Previous Page Next Page 
మౌనవిపంచి పేజి 25

 

    "మేడం మీకు ఫోన్!"
    
    మరో రెండు నిముషాలకు వచ్చి పిలిచాడు ఎటెండరు జార్జి.
    
    ఫోన్ మేనేజర్ గదిలో వుంది.
    
    అక్కడికి వెళ్ళి మాట్లాడాలంటే ఎవరికయినా ఇబ్బందిగానే వుంటుంది. ఎక్స్ టెన్షన్ గా ప్రతి సెక్షన్ లో ఒక ఫోన్ పెట్టించమంటే ఆయన వినడు.
    
    "రామ్మా!" రిసీవర్ అందించబోతూ పిలిచాడు ఆయన.    

 

    "ఎక్కడ నుంచండీ!" ఫోనంటే నందకి చాలా భయం ఇంతలో ఏ ప్రమాదం ముంచు కొచ్చిందోననే ఆందోళన ముందుగా వస్తుంది. ఆ ఆలోచనలో బి.పి. హెచ్చుతుంది.
    
    "హల్లో!!"
    
    అనిల్ గొంతు వినగానే మనస్సు కుదుటపడింది అదోలా చూసింది మేనేజర్ వైపు మేనేజర్ రంగనాధంగారు కళ్ళు చిట్లించి చూశాడు. ఆయనకిలా మధ్యలో ఫోన్స్ తో వర్క్ డిస్టర్బ్ కావటం ఇష్టం ;లేదు.
    
    "హల్లో!!" అంది మెల్లగా నందా.
    
    "ఊఁ"
    
    టెలిగ్రాం యిచ్చారు. ఇక్కడినుంచి ఎక్కడికో పెళ్ళి చూపులకి వెళ్ళాలట!" అన్నాడు అనిల్.
    
    'ఆ' నిర్లిప్తంగా అంది నంద.
    
    "అవును అమ్మాయి ఫోటో కూడా పంపించారు. చాలా బాగుంది. ఎమ్మెస్సీ చదివి జూనియర్ కాలేజీలో సెలక్టయి పనిచేస్తుంది. కట్నం నలభై వేలట! అదికాక గోల్డ్ పది తులాల దాకా ఉందట అంతే కాదు! ఆమె పేర కొంత మాగాణి పొలం కూడా వుందట!" ఉత్సాహంగా చెప్పుకుని పోతున్నాడు అనిల్.
    
    వినటానికి బావున్నా విసుగనిపించింది నందకి.
    
    "అయితే!" కనుబొమలు చిట్లించింది.
    
    "ఇలాంటి కబుర్లు చెబుతున్నందుకు ఎదురుగా వుంటే ముక్కు పిండేదాన్ని. చెవులు మెలేసేదాన్ని-

 

    తాళికట్టుకున్న భార్యలాగా చూసుకుంటుంది తను.
    
    అతనూ అంతే! మరి అలాటి తనతోనా ఈ కబుర్లు! ఎంత ధైర్యం? తమాషా చేస్తాడా? ఊచికోలు కబుర్లా?" అనుకుని అటు ఇటు చూసింది.
    
    రంగనాధంగారు అసహనంగా చూస్తున్నారు.
    
    "పెళ్ళిచూపులకి వెళ్ళనా?"
    
    "ఊ"
    
    "ఇదిగో నందా! నీకు అ, ఆ, ఉ, ఊ లు తప్ప ఇంకోటి రావటం లేదా? ఎదురుగా ఆ ఫూల్ వున్నాడా?"
    
    రంగనాధన్ వైపు చూసి 'ఊ' అంది.    
    
    వెధవ! ఎన్ని ప్రశ్నలడిగా డనుకున్నావ్? ఎవర్నువ్వు నందతో ఏం మాట్లాడాలి? బంధువులా స్నేహితులా? "ఆఫీస్ టైంలో ఇలా డిస్టర్బ్ చేస్తే ఎలా? అని సొద పెట్టాడనుకో ఎప్పుడయినా ట్రాఫిక్ రూల్స్ తో స్టేషన్ కి లాక్కురమ్మంటాను!"
    
    "ఊ"
    
    సాయంకాలం నేను ఆఫీసు వదిలేశాక రమ్మంటావా
    
    "ఆ"
    
    "నందా! మానాన్నకి టెలిగ్రాం ఇచ్చాను నేను వస్తాను నువ్వు రావద్దు. పెళ్ళిచూపులు వద్దు అని రాశాను.
    
    "ఉ"
    
    "థాంక్సయినా చెప్పవేం?"
    
    "థాంక్స్..."
    
    "నందా! ఉదయం నిన్ను ముద్దు పెట్టుకుంటే ఎంత తీయగా ఉన్నదో తెలుసా? చేతి ముద్దే అలా ఉంటే."
    
    ఫోన్ పెట్టేయబోయింది నంద.
    
    "సారీ ఫోన్ పెట్టెయ్యకు లంచ్ అవర్లో రానా?"
    
    "ఊహూ"
    
    "ఈవినింగ్ వస్తాను ప్చ్!"
    
    అవతల ఫోన్ పెట్టేసిన శబ్దమైంది.
    
    తనూ ఫోన్ క్రెడిల్ చేసి "థాంక్యూ" సర్! అని వెళ్ళబోయింది నంద.
    
    రంగనాధంగారికి నిప్పులమీద వున్నట్టుగా వుంది.
    
    ఏమనటానికి ఆయనకి తోచటం లేదు.
    
    అంతలో హెడ్ క్లర్క్ వచ్చాడు.
    
    "సర్! కలెక్టరునుంచి రిమైండర్ వచ్చింది!
    
    "ఏమని?"
    
    "చూడండి!"
    
    అందుకుని చదివాడు రంగనాధన్.
    
    అది బ్యాక్ వర్డ్ క్లాస్ వాళ్ళకి సబ్సిడీగా ఇవ్వబోయే పాడిపశువుల ఎస్టిమేషన్ రిపోర్టు గురించి ఒక్కోవూరి కెంతెంత? వర్క్ కెంతా? తాలూకా కెంత? మొత్తం డివిజన్ కి ఎంత? వివరంగా పర్టిక్యులర్స్ కావాలన్నారు.
    
    అడిగి నెలరోజులయినా ఇవ్వనందుకు ఘాటుగా రాశాడు కలెక్టరు.
    
    "ఇది నీ సీటుకి సంబంధించినదే అనుకుంటాను" తప్పంతా నీదే అన్నట్టుగా నందవైపు చూస్తూ అడిగాడు రంగనాధన్.
    
    "అవునండీ!" నంద జవాబు చెప్పకముందే- దొరికిన ఛాన్స్  వాడెయ్యాలన్నంత కసిగా అన్నాడు హె.సి.రామయ్య మ్రాన్పడిపోయింది ఆమెపై యాక్షన్ తీసుకో అన్నట్టుగా వుందతని ధోరణి...
    
    ఆ రిమైండర్ అందుకుని చూసింది నంద!
    
    అది ఆమె సీటుకి సంబంధించినదే!
    
    "దీన్ని గురించి మనం సబ్ కలెక్టరుగారికి రాశామంది. ఆయనగారి నుంచి ఇంకా రిప్లై రాలేదు. మా ఫ్రెండ్ కి ఫోన్ చేస్తే వాళ్ళే ఆ స్టాటిస్టిక్స్ పంపమన్నారు!" జవాబు చెప్పిం సంజాయిషీ యిస్తోన్నట్టుగా.
    
    "ఇదిగో చూడమ్మాయ్! ఇలా ఫ్రెండ్సూ ఫోన్ చేయటాలూ ఆఫీసు పనిలో కుదరదు" కఠినంగా అన్నాడు మేనేజర్.
    
    ఆయన ఆ విషయం అంటున్నాడో ఇందాకటి విషయమే అంటున్నాడో అర్ధం కాలేదు నందకి.
    
    "నువ్వు కలెక్టరువి కాదు. పి.వీ.కాదు ఆఖరికి సి.సి. తు కలెక్టర్ కాదు అలా ఫోన్లమీద అడిగెయ్యటానికి" అన్నాడు మళ్ళీ.
    
    "అది కాదండీ! ఆ సీట్లో పనిచేసేది నా క్లాస్ మేట్.
    
    "నీ క్లాస్ మేట్ బెంచీమేటో నాకక్కర్లేదు. నాక్కావలసింది వర్క్! ఆఫీసుకి వచ్చినప్పటినుంచి పర్సనల్ విషయాలు వ్యవహారాలు మరిచిపోవాలి__ మనం మన డ్యూటీ చేయాలి. గీత ఏమంటుంది? నియతం కురుకర్మత్వం. యువర్ డ్యూటీ అంటుంది. మనమేం ఊరకే చేస్తున్నామా నెలనెల జీతం తీసుకోవటం లేదా?" తలవాచేట్లు చివాట్లేశాడు ఆయన.
    
    హెచ్.సి.రామయ్య ముసిముసినవ్వులు నవ్వుతున్నాడు.    

 

    ఆయన తన క్రింది క్లర్క్ ని ఎవరు తిట్టినా ఆనందం తను తిట్టలేడు, అరవలేడు అదీ ఆయన బలహీనత!


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS