"వెళ్ళమ్మాయ్ వెళ్ళు! మీ ఆడపిల్లలని నాలుగు మాటలంటే సరి! ఎక్కడలేని అభిమానం! గంగాభవాని తలపైనే వుంటుంది!" అన్నాడాయన మళ్ళీ.
అవమానాన్ని భరించి, విషంలా మ్రింగి బయటకి వచ్చింది.
"వీళ్ళు సరిగా పని చేయలేరు సార్! అంటున్నాడు హెచ్.సి.
"అలా అంటావేమయ్యా! వీళ్ళే మేలు! కాస్తో కూస్తో భయంగా పనిచేస్తారు. మగ ముండా కొడుకులు గంటకోసారి కాఫీలు, టీలు, సిగరెట్లతో గడిపేస్తారు. ఏమనటానికి వీల్లేదు! నిర్లక్ష్యం! మెమోలాంటివి ఇద్దామా అంటే యూనియన్లు గొడవలు" అంటున్నాడాయన.
నిట్టూర్చి వెళ్ళి తన సీట్లో కూర్చుంది నంద.
పది నిముషాల్లో ఆ రిమెండర్ కి రిప్లై రాసింది. సబ్ కలెక్టరు ఆఫీసుకి తనో రిమైండర్ రాసింది. తీసుకెళ్ళి హెచ్.సి. ముందు పెట్టమంది ఎటెండర్ ని.
"నందగారూ!"
"కొద్ది దూరంలోనే వున్న హె.సి. పిలిస్తే చూసింది.
"ఈ విషయంలో మీ ఫ్రెండ్ కి కాస్త ఫోన్ చేసి పర్టిక్యులర్స్ వెంటనే పంపమని చెబుతారా?" రిక్వెస్టు చేశాడు రామయ్య.
అసహ్యంగా చూసింది నంద.
"ఇలాంటి విషయాల్లో ఫోన్స్ పని చేయవండీ!" అంది నెమ్మదిగా.
ఆ సమాధానం ఆయనకీ నషాళానికి అంటింది.
పళ్ళు కొరుక్కున్నాడు.
"ఏమిటీ?" అంది స్టెల్లా.
చెబుతా అన్నట్లుగా తలూపింది నంద.
అంతలో సిల్క్ పాలెస్ గుమాస్తా వచ్చాడు. అతన్ని అక్కడ చూడగానే ఆమె గుండె జల్లు మంది. అతను నేరుగా వచ్చి చీటీ ఇచ్చాడు.
దానిపై ఎంత ఇవ్వవలసింది రాసి వుంది.
రెండొందల చిల్లర!
ఏమిటన్నట్టు చూసింది నంద.
"అదేమిటో, అతనెందుకు వచ్చాడో ఆమెకి తెలియక కాదు అదంతే!"
"డబ్బందో! ఇప్పించుక రమ్మన్నారు!"
"నేనే తెచ్చి యిస్తానని చెప్పు!"
"ఎప్పుడొస్తారండీ?"
"జీతాలు రాగానే వస్తాను"
"జీతాలు వచ్చి పదిరోజులు అయింది కదండీ!"
"అవి ఖర్చయిపోయాయి ఇంకా వున్నాయా?"
ఆ అబ్బాయి కుర్రాడు.
"మా షావుకారు చెప్పాడండీ! డబ్బు ఇచ్చేదాకా యిక్కడే కూర్చోమన్నానండీ! సంవత్సరం పైగా అయింది. గుడ్డలు తీసుకున్నారు. తర్వాత ఒక్కసారయినా షాపుకి వచ్చారా? నెలనేలా ఇరవయ్యి చెల్లు చేసినా ఈ సరికి సరిపోయేది. గుడ్డలు తెన్చుకుంటే కుదరదు. అప్పుకూడా తీర్చేయ్యాలండీ" అన్నాడండీ ఆయన!" అన్నాడా కుర్రాడు.
తల కొట్టేసి నట్టయింది నందకి.
ఆ అబ్బాయితో ఆమె ఎంతో మెల్లిగా మాట్లాడుతోంది.
అయినా అతను కాస్త గట్టిగానే మాట్లాడుతున్నాడు.
ఎవరయినా వింటే పరువుపోతుందనే మధ్యతరగతి మనస్తత్వం!
మామూలు వాళ్ళకి యివి చాలా సహజం...
"బాబూ! ఇలా ఆఫీసుకి రావద్దు- నేను రేపు ఫస్టుకి తప్పక తెచ్చిస్తాను."
"అదేం కుదరదండీ! డబ్బివ్వకపోతే మిమ్మల్ని వెంటబెట్టుకు రమ్మన్నారండీ!"
"పోనీ సాయంకాలం వస్తాలే!"
"అందాకా నేనిక్కడే వుండాలా! భలేవారే! నా కింకేం పనిలేదా? మీలాంటి వాళ్ళని ఎందర్ని చూడాలి ఈ రోజు-"
విషం మింగుతున్నట్టుగా వున్నాయి వాడి మాటలు కోపం కట్టలు తెంచుకుని వస్తుంది. కానీ అది ఆఫీసని, నలుగురిలో నగుబాటనీ, అనవసరంగా వెలితి పడకూడదనే జంకుతోంది నంద.
"ఇప్పుడొకసారి వచ్చి, ఏం చెప్పుకుంటారో చెప్పుకుందురు కానీ రండి!!"
"ఇదిగో బాబూ-"
"న ఆపేరు రమణా-"
"రమణా-"
నంద ఏదో చెప్పబోయేలోగా శివరాం వచ్చాడు అక్కడికి "ఏం వోయ్ రమణా!" అంటూ.
"నమస్కారం సార్!" వినయంగా అన్నాడు వాడు.
"మిస్టర్ శివరాం!" గట్టిగా పిలిచింది నంద.
స్పీడ్ గా టైపు చేసుకుంటూ తన పనిలో నిమగ్నమై పోయిన స్టెల్లా ఉలికిపడి చూసింది ఆ పిలుపుకి.
శివరాంనీ-
ఆ కుర్రాడినీ-
ముఖాన నెత్తురుచుక్క లేనట్టున్న నందని చూసింది.
"మీరు వెళ్ళండి ఇదిగో అబ్బాయి! ఇది ఆఫీసు ఇక్కడ యింతకంటే చెప్పలేను, నువ్వు ఎక్కువ మాట్లాడకు నేను సాయంకాలంవచ్చి మీ షావుకారుతో మాట్లాడుతాను. లేదా లంచ్ టైంలో ఫోన్ చేస్తాను వెళ్ళు!" గట్టిగా అంది నంద.
తన ఎత్తు పారనందుకు దిగులుగా! "వెళ్ళవోయ్ సాయంకాలం రాపో! అంతగా అయితే షాపుకి నేనూ వస్తాను!" అన్నాడు శివరాం.
చేసేదిలేక వాడు వెళ్ళిపోయాడు బిక్కముఖం వేసుకుని.
శివరాం ఏదో చెప్పబోయాడు.
'ప్లీజ్ వెళ్ళండి!" నరికినట్టుగా అంది నంద. ఆమెకి ఎంతో కోపంగా వుంది. ఆ కుర్రాడి ప్రవర్తన- ఆ యజమాని పద్దతి- అసలు అప్పుచేయాల్సి వచ్చిన తన దౌర్భాగ్యం యివన్నీ కలిసి చేతకాని కోపాన్ని తెప్పించాయి. ఆ కోపం ఎవరిపై చూపే అవకాశం లేదు. అందుకే కోపం స్థానంలో బాధ వచ్చి కూర్చుంది.
శివరాం గూడలు ఎగర్ సి వెళ్ళిపోయాడు. ఆ కుర్రాడు వచ్చి, అతన్ని పలకరించినప్పుడే ఏదో ఎత్తు వేసుకుని వాడి వెంటే వచ్చాడతను. తను సాయం చేస్తోన్నట్టుగా ఆ డబ్బు కట్టేసి నందకి సహాయం చేసి, ఆమెతో యింకాస్త ఫ్రెండ్షిప్ పెంచుకోవాలనుకున్నాడు. కానీ ఆమె ఆ అవకాశం కల్పించలేదు.
