ప్రిన్సిపాల్ రమ్మంటూన్నారని కబురు వచ్చేసరికి రవి కంగారు పడిపోయాడు. వణుకుతున్న కాళ్ళతో, ప్రిన్సిపాల్ రూమ్ లోకి వెళ్ళేసరికి అక్కడ స్నేహలత కనుపించింది.
రవి నిర్ఘాంత పోయాడు. ప్రిన్సిపాల్ "ఈమె నీకోసం వచ్చారు. నువ్వు కావాలంటే వెళ్ళచ్చును!' అన్నారు.
కింకర్తవ్యతా వీమూడుడై రవి చూస్తుండగానే స్నేహలత లేచి ప్రిన్సిపాల్ కు ధన్యవాదాలు తెలిపి "రా! రవి!" అంటూ బయటకు నడిచింది. ఒక యంత్రపు బొమ్మలాగ రవి ఆమె ననుసరించాడు.
"ఇవాళ నా పుట్టినరోజు! అందుకని నిన్ను తీసి కేడుతున్నాను."
రవి మాట్లాడలేదు.
"నామీద కోపమా?"
"నీమీద కోపమేమిటి?"
"మరి ఇన్నాళ్ళుగా కనబడడం లేదేం? నువ్వు కనబడకపోతే , నా మనసెంత బాధపడుతుందో తెలుసునా? నువ్వు లేకపోతె , నాకు పిచ్చెక్కినట్లుంటుంది రవీ!"
స్నేహలత అతని వంక అదోరకంగా చూసింది.
రవి జుగుప్స తో ముఖం తిప్పుకొన్నాడు . వద్దు వద్దను కొంటూనే , స్నేహలత తో ఇంట్లోకి ప్రవేశించాడు-- సోఫాలో కూలబడ్డాడు.
"ఇదిగో, ఇది చూడు!"
రవి చూసాడు. కనీసం రెండు వందల పైన ఖరీదు చేసే ఉలెన్ సూట్!
"నీకోసం కొన్నాను. బాగుందా? వేసికొని చూడు! నీకు తెలియకుండా ఎలా కుట్టించావని ఆశ్చర్యపడుతున్నావా? ఒకసారి నువ్వు నాతొ మాట్లాడుతుండగా , మా టేయిలర్ నీ కొలతలు తీసికొలెదూ? ఇందుకే! చెప్పు! బాగుందా?"
రవి మాట్లాడలేక పోయాడు. ఏవో సాధారణ మైన చొక్కాలు తప్ప, ఖరీదైన చొక్కా కూడా లేని తను సూట్ తొడుక్కోగలనని ఎన్నడూ వూహించలేదు. స్నేహలత చేతిలో అందంగా మెరుస్తుంది సూట్.

"చెప్పు రవి! ఎలా ఉంది?"
"చాలా బాగుంది. నా కెందు కిది?"
"ఎందుకేమిటి? వేసుకోడానికి. ఇదిగో ఈ టై చూడు! బాగులేదూ! వేసుకో.
స్నేహలత బలవంతం మీది ఆ సూట్ వేసి కొని అద్దంలో చూసుకొన్న రవి , తనను చూసి తనే ఆశ్చర్యపోయాడు. వెనక నుంచి స్నేహలత వచ్చి, అతని భుజాల మీద చేతులు వేసింది.
"ఎంత బాగున్నావు రవీ! నీ బూట్లే బాగులేవు. షాపింగ్ వెడదాం! ఆ డ్రాయర్ లో డబ్బుంటుంది. ఎంత కావాలో జేబులో వేసుకో!"
రవి తెల్లబోయి చూసాడు.
"అలా చూస్తావేం? నాదంతా నీది కాదూ కావలసిన డబ్బు తియ్యి. ఇంతలో నేను తయారయి వస్తాను."
స్నేహలత బాత్ రూమ్ లోకి వెళ్ళిపోయింది. రవి బెదురుగా డ్రాయర్ లాగాడు. లెక్కలేనన్ని నోట్లు చిందర వందరగా ఉన్నాయి. రవికి క్షణకాలం కళ్ళు తిరిగినట్లయింది. మరుక్షణం అప్రయత్నంగా అతనిచేయ్యి డ్రాయర్ లోకి వెళ్ళింది. ఆశగా అందినన్ని నోట్లు జేబులో కుక్కుకొన్నాడు. మళ్ళీ అతని చెయ్యి డ్రాయర్ లోకి వెళ్ళింది.అందినన్ని నోట్లు జేబులో కుక్కుకున్నాడు . మళ్ళీ.....
తార ప్రేమతో నిండిన ప్రబోధ వాక్యాలూ ఉద్వేగపూరితమైన ఉపన్యాసాలూ కలిగించలేని ఆత్మ విశ్వాసాన్ని అతని జేబులోని రూపాయి నోట్లు క్షణ కాలంలో కలిగించాయి. నిటారుగా నిల్చున్నాడు. గర్వంగా చుట్టూ చూసాడు. అక్కడ పడి ఉన్న సిగరెట్ కేస్ లోంచి సిగరెట్ తీసి, అక్కడే వున్న లైటర్ తో, ప్రప్రధమంగా వెలిగించి పొగ రింగుల వంక ఆనందంతో చూసాడు.
ధగధగ లాడుతూ తయారయి వచ్చిన స్నేహలత గర్వంగా, ఠీవిగా సిగరెట్ కాల్చే రవి వంక లిప్త మాత్రం విభ్రాంతి తో చూసి, మరుక్షణం గర్వంగా నవ్వుకొంది.
స్నేహలతతో షాపింగ్ కెళ్ళి అనేక రకాల వస్తువులు కొని బయట పడేసరికి రాత్రి ఏడున్నరయింది. అప్పుడతనికి తార గుర్తు కొచ్చింది.
"లతా! నాకు లైబ్రరీ లో కొద్దిగా పనుంది. రేపు కలుస్తాను."
లాలనగా అన్నాడు. అతడామెను "లతా?" లని పిలవటం అదే ప్రధమం! స్నేహలత కులాసాగా నవ్వుకొని "రేపు తప్పక రావాలి! రాకపోతే?" తర్జని తో బెదిరించి కలకల నవ్వింది. రవి శృతి కలిపాడు.
స్నేహలత వెళ్ళిపోయింది.
తార ఆరోజున జీతం అందుకొంది. దీనిని ఏ విధంగా రవి కందజేయాలా అని లక్ష విధాలుగా ఆలోచిస్తూ , ఆ డబ్బు చూసి అతనెంత మొహమాట పడ్తాడో, ఎంత సంతోషపడ్డాడో, తన వంక ఎంత కృతజ్ఞతతో చూస్తాడో రక రకాలుగా కలలు కనసాగింది. కానీ, ఎంతకూ రవి రాకపోయే సరికి ఆమె కాశాభంగమయింది. పావు తక్కువ ఎనిమిదయింది. ఇంకొక పావుగంట లో వెళ్ళిపోవాలి తను! తారకు ఇంచుమించు కళ్ళలో నీళ్ళు తిరిగాయి. ఇంతలో లైబ్రరీ ముందు అటో రిక్షా ఆగటం , అందులోంచి దిగి పుల్ సూట్ తో ఒక యువకుడు దర్జాగా నడిచి రావటం గమనించింది. అతడు రవి! తన కళ్ళను తానూ నమ్మలేక పోయింది. నోట మాట రాలేదు. విభ్రాంతి తో చూసే తారను చిరునవ్వుతో సమీపించాడు.
"ఇవాళ ఒక స్నేహితుడింట్లో ఆలస్యమయి పోయింది తారా! నువ్వెక్కడ వెళ్ళిపోతావో నని అటో రిక్షా లో వచ్చాను. ఎందుకలా తెల్లబోయి చూస్తావ్?"
తార సమాధానం చెప్పక, కళ్ళప్పజెప్పింది. రవి ఇబ్బందిగా కదిలాడు.
కొద్ది క్షణాలకు తార తెప్పరిల్లి " ఈ దర్జా అంతా ఎక్కడేరువు తెచ్చుకోన్నావ్?' అంది.
"భలేగా అందించింది" అనుకొన్న రవి నవ్వు తెచ్చి పెట్టుకొంటూ , "నా స్నేహితుడిది! వేసికోమని బలవంత పెట్టాడు బాగులేదూ?" అన్నాడు.
తార బరువుగా నిట్టూర్చింది.
"ఒక్క మా అన్నయ్యేనా ఇంకా అలాంటి స్నేహితులున్నారా నీకూ?"
"రవి గతుక్కుమన్నాడు. ఈ క్రాస్ ఎగ్జామినేషన్ కు విసుక్కున్నాడు కూడా!
"ఏమిటి తారా?" విసుక్కున్నాడు రవి.
తనమీద విసుక్కుంటున్న రవిని తెల్లబోయి చూసింది తార! ఆ చూపుల్లో భావం మనసులో ముల్లులా గుచ్చుకున్నా, తల దించుకోక , నిర్లక్ష్యంగా అమెచూపుల నేదుర్కొన్నాడు.
"రవీ! ఆశ మానవుని మనుగడ కెంత ఆవశ్యకమో, దురాశ ఈ జీవన లత కంతటి వేరుపురుగు! ఏదో ఒకసారి సరదాకు నువ్వు సూట్ వేసికొంటే , ఆక్షేపిస్తూన్నాననుకోకు! ఏదో తాత్కాలికమైన సరదా. అయితే పరవాలేదు. కానీ, వాటి మీద ఆశలు పెంచుకొంటె వాటికి అంతుండదు! మన శ్శాంతి ఉండదు."
రవి మనసు మండిపోయింది. తార కట్టుకొన్న పట్టుచీర వంక కసిగా చూసాడు.
"నువ్వు భయపడక్కర్లేదులే! నేను మీ అందరిలా భాగ్యవంతుడ్ని కానని నువ్వు చెప్పకపోయినా నాకు తెలుసు!"
తార కృంగి పోయింది.
"రవీ! నువ్వే నన్ను అపార్ధం చేసికొంటున్నావా?" దెబ్బతిన్న పిట్ట ఎలుగులా, దీనంగా ఆ కంఠస్వరానికి కదిలిపోయాడు రవి. ఆ ప్రయత్నంగా తార భుజం మీద లాలనగా తట్టి , క్షమించు తారా! నా బీదరికం నన్నే పరిహసిస్తోంది" అన్నాడు.
అతడు తారను స్పృశించటాని కదే ప్రధమం. అంతకు ముందెన్నడూ తార ఎంత ఆప్యాయంగా మాట్లాడినా, అతడామె సమీపానికి రావటానికి కూడా సాహసించ లేదు.
తార మృదువుగా అతని చేతిని తొలగించింది. అతనిలో ఏదో మార్పు వచ్చిందని ఆమె గ్రహించింది. కాని, ఆ మార్పుకు సంతోషించాలో పరితపించాలో మాత్రమే , ఆమె కర్ధంకాలేదు.
"బీదరికం కంటే, మనకు భయంకరంగా పరిహసించేవి చాలా ఉన్నాయి రవీ! వాటికి దూరంగా ఉండగలిగితే బీదరికాన్ని గురించి ఆలోచించవలసిన అవసరమే లేదు. భగవంతుడు , నీ కిచ్చిన శక్తిని నువ్వు పూర్తిగా వినియోగించుకొన్నవారు, అసలు బీదరికమనేదే ఉండదు."
ఎనిమిదయిపోయింది . లైబ్రరీ మూసెయ్యాలి. తారకు యాభై రూపాయలూ, రవికి ఎలా ఇయ్యాలో తోచలేదు. అనుకోకుండా తమ మధ్య వాతావరణ మిలా కలుషితమయింది. పరధ్యానంగా ఏదో ఆలోచిస్తున్న రవి కోటు జేబులో చటుక్కున ఆ డబ్బు పడేసింది తార! తార మాటలను గురించి తీవ్రంగా ఆలోచిస్తున్న రవి అది గమనించనేలేదు. అతడు గమనించక పోవటమే మేలను కొంది తార! చూసి, ఇదేమిటని అడుగుతే, చెప్పలేక తను నానా అవస్థా పడాలి. అసలిప్పటికే తననపర్ధం చేసికొని, అభిమాన పడ్తున్నాడు. రేపు తనే ఆ డబ్బు చూసుకొని ఆశ్చర్య పోతాడు. అప్పుడు తేలిగ్గానే అర్ధం చేసికోగలడు!
పాపం! పూజా ద్రవ్యాలను మురికి కాలువలో పోసినట్లు, తన యాభై రూపాయలూ, స్నేహలత డబ్బు నింపుకొన్న రవి జేబులో పడి, అతనికి లెక్క తెలియకుండా పోయాయని తారకు ఈషణ్మాత్రమూ తెలియదు కదా!
* * * *
ఆ రాత్రి రవికి నిద్రపట్టలేదు. తారను తాను ప్రేమించాడు. స్నేహలత తనను ప్రేమించింది. చిన్నప్పటి నుండీ ,అష్ట కష్టాలు పడ్డాడు. ఎప్పుడూ డబ్బుకు తడుముకోవటమే! అది లేదు, ఇది లేదు అనుకోవటమే? ఎప్పుడూ సరిపెట్టకోవటానికి ప్రయత్నించటమే! బ్రతుకంతా ఇంతేనా? పాపం తార స్థితి కూడా మెరుగ్గా ఉన్నట్లు లేదు. యాభై రూపాయల కోసం కష్టపడి ఉద్యోగం చేస్తుంది. స్నేహలత దగ్గిర ఎంత డబ్బు? అబ్బ! ఈ భయంకర దారిద్యపిశాచం తో పోరాడి, పోరాడి అలసిపోయాడు. తను లత వాడయితే -- రవికి తల దిమ్మెక్కింది. కష్టపడి నాలుగేళ్ళ చదువు -- తరువాత మధ్యమ తరగతి కుటుంబం -- ఏదో గుట్టుగా సంసార మీడ్చుకు రావటం.
కానీ, అప్పుడు తార తన ప్రక్కన ఉంటుంది. మెరిసే ఆ కళ్ళను తను మనసారా ముద్దు పెట్టుకోవచ్చు- ఎట్లాంటి కష్టాలనైనా మరపింపజేసే ఆ చిరునవ్వు తనతోనే ఉంటుంది. ఆమెతో కూర్చొని మాట్లాడితేనే ప్రాణం పరవశించి పోతుందే? ఆమెను తన గుండెల్లో ఇముడ్చు కొన్నవాడు ఆసౌఖ్యాని కేది సాటి వస్తుంది?
