను గాదుటే?"
    "జ్వరమా?"
    "అవునేం?"
    "ఏం జ్వరమో?"
    "ఏదైనా మాయదారి రోగమేమో?"
    "సీతా!"
    "ఎందుకలా గావుకేక పెడతారు?"
    "ఏమిటా ఆశీస్సు , మరి?"
    "ఇందిరను గురించి మీకేం తేలియదాండి?"
    శ్రీనివాసరావు సీత వేపు పరీక్షగా చూసేడు. అప్పుడామే పూర్తిగా చెప్పిందుకు ప్రయత్నించింది.
    "ఇంకా ఎన్నాళ్ళీ రహస్యాన్ని దాచిపెడతారు? ఇన్నాళ్ళూ ఆ పిల్లకి మీరు ట్యూషనే చెప్పెరనుకున్నాను."
    "మరేమిటనుకున్నావ్?"
    "ఒక చిన్న పొరపాటు చేసేరు మీరు. ఉత్తరాలు ఆఫీసు అడ్రసుకే రాయమని మీ ముకుందం గారికి చెప్పి వుండవలసింది . ఇంటికి రాసేడాయన . చదివి మేమంతా అనందించేం లెండి. చదువుకునే పిల్లకి సినిమాల్లో చేరమని మంచి సలహానే యిచ్చేరు."
    "అతిగా వాగకు. అసలేం జరిగిందో చెప్పు ముందు."
    "నిక్షేపంగా ఉత్తరమే చదువుకోండి. ఒరేయ్ , బుజ్జీ , ఆ ఉత్తరాన్ని మీ నాన్నగారికివ్వు'."
    బుజ్జి తెచ్చిన ఉత్తరాన్ని శ్రీనివాసరావు గబగబా చదివేడు. ఆ ఉత్తరం ముకుందమే రాసేడు.
    "మై డియర్ రావ్!
    క్షేమం. నీ క్షేమం రాయి. ఇందిర మదరాసు వచ్చి ఎన్నాళ్ళయిందో గానీ, రెండు రోజుల క్రితమే నా దగ్గిరికి వచ్చింది. ఆ పిల్ల సినిమాల్లో చేరాలనే సరదా కొద్ది ఇక్కడికి వచ్చిందట.
    తన గురించి తక్కువ చెప్పి నీ గురించి ఎక్కువ చెప్పింది. ప్రైవేట్లు కూడా ప్రారంభించావా? నాకు తెలీదు. నువ్వింత గొప్ప మేష్టారువని. శుభం. ఈ పాత్ర కూడా నటించు.
    అనుకున్న క్షణంలో సినిమాల్లో వేషం దొరకడం కష్టం. నాకేదో యిక్కడ గొప్ప స్థానముందని ఇందిర అనుకున్నది కాబోలు . నేను ఆ అమ్మాయిని నిరుత్సాహపరచలేదు. చూద్దమన్నాను."
    నేను విసుక్కోనట్టయితే రోజూ మా యింటికి వస్తానంది. శిష్యురాలికి నా దగ్గిర అనాదరణ దొరకదు రమ్మన్నాను.
    నువ్వు నాకు దూరంగా వుంటున్నా రావూ! నీ మనుషులు వస్తున్నందుకైనా నేను గర్వించాలి. ఆనందించాలి. ఒకమాటు నువ్వూ రాకూడదూ! నీ యువరాజులకు ఆశీస్సులు, అమ్మకీ, అక్కగారికీ వందనాలు.
                                                                                                              - ముకుందం.
    శ్రీనివాసరావు నిలువునా కూలిపోతున్న అనుభూతిని పొందేడు.
    (ఏం సార్ ! ఇందిర బంధువులు ఊరు వెళ్ళిందన్నారు. జ్వరమన్నారు పరీక్ష మానుకుందన్నారు. ఎందుకిన్ని అబద్దాలు? ప్రేస్టేజీ! అయన దొక్కటే మీచేత యిన్ని అబద్దాలు పలికించింది. ఆడపిల్ల యిల్లు విడిచి పోయినందుకు మీరు బాధపడరు. ప్రేస్టీజీ , అది తగలబడిపోతుందేమోనని మీ భయం. భేష్! బాగుంది సార్ ,ఈ యిబ్బంది గొప్ప యిబ్బంది .)
    "చదివేరా?" అనడిగింది సీత.
    "చదివేను. కాని సీతా! నువ్వు నన్ను ఎందుకింత తక్కువగా అంచనా స=వేసేవో అర్ధం కాకుండా వుంది. ఆడపిల్ల సినిమాల్లో చేరడం తప్పో ఒప్పో చెప్పను గాని ఆడపిల్లలకి వాళ్ళకి కావలసిన మార్గాలు చూపించి , నాకేం తెలీనట్లు నటించే ఫూల్ నా నేను? ముకుందం నాకు స్నేహితుడని ఆ అమ్మాయికి తెలుసు. చొరవతో మదరాసు వెళ్ళి వుంటుందటే. నా పిల్లల సాక్షి! నాకేం తెలీదు. వుండు ఇప్పుడే వస్తాను. రోజస్తమానం దిగుల్ని మింగి తిరుగుతూన్న ఆ పెద్ద మనిషికి ఈ వుత్తరం చూపించి వస్తాను."
    అతను నేరుగా యింట్లోంచి బయటికి వచ్చేడు. గబగబా ఆఫీసరు యింటివేపు నడిచేడు.
    ఆ యింటి వరండాలో ఆఫీసరు ఫేము కుర్చీలో కూర్చుని వున్నాడు. శ్రీనివాసరావుని చూచీ చూడటంతోటే అయన కంగారుగా అడిగేరు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS