"అన్నయ్యనే! నీకు ఊర్లో సమస్యలలో తలదూర్చటం తప్ప పని లేదా! నాన్నగారు పిలుస్తున్నారు." అన్నాడు కోపంగా.
సిద్దార్ధ అక్కడ ఉండడం మంచిదికాదని ఇంటికి వచ్చేసాడు. ప్రతీసారి అన్న బయటినుండి రాగానే రాధిక ఆశగా ఎదురు చూస్తుంది.
"అన్నయ్యా! శ్రీనివాస్ విషయాలు తెలిసాయా!" అంటూ బేలగా ప్రశ్నిస్తుంది.
సిద్దార్ధకు పరిస్థితి ఇబ్బందిగా, ఇరకాటంగా ఉంది.
రోజుకుమల్లే ఎదురువచ్చిన రాధికను జాలిగా చూచాడు.
"శ్రీనివాస్ విషయాలు చెబుతాడనుకున్న జంగయ్య చనిపోయాడు." అన్నాడు నిరాశగా.
రాధిక దిగులుగా చూచింది. ఇప్పుడా అమ్మాయికి తను బ్రతక్కపోయినా, శ్రీనివాస్ బ్రతికితే చాలునని ఉంది. తనేమయినా పరవాలేదు. శ్రీనివాస్ క్షేమంగా ఉండాలని కనిపించని దేవుళ్ళకి మొక్కుకుంటుంది.
సాయంత్రం వరకు చెల్లెలితో చదరంగం ఆడుతూ కూర్చున్నాడు. అతని మనసుమాత్రం బయటే ఉంది.
అప్పుడే పురుషోత్తమరావు వచ్చాడు. అతనివెంట పది, పదిహేను మంది ఆశ్రితజనం ఉన్నారు.
"అబ్బే! అక్కడ ఎవరు అనుమానించలేదండీ. పెద్దలకు చదువు చెప్పే పంతులమ్మ, మీ అబ్బాయే అనుమానించారు" అన్నాడు.
"మా అబ్బాయా!"
"అవునండీ మీ అబ్బాయె. అతనే పోలీసులకు రిపోర్టు ఇచ్చాడు."
"ఒహో........." సిద్దార్ధకు సంభాషణ వినిపించలేదు. అతను మెల్లగా బయటికి జారుకున్నాడు.
"యెక్కడికిరా!" యశోద అడిగింది.
"యెందుపోయెదవన్న, ఎదురు తంబళిగన్ని.....అంటూ అడగరాదని తాతయ్య చెప్పిన సూక్తి మరిచిపోయావా అమ్మా!" అన్నాడు నవ్వుతూ.
"మాయజేయటం బాగా అలవాటు అయింది."
ఆమె నవ్వింది. అతను వెళ్ళిపోయాడు. జంగయ్య అంత్యక్రియలు చేసి అందరూ వెనుతిరిగి వస్తున్నారు.
"ఒరేయ్ సిద్దూ! నువ్వు ఇంజనీరింగ్ బదులు, పోలీసువి అయితే బావుండేది........." బాలు దగ్గరనుండి వచ్చిన అర్జున్ అడిగాడు.
"ఏమయింది?"
"త్రాగి చచ్చిపోతే, మామూలు మరణం కాదని పోలీసులకి రిపోర్ట్ ఎందుకిచ్చావ్?"
"మామూలు మరణం అని యెవరు చెప్పారు?"
"అదేం పిచ్చి ప్రశ్న. డాక్టరు చెప్పారు."
అదిరి పడ్డాడు సిద్దార్ధ.
"డాక్టర్.........డాక్టర్ మామూలు మరణం అని చెప్పాడా!"
"అవును"
సిద్దార్ధ అర్జున్ను దులపరించుకుని వెనుతిరిగాడు. చరచర డాక్టర్ దగ్గరకు వెళ్ళాడు. అప్పుడే ఆయన క్లినిక్ నుండి ఇంటికి వెళ్ళాడట హాస్పత్రి కాంపౌండులోనే ఉంది ఆయన ఇల్లు.
సిద్దార్ధ ఇంట్లో అడుగుపెట్టి ఆగిపోయాడు. ఎదురు గోడమీద నిలువెత్తు క్రీస్తు బొమ్మ. గుండె చీలి ఉంది. ఎఱ్ఱని రక్తధారణతో ప్రేమ అనే తెల్లని, స్వచ్ఛమైన చైతన్యంలా కనిపిస్తుంది.
"ప్రేమతో జయించండి జగతిని"
"నీ ప్రక్కవాడిని ప్రేమించు"
"ప్రభువును నమ్ము. ఆ ప్రభువే దారి చూపుతాడు......." ఇలా రక, రకాల నినాదాలు వ్రాసిన పలకలు ఇంటినిండా ఉన్నాయి.
ఇలాంటి వారిని చూచే అన్నారు కాబోలు. చెప్పేవి శ్రీరంగ నీతులు. దూరేవి దొమ్మరి గుడిసెలు " అని
"యెవరూ!" డాక్టర్ జోస్ బయటికి వచ్చాడు.
"నన్ను సిద్దార్ధ అంటారు........"
"మధ్యాహ్నం క్లినిక్ కు వచ్చారు........కూర్చోండి. వాట్ కెన్ అయి డూ ఫర్ యు?" అన్నాడు ప్రశాంతంగా.
