Previous Page Next Page 
అదివిష్ణు నవలు -2 పేజి 24

 

    సీత అక్కణ్ణించి వెళ్ళిపోయింది విసురుగా.
    అతను కాఫీ తాగడం పూర్తీ చేసేడు.
    బుజ్జిగాడ్ని వెంట బెట్టుకుని పార్కు వేపు సరదాగా షికారు వెళ్లి వస్తే ఎలా వుంటుందో ఊహించబోయేడు కాని, చప్పున ఆ ఆలోచనకి స్వస్తి చెప్పేడు. బుజ్జి కదులుతే చిన్నా వస్తానంటాడు. ఇద్దరూ కదలడం చూస్తే చంటి వెధవ మారాం చేయక మానడు.ఈ ముగ్గుర్ని వెంట బెట్టుకుని పార్కుకి వెడితే కనీసం రెండు రూపాయలైనా ఖర్చయిపోతాయి. ఆ రెండు రూపాయలూ వుంటే......వుంటే.....ఏమైనా చేయవచ్చు.
    కనక ఎవర్నీ వెంట బెట్టుకు పోరాదనే నిర్ణయానికి వచ్చి అతనోక్కడూ లేచి నించున్నాడు.
    (న పిల్లలు ముగ్గురూ నా దగ్గిర గారాం చేస్తూ అల్లరి చేయాలని వుంటుంది గదా. నేనది సహించలేకపోతున్నాను. చనువిస్తే చాలు, బుజ్జిగాడు నా నెత్తి నెక్కి మిగతా యిద్దర్నీ పిలుస్తాడు. సోదర ప్రేమ! - వర్ధిల్లండిరా , బాబూలూ! మీ బాబు జాతకం సరైనది కాదు . వాడుత్త దుర్మార్గుడు . మీ అల్లర్ని , గారాన్నీ , భరించలేనంత చవటైపోయేడు. ఐ.పిటీ యూ, చిల్డ్రన్! ఈ మధ్య నా దగ్గరికి రావడమే మానుకున్నారు. మీరు. ఒర్ కుర్రాళ్ళూ , మీ నాన్నగాడిని క్షమించండి. ఈ మధ్య ఒక్క తడవైన మిమ్మల్ని సినిమాకి తీసుకెళ్ళాన్రా? మీకు మిఠాయిలు తెచ్చేనా? ఎప్పుడో కొన్నాను. ఒక చిన్న సైకిలు. ఎంత మంచివాళ్ళురా మీరు? ఆ సైకిల్ పాతబడి డొక్కైపోయినా , మరోటి కొనమని మీ పెదనాన్నని బలవంతం చేయలేదు మీరు. ఈ రౌడీ గాడి చిన్నతనం మహా వైభవంగా జరిగిపోయింది గదా. స్వార్ధం కరుడు గట్టి మీ సుఖాలన్నింటిని దూరం చేసేడు. తిట్టకండిరా బాబూ! వచ్చే జన్మకి నేనో మహారాజునై మిమ్మల్ని మరిచి పోకుండా కని, బంగారు ఏనుగుల మీద మిమ్మల్ని తిప్పి తృప్తి పడతాను గానీ, ఈ జన్మకిలా నన్ను వదిలెయ్యండి.)
    అతను వెంటనే కూర్చున్నాడు. కాసేపటికి మంచం మీద పడుకున్నాడు. ఆ తరవాత దుప్పటి కప్పుకున్నాడు. ఆ పైన కళ్ళు మూసుకున్నాడు.
    ఇంత జరిగితే మాత్రం, ఇప్పటి కిప్పుడే నిద్ర వచ్చి బంగారు కలల్లో తెలిపోవాలంటే సాధ్యమయ్యేదేనా?"
    అయినా అతను ఆ బగారు కల కోసం భోజనం కూడా మానుకుని ఆ రాత్రంతా వేట ప్రారంభించేడు. ఫలితం కలగలేదు.
    మరునాడు ఆకలితో అతను గిలగిల్లాడిపోయేడు. వంటయితే పూర్తీ అయింది గానీ, అతని కిష్టమైన కూర ఒక్కటి లేదు. వండింది ఒకే ఒక్క కూర . అదీ దొడ్లో పెరుగుతున్న తోటకూర. ఇంత ఆవకాయ, ఇంత నెయ్యి, పెరిగునూ. కంచాన్ని చూస్తూ అతను విసుక్కున్నాడు. అర్ధాకలితో లేస్తుండగా , పిల్లల్ని పిలిచింది సీత.
    తండ్రిని తప్పించుకుంటూ వాళ్ళు వంటగదిలో ప్రవేశిస్తున్నప్పుడూ నిజంగానే ఎడ్చేసేడు శ్రీనివాసరావు.
    ఆఫీసుకు వెళ్ళబోతుండగా తల్లి పిలిచిందతన్ని . అతను ఆ గదిలోకి వెళ్ళేడు.
    మంచం మీద ఆ తల్లి అతుక్కుపోయి వుంది. మొహం చెల్లక తల తిప్పకుందామానుకున్నాడు. ఆ తల్లి కళ్ళల్లో మెరిసి వెలుగు చూచి దిగ్భ్రాంతుడైపోయేడు. ఆవిడ తన దుస్థితిని అవతలకు నెట్టి ఎంతో ఆనందంగా అనేసింది.
    "యింట్లో మరో గోపాలకృష్ణుడు పుట్టబోతున్నాడురా శ్రీనూ."
    శ్రీనివాసరావు నిలువెల్లా వణికి పోయేడు.
    "సాయంత్రం పెందరాళే వచ్చి నీకు తెలిసిన డాక్టర్ దగ్గిరికి అమ్మణ్ణి తీసుకువెళ్ళు. టానిక్కులేవైనా రాస్తే , తెప్పించు. మరిచిపోమాకు మ నాన్నా!"
    (అమ్మా! ఈ యింట్లో మరో కృష్ణుడికి చోటేదే, తల్లీ! ఉన్న ముగ్గురు కృష్ణుళ్ళూ నా హింసకి నలిగిపోతుంటే , మరో కృష్ణుడా? అయినా, అమ్మా చదువుకున్నదానివి గదా, పిల్లలంటే అసహ్యం లేదా నీకు? చదువుకున్న వాళ్ళెవరూ పిల్లల్ని కనకూడదే తల్లీ! అనక సంతానంతో సంసారంలో సుఖం లేదు. "లెస్ లగేజ్ మోర్ కంఫర్టబుల్" రూల్ తెలీదా నీకు? ఎక్కువ పిల్లలు ఈ ఇంటికే కాదు, దేశానికే బరువు. ఆ రకంగా నేను క్లాస్ వన్ దేశ ద్రోహిని. ఇద్దరు పిల్లల్ని మించి కనేవాడిని షూట్ చేసే రోజులు వస్తున్నాయి. ఇంకా నీకా ఆనందమేమిటో తెలీడం లేదు. ఇప్పటికే నా తల బరువుతో నేను వంగిపోయేను. రేపు ఆ నాలుగోవాడు ఉద్ధరించి, నన్ను మింగేసి మాట నిజం. ఎంత దుర్వార్త చెప్పేవే!"
    "పిచ్చి సన్నాసి! నీ ఆలోచనలు నాకు తెలుసులేరా. దేవుడి అనుగ్రహాన్ని మనం కాదనలేము. పిల్లలు యింటికి దీపాలురా . నీ ఇల్లు ఈ దీపాలతో కన్నుల పండుగ్గా వుండనివ్వు. నారు పోసిన దేవుడు నీరు పోయాక మానడు. దిగులు పెట్టుకోవద్దు. ఈ తల్లి నీ మంచి రోజుల్ని చూచే కన్ను మూస్తుంది. సాయంత్రం త్వరగా వచ్చి , అమ్మణ్ణి  వెంట బెట్టుకు వెళ్ళు. ఎలాగో ట్యూషన్ గూడా లేదంటివిగా. త్వరగా రా. పనిలో పని - నీ ఆరోగ్యం కూడా తనిఖి చేయించుకో . వెళ్ళు."
    శ్రీనివాసరావు ఆ గది నుంచి దోషిలా బయటికి వచ్చేడు. దోషిలాగానే తల వంచుకుని ఆఫీసుకు నడక ప్రారంభించేడు.
    అనగనగా ఒక రాజు . ఆ రాజుకి లేక లేక , ఎన్నో పూజలూ వ్రతాలు చేయగా ఎంతో కాలానికి ఒకే ఒక కొడుకు పుట్టెడు. రాజుల్లాంటి మహా పురుషులకి పాపం ఒక్క కొడుకో, ఒక్క కూతురో అంతే , బంద్ . దీనికి కూడా ఏదో వుంటుంది శ్రీనివాసరావు అనుకున్నాడు.
    అతను పూర్వ మెప్పుడో నటించిని ఒక చిన్ని సన్నివేశం గుర్తుకు వచ్చింది. ఒక డాక్టరు ఒక పేద మనిషిని నిలబెట్టి అడిగే సీనది. దానిలో డాక్టరుగా ముకుందం, పేద మనిషిగా శ్రీనివాసరావు నటించేరు.
    "లాభం లేదయ్యా ! నీ ఆరోగ్యం పూర్తిగా చెడిపోయింది."
    'డాక్టర్!"
    "అదంతే! నీ జబ్బు నయం కావాలంటే డబ్బు కావాలి. అది నీ దగ్గిర లేదు. మందులు కొని యిచ్చెంత దానకర్ణుణ్ణి కాదు నేను. నువ్వింక అట్టే కాలం బతకలేవు."
    "అయితే నా భార్య పిల్లలు లేమవుతావు. డాక్టర్? వాళ్ళెలా బతుకుతారు?"
    "ఎంతమంది పిల్లలు నీకు?"
    "ఆరుగురు!"
    "అరుగురా> అవునయ్యా, అంతమంది పిల్లల్ని కన్నందుకు నీకు సిగ్గు లేదు?"
    "సిగ్గా? ఎందుకు సార్ సిగ్గు?"
    "దేశాన్ని చూడు , తెలుస్తుంది."
    "నన్ను దేశం చూడదేం సార్?"
    "పిచ్చి ప్రశ్న."
    "సార్, డాక్టర్ గారూ......తమరేమనుకోవద్దు. తమకెంతమంది సార్ పిల్లలూ?"
    "లేరు."
    "ఒక్క నలుసు గూడా...."
    "లేరని చెప్పడం లే?"
    "అదేం మాట?"
    "అవునంతే , సార్! సాయంత్రం వరకు తమరు వందల సంపాదనలో వుంటారు . సాయంత్రం మీకోసం క్లబ్బులూ, మీటింగులూ, వైభోగాలు వుంటాయి. అమ్మగారికి కూడా ప్రత్యేకమైన క్లబ్బులున్నాయి. కనక, సార్ మీరు రోజస్తమానం హాయిగా కాలక్షేమం చేస్తారు. కానీ నా విషయం వేరు. నేను పెదా ముండావాణ్ణి . నాకు యీ సరదాలు కలల్లోకి కూడా రావు. సాయంత్రం తిన్నగా యిల్లు , ఇల్లే నాకు క్లబ్ అన్నీను. యింట్లో మా ఆవిడ. అదొక్కటే నా అనందం. అందుచేత నాకు సంవత్సరానికో సంతానం. పిల్లల్లేకపొతే -- పాత మొహాలు - మా ఇద్దరికీ తోచి చావదు. తోచి చావందే బతకలేం. అందుకైనా పిల్లలు కావాలి. అందుచేత నేనేం చెబుతున్నానంటే సార్ గొప్ప ప్రజలకి పిల్లలు తక్కువనీ , నాలాటి నారాయణరావుకి పిల్లలెక్కువనీ."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS