Previous Page Next Page 
ఆదివిష్ణు కథలు పేజి 24


                                              ఉద్యోగం
    
    ఆయన వెళ్ళిపోయారు.
    నిట్టూర్చాను. హృదయం బరువెక్కింది. నా కళ్ళల్లో నీళ్ళు నిండుకున్నాయి. రాయిలా గుమ్మందగ్గరే నించున్నాను. ఆయన వెళ్ళిపోతూ అన్నమాటలే చెవుల్లో రింగుమంటున్నాయి.
    "అమ్మ పిలుస్తోంది" అన్నాడు చిట్టి.
    కళ్ళు తుడుచుకుంటూండగా అడిగాడు "ఏడుస్తున్నావా?"
    
                                         *    *    *
    
    జీవితంలో నేనేనాడూ నవ్వలేదు. నాన్న తెలీదు. అమ్మ ఒడిలో సుఖం తెలీదు. వాళ్ళెలా ఉండేవారో గూడా గుర్తులేదు.
    నేననుకుంటాను -దేవతలాంటి అమ్మ ఆదరణ దేవుడి లాంటినాన్న వాత్సల్యం పంచుకున్న మనిషి బతుకులో ఏనాటికైనా నవ్వగలడు అని. నా కా అదృష్టం లేదు మరి.
    అన్నయ్య ఉన్నాడు. అయినా నేను నవ్వుకునేందుకు అవకాశమివ్వలేదాయన. ఒదినుంది - కానీ ఆమె అమ్మ కాలేదు. కాదు! ఆ యిద్దరి చేతుల్లో పెరిగేను.
    నన్ను పెంచుతూన్న అన్నయ్య పదిమందిలోనూ అవుననిపించుకున్నాడు. ఒదినని చాలామంది గౌరవించేవారు. వాళ్ళిద్దరూ లోకాన్ని మాయచేయగలరు అంతరంలో లేని ప్రేమని పదిమంది ముందూ ఒలికించగల నేర్పు వాళ్ళకుంది.
    నాకు చాలా గుర్తున్నాయి. అన్నయ్య దగ్గిర అక్కయ్య గూపె పెరిగింది. హీనాతి హీనంగా పెరిగింది. మగవాడిని, వోర్చుకోగల గుణం గలవాడిని గనక వాళ్ళ అనాదరణకి తలొగ్గేను.
    అక్కయ్య తర్వాత నలుగురు పుట్టి అదృష్టవంతులై మరో లోకంలో ఉన్నారు. వాళ్ళందరి తర్వాత నేను. సాంప్రదాయానికి వ్యతిరేకంగా నేను అమ్మనీ, నాన్ననీ కొంచెం తేడాలతో  పొట్టని పెట్టుకున్నాను. అందుచేతనే అన్నయ్యకి నేనంటే కసి.
    కానీ, అక్కయ్యమీద అంత అసహ్యమెందుకో తెలిసేది కాదు.
    ప్రేమించిన మనిషిని పెళ్ళిచేసుకుంటానని ధైర్యంగా చెప్పడం నీచమైంది. నా కళ్ళముందే అక్కయ్యని మెడపట్టి గెంటి తలుపుమూసేడు అన్నయ్య చాతకాక యేడుస్తూన్న నన్ను బరబరా లాక్కుపోయి నోరు మూయించేడు.
    నా నోరు యెల్లప్పుడూ మూసుకునే వుంటుంది. నా కోరికలు సర్వదా చంపబడుతూనే ఉంటాయి. నే నెందుకూ పనికిరాని చవటని కాకపోతే అక్కయ్యకి అంత అవమానం జరుగుతూంటే చూస్తూ వూరుకునే వాడిని కానే కాదు.
    ఆ నరకం నుంచి అక్కయ్య తప్పుకున్న తర్వాత నా నెత్తిమీద బాధ్యతల బరువు రెండింతలయింది. ఇంటెడు చాకిరీ నేనొక్కడ్నే చేయవలసి వచ్చేది. వదినకి వల్లమాలిన సుస్తీ అస్తమానూ ఉండేది. ఒదిన అన్నయ్యకి మరో ప్రాణం. ఆమెకి తలనొప్పొస్తే నాకారోజు చేతినిండా పని తగిలేది. మందుకి వెళ్ళాలి. వంటచేసి అన్నయ్యని ఆఫీసుకి పంపాలి. దానికో గంటముందునుంచీ వూపిరి సలుపుకోలేనంత ఒత్తిడి వల్ల నలిగిపోవాలి.
    నేను చేసిన వంట నా మొహంల వుంటుందట. నా మొహం దరిద్రగొట్టు మొహమని వదినా అన్నయ్యల అభిప్రాయం. అయినా నెలకి యిరవైరోజులు నా చేతివంటే కావల్సొచ్చేది. వాళ్ళిద్దరికీ వండిపెట్టి నేనింత కతికి స్కూలుకి వెళ్ళేవాడిని! స్కూలునుంచి రావటంతోనే మళ్ళా పురమాయింపులూ, ఆజ్ఞలూ, చివాట్లూను.
    నా కోరికలు తిన్నవాళ్ళలో ముఖ్యులు వాళ్ళిద్దరూ. సగం చచ్చి బతికినందుకు కారణం వాళ్ళేను.
    చదివి బాగుపడి నన్ను నేను వుద్దరించుకోవాలనే తపన గలవాడిని. నన్ను నేను చంపుకోడం యెలా సాధ్యం? పరిస్థితులు అనుకూలించక చదువుమీద శ్రద్ద చూపించలేని మాట వాస్తవం. ఆ పరిస్థితులకి కారణమేమి?
    ఇవన్నీ అన్నయ్య ఆలోచించలేదు. తొందర మనిషి తప్పేనన్న సాకుతో చదువు మాన్పించేడు. హైస్కూలు చదువుతో నా కోరికల మనిషి చచ్చిపోయేడు.
    మళ్ళా స్కూలు తెరచేంతవరకూ నోరు విప్పలేదు. ఒదినా, అన్నయ్యల సాధింపులు విన్నాను. ఈటెల్లాటి మాటల్ని గుండెల్లోనే దాచుకున్నాను. కానీ, స్కూలు తెరచే ముందు రోజు కోరిక గొంతులో నిలిచింది. అడిగేను -
    "అన్నయ్యా! నన్ను చదివించు"
    అన్నయ్య రుద్రుడయ్యేడు.
    "ఇలా యేటా తప్పుతూంటే నిన్ను పోషించేందుకు మా దగ్గిర బంగారు గనుల్లేవు. ఈ యింటిపడుచు చేసిన నిర్వాహకం చాలదన్నట్టు నువ్వొహడవి మమ్ముల్నుద్దరించేందుకు తయారవుతున్నావు" ఒదిన మంచం దిగకుండానే అనేసింది.
    ఆ క్షణంలో కసికి లొంగిపోయిన మాటనిజం. నోరు జారేనన్న నింద నెత్తినరుద్దేడు అన్నయ్య. నేనన్న దిది -
    "నేనెందువల్ల తప్పేను? ఈ యింట్లో చాకిరీ చేయడంవల్లా, మీకు నౌఖరు నవ్వడం వల్లాను."
    అన్నయ్య నన్ను కొట్టేడు. ఒదిన ఏడ్చింది. నన్ను కొట్టినందుక్కాదు, నేను నోరెత్తనందుకు. అంతలేసి మాటలన్నందుకు. వచ్చే దుఃఖాన్నీ, కసినీ, అసహాయతనీ దాచేసుకున్నాను.
    ఆనాటి నుంచీ నేను మరింత హీనంగా బ్రతకవలసి వచ్చింది. అనుక్షణం దెప్పిపొడుపు మాటల్తో కృంగిపోవలసి వచ్చింది. ముష్టెత్తి బతుకుదామనుకున్నాను. రాత్రిపూట రిక్షా లాగి, పగలు చదువుకుందామనుకున్నాను. చాలా అనుకున్నాను. ఏమీ చేయలేకపోయాను.
    ఓనాడు - ఒదిన హితబోధనలను ఆలకించి అన్నయ్య అన్నాడు -
    "ఎన్నాళ్ళని చెప్పి యింట్లో గోళ్ళు గిల్లుకుంటావ్? ఏదైనా ఉద్యోగం చూసుకోరాదుట్రా?"
    "ఉద్యోగం ఏ ఉద్యోగమొస్తుంది నాకు? ఎవరిస్తారు? కలక్టరవ్వాలని కోరలేదు పంకాకింద కూచుని పదిమందిని అజమాయిషీ చేయాలని అనుకోలేదు. మామూలు ఉద్యోగిగా బతుకుదామనుకున్నాను. అన్నయ్యలా బతుకుదామనుకున్నాను.
    అది ఆ పరిస్థితుల్లో కలగానే నిలిచిపోయింది. 'ఉద్యోగం చూసుకోరాదుట్రా" అని అన్నయ్య చాలా తేలిగ్గా అనేశాడు కానీ, ఆ మాటన్న అన్నయ్యకీ తెలుసు. అందుకు అర్హుడిని కానని.
    నా పాలిటి యమరాక్షసిలా నడుస్తూన్న కాలం నా కోసం ఆగిపోదు. చాలాకాలం తర్వాత గాని దేవుడు నా మొరాలకించలేదు. హైద్రాబాద్ నుంచి ఉత్తరం వచ్చింది. పరపతిని పెంచుకున్న కొండలాంటి మావయ్య రాసిన ఉత్తరం నాకు వెయ్యేనుగుల బలాన్నిచ్చింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS